పలుకు బడుల మొలక

0
2

[box type=’note’ fontsize=’16’] జూలై 17 వ తేదీన శ్రీ పెండెం జగదీశ్వర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల. [/box]

[dropcap]’రా[/dropcap]దుగ మళ్ళీ రాదుగా’ అన్న వ్యాస శీర్షిక ఆకర్షణీయంగా ఉంది. విషయం ఏమిటా అని చదివాను.

ఆ వ్యాస రచయిత బాల్యంలో చదివిన పుస్తకాలను గురించి తెలిపారు.

అవి ‘రాదుగ ప్రచురణాలయం’ వారి పుస్తకాలు. ఆ రోజులలో నాణ్యంగా అతి తక్కువ ధరకు లభించిన రష్యన్ ప్రచురణాలయం వారి తెలుగు పుస్తకాలు. షెల్ఫ్ లోకి మరెన్నెన్నో పుస్తకాలు వచ్చి పోతున్నా, అవి కాలగతిని శిథిలం అయిపోతున్నా ‘రాదుగ’ ప్రచురణలు చెక్కు చెదరక ఉన్నాయని, ఆ పుస్తకాల తయారీ ప్రమాణాలకు మనసు నిండిన సంతోషాన్ని ప్రకటించారు, పుస్తకాలంటే గుండె నిండు ప్రేమను వెల్లడించారు. అక్షరాల విలువలను అంతగా తెలుసుకున్న యువ రచయిత ‘పెండెం జగదీశ్వర్’.

‘రాదుగ’ అంటే రష్యన్ భాషలో ఇంద్రధనుస్సు అని అర్థం. అనేక దేశాల్లోని చిన్నారుల చేతుల్లో హరివిల్లులను ఆవిష్కరింపజేసిన ‘రాదుగ’ మళ్ళీ రాదుగా! ఒకవేళ రాగలిగితే లోకంలోని పిల్లలకు ప్రకృతి సృష్టించే ఆ ఇంద్రధనుస్సు అక్కర్లేదేమో! అని భావుకులయ్యారు. అక్షరాల ఇంద్రధనుస్సును తన రచనలతో పిల్లలకు అంకితం చేయదలచారు. బాలల కథా రచయితగా నిరంతరం పరిశ్రమించి, 42 ఏళ్ళకు 42 పుస్తకాలను రచించిన యువ రచయిత పెండెం జగదీశ్వర్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకున్నారని చదివి తెలుసుకుని మౌనంగా దిగమింగలేని దుఃఖం కలిగింది.

బాలసాహిత్యంలో వినూత్న ప్రయత్నం కావించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో తెలుగుభాషా బోధన ఎలా ఉండాలి..? అన్న సందిగ్ధ సమయంలో తెలంగాణ పిల్లల భాషను రికార్డు చేసే గొప్ప ప్రయత్నం చేసినవారు పెండెం జగదీశ్వర్‌. తన జీవితమంతా బాల సాహిత్యానికి వెచ్చించిన బాల సాహితీవేత్త జగదీశ్వర్. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వంత వాడుక భాషలో ‘బడిపిల్లగాల్ల కథలు, గమ్మతి గమ్మతి కథలు’ రాసారు. బాలలు మాట్లాడుకునే మాండలిక భాషలో రాసిన కథల సంపుటం ‘బడి పిల్ల గాల్ల కథలు’ తెలుగు బాలల సాహిత్యంలో వెలువడిన తొలి పుస్తకంగా ఎంతో ప్రసిద్ధిని పొందింది. అతి సహజంగా తెలంగాణాకే స్వంతం అయిన అనేక పదాలు లాషిగ నవ్విండు, పోరగాల్లు, శిత్రబోయిండు, వుర్కుడు, శెంగశెంగ ఎగురుడు, లబ్బలబ్బ మొత్కుంట వంటి పదాలు, మట్టి పూల పరిమళాలుగా విస్తరిస్తాయి

పెండెం జగదీశ్వర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు పిల్లల కోసం ఆలోచించాలి, పిల్లల కోసం రచించాలి. కేవలం పాఠం చెప్పడం మాత్రమే కాదు, వారికి భవిషత్తులో ఉపయోగ పడే భాషా జ్ఞానం అందించాలి అని కృషి చేసారు. మొత్తం తెలుగు సాహిత్యంలో పిల్లల కోసం రచించేవారు కేవలం 90 మంది మాత్రమే ఉన్నారని తెలుసుకుని విచారించారు. అనేక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల ద్వారా అనేక కథలను సేకరించారు. పిల్లలు మాట్లాడే భాషను పరిశోధనాత్మకంగా పరిశీలించారు.

బడి పలుకుల భాష కాదు, పలుకు బడుల భాష వంట బట్టాలని కాళోజీ గారు అన్నట్టుగా తన కథల ద్వారా భావి తరాలకు పలుకు బడి భాష పట్టుబడాలని కోరారు.

జగదీశ్వర్ కథలలో చక్కని సందేశం ఉంటుంది. హాస్యం పిల్లలను అలరిస్తుంది. సాహిత్యం ప్రయోజనాత్మకంగా అర్థవంతంగా ఉండాలని ఆయన ఆశించారు. ఆయన బాల సాహిత్య చరిత్రలో నిరంతరం వెలిగే దీప స్తంభం భాషా పరిశోధకులు సైతం, తెలంగాణా భాషా అధ్యయనానికి ఈ బాల సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం తప్పక కలుగుతుందని బాల సాహిత్య ప్రముఖులంటారు.

పిల్లలకు తెలిసే శైలిలో వారి స్థాయిలో ఉన్న వందలాది జానపద కథలను సేకరించారు. పిల్లలకు చెప్పవలసిన కథలు, పిల్లలు స్వయంగా చెప్పే కథలను ఉమ్మడి ఆంధ్ర దేశం అంతా తిరిగి సేకరించారు. ‘ఆంధ్ర ప్రదేశ్ జానపద కథలు’ పేరిట సంకలనం చేసారు.

పెండెం జగదీశ్వర్ రచించిన బడి పిల్లగాల్ల కథలులో ‘నాకోసం యెవలేడుస్తరు?’, ‘వొంకాయంత వజ్రం’ కథలు మహారాష్ట్రలో 20016 నుండి ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో కొనసాగుతున్నాయి. చెట్టు కోసం కథ కూడా 2006 వరకు గ్రహించడం జరిగింది.

2005వ సంవత్సరం తెలుగు విశ్వ విద్యాలయం వారు జగదీశ్వర్ రచన ‘గజ్జెల దెయ్యం’కు ఉత్తమ బాల సాహితీ గ్రంథంగా పురస్కారం ఇచ్చారు.

‘బాల సాహితీ రత్న’ అన్న గుర్తింపు ఊరికెనే ‘రాదుగా’ అని నిరూపించుకున్న పెండెం జగదీశ్వర్ 2018 జూలై 17 వ తేదీ న నల్గొండ జిల్ల చిట్యాల సమీపంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

1976 జూన్ 28న చేనేత కుటుంబంలో తెలంగాణా రాష్ట్రం యాదాద్రి, భువనగిరి జిల్లా, కొమ్మాయి గుడెం గ్రామంలో జన్మించిన పెండెం జగదీశ్వర్ బాలల కథల్లో చిరు జల్లుల భావనలకు లేలేత రంగుల ఇంద్ర చాపంగా విరిసి పలుకు బడుల మొలకలను నాటుతునే ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here