[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]
[dropcap]ప[/dropcap]ట్టణం నడిబొడ్డున వున్న విద్యానికేతన్ కాలేజీలో రంజిత్, రమలు ఎం.ఎస్.సి ఆర్కీయాలజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు. గొప్పింటి పిల్లలు కావడంలో కాలేజిలో కాస్త లగ్జురీగా వుంటారు. చదువులోనూ వాళ్ళదే ముందంజ.
రంజిత్, రమలు మంచి స్నేహితులు. కొందరికి వాళ్ళిద్దరి మధ్య వున్నది స్నేహం కాదు ప్రేమే అన్నంతగా కనబడతారు. వాళ్ళిద్దిరిని కాలేజీలో క్లాసుల్లోనే కాక క్యాంటిను, లాన్, కాలేజీ ఆవరణలో ఎక్కడైనా చూడవచ్చు. వాళ్ళ స్నేహాన్ని చూసిన కొందరైతే ఇద్దరు ప్రేమించుకొంటున్నారని ముద్ర వేశారు. కొన్ని సందర్భాల్లో స్నేహితులంతా కలసి హోటళ్ళకు వెళ్ళినప్పుడు ఇద్దరూ ప్రక్క ప్రక్కన కూర్చొని ఒకరి ప్లేటులోంచి మరొకరు ఎంగిలి పడి తినడం, చనువుగా వుండడం అందరికి తెలిసిన విషయమే! మొత్తంలో వాళ్ళ కోర్సు పూర్తవుతూనే వాళ్ళతల్లిదండ్రుల మాట దేవుడెరుగు కాని వాళ్ళు మాత్రం ఏ గుడిలోనో పెళ్ళి చేసేసుకొంటారేమో నన్నంతగా వూహించుకొంటారు. అంటే వాళ్ళమధ్య వున్న చనువుకు అలా పెళ్ళి జరిగినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు.
ఆ రోజు ప్రొఫసర్ క్లాసు పిల్లలందరికి రకరకాల ప్రాజెక్టు వర్కులను అలాట్ చేశారు. అందులో రంజిత్ రమలకు ఓ ప్రాజక్టును అలాట్ చేయగా అది కష్టమైనదని, దానికోసం నాలుగు కిలోమీటర్ల కావల దీవిలో వున్న రామాపురానికి వెళ్ళి అందుకు కావలసిన మెటీరియల్‌ను సేకరించాల్సి వుందని అది ఎంతో కష్టమైన పనని తెలిసి కూడా ఇద్దరూ కలసి అక్కడికెళ్ళి సరదాగా చేయొచ్చులేనని ఒప్పుకొన్నారు.
అందుకు శుభ ముహూర్తం రేపేననుకొని దీవిలో వున్న రామాపురానికి వెళ్ళ డానికి తీర్మానించుకొన్నారు.
మరుసటి రోజు ఇద్దరూ చక్కగా ప్రిపేరై నది వొడ్డుకొచ్చి దీవిలో వున్న రామాపురానికి వెళ్ళడానికి టిక్కెట్టు తీసుకొని లాంచ్‌లో ఎక్కి కూర్చొన్నారు. వాళ్ళతో పాటు చాలా మంది పర్యాటకులు కూడా అక్కడ విశేషంగా చెప్పుకునే అమ్మవారి ఆలయాన్ని చూసేందుకు ఎక్కి కూర్చొన్నారు. లాంచ్ ఒక్క గంట వ్యవధిలో దీవిలో వున్న రామాపురానికి చేరుకొంది. అందరూ దిగి అమ్మవారి దర్శనార్థం పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలంటూ పూజ సామగ్రిని కొనుక్కొని పెద్ద బజారు దాటుకొని వూరికి మధ్య నున్న అమ్మవారి గుడికి వెళ్ళిపోయారు.
గుడి ప్రాంగణం చక్కటి అలంకరణతో, మామిడి తోరణాలతో అందంగా వుంది. రంజిత్ రమలు ఎంతో ఆసక్తితో గుడిలోకి వెళుతూ అక్కడ గుడికి బయట కాస్త దూరంలో గాంధి తాతలా ముందుకు నడుస్తున్నట్టు వున్న నిలువుటెత్తు శిలావిగ్రహాన్ని, ఆ విగ్రహం చుట్టూ వున్న అరుగు మీద పిచ్చాపాటి మాట్లాడుకొంటూ వున్న నలుగురు మనుష్యులను చూస్తూ లోని కెళ్ళారు. ఇద్దరూ అమ్మవారిని దర్శించుకొని పంతులుగారిచ్చిన ప్రసాదాన్ని తీసుకొని కుంకుమను నొసట పెట్టుకొని పావుగంట తరువాత బయటికి వచ్చారు. అరుగుమీద కూర్చొన్నారు. నలుగురు చూస్తున్నట్టు వాళ్ళూ ఆ శిలా విగ్రహాన్ని చూస్తూ వాళ్ళ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాళ్ళ మనసుల్లో ఉద్భవించగా ఓ నోటు పుస్తకంలో రాసుకొని వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలనుకొన్నారు. వారిలో కలిగిన ఆసక్తి మేరా అక్కడే అరుగు చివర కూర్చొని దినపత్రికను చదువుకొంటున్న అరవై ఏళ్ళ పెద్దమనిషి అప్పయ్యను సంప్రదించారు ‘తాము ఎం.ఎస్.సిలో జియాలజిని సబ్జక్టుగా తీసుకోని చదువుకొంటున్న విద్యార్దులమని, తమ రీసెర్చికి కావలసిన కొన్ని వివరాలను ఆ వూరిలో సేకరించటానికి వచ్చామని’ వాళ్ళకు వాళ్ళే పరిచయం చేసుకొని.
మళ్ళీ వాళ్ళే వాళ్ళ పాఠ్యాంశానికి అతీతంగా అక్కడున్న శిలా విగ్రహానికి సంబంధించి ‘ఆ శిల యెవరిది? దాన్నెవరు అక్కడ ప్రతిష్ఠించారు? ఎందుకు ప్రతిష్ఠించారు? ఆ శిలా విగ్రహానికి వూరికీ వున్న సంబంధమేమిటి? అసలాయన యెవరు?’ అన్న రకరకాల ప్రశ్నలను సంధించారు పెద్దమనిషి అప్పయ్యకు.
“చెపుతాను బాబూ! మీరు అడిగిన ప్రశ్నలు మీ పాఠ్యాంశానికి సంబంధించినవైతే తప్పకుండా ఈ శిలా విగ్రహానికి వూరికీ వున్న సంబంధాన్నిగూర్చీ కూడా తప్పకుండా చెపుతాను. రండి నాతో రండి” అంటూ లేచి వాళ్ళను తన ఇంటికి తీసుకెళ్ళాడు. మంచంమీద దుప్పటి పరచి కూర్చోమన్నాడు. తను ప్రక్కనే వున్న అరుగుమీద కూర్చొని ఇంట్లోకి చూస్తూ “సీతా! చెంబుతో మంచినీళ్ళు తీసుకు రా!” అని పిలిచాడు సీత మంచినీళ్ళు తెచ్చి రమ,రంజిత్ లకు ఇచ్చి లోనికెళ్ళి పోయింది.
“ఆఁ… మీరు లాంచ్ దిగి వస్తున్నప్పుడు అక్కడో ఉన్నతపాఠశాలను, అక్కణ్ణుంచి కాస్త ముందుకొచ్చిన తరువాత ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చూశారాగా?” రంజిత్ రమలను ప్రశ్నించాడు అప్పయ్య.
“ఆఁ… చూశామండి. వాటిని చూసిన తరువాత ఈ వూరు ఓ రకంగా బాగా ఎదిగి మండల స్థాయిలో వున్నట్టు భావించాము.ఈ వూరికి ఇదే పెద్ద బజారనుకొంటున్నాం.అవునా?!” అన్నారిద్దరూ.
“అవును బాబూ! పెద్ద బజారే కాదు. కొట్ల బజారు కూడా ఇదే! ఇక్కడ దొరకని వస్తువంటూ వుండదు. అన్నిటినీ ఆ టౌనునుంచి లాంచీలలో తెచ్చి అమ్ముతుంటారు. అప్పట్లో మేము అంటే మా ఆదివాసీలం మాత్రమే వుండే వాళ్ళం. మాకు ఇలాంటి ప్రయాణ సౌకర్యాలు వుండేవి కావు. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు కలిగి వుంది ఈ వూరు. అందుకే అందరూ మనవాళ్ళు అండమాను దీవుల్లో స్థిరపడ్డట్టు పదేళ్ళనుంచి వుద్యోగాలు, వ్యాపారరీత్యా ఇక్కడికొస్తున్నారు. కొందరైతే ఇక్కడే స్థిరపడిపోయారు. ఇప్పుడిక్కడ వుద్యోగస్థులు, వ్యాపారస్థులంటూ వందల సంఖ్యలో వున్నారు. వీళ్ళు చేరిన తరువాత ఇక్కడున్న గుడిసెలు మాయమై పెంకుటిల్లు, డాబాలు వచ్చాయి. వీటన్నిటికీ కారణభూతుడు, మా జనానికీ స్ఫూర్తిదాయకుడు ఎవరంటే మీరు శిలా విగ్రహంగా చూశారే ఆ మహానుభావుడే! ఆయనే పడవతాత.”అని పడవతాతను గూర్చి చెపుతుండగా ఆసక్తిగా వినసాగారు రంజిత్ రమలు. అప్పుడు పడవతాతను గూర్చి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకొంటున్న వాళ్ళ ఉత్సాహాన్ని గమనించాడు అప్పయ్య.
“మీకు వీరిని గూర్చి, వూరిని గూర్చి తెలియచెప్పాలంటే నేను నలభై ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి బాబూ! వెళతాను. వెళ్ళి నాకు తెలిసిన వివరాలను వివరంగా చెపుతాను చక్కగా కూర్చొని రాసుకొండి” అని కధ చెప్పను ఉపక్రమించాడు అప్పయ్య.
***
అప్పట్లో….
అదో దీవి. దీవిలో వున్న ఈ రామాపురానికి రావాలన్నా, వూళ్ళో నుంచి అవతలి వొడ్డుకు పోవాలన్నా పడవతాత పడవే గతి. వూరిలో కేవలం వంద పూరి గుడిసెలు మాత్రమే వుండేది. వాటిల్లో అమాయకులు, లోకం తెలియని ఆదివాసీలు నివసించేవారు.. వారిలో నూనూగు మీసాలతో, యువ రక్తపు పొంగులో వున్నవాళ్ళలో అప్పయ్య ఒకడు.
రామాపురానికి రావాలంటే శ్రమతో కూడికొన్న పని. తప్పకుండా పడవతాత సహాయంతో ఆయన పడవలో ఆ దీవిలోని వూరికి వెళ్ళాలి. దీవినుంచి తిరిగి ఈ ఒడ్డుకు రావాలి. అది వారంలో ఒకసారే జరుగుతోంది. కారణం అవతల కాస్త దూరంలో మరో పడవ వున్నా వూరి జనం ఎక్కువగా అందులో వెళ్ళరు. వారానికి ఒకసారైనా సరే పడవతాత పడవకే ముఖ్యత్వమిస్తారు. అందులోనే వెళతారు.
దీవిలోని వూరికి వెళ్ళాలంటే కాస్త శ్రమతో కూడికొన్న పని. రెండు వైపుల కొండలు. వాటికి మధ్య పెద్ద లోయ. పైన గట్టు. గట్టుమీద నుంచి ముప్పై అడుగులు క్రిందకు దిగి కాలి బాటలో రెండు కిలోమీటర్లు నడిచి దట్టమైన అడవిని దాటుకొని చుట్టూరా సముద్రాన్ని తలపించే ఆ నదిగుండా దీవి మధ్యలో వున్న రామాపురానికి చేరుకోవాలి.
ప్రభుత్వపు రికార్డుల ప్రకారం దీవిలో వున్నఆ వూరి పేరు రామాపురం. ఆ వూరి పూరి గుడిసెల్లో దాదాపు నాలుగు వందల వరకూ ఆదివాసీలు వున్నారు.
వాళ్ళ జీవనాధారానికి ప్రధానమైన పని చేపల వేట. తదుసరి అడవి సంపదైన కట్టెలు, తేనె, పళ్ళు, కూరగాయలు, ఆకు కూరలు. ఎందుకంటే… అవే వాళ్ళకు అడవుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వాళ్ళు వాటిని వాళ్ళ శక్తి మేరా సేకరించుకొని వారానికోసారి అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళి సిరిపురం సంతలో అమ్ముకొని తిండికి కావలసిన వస్తువులను కొనుక్కొని తిరిగి వచ్చేవాళ్ళు. మామూలుగా అవతలి ఒడ్డుకు తీసుకు వెళ్ళటానికి ఇంకో పడవవున్నా పడవతాతపై వాళ్ళకున్న అభిమానంతో ఆయన పడవలోనే అవతలి గట్టుకు పయనించేవాళ్ళు ఆ వూరి జనం. పడవతాత కూడా వూరి జనాన్ని జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళి మరుసటి రోజు మళ్ళీ దివికి తీసుకొచ్చేవాడు. జనం లోయను దాటుకొని నగరానికి కాస్త దగ్గరలో వున్న ఆ సిరిపురం అన్న వూరిలో జరిగే సంతలో వాళ్ళు తీసుకు వెళ్ళిన వస్తువులను అమ్ముకొంటారు. అమ్ముకోగా వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పు, ఉప్పు కారమని కావలసిన వెచ్చాలను కొనుక్కొని ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం పడవతాత పడవలోనే ఇళ్ళకు చేరుకొంటారు. ఇదీ వాళ్ళ దైనందన జీవితం. ఏదేమైనా ఆ ఆదివాసీలు అర్ధాకలితో బ్రతికే బడుగు జీవులు. కట్టుబట్ట, తలకు చమురుక్కూడా ఇబ్బంది పడే నిరక్షరాస్యులు. ఇంకా చెప్పాలంటే ఈ లోకం పోకడ గూర్చి ఇప్పటికి పూర్తిగా తెలుసుకోలేని అమాయకులు.
ఆ వూరి జనంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వాళ్ళలో పడవతాత మొదటివాడు. ఆయన పేరు రాములు. కాని జనమంతా ఆయన్ను పడవతాతని పిలుచుకొంటారు. ఆయనే ఆ వూరికి పెద్ద దిక్కు. తన పని వూరి జనాన్ని వాళ్ళ వ్యాపార నిమిత్తం పడవలో దివి నుంచి ఒడ్డుకు, ఒడ్డునుంచి దివికి చేర్చడం, అందుగ్గాను ఎంతిచ్చినా తీసుకొంటాడు. కొన్ని సందర్భాల్లో డబ్బులివ్వక పోయినా వూరుకొంటాడు. అందుకే ఆయనతో అందరూ సన్నిహితంగా వుంటూ, సొంతమనిషిగా వూహించుకొని అప్యాయంగా ‘పడవతాతా’ అని పిలుస్తారు. ఆయనకూ సొంతమంటూ ఎవరూ లేని కారణంతో ఆ వూరి జనాన్నే తన బంధువులుగా భావించుకొని తనూ మసులుకొంటాడు. ఆ వూరి జనం కూడా పిల్లల వద్దనుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఆయన్ను తండ్రిలా, తాతయ్యలా, మామయ్యలా, అన్నయ్యలా, బాబాయిలా వరుసలు కలుపుకొని పిలుస్తుంటారు. అందువల్ల ఆయనలో తనో అనాథన్న భావం ఎన్నడూ కలుగలేదు. ఇది క్లుప్తంగా ఆయన చరిత్ర.
ఆ దీవిలో వున్న జనం అడవి సంపదను, కోళ్ళను, మేకల్ను, కుందేళ్ళను సేకరించుకొని అమ్ముకోవడానికి వారానికి ఒకసారి పడవతాత పడవలో ఈవల వొడ్డుకు వస్తారు. గట్టు పైకెక్కి కాస్త దూరం నడిచి రోడ్డుపైకెక్కిఅక్కడికి దాపులో వున్న మర్రి చెట్టు క్రింద మల్లయ్య టీ కొట్టు వద్దకెళ్ళి టీ తాగి వ్యాపారానికి వెళతారు. ఇది నిత్యం జరిగే తతంగం.
ఆ మర్రి చెట్టు క్రిందే బస్టాండు. బసెక్కడానికి ఆ చుట్టుప్రక్కల పల్లె ప్రజలు అక్కడికే వస్తారు. అందువల్ల మల్లయ్య టీ కొట్టు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా వుంటుంది. బస్సులతో పాటు అటూ ఇటూ వెళ్ళే ఎన్నో రకాలైన వాహనాలతో ఆ రోడ్డు ఎప్పుడూ రద్దీగానే వుంటుంది. మల్లయ్యకు జీవనాధారం ఆ టీ కొట్టే! దానిమీద తనకొచ్చే సంపాదనతో భార్య, తన ఇద్దరు పిల్లలతో జీవనాన్ని గడుపుకొంటుంటాడు. ఆయనలో దేశభక్తి ఎక్కువ. అందుకే మన దేశంమ్మీద పడి దోచుకొనే దుర్మార్గులు, దొంగలైన రాజకీయ నాయకులంటే కోపం. ఈ దేశం వాళ్ళ కబంద హస్తాల్లో చిక్కుకొని అల్లాడిపోతుందన్నది ఆయన భావన. అందుకు ఈ దేశాన్ని కాపాడే నిస్వార్థపరుడు, బడుగు బలహీన వర్గాలకు మంచి చేసే నిజాయితీపరుడు కావాలనుకొంటాడు. అప్పుడే ఈ దేశానికీ,దేశ ప్రజలకు విముక్తని తపనతో ఆరాటపడుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ వుండేవాడు.
మల్లయ్య కాస్త చదువుకొన్న వ్యక్తి. లోకం పోకడ నుంచి రాజకీయం వరకూ బాగా తెలిసినవాడు. అందుకే ఈ కుళ్ళు కుతంత్రాలతో భ్రష్టు పట్టిన సమాజం గూర్చి, దుర్మార్గంగా కొనసాగే రాజకీయాల గూర్చిన సంగతులను నలుగురితో చెప్పుకొని వాళ్ళనూ చైతన్యపరచాలనుకొంటాడు. ఆ ప్రయత్నం నిత్యం చేస్తూనే వుంటాడు. అందుకే తన వంతుగా తన వద్దకు టీ తాగను వచ్చే వాళ్ళకు పత్రికను చదివి చెప్పడమే కాదు, చుట్టూ జరుగుతున్న రాజకీయం మరియు ఇతరత్రా విషయాల గూర్చి విన్నవిస్తూ వుంటాడు. తద్వారా తన ఆశయం నెరవేరుతుందనుకొంటాడు. ఇంకా అలా చేయడం ద్వారా ఏ కొందరి లోనైనా కొంతైనా అవగాహనతో కూడికొన్న మార్పు కలిగి, చైతన్యంతో కూడుకున్న ఓ కొత్త సమాజం ఏర్పడుతుందన్న నమ్మకం ఆయనది. అందుకే తన కొట్లో టీ తాగను వచ్చే జనానికి నిత్యం బోధిస్తూనే వుంటాడు. జనం కూడా ఆయన బోధనలు అర్థం అయినా కాకపోయినా విని టీ తాగి వెళుతుంటారు. మల్లయ్య కూడా ఆ జనం విన్నా వినకపోయినా విసుగు విరామం లేకుండా పత్రికను చదివి లోకం పోకడను గూర్చి తన వంతు బాధ్యతగా చెపుతూనే వుంటాడు. అనతి కాలంలోనే ఏదో తను వూహించే మంచి జరిగి పోతుందన్నట్టు ఆనంద పడి పోతుంటాడు.
అలా అక్కడికి వచ్చి మల్లయ్య మాటలను వినే జనంలో అప్పయ్య ఒకడు. ఆ దీవినుంచి ఇక్కడికొచ్చి నప్పుడల్లా ఆయన కొట్లో టీ తాగి తను చెప్పే మాటల్ను వింటూ తన అవగాహన మేరా విన్న ఆ విషయాలను వాళ్ళ జనానికి తన అవగాహన మేరా తెలియచెప్పి వాళ్ళను చైతన్యపరచే పనిలో వుంటాడు తను కూడా ఏదో సాధిస్తున్నాడన్న నమ్మకంతో.
కానీ అప్పయ్య మాటల్ని వాళ్ళు పట్టించుకునే వారు కాదు. పైగా హేళన చేస్తూ నవ్వుకొంటూ వెళ్ళిపోయేవారు.
ఓ రోజు అప్పయ్య దీవినుంచి తెచ్చుకున్న బుట్టెడు మామిడి పళ్ళను సంతలో అమ్ముకొని త్వరత్వరగా టీ కొట్టు వద్దకొచ్చాడు. బెంచిమీద కూర్చొని టీ తాగి పత్రికను చదివి అందులోని విషయాలను అందరికీ వివరిస్తున్న మల్లయ్య ముఖంలోకి చూస్తూ శ్రద్దగా వింటున్నాడు. అంతలో బసోచ్చింది. అందరూ ఆ బస్సెక్కి వెళ్ళి పోయారు అప్పయ్య తప్ప.
అప్పుడు…..
“ఏంటి నువ్వెళ్ళ లేదా!” టీ తాగిన ఎంగిలి గ్లాసులు కడుగుతూ అడిగాడు మల్లయ్య.
“నేదండి. తమరు సెపుతుంటే ఇంకా ఇంకా ఇనాలనుంది” బెంచి మీద నుంచి లేవబోయాడు.
“వినాలని వుందా… అయితే కూర్చో! నేను మీకు చెబుతున్నది ఈ లోకం పోకడ గూర్చి. ఇందులో మనింట జరిగే చిన్నచిన్న విషయాలు మొదలు మన దేశ, విదేశ రాజకీయాల వరకూ అన్నీ వుంటాయి. కావాలంటే నీకు బాగా అర్థమయ్యేలా చెపుతాను. ఇందు వల్ల బోలెడు పరిజ్ఞానం పెరుగుతుంది. వింటావా?” వివరించి అడిగాడు మల్లయ్య.
“సెప్పండి. తెనుసుకొంటాను. మీరు సెప్పే మాటల్ని బట్టి సూత్తే అందులో ఏదో వుందని నాకు అర్థమవుతుంది. కానీ అదేటో తెలియకుంది. ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన నాను ఏదో పోగొట్టుకొన్నట్టు అనిపిస్తోంది” అన్నాడు అప్పయ్య
“కరెక్టు. అవేమిటంటే నువ్వు ఈ దేశ పౌరుడవి. ఈ దేశ పౌరుడిగా నీకు వున్న హక్కు, అధికారాలు పోగొట్టుకోవడమే అప్పయ్యా!”
అప్పయ్యకున్న బుధ్ధి జ్ఞానానికి, ఆలోచనా థోరణికి తనకు అన్నీ వివరించి చెప్పాలనుకొన్నాడు. మల్లయ్య మనసులోనే ఆలోచింపసాగాడు. తను రోజు చెపుతున్న ప్రసంగంలాంటి ఆ మాటలకు అందరిలో స్పందన కలుగక పోయినా ఈ అప్పయ్యలో ఏదో స్ఫూర్తితో కూడకొన్న చిన్న చలనం మాత్రం కలిగిందని గమనించాడు. తన భావాలకు దగ్గరగా వున్న వ్యక్తీ ఈ అప్పయ్యే ననుకొన్నాడు. తనలో దాగివున్న ఆ భావాలను కమ్యునిస్టు భావాలని చెప్పలేము కాని సాధారణ ప్రజ సైతం తెలుసుకొని కారు చీకటిలో బ్రతికే వాళ్ళ జీవితాలను వెలుగులోకి తెచ్చుకోగలరని తను అనుకొన్నాడు. అందుకు తనకు మొదటిగా దొరికిన చిన్న ఆయుధం అప్పయ్యని, అప్పయ్య మీద తన ప్రయోగం ప్రరంభించాలని కాస్త నమ్మకం తెచ్చుకొన్నాడు.
వెంటనే “నీకు నా నుంచి చాలా తెలుసుకోవాలన్న ఆసక్తి వున్నప్పుడు చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అప్పయ్యా! అయితే ఇది తెలుసుకోవడానికి ముందు నువ్వు నాలుగక్షరాలు నేర్చుకోవాలయ్యా! కనుక నీకు యిష్టమైతే నువ్వు ఈసారి సంతకొచ్చే రోజు నీకు అక్షరాలు నేర్పడం మొదలు పెడతాను! మామూలుగా మీ వాళ్ళతో సంతకెళ్ళే నువ్వు ఆ రోజు వ్యాపారం ముగించుకొని త్వరగా ఇక్కడికి వచ్చేయ్! ఏం?” అంటూ కొట్టు కట్టేశాడు మల్లయ్య. సరేనన్నట్టు తలూపి రోడ్డు దాటుకొని పడవ దగ్గరకు నడిచాడు అప్పయ్య.
మరుసటి రోజు —
ఉదయం ఎనిమిది గంటలు. వ్యాపారం చేసుకొని వాళ్ళకు ఓ వారానికి సరిపడే వెచ్చాలను తీసుకొని పడవవెక్కి కూర్చొన్నారు ఆ ఆదివాసీ ఆడ మగలు. పడవతాత తెడ్ల సహాయంతో తన పడవ నిండు గర్భిణిలా నదిలో మెల్లగా సాగి పోతోంది. అందరూ వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా ఏదో మాట్లాడుకొంటున్నారు. అవేమీ పట్టించుకోని అప్పయ్య ఓ మూల కూర్చొని ఏవేవో ఆలోచనల్లో పడ్డాడు. రెండు గంటల వ్యవధిలో పడవ అవతలి గట్టుకు చేరుకొంది. అందరూ దిగి వెళ్ళి పోయారు అప్పయ్య తప్ప.
“అప్పయ్యా! ఏంట్రా… ఇంటికెళ్ళవా? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో వున్నట్టున్నావ్!” పడవతాత అడిగాడు.
“అవును తాతా! మన వూరిని, జనాన్ని గూర్చి ఆలోచిస్తున్నాను” లేచి దగ్గరకొస్తూ అన్నాడు అప్పయ్య.
“ఏం… అందరం బానే వున్నాంగా!”
“కాని ఇదే లోకమనుకొని ఈ దీవినే నమ్ముకొని ఇక్కడ దొరికే అడవి సంపద మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అక్షర శూన్యులమై అనాగరికులుగా వుంటున్నాం. మనకు బయటి ప్రపంచం గూర్చి అస్సలు తెనీదు తాతా!”
“నీకు తెలుసా?”
“నాను తెనుసుకోవడానికి ప్రయత్నిత్తున్నాను తాతా! శుక్రవారంనుంచి నాను చదువు కొంటాను.”
“ఆహా! పెద్ద పనే! అయినా నీకు ఈ వయస్సులో చదువేంట్రా? నీకు చదువు సెప్పేదెవర్రా?” అంటూ నవ్వాడు పడవతాత.
“నాకు ఆ టీ కొట్టు మల్లయ్య చదువు నేర్పుతాడని సెప్పాడు. నాను చదువుకొని ఆ చదువును మన వాళ్ళకు నేర్పుతాను. వాళ్ళనుకూడా అక్షరాస్యులను చేసి నాగరికులుగా తీర్చి దిద్దుతాను. ఇంకా…” ఏదో చెప్పబోయాడు వుద్వేగానికి లోనై.
“సరే… సరే! ఏదో చేద్దువులే పద!”అంటూ అప్పయ్య మాటల్ని పెద్దగా పట్టించుకోని పడవతాత ముందుకు నడిచాడు. ఆయన వెళ్ళే వేపు చూస్తూ అక్కడే నిలుచుండిపోయాడు అప్పయ్య.
(సశేషం)