Site icon Sanchika

పామరులు – పడవతాత 2

[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

[dropcap]ఆ [/dropcap]రోజు ఉదయం అప్పయ్య ఇంట్లో కార్యక్రమాలను ముగించుకొని తనకు వరుసకు మామైన అంజయ్య గుడిసెకు వెళ్ళాడు. అప్పయ్యను చూస్తూనే అడవికి వెళ్ళడానికి వేట కొడవలికి పదును పెడుతున్నవాడల్లా దాన్ని పక్కన బెట్టి తలకున్న గుడ్డను తీసి ముఖం తుడుచుకొంటూ “ఏంటల్లుడూ ఇందాక వచ్చావు? ఏదైనా చెప్పుకోవాలా?” అడిగాడు అంజయ్య.

“అవును మావా! మనం ఆవల ఒడ్డుకెళితే అక్కడో ‘టీ’కొట్టు వుంది తెనుసుగా?”

“అవును. మల్లయ్య ‘టీ’కొట్టు”

“ఆఁ…ఆ సామి నాకు శుక్రవారం నుంచి చదువు నేర్పుతానన్నాడు” ఖచ్చితంగా తొట్రుపాటు లేకుండా అన్నాడు.

“ఓర్… నీ! చదువా…! ఇప్పుడా? ఈ వయస్సులోనా?” నవ్వి “సరే అందుకు నేనేంచెయ్యాలి!” అంటుండగా అంజయ్య కూతురు సీత నవ్వుకొంటూ చెంబుతో మంచి నీళ్ళు తెచ్చి అప్పయ్యకు యిచ్చింది. మంచి నీళ్ళను తాగి చెంబును సీత చేతికిస్తూ “నువ్వేం చెయ్యక్కరలేదు మావా!సీతను కూడా చదువుకోవడానికి నాతో పంపుతావని…”అంటుండగా సీత నవ్వుకొంటూ లోనికెళ్ళి పోయింది.

 అంజయ్య మళ్ళీ నవ్వి”చూద్దాంలే! మొదట నువ్వు చదువుకో అప్పయ్యా!”అన్నాడు పైకి లేస్తూ.

“సరే! వస్తాను మావా” అంటూ అప్పయ్య దృఢమైన నమ్మకంతో అక్కణ్ణుంచి వెళుతుంటే ఇంటిలో నుంచి బయటికొచ్చి తన వేపే చూస్తూ నిలబడింది సీత. సీత అప్పయ్యల మధ్య ఏదో తెలియని ప్రేమలాంటి అనుబంధముంది. అది సీత తండ్రికి తెలుసు.

అప్పయ్య అంతటితో ఆగకుండ అలాగే తన స్నేహితుడు సోమయ్య ఇంటి కెళ్ళి తనతో కూడా విషయాన్ని చెప్పి తనతోపాటు చదువుకోవడానికి రమ్మన్నాడు.

సోమయ్య కూడా విరగబడి నవ్వి “ఈ వయస్సులో మనకు చదువేంట్రా! అదేదో నువ్వే చదువుకో ఎళ్ళు. నేను కట్టెల కోసం అడవికి వెళుతున్నా”నంటూ అప్పయ్య మాటల్ని పట్టించుకోకుండా గొడ్డల్ని భుజానుంచుకొని వెళ్ళిపోయాడు. అయినా అప్పయ్య నిరుత్సాహ పడకుండా పట్టు విడువకుండా కొందరిని అడిగాడు. ఎవ్వరూ తన మాటకు తలొగ్గక పోయేసరికి ఇక ఎవరినడిగినా లాభం లేదనుకొన్న అప్పయ్య తనకున్న ఆసక్తితో తప్పకుండా శుక్రవారమే టీ కొట్టు మల్లయ్య వద్ద తన అక్షరభ్యాసానికి శ్రీకారం చుట్టాలనుకొన్నాడు. ఎవరేమనుకొన్నా తన ప్రయత్నం మానుకోకుండా తప్పకుండా చదువుకోవాలని నిర్ణయిం తీసుకొన్నాడు.

ఆరోజు శుక్రవారం. మామూలుగా అందరూ సంతకు వెళ్ళి తమ వద్దున్న వస్తువులను అమ్ముకొని వెచ్చాలు తెచ్చుకునే రోజు. కాని ఆ శుక్రవారం అప్పయ్యకు ఓ ప్రత్యేకమైన రోజు. తన వద్ద వున్న వస్తువులను అమ్ముకొని వెచ్చాలు తెచ్చుకోవడంతో పాటు తన జీవితంలో వెలుగులు నింపి అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టబోయే మంచి రోజు.. అందుకే సంతలో తనకు వ్యాపారమౌతూనే చదువుకోవడానికి తిన్నగా మల్లయ్య వద్దకు రావాలనుకొన్నాడు. అది తలచుకొని ఆనందంతో పొంగి పోయాడు.

ఊరి జనం వాళ్ళ వాళ్ళ స్థోమతుకు తగ్గట్టు సేకరించిన అడవి సంపదైన పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, కట్టెలని, ఇళ్ళలోని కోళ్ళు, మేకలు, పాలని రకరకాలుగా తీసుకొని ఏటి వొడ్డున కట్టి వుంచిన పడవతాత పడవలో ఎక్కి కూర్చొన్నారు.

అప్పయ్య కూడా తను సేకరించిన జామపళ్ళ బుట్టతో పడవలో ఓ మూల కూర్చొని అప్పటికింకా రాని అంజయ్య మామ కూతురు సీత కొరకు యెదురు చూస్తున్నాడు.

పడవతాత పడవనీ, పడవలో కూర్చొని వున్న జనాన్నీ ఒక్కసారి చూసి దేవుడికి దణ్ణం పెట్టుకొని “అందరూ వచ్చినట్టేగా” అని అడిగాడు. అందరూ వచ్చినట్టేనని ‘ఆఁ…ఆఁ,’ అంటూ తలలూపారు.పడవ తాతకూడా ‘సరే’నన్నట్టు జనం పడవలోనికి రావడానికి, పడవలోనుంచి వొడ్డుకు వెళ్ళడానికి వేసి వుంచిన పలకను తొలగించబోయాడు.

అంతలో అప్పయ్య “తాతా! కాస్త ఆగండి. అదిగో సీత వొస్తోంది” అన్నాడు ప్రాధేయ పూర్వకంగా.

సీత తన కూరలున్న బుట్టతో పడవలో కాలు పెట్టింది. అప్పయ్య కాస్త సర్దుకొంటూనే తన ప్రక్కన కూర్చొంది. పడవతాత వాళ్ళిద్దరిని చూసి మెల్లగా నవ్వుకొని తెడ్లతో పడవను నడపను ప్రారంభించాడు. నీటి తొణుకులతో పడవ సాగిపోతోంది. పడవలో వున్న జనం పిచ్చాపాటి మాట్లాడుకొంటున్నారు.అటు పడవ చివర ఓ ఇద్దరు కూనిరాగాలు తీస్తున్నారు. అప్పయ్య, సీతలు ఒకరినొకరు చూసుకొంటూ కళ్ళతోనే వూసులాడుకొంటూ వున్నారు. పది గంటల కల్లా వాళ్ళను సంతకు చేర్చే వుద్దేశ్యంతో తెడ్లను వొడుపుగానే వేస్తున్నాడు పడవతాత.

సమయం పది గంటలవుతుండగా ఆవలి వొడ్డుకు చేరుకొంది పడవ. పడవలో వున్న జనం వ్యాపార నిమిత్తం తెచ్చుకొన్న వాళ్ళవాళ్ళ వస్తువులతో దిగారు. దాదాపు ఇరవై అడుగుల లోయలో ఇసుకలోనే నడిచిన వాళ్ళు కాస్త దూరం వెళ్ళాక రోడ్డు పైకెక్కారు. ఆ రోడ్డునానుకొని ఓ మర్రిచెట్టు. అక్కడే మల్లయ్య టీ కొట్టు, బస్టాపు కూడా.

అందరూ అక్కడి కెళ్ళి మల్లయ్యకు నమస్కారం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన కొట్లో టీ తాగి సంతకు వెళ్ళి పోయారు. వెళ్ళిపోయిన వాళ్ళలో అప్పయ్య, సీతలు కూడా వున్నారు.

ఇక పడవతాత తనతో తెచ్చుకొన్న సద్ది అన్నాన్ని మర్రి చెట్టు క్రింద కూర్చొని తిన్నాడు. చల్లగా వీస్తున్న ఆ గాలికి తన వద్దున్న గుడ్డను చెట్టు చుట్టు వున్న అరుగు మీద పరుచుకొని అలసిపోయిన తను అక్కడ హాయిగా నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు అటూ ఇటు వెళుతున్న వాహనాల శబ్దాలు కాని, జనాల మాటలు కాని వినబడలేదు. అది ప్రతిసారి పడవతాతకు మామూలే!

అప్పయ్య మూడు గంటలకల్లా తన వ్యాపారం ముగించుకొని టీ కొట్టు మల్లయ్య వద్దకొచ్చాడు. టీ కొట్టు మల్లయ్య, తను ముందే అప్పయ్య కోసం తీసి వుంచిన పలకా బలపం బయటికి తీసి ‘అ ఆ’ లను రాసి, అప్పయ్య చేత రాయిస్తూ వాటిని పలికిస్తూ అక్షరాభ్యాసాన్ని ప్రారంభించాడు. శ్రద్దగా నేర్చుకొంటున్నాడు అప్పయ్య. తన ద్వారా ఒకడు, అందునా ఓ ఆదివాసి అక్షరాస్యుడవుతున్నాడన్న తృప్తితో మనసులోనే ఆనందించాడు టీ కొట్టు మల్లయ్య.

పొద్దటు వాలుతుండగా వ్యాపారానికని వెళ్ళిన జనం ఒక్కొక్కరూ తిరిగి వస్తున్నారు. క్రిందికి దిగిపోతున్న సూరీడు కిరణాలు తనపై పడ్డంతో టక్కున లేచాడు పడవతాత. ముఖం కడుక్కొని తుండు గుడ్డతో తుడుచుకొంటూ మల్లయ్య టీ కొట్టు వద్దకెళ్ళి తనకు టీ చెప్పుకొని అటు చూశాడు. అక్కడ అప్పయ్య చక్కగా అక్షరాలను ఒత్తి పలుకుతూ దిద్దుతున్నాడు.

“అప్పయ్యా! అనుకున్న ప్రకారం చదవను ప్రారంభించావన్న మాట”

“అవును తాతా! నాకు చదువుకోవాలని వుంది!”

“అవును తాతా! అప్పయ్యకు చదువు మీది వున్న ఆసక్తిని తెలుసుకొన్నాకే నాకూ తన్ను అక్షరాస్యుణ్ణి చేయాలన్న భావం కలిగి తనకు అక్షరాభ్యాసాన్ని ఇవాళే ప్రారంభించాను. ఇది చక్కగా సాగాలని అప్పయ్యను నువ్వూ దీవించు తాతా!”అన్నాడు టీ కొట్టు మల్లయ్య.

“నా దీవెనలకేం బాబూ! మెండుగా వున్నై” అంటూ టీ తాగాడు పడవతాత.

గంట రాత్రి ఎనిమిదయ్యేసరికి అందరూ మర్రి చెట్టు వద్దకు చేరుకొన్నారు. సంతనుంచి వాళ్ళతో తెచ్చుకొన్న భోజనం, టిఫిన్ లాంటివి తిని పక్కలు పరచుకొని పడుకొన్నారు.

కాస్సేపటికి అప్పయ్య కూడా తనకూ పడవతాతకు, సీతకు ఇడ్లీ కట్టించుకొని వచ్చాడు. ముగ్గురూ తిని పక్కలు వేసుకొని పడుకొన్నారు. అలసిన ప్రాణాలు కదా పాపం వెంటనే నిద్ర పోయారందరూ!

మరుసటి రోజు వుదయం పది గంటలకల్లా పడవతాత అందరిని ఆవలి వొడ్డునున్న వాళ్ళ దీవికి చేర్చాడు. అందరూ వెళ్ళి పోయారు. పడవతాత మామూలుగా తన పడవను ఒడ్డుకు కట్టి తనూ అందరిని పలకరించే నిమిత్తం నిత్యం అందరూ కలుసుకునే అమ్మవారి ఆలయం వద్దకెళ్ళి నలుగురితో పిచ్చాపాటి మాట్లాడుకోవడంలో మునిగి పోయాడు. మొత్తంలో అవతలి వొడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయం తప్ప తతిమ్మా వేళలు పడవతాతకు అమ్మవారి ఆలయంతో, వూరి జనంతో మమేకమై పోవడం పరిపాటి.. కారణం ఆ వూరన్నా, వూరి జనమన్నా పడవతాతకు ప్రాణం మరి.

ఆరు నెలలు గడిచి పోయాయి, అప్పయ్య ఇప్పుడు పేపరు చదివేంతటివాడయ్యాడు. పట్టణ శివారులో కనబడే ఆంగ్ల బోర్డులను సైతం చదవగలుగుతున్నాడు. అప్పయ్యను చూసి ఎగతాళిచేసిన వాళ్ళ జనం ఇప్పుడు అతన్ని మెచ్చుకొంటున్నారు. గౌరవిస్తున్నారు.

అప్పయ్య నడవడికలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా తెలివితో పెద్ద మనిషి తరహాలో చక్కటి భాషతో మాట్లాడుతూ మసలుకొంటున్నాడు. ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడ్డం అలవాటు చేసుకున్నాడు. అప్పయ్య ధోరణి అందర్ని అబ్బురపరచటమే కాదు అతని మీద వాళ్ళకు తెలీకుండానే గౌరవం పెరిగింది.

ఇప్పుడు వూరిలో వున్న పెద్ద మనుష్యులు ఏ చిన్న విషయానికైనా సరే అప్పయ్యను పిలిచి సలహాల నడుగుతున్నారు. అప్పయ్య కూడా ఓ ప్రక్క తనకు తోచిన మంచి సలహాలను ఇస్తూ మరో ప్రక్క వూరి జనాన్ని చైతన్యపరిచి అందరూ తన మాటలు వింటూ తన ఆలోచనలకు అనుగుణంగా నడచుకునేలా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటే ఏదైనా మంచి చేయగలుగుతాడని అప్పయ్య నమ్మకం. రోజులు గడుస్తున్నాయ్ .

***

అప్పయ్య, సీతలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇద్దరూ కలిసి తిరిగే చోటు అది వూరైనా, సంతైనా మరే చోటయినా సరే అక్కడ ఒక్కటిగా వుండడం కద్దు. అందుకు కారణం అప్పుడప్పుడే వాళ్ళ మధ్య చోటు చేసుకొంటున్న ప్రేమనే భావించవచ్చు ఆ సంగతి సీత తండ్రి అంజయ్య ఎప్పుడో గమనించాడు. ఆయనకు అప్పయ్యంటే ఇష్టం కనుక వాళ్ళను పట్టించుకోకుండా ఇద్దరిని ఒక్కటి చేసేందుకు సమయ సందర్భాల కోసం వేచి చూస్తున్నాడు. ఎలాగైనా పడవతాతతో సంప్రదించి ఈ విషయంగా మాట్లాడి అప్పయ్యను తనింటి అల్లుడ్ని చేసుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు సంగతి బయటికి పొక్కకుండా!

ఆ రోజు అప్పయ్య, సీతలు వాళ్ళకు దగ్గరగా వున్న తోటలో ఆకుకూరలను సేకరిస్తున్నారు.

“ఏమంటున్నాడు మీ అయ్య?” అడిగాడు అప్పయ్య కాస్త చతురుగానే.

“దేన్నీగూర్చి?” క్రీకంట చూస్తూ అడిగింది సీత.

“అదే మనమిలా విచ్చలవిడిగా అడ్డూ ఆపు లేకుండా అప్పుడప్పుడు కలుసుకొంటున్నాంకదా ! దాని గూర్చి”

“మా అయ్యకు నీ మీద నమ్మకముంది. ఇప్పటికే నిన్ను తన అల్లుడుగానే భావించుకొంటున్నాడు”

“అంటే…”

“అంటే ఏముంది! త్వరగా వచ్చి నన్ను పిల్లనడిగి పెళ్ళి చేసుకోంటావనుకొంటున్నాడు”

“నువ్వేమనుకొంటున్నావ్?” దగ్గరకు లాక్కొని పొదివి పట్టుకొని అడిగాడు అప్పయ్య.

“మా అయ్య అనుకొంటుంది నువ్వు త్వరగా నిజం చెయ్యాలనుకొంటున్నాను” తల దించుకొనే జవాబు చెప్పింది సీత అప్పయ్య నుంచి విడిపించుకొంటూ.

“అలాగే సీతా! ఈ అదివారం మనకు పెద్ద దిక్కు, తండ్రిలాంటి పడవతాతతో మీ ఇంటికి నిన్ను పిల్లనడగడానికి వస్తాను” మనసులోని మాట బయట పెట్టాడు అప్పయ్య సీత చేయిని తన చేతిలోకి తీసుకొని.

సీత సంతోషంతో సిగ్గుపడుతూ “మా అయ్యతో చెప్పి మీ కోసం యెదురు చూస్తూ వుంటాం” అంటూ కూరల బుట్టను నెత్తినపెట్టుకొని చిరునవ్వుతో అక్కడినుంచి బయలుదేరింది. అమెనే చూస్తూ వుండి పోయాడు అప్పయ్య.

ఆదివారం రానే వచ్చింది. అప్పయ్య తన వద్ద కాస్త బాగున్న చొక్కాను వేసుకొని పంచ కట్టుకొని చక్కగా తల దువ్వుకొని పడవతాత వద్దకు బయలుదేరాడు.

అప్పటికే పడవలో ఏదో మరమ్మతులో మునిగి వున్న పడవతాతకు దగ్గరగా వెళ్ళి దగ్గాడు అప్పయ్య. తిరిగి చూశాడు పడవతాత. అప్పుడు అప్పయ్య తన కళ్ళకు కాస్త తేడాగా కనబడ్డాడు. తప్పని సరిగా తెలుసుకోవాలన్న వుద్దేశ్యం తనలో చోటు చేసుకోగా “ఏమిటప్పయ్య! ఏమిటి సంగతి. ఇవాళ మనిషివి కాస్త తేడాగా కనబడుతున్నావ్!” అడిగాడు పడవతాత.

“అదే తాత! అంజయ్య మామ కూతురు సీతను పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నానని క్రితంలో నీతో అన్నాను గుర్తుందా?!” నేల చూపులతో సిగ్గు పడుతూ అన్నాడు అప్పయ్య.

“ఆఁ… అన్నావు.అందుకిప్పుడేమిటట?”

“అంజయ్య మామ ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళాలి. అందుకు నువ్వు నాకు తండ్రి స్థానంలో రావాలి.”

“దాందేముంది. ఎవరూలేని నాకు నువ్వే కొడుకువని ఎప్పటినుంచో అనుకొంటున్నాను! మహా భాగ్యంగా వస్తాను పద” అంటు చేతులు కడుక్కొని అక్కడే వున్న కండువాను భుజాన వేసుకొని అప్పయ్యతో బయలుదేరాడు పడవతాత.

అంజయ్య కూతురు సీత ఉదయాన లేచి ఇంటిముందు తుడిచి కలేపు చల్లి, తనూ స్నానమది చేసి అప్పయ్య కోసం సిధ్ధంగా వుంది. ప్రతి రోజూ తనకది మామూలే అయినా ఈ రోజు ప్రత్యేకమనుకుంది. ఇంటి పనులన్నీ పూర్తవుతూనే తనూ స్నానమదీ చేసి చీర కట్టుకొని తల దువ్వుకోని పూలు పెట్టుకొని చక్కగా తయారై ప్రతి పది నిముషాలకు ఓ మారు ఇంట్లోంచి బయటికొచ్చి చూసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పోతోంది. అది గమనించిన తండ్రి అంజయ్య తనలో తానే నవ్వుకొన్నాడు. ఈడొచ్చిన పిల్లకు పెళ్ళి చేసిపెట్టి అత్తారింటికి పంపడం సంతోషకరమైన సంగతైనా తన కూతుర్ని పెళ్ళి చేసుకోబోతున్నది తనకిష్టమైన అప్పయ్య కనుక అంజయ్య ఆనందానికి అవధుల్లేవు.

అంతలో అప్పయ్య పడవతాతను తీసుకొని రానే వచ్చాడు. వాళ్ళను చూస్తూనే లోనికెళ్ళి పోయింది సీత.

“రండి. కూర్చొండి!” ఆహ్వానించాడు అంజయ్య. అది కూడా మామూలు పద్దతే అయినా ఇవాళ అందులో కాస్త ప్రత్యేకత వుందనిపించింది అప్పయ్యకు. ఇంటి గుమ్మానికి ముందున్న వసారాలో మంచం మీద దుప్పటి పరచి వుంది. అందులో కూర్చొన్నారు పడవతాత, అప్పయ్య. ఎదరే అరుగుమీద కూర్చొని వున్న అంజయ్య ఇంట్లోకి చూస్తూ “పడవ తాతొచ్చాడు. మంచినీళ్ళు తీసుకురామ్మా సీతా!” అని పిలిచాడు.

ఇంటి లోపల నీళ్ళ చెంబుతో తయారుగా వుందేమో సీత మరి వెంటనే ప్రత్యక్షమైంది. నీళ్ళిచ్చి తను లోనికి వెళ్ళి పోయింది. మంచినీళ్ళు తాగారిద్దరూ.

“అంజయ్యా! నీకు తెలియందేమీ కాదు. అప్పయ్య తల్లి తండ్రి లేని అనాథ. మంచిపిల్లాడు. బుద్ధిమంతుడు. మన జనంలో నాలుగక్షరాలు నేర్చొకొని మన వూరినే చైతన్యపరచి అందరిని మంచి మార్గాన తీసుకు వెళ్ళాలనుకొంటున్న కుర్రాడు. ఇంకా….”

“ఆపండయ్యా! అల్లుడు గూర్చి ఇంకా చెప్పుకొంటూ వెళితే చాలా వుంది. మీరొచ్చిన పని…. నా కూతుర్ని తనకిమ్మని అడగడానికేగా! నేనెప్పుడో నిర్ణయం తీసుకొన్నాను. సీతను అప్పయ్యకు ఇవ్వడం నాకు పరిపూర్ణ సమ్మతం” మనసులోని మాట సంతోషంతో బయటపెట్టాడు అంజయ్య. అప్పుడు అప్పయ్య ముఖంలో వెయ్యి కాంతులు వెల్లివిరిశాయి.

“సీతా!పడవ తాతకు కాఫీ నీళ్ళు పట్టుకు రామ్మా”అంటూనే కాఫీతో తయారుగా వున్న సీత బయటికొచ్చి వాళ్ళకిచ్చి పడవతాత కాళ్ళకు నమస్కరించింది. అప్పయ్యను క్రీకంట చూస్తూ లోనికెళ్ళి పోయింది.

పెద్దగా వ్యవహారాలు సాక్కుండానే ఓ మాసంలోపే ముహుర్తాలు పెట్టుకొని వాళ్ళ ఆచారవ్యవహారాల పధ్ధతుల్లో వూరికి నడుమున్న అమ్మవారి ఆలయంలో పెళ్ళి చేసుకోవాలని ఉభయులు నిర్ణయించుకొన్నారు. మెళ్ళో కండువాను సర్దుకొని లేచాడు పడవతాత.

అప్పయ్య కూడా “వస్తాను మావా” అంటూ బయలుదేరాడు. అప్పుడు గుమ్మం వద్దకు వచ్చి వాళ్ళు వెళుతున్న వేపే చూస్తూ నిలబడింది సీత తండ్రితో పాటు.

ఇళ్ళ మధ్య నుంచి పడవ వద్దకు నడుస్తున్నారు పడవతాత, అప్పయ్య. అప్పుడు ఓ తల్లి తన అయిదేళ్ళ పాపను భుజాన వేసుకొని ఏడుస్తూ పడవ వద్దకు పరిగెత్తినట్టు వస్తోంది. ఆమె వెంట ఓ నలుగురు ఆడమగలు కూడా వస్తున్నారు. అది గమనించిన పడవతాత, అప్పయ్య నడక వేగాన్ని పెంచి త్వరత్వరగా పడవ వద్దకు వెళ్ళారు.

పడవతాతను చూసిన ఆ తల్లి “తాతా! నా బిడ్డను ఏదో విష పాము కాటేసింది. కళ్ళు తేలేశాడు. నోట నురగొస్తుంది. పడవ కట్టండి. టౌనుకు వెళ్ళాలి” అని ఏడ్పు స్వరాన్ని పెంచింది. ఆమెతో వచ్చిన తతిమ్మా వాళ్ళుకూడా పడవలో కూర్చొని పడవతాతను తొందర చేశారు.

“పదండి తాత”అంటూ పడవ తాడును విప్పి తెడ్లను పడవతాత చేతికిచ్చాడు అప్పయ్య.

పడవతాత వొడుపుగా వేస్తున్న తెడ్ల సహాయంతో పడవ కాస్త దూరం సాగింది. అంతలో పాము కాటేసిన పిల్లాడి తల్లి పెద్దగా “అయ్యో దేముడోయ్! నా పిల్లాడు చనిపోయాడు తాతా. పడవను వెనక్కుతిప్పండి. వెనక్కు తిప్పండి తాతా! అయ్యా అప్పయ్యా! పడవను వెనక్కు తిప్పమనయ్యా”అంటూ గగ్గోలు పెట్టింది. పడవలోని అందరూ పిల్లాడి దాపుకు వెళ్ళారు. అంతలో పడవను వొడ్డుకు చేర్చాడు పడవతాత. పడవలో వున్న వాళ్ళ సహాయంతో పిల్లాడి తల్లి పిల్లాడ్ని తీసుకొని శోకాలు పెడుతూ తన ఇంటికి పరిగెత్తినట్టు నడిచింది. ఆమెను వెంబడించారు తతిమ్మా జనం. దిగాలుపడ్డ ముఖాలతో ఏదో ఆలోచిస్తున్నట్టు అటే చూస్తూ నిలబడ్డారు పడవతాత, అప్పయ్య.

కాస్సేపైన తరువాత “తాతా !ఈ దీవికే పరిమితమైన మన గతి యింతేనంటావా?!” ప్రశ్న సంధించాడు అప్పయ్య.

“అంతే అప్పయ్యా! మన తనువులు చాలించే వరకు ఇలా గడిచిపోవలసిందే! కాకపోతే అసలు అటు టౌనుకు ఇటు చుట్టు ప్రక్కలున్న వూర్లకు దూరాన ఈ దీవిలో వుంటున్న మనం ఏం చేయగలం చెప్పు?”

“అది కాదు తాతా! మన వాళ్ళందరిని అమ్మవారి అలయం వద్దకు రమ్మని పిలిచి వాళ్ళతో కలిసి మాట్లాడుకొని మనకు కావలసిన వసతులతో మంచి చేయమని ప్రభుత్వాన్ని అడగాలని వుంది. అసలు ఈ దీవికే పరిమితమై బ్రతుకుతున్న మనం ఆవల వున్న జనాభాలా ఈ ప్రభుత్వానికి లెక్కున్నామా లేదా అన్న సందేహం నా కొస్తుంది తాతా” కాస్త ఆలోచన ధోరణితో ఆవేశపూరితంగా అన్నాడు అప్పయ్య.

“ఏమిట్రోయ్! నువ్వు నాలుగక్షరాలు నేర్చుకొన్నాక కాస్త పెద్ద మాటలే మాట్లాడుతున్నావ్. దాన్ని గూర్చి తరువాత ఆలోశిద్దాం. మొదట కాళ్ళు చేతులు కడుక్కో! అంత పచ్చడి మెతుకులు తిందువుగాని” అంటూ పడవను కట్టేసి ఇంటికి దారి తీశాడు పడవతాత.

“ఏమో తాతా! నాకు మాత్రం నలుగురిని కూడేసి ఇలాంటి విషయాలకు ఓ నిర్ణయం తీసుకోవాలని వుంది. అవును తాతా! ప్రతి ఏడు వర్షాలొచ్చినప్పుడు ఇలా పాములు కరవడాలు అటుంచి విష జ్వరాలు, వాంతులు భేదుల భారిన పడి చిన్న పిల్లల దగ్గరనుంచి పండు ముసలాల్ల వరకు దాదాపు అయిదారు మంది మృత్యువాత పడుతున్నారు. మనం కూడా మనలో వున్న మూఢ నమ్మకంతో అమ్మోరికి కోపం వచ్చి మనల్ని ఇలా చేస్తుందని మనకు మనమే సమర్థించుకొని సర్ది చెప్పుకొని చచ్చిన వాళ్ళను ఈ నది నీళ్ళ వెంట వొదిలేసి వూరకుండి పోతున్నాము. అందుకని…” అని ఇంకా ఏదో చెప్పబోయాడు అప్పయ్య పడవతాతకు.

అప్పయ్య మాటలకు మధ్యలోనే అడ్డు తగిలి “సరే! నువ్వు చెప్పినట్టు ఓ రోజు వూరిజనాన్ని గుడి వద్ద కూడేసి మాట్లాడుదాంలే పద” అన్నాడు పడవతాత అప్పయ్యలో నుంచి వస్తున్న తెలివితో కూడికొన్న వుద్వేగ భరితమైన మాటలను ఆలోచిస్తూ.. కాస్సేపటికి ఇద్దరూ పడవతాత గుడిశెకువెళ్ళి పోయారు.

***

ఆ రోజు శుక్రవారం. శుభ ముహూర్తం. ఆ శుభ ముహూర్తానే అప్పయ్యకు పెళ్ళి జరగనుంది.

అప్పయ్య తన పెళ్ళి కోసం ఊరి మధ్య నున్న అమ్మవారి గుడి ముందు కొబ్బరాకులతో చిన్న పందిరి వేయించాడు. తన స్థోమతుకు తగ్గట్టు పెళ్ళికి వచ్చే వారికి అక్కడే విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు.

ఉదయం పదిగంటలకల్లా పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. అర్ధగంటలో వూరి జనం మొత్తం గుడి వద్దకు చేరారు. అంజయ్య ఇంటి వద్దే తన కూతుర్ని నలుగురు ఆడాళ్ళను పిలిచి పెళ్ళి కూతుర్ని చేయించి అమ్మ వారి గుడికి తీసుకు వచ్చాడు. అప్పటికే గుడి ప్రాంగణం వూరి జనాలతో నిండి సంతోషకరమైన వాతావరణంలో కేరింతలతో కళకళలాడుతోంది.

అనుకున్న ముహూర్తం సమయానికి వారి సాంప్రదాయం ప్రకారం అప్పయ్య సీత మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు. అంజయ్యకు తన కూతుర్ని అప్పయ్యకు కట్టబెట్టిన ఆనందంలో కళ్ళమ్మటి కారుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకొని దంపతులను ఆశీర్వదించాడు తన్నుంచి ఏదో భారాన్ని దించు కున్నట్టు. పడవతాత కూడా వూరి జనంతో పాటు దంపతులను ఆశీర్వదించగా చక్కగా పెళ్ళి జరిగిపోయింది. అందరూ విందు భోజనాలకు లేచారు.

(సశేషం)

Exit mobile version