Site icon Sanchika

పామరులు – పడవతాత 3

[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]రో[/dropcap]జులు గడుస్తున్నాయ్! ఇన్నాళ్ళు అప్పయ్య ఒక్కడే ఒంటరిగా వుండి ఆ వూరికి, పామర జనానికి చేస్తున్న మంచి పనుల్లో ఇప్పుడు పాలి భాగస్తురాలయ్యింది తన భార్య సీత కూడా. ఊరిలో ఎక్కడ ఏ ఇంట్లో ఏది జరిగినా అది శుభమైనా, అశుభమైనా మొదటిగా వెళ్ళి పాలుపంచుకునే వాళ్ళు అప్పయ్య, సీత దంపతులే!

వూరి జనం కూడా ఏ చిన్న విషయమైనా సరే అప్పయ్యకు చెప్పి అతని అభిప్రాయం ప్రకారం నడచుకునేంతగా మారిపోయారంటే అది అదిశయోక్తి కాదు. ఆ వూరిలో ఎంతో మంది పెద్దలున్నా అప్పయ్య మాటలే వాళ్ళకు వేదమనుకొంటూ అలాగే నడుచుకొంటున్నారు. ఇంతటికీ కారణం అప్పయ్యలో వున్న అక్షర జ్ఞానమే! అప్పయ్య నేర్చుకున్న ఆ కొద్దిపాటి చదువే! అదే అప్పయ్యలో వున్న సంస్కారాన్ని మరింతగా పెంచింది. వినయంతో కూడికొన్న సభ్యతను ఎక్కువ చేసింది. ఇంకా చెప్పాలంటే అప్పయ్య ఆ వూరి జనానికి చేసే సేవలు అతన్ని శిఖరాగ్రాలను అధిరోహించేలా చేశాయి.

రోజులు సాఫీగా దొర్లిపోతున్నాయ్….

ఆ రోజు శుక్రవారం. వ్యాపార నిమిత్తం వాళ్ళ శక్తి మేరా సేకరించుకొన్న రకరకాల వస్తువులను పడవలో అవతలి వొడ్డుకు తీసుకు వెళ్ళి సంతలో అమ్ముకొని వారికి కావలసిన వెచ్చాలు తెచ్చుకునే రోజు.

ఉదయం ఎనిమిది గంటలకల్లా అందరూ వాళ్ళు సేకరించుకున్న వస్తువులతో వచ్చి పడవలో కూర్చొన్నారు. చాలా సేపటివరకూ పడవతాత రాలేదు. అందరూ ఆదుర్దాతో పడవ తాతకోసం ఎదురు చూస్తున్నారు. ఎంత సేపటికి రాకపోయే సరికి అప్పయ్యకు సందేహం రాగా సీతను తీసుకొని పడవతాత గుడిశెకు వెళ్ళాడు. పాపం అక్కడ పడవతాత తన కుక్కి మంచంలో పడుకొని మూలుగుతున్నది గమనించారు ఆలుమగలు. వెంటనే అప్పయ్య పడవతాత నొసలు, వొంటిని తాకి చూశాడు. ఇంకేముంది. పడవతాత చలి జ్వరంతో వొణికిపోతోంది గమనించారు. సీత వెంటనే ఏదో కషాయం పెట్టి ఓ గ్లాసుతో యిచ్చింది పడవతాతకు. ఓ అయిదు నిముషాలు అయిన తరువాత కాస్త తమాయించుకొన్నాడు పడవతాత.

“అప్పయ్యా! ఇవాళ మన వాళ్ళను సంతకు తీసుకు వెళ్ళాలి. పడవ దగ్గరకు వెళదాం పద” దుప్పటిని ఒంటినిండా కప్పుకొంటూ అన్నాడు.

“వెళదాంలే! వొంట్లో ఇప్పుడెలావుంది తాత” అడిగాడు అప్పయ్య.

“పర్వాలేదు. పద… మనవాళ్ళను సంతకు తీసుకు వెళ్ళాలి. లేకుంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతిని వారం రోజులపాటు తిండికి తిప్పలు పడతారు పాపం”కాస్త బాధతో అన్నాడు పడవతాత.

“అందుకు నేనున్నానులే! నువ్వు పడవలో ఓ మూల పడుకో! పడవలో వున్న జనాన్ని ఆవలకు నేను తీసుకువెళతాను” పడవతాతకు ధైర్యాన్నిస్తూ అన్నాడు అప్పయ్య.

“ఎలా… నీకు తెడ్లు వేయడం వచ్చా?”

“ఇన్నాళ్ళు నీతోనే వుంటూ అన్ని మెలుకువలు తెలుసుకొని నేర్చుకున్నానులే తాత! పద.” అంటూ తాతను రెక్క పట్టుకొని మెల్లగా నడిపిస్తూ “తాతా!నీ కొచ్చిన ఈ చలిజ్వరానికి ఆ టౌనులో అయితే ఏ డాక్టరు వద్దకో వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ఈ దీవిలో వ్యాధులోస్తే మనకే తెలిసీ తెలియని పసరులు, కషాయాలు వాడుకొంటూ ప్రాణాలను కాపాడుకొంటున్నాం. మనమూ ఈ దేశ ప్రజలమే కదా!? ప్రభుత్వం ఆ వైద్య సౌకర్యాలను మనకు ఎందుకు కల్పించలేదు? అవి మనకు అందవెందుకూ? మన వూరికి ఓ వైద్యుడు కావాలి తాతా! ఈ విషయంగా వూరి జనాన్ని అమ్మవారి గుడి వద్దకు చేర్చి మాట్లాడుకొని ఓ నిర్ణయానికొచ్చాం. వాటిని చేసి పెట్టమని ప్రభుత్వానికి నివేదికను ఇచ్చాం. అర్జీలు కూడా పెట్టుకున్నాం. మనం కోరుకున్న ఏ పని జరగక పోగా రోజులు దొర్లిపోతున్నాయ్” తన మనసులోని మాట బయట పెట్టాడు అప్పయ్య పడవతాత వెంట నడుస్తూ.

“అప్పయ్యా! మన స్థోమతుకు నువ్వంటున్నవి పెద్ద మాటలు. ఏదో నీ తృప్తికోసం ప్రభుత్వానికి నివేదికను ఇచ్చావు కాని అది జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. వైద్యాన్ని గూర్చి మనం ఆలోచించడం కూడా తప్పే! వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలంతే! త్వరగా పద పడవ దగ్గరకు” అంటూ నడక వేగం పెంచాడు పడవతాత! ఆయన వెంట నడిచారు అప్పయ్య, సీతలు.

పడవతాత పడవలో ఓ మూల కూర్చొన్నాడు. అప్పయ్యకు ముందే కాస్త అనుభవమున్నందున తెడ్లను వొడుపుగానే వేస్తున్నాడు. పడవను పది గంటలకల్లా అవతలి వొడ్డుకు చేర్చాడు. అందరూ వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న సరంజామాతో వెళ్ళి పోయారు. సీత కూడా వాళ్ళతో వెళ్ళిపోయింది. అప్పయ్య పడవతాతను రెక్క పట్టుకొని మెల్లగా మల్లయ్య టీ కొట్టు వద్దకు వెళ్ళాడు.

“ఏంటప్పయ్యా! పడవతాతకేమైంది అలా వున్నాడు” కూర్చొమన్నట్టు బల్లను తుడుస్తూ అన్నాడు మల్లయ్య.

“పడవతాతకు చలిజ్వరమండి. ఇప్పుడు కాస్త పర్వాలేదు. రెండు టీలు ఇవ్వండి” అన్నాడు అప్పయ్య.

“మరి ఇంట్లో వుండి విశ్రాంతి తీసుకోకుండా ఇందాక రావడమెందుకూ?” టీ అందిస్తూ అన్నాడు మల్లయ్య.

“నాకు ఇప్పుడు కూడా విశ్రాంతేలెండి. ఇవాళ పడవను నడిపింది మన అప్పయ్యేనండి” టీని ఆర్పుకొంటూ అన్నాడు పడవతాత.

“అలాగా! అప్పయ్య తెలివిగలవాడు.కష్ట జీవి. ఇంకాచెప్పాలంటే పట్టుదలతో ఏదైనా సాధించగలడు.ఇంకా చెప్పాలంటే అప్పయ్య పరులకు సహాయం చేయగల పరోపకారి” భరోసాగా వచ్చాయా మాటలు.

“ఖచ్చితంగా చెప్పారండి. ఎప్పుడూ తన మనసులో మా జనానికి ఏదేని మంచి చేయాలన్న తపనుంది”

“ఊఁ… ఏదో ఒక రోజు మీరనుకొంటున్నట్టు ఏదేని గొప్ప పని మీ జనానికి చేసిపెట్టి చరిత్రలో నిలిచి పోతాడన్న నమ్మకం నాకూ వుంది. అప్పయ్యా!ఆ బెంచీని తీసుకెళ్ళి ఆ నీడ పట్టున వెయ్యి. పడవతాత పడుకొంటాడు. తాతా! మీరెళ్ళి రెస్టు తీసుకొండి. అప్పయ్యా!నువ్వు ఈ దినపత్రికను చదువుతూ వుండు. నేనలా బజారుకెళ్ళి సరుకులు తెచ్చుకుంటాను” అంటూ అక్కడి నుండి బయలు దేరాడు మల్లయ్య. పడవతాత పడుకున్నాడు. అప్పయ్య పత్రికను చదవడంలో నిమగ్నమైయ్యాడు..

కాస్సేపటికి మల్లయ్య టీ కొట్టుకు కావలసిన సరుకులు తీసుకొని వచ్చాడు. సరుకుల సంచిని లోపల పెట్టి అప్పయ్య వేపు చూసి “అప్పయ్యా!ఇక నువ్వెళ్ళి నీ వ్యాపారాన్ని చూసుకో”అన్నాడు.

“అవసరం లేదయ్యా! సీతను పంపాను. నేనిక్కడే పడవతాతకు తోడుగా వుండాలనుకొంటున్నాను”

“నువ్వంటుందీ కరక్టే! కూర్చో… మనం ఏదేని పిచ్చాపాటి మాట్లాడుకొందాం మన జనం వచ్చే లోపు”

“అవునయ్యా! పిచ్చాపాటి అంటూనే గుర్తుకొచ్చింది. మనకు ఉప ఎన్నికలని చెపుతున్నారు కదయ్యా!”

“అవును అప్పయ్యా! మనకు కాదు. ఈ ఉపఎన్నికలు మీకు. మీ నియోజిక వర్గ ప్రజలకి. అవును అప్పయ్యా! క్రితంలో ఈ నియోజిక వర్గానికి పని చేస్తున్న ఎం.ఎల్.ఏ. ఏకాంబరం గుండెపోటుతో పోయాడు. తెలుసుగా?”

“అవునయ్యా!ఆ మధ్య దినపత్రికలో చదివాను”

“అతని స్థానాన్ని బర్తి చేసే నిమిత్తమే ఈ ఉప ఎన్నికలు.ఇదిగో…మీరుంటున్న వూరు ఈ నియోజిక వర్గం పరిధిలోకే వస్తుంది తెలుసా! ఇంతకు గతించిన ఆ ఎం.ఎల్.ఏ.ని ఎప్పుడైనా నువ్వు చూశావా?”

“లేదయ్యా! అసలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఎన్నికలు అన్న ఓ ప్రక్రియ వుందని కూడా నాకు తెలియదు. అసలు అలాంటి ఎన్నికలు ఎప్పుడూ మా వూరిలో జరిగినట్టు కూడా నాకు గుర్తులేదు”

“లేదు అప్పయ్యా! ఖచ్చితంగా ఎన్నికలు జరిగి వుంటాయి. బహుశా మీ దీవిలో వున్నవి తక్కువ ఓట్లని, ప్రచార చేయడానికి అభ్యర్థులు అక్కడికి వచ్చి వుండరు. ఇక ఓట్లు వేసే బూతులను కూడా ఇక్కడే ఏదేని ఓ బడిలో పెట్టుంటారు. కనీసం ఓట్ల గుర్తింపు సీటీలు కూడా అక్కడ పంచి వుండరు”

“ఎందుకనయ్యా! ఇప్పుడు మా వూరిలో దాదాపు నాలుగు వందల ఓట్లకు మించి వుంటాయి కదా! వాళ్ళకు అవి అవసరంలేదా?”

“నువ్వన్నట్టు ఓట్లు అవసరమే. కాని క్రితంలో తక్కువ ఓట్లని మీ వూరికి వచ్చి వుండరు. ఇప్పడు ఆ ఓట్లు నాలుగు వందలకు పైబడి వున్నాయి కదా! ఆ పెద్ద మొత్తం ఓట్లు ఇప్పుడు వాళ్ళకు అవసరమే! అందుకే ఈ సారి అభ్యర్థులు మీవూరి ఓట్లను టార్గెట్ చేస్తున్నట్టు వినికిడి. మీరు వేసే ఓట్లే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని అనుకుంటున్నారు. పోతే ఇక్కడ నీకో కీలకమైన పాయింటును చెప్పాలి అప్పయ్యా! అదేంటంటే…. ఈసారి అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ వూరికి వస్తారు. వాళ్ళకు ఓట్లు వేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తారు. అప్పుడు మీ వద్దకొచ్చే ఆ అభ్యర్థులను మీకు కావలసిన వసతులను చేసి పెట్టమని, ప్రభుత్వానికి మీరిచ్చిన నివేదిక మీద చర్య వెంటనే తీసుకోవాలని,అప్పుడే వాళ్ళకు మీ ఓట్లను వేయగలమని మీరు గట్టిగా చెప్పాలి. అప్పుడే మీకు కావలసిన అన్ని వసతులను కాకపోయినా వాటిలో కొన్నైనా చేసి పెడతారు. అలాంటి గొప్ప సందర్భం ఇది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కొచ్చిన ఈ సందర్భాన్ని మీరు జారవిడుచుకోకూడదు!” అప్పయ్యకు అర్థమైయ్యేటట్లు వివరించి చెప్పాడు మల్లయ్య.

“అంటే మనం మన ఓట్లు అన్నవి వాళ్ళకు వేసి వాళ్ళను ఎన్నుకోవాలా! వాళ్ళు మనకు పనులు చేసి పెట్టాలా!”

“అవును అప్పయ్యా! మనం ఎన్నుకొనే వారే ప్రభుత్వ ప్రతినిధులై ప్రభుత్వం ద్వారా మనకు సేవలు చేస్తారు. మనకూ మన వూరికి కావలసిన వసతులతో కూడికొన్న మంచి పనులను చేసి పెడతారు.వాళ్ళు మాత్రం ప్రభుత్వంనుంచి జీతాలు తీసుకొంటారు.”

“అంటే! అయ్యా…మా వూరికి పిల్లల చదువు కోసం బడి కావాల. మా జనం ఆరోగ్యవంతులుగా వుండడానికి ఓ డాక్టరూ, ఆసుపత్రి కావాలయ్యా! అవి కావాలనేగా మేము ప్రభుత్వాన్ని అడుగుతోంది”

“భేష్! గాట్లో పడ్డావ్! అలాంటివి చేసి పెట్టమని వాళ్ళను మీరు అడగాలి. అప్పుడు వాళ్ళు ప్రభుత్వంతో సంప్రదించి నియోజికవర్గ నిధుల కేటాయింపులతో మీరు కోరినవి నిజాయితీగా చేసి పెడతారు. ఇప్పటికి ఇవి తెలుసుకొన్నావ్ చాలు. సందర్భాలను బట్టి ఇంకా ఎన్నో చెపుతాను. వాటిని మీ వాళ్ళకు చెప్పి నీ మాటలను తప్పకుండా వినేలా చేసుకో చాలు. అన్నీ అవే జరిగి పోతాయి. మీరూ కాస్త అవగాహనతో మెలుకువగా వెలుగులోకి వచ్చినట్టుంటుంది.”

“అలాగేనయ్యా!”అంటూ దీర్ఘాలోచనల్లో పడ్డాడు అప్పయ్య.

“అప్పయ్యా!” అంటూనే వులిక్కిపడ్డట్టు ఆలోచనల్లో నుంచి తేరుకొని మల్లయ్య ముఖంలోకి చూశాడు అప్పయ్య.

“ఇదిగో! ఇవాల్టికి కొట్టు కట్టేసి వెళుతున్నాను. పడవ తాతను, ప్రజను జాగ్రత్తగా మీ వూరికి చేర్చుకో. వస్తాను” అంటూ కొట్టుకు తడికను అడ్డం పెట్టి వెళ్ళి పోయాడు టీ కొట్టు మల్లయ్య.

***

గంట సాయంత్రం ఏడు కావస్తుంది. వ్యాపారానికి వెళ్ళిన జనం వాళ్ళ వ్యాపారాన్ని ముగించుకొని వాళ్ళకు కావలసిన వెచ్చాలు తీసుకొని తిరిగి మర్రిచెట్టు వద్దకు చేరారు. సంతనుంచి వాళ్ళతో తెచ్చుకున్న అన్నమో లేక టిఫనో తిని చెట్టు చుట్టు పక్కలు వేసుకొని పడుకొన్నారు. బాగా అలసిపోయిన ప్రాణాలు కనుక వెంటనే నిద్రలోకి జారుకొన్నారు.

ఉదయం అందరూ తయారై పడవలో కూర్చొన్నారు. అప్పయ్య కాసిన్ని నీళ్ళతో పడవతాతకు ముఖం కడిగించి, టీ తాపించి పడవలో కూర్చోపెట్టుకొన్నాడు. ఒక్కసారి వాళ్ళ జనం మొత్తం పడవలో వున్నారన్నది నిర్ధారించుకొన్నాడు అప్పయ్య. సూర్య నమస్కారం చేసుకొని చేతికి తెడ్లను అందు కొన్నాడు. మెల్లగా పడవను నడుపు తున్నాడు.

అప్పుడు పడవతాత ముఖంలో ఎన్నడూ లేని ఆనందం. ఎప్పుడూ జవాబు దొరకని తనలోని ఓ ప్రశ్నకు ఆ రోజు జవాబు దొరికిందన్నసంతోషం. అంటే…. తనకు తరువాత ఆ దీవిలోని జనాన్ని ఆవలకు చేర్చే నాథుడెవడోనని, తన పడవ ఏమైపోతుందోనని ఇన్నాళ్ళు దిగులుతో మథనపడుతున్న తన ఆలోచనలకు ఇవాళ తెర పడిందనుకొన్నాడు. అప్పయ్య ఎంతో చాకచక్యంగా తెడ్లను వేస్తు పడవను నడుపుతున్న తీరును చూసి ఆనందించాడు. తనంతటివాడు తనకు వారసుడులాంటి అప్పయ్యను చూస్తూ మనసులోనే మురిసిపోయాడు. ఇకపై జనం ఆవలి వొడ్డుకు వెళ్ళడానికి అప్పయ్య వున్నాడన్న భరోసా తనకు కలిగి నెమ్మదిగా చూస్తూ వున్నాడు. అంతలో వాళ్ళూరు రానే వచ్చింది. పడవను ఒడ్డున కట్టి ఒడ్డుకు పలకను వేశాడు అప్పయ్య. అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ వూళ్ళోకి వెళ్ళి పోతుంటే పడవలో వున్న పడవతాత, అప్పయ్య వాళ్ళను చూస్తూ వుండిపోయారు.

***

“ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నావ్?” అప్పయ్యను అడిగింది సీత.

“రాత్రే చెప్పానుగా! పడవతాతను చూడాలని”

“టీ తాగి వెళ్ళు” అంటూ టీ గ్లాసునందించింది సీత.

అరుగు మీద కూర్చొని టీ తాగాడు అప్పయ్య. ఖాళీ గ్లాసును సీత చేతికిస్తూ “సీతా! మీ ఇంట్లో వున్నప్పుడు అలాగే వున్నావ్! ఇక్కడా పనులు చేసుకోవడం, వండుకొని తినడమంటూ ఇక్కడా అలాగే వున్నావ్!”

“అయితే ఏం చెయ్యమంటావ్? నలుగురి ఆడాళ్ళలాగానే నేనూను. ఇంకేం చెయ్యాలో చెప్పు?” క్రీగంట చూస్తూ అడిగింది సీత.

“నలుగురితో నిన్ను పోల్చుకోకు. నువ్విప్పుడు అప్పయ్య పెళ్ళానివి. కాస్త ప్రత్యేకంగా కనబడాలి”

“అంటే”

“నువ్వు నాలా చదువుకోవాలి సీతా. నీలోని తెలివితేటలకు చదువు తోడైతే మనం ఈ వూరికి, వూరి జనానికి ఇంకెంతగానో ఉపయోగపడతాం. అమాయకులు, పామరులైన ఈ జనాన్ని మన గుప్పెట్లో వుంచుకొని వాళ్ళకు మంచి పనులను చెయ్యగలుగుతాం.అది నా ఆశయం కూడా!”

“నాకేమీ అర్థం కావడం లేదు. మీ పలకా బలపం తెచ్చుకుంటాను! మీ కోరిక ప్రకారం చదువు నేర్పండి చాలు” అంటూ వెళ్ళి పలకా బలపం తెచ్చుకొంది సీత. ఆనందంగా ఆమె ముఖంలోకి చూస్తూ పలక మీద ‘అ ఆ’ లు రాసి ఎలా పలుకుతూ దిద్దాలో చూపించాడు. అలాగే పలుకుతూ దిద్దుతోంది సీత.

అప్పయ్య తనలా చదువుకునే మరో వ్యక్తి తనకు తోడు కావాలనుకొన్నాడు. అందుకు తన స్నేహితులను అక్షరాస్యులను చేసి తనతో వుంచుకోవాలనుకొన్నాడు. అందుకోసం క్రితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవ్వరూ కలసి రాకపోయేసరికి కాస్త నిరుత్సాహపడ్డాడు. కాని ఇప్పుడు తన భార్య సీతనే చదివించి తనకు చేదోడు వాదోడుగా తోడుండేలా చేసుకోబోవడం ఆనందదాయకమనుకొన్నాడు.

అప్పయ్య చదువు నేర్పడం ద్వారా సీత ఓ నెల్లోపే దినపత్రికను చదివేలా తయారైంది.

ఆ రోజు అప్పయ్య పడవతాత ఇంటికి వెళ్ళటానికి బయలుదేరబోతున్నాడు. అంతలో ఆ పడవతాతే తనింటికి వచ్చాడు.

“నీ వద్దకే వద్దామనుకొంటున్నాను తాతా! అంతలో…”

మధ్యలో అందుకొని “నేనే వచ్చాను. అంతేగా!?”

“అవును. ఇంతకు ఆరోగ్యం ఎలా వుంది?”

“పర్వాలేదు. ఏమిటి సీతకు చదువు నేర్పుతున్నావులా వుంది?”

“చూడు తాతా… ఇప్పుడు నాకు చదువు అవసరమా చెప్పు?”

“చదువన్నది ఎప్పుడైనా అవసరమేనమ్మా!”

“అలా చెప్పండి తాత. తన్ను నెలలోపే దినపత్రికను చదివేలా తయారు చేశాను తాతా”

“భేష్! నిజం చెప్పాలంటే ఆ చదువన్నిది లేకుండా ఈ దీవిలో ఇదే ప్రపంచమనుకొని పడుండడం వల్లే మనమిలా తయారైయ్యాం. చదువన్నది మనిషికి మూడవ నేత్రం లాంటిదమ్మా! అప్పయ్యలో ఈ చదువువల్ల ఎంత మార్పు వచ్చిందో నువ్వూ గమనించి వుంటావు. తనిప్పుడు మన వూరినే తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడనుకొంటున్నాను. అలాగే నువ్వూ చదువుకొని అప్పయ్యకు తోడైతే మీరిద్దరూ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పి మంచి పనులు చెయ్యగలుగుతారు. కనుక నువ్వూ బాగా చదవాలి. మీరిద్దరూ కలసి ఈ వూరికి మంచి పనులు చేసి పెట్టాలి.”

“ఏమిటో… నువ్వూచదవమని చెపుతున్నావు తాతా! చదువుతానులే!”

“చదువుతానులే కాదమ్మా! తప్పకుండా చదవాలి. ఆఁ అప్పయ్యా! అసలు నేనొచ్చిన విషయం ఏమిటంటే… మన వూరికి ఉప ఎన్నికలు వస్తున్నాయట, ఇన్నాళ్ళు మన నియోజిక వర్గానికి ఎం.ఎల్.ఏ. అయిన ఆ ఏకాంబరం…”

“మరణించాడు. తద్వారా ఈ ఉపఎన్నికలు వస్తున్నాయ్! టీ కొట్టు మల్లయ్య నాకు నిన్ననే చెప్పాడు. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏంచేయాలో కూడా నాకు వివరించాడు. అందుకే నాకు పక్క బలంగా సీతను తయారు చేస్తున్నాను తాతా! అందుకే చదివిస్తోంది.. అవును తాతా! వూరి జనాన్ని ఒక్కటి చెయ్యాలిగా!”

“అవును. మీ తెలివితేటలతో వాళ్ళను ఒక్కటి చేయడమే కాదు… అందర్నీ కలుపుకొని మీ అవసరాలను ప్రభుత్వం ద్వారా చేయించుకోవాలి. అదే అప్పయ్యా! ఆ రోజు ఈ వూరిలో బడి లేదన్నావ్! ఆసుపత్రి లేదన్నావ్! ఇలాంటి పనులను ఎన్నో చేయించుకోవాలి, అది చెప్పడానికే వచ్చాను. పనుంది వస్తాను అప్పయ్యా!” అంటూ అటు తిరిగాడు పడవతాత. అంతలో “టీ తాగి వెళ్ళు తాతా!” అంటూ టీ గ్లాసు నందించింది సీత.

పడవతాత టీ తాగి దంపతులిద్దర్ని చూసి “చిలకా గోరింకల్లా వున్నారు. మీరు త్వరగా తల్లితండ్రులవ్వాలి” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. అప్పయ్య,సీతలు కూడా నవ్వుకొంటూ ఇంట్లోకి వెళ్ళారు.

***

ఆ రోజు ఆదివారం. అప్పయ్య, పడవతాతల పిలుపును మన్నించి వూరి పెద్దలందరూ వచ్చి గుడి ముందు కూర్చొన్నారు. కొందరు ఇళ్ళలోనే వుండి పోయారు. వాళ్ళను కూడా తీసుకు రమ్మని సీత తండ్రిని పంపారు. పదినిముషాల్లో అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళకు విషయం అర్థంకాక పడవతాతను, అప్పయ్యను మార్చి మార్చి చూస్తున్నారు.

పెద్దమనిషి చంద్రయ్య లేచాడు. అందరి వైపు ఓ సారి చూసి “ఏరా అప్పన్నా! అందర్ని గుడి దగ్గరకు రమ్మన్నావ్! అందరూ వచ్చారు. ఎందుకు రమ్మన్నావో, సంగతేటో సెప్పు మరి?” అడిగాడు.

“నువ్వు కూర్చో సెంద్రయ్యా? అప్పయ్యా! మనాళ్ళకు విషయం బాగా అర్ధమైయ్యేటట్టు వివరంగా చెప్పు. ఆఁ” పురమాయించాడు పడవతాత.

అప్పయ్య తనవద్ద మడిచి వుంచుకొన్న పేపర్ను సంచిలోనుంచి బయటికి తీశాడు. దాన్ని విప్పాడు. ఓ పేజీని తెరచి పట్టుకొన్నాడు. అందరూ ఆత్రుతగా అప్పయ్యను, తన చేతిలో వున్న పేపర్ను చూస్తున్నారు.

“ఇది శుక్రవారం నాటి దినపత్రిక. దీన్ని చదివి మన వాళ్ళందరికి వివరంగా చెప్పమని మన టీ కొట్టు మల్లయ్య ఆ రోజు సంతకెళ్ళి నప్పుడు నా చేతి కిచ్చాడు.”

“అదేటో సెప్పమన్నాముగా! ఇవరంగా సెప్పు మల్లయ్యా”ఒక పెద్ద మనిషి మాట.

“విషయమేమిటంటే… ఇందులో మన వూరికి సంబంధించిన ఓ ముఖ్యమైన వార్త వుంది. చదువుతాను వినండి. సిరిపురం నియోజిక వర్గానికి ఉప ఎన్నికలు. సదరు సిరిపురం నియోజిక వర్గం ఎం.ఎల్.ఏ. ఏకాంబరం గుండెపోటుతో మరణించిన కారణాన సిరిపురం నియోజిక వర్గానికి మార్చినెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి అని ఇంకా చాలా రాసుంది” అని అప్పయ్య ఇంకా ఏదో చెప్పబోయాడు.

మధ్యలోనే అప్పయ్య మాటలకు అంతరాయం కలిగిస్తూ “అసలు ఉపయెన్నికలంటే ఏటీ! వాటివల్ల మనకేటి నాభం?” అడిగాడు ఒకతను.

“అప్పయ్యా! యెన్నికల నేటివి ఏమిటో మేము ఇంత వరకూ ఇనలేదు! ఏంటవి?”మరొకతను.

“అసలు ఆ యెన్నికలవల్ల మనకేటి నాభం అని అడిగాడుగా సెప్పు అప్పయ్యా” ఇంకొకతని సందేహం.

అందరూ రకరకాల ప్రశ్నలను అప్పయ్య మీదికి సంధించారు.

“అందరూ కాస్సేపు మౌనంగా కూర్చొండి. అన్ని విషయాలు నేను మీకు వివరంగా వివరిస్తాను”అని పడవతాత వంక చూశాడు అప్పయ్య.

పడవతాత ‘ఊఁ చెప్పు అప్పయ్యా’ అన్నట్టు తలూపాడు.

“అందరూ బాగా వినండి. ఎన్నికలంటే ఓ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం. ఎన్నుకోవడమంటే అది ఓటు ద్వారా. అంటే ఎవరు ఎన్నికలలో నిలబడ్డా ఆ నిలబడే వారిలో మంచి వారిగా, మనకు అనుకూలమైన వారిగా, మనకొరకు ప్రభుత్వంతో మాట్లాడో లేక పోరాడో వాళ్ళిచ్చే నిధులతో మనకు కావలసిన వసతులను, పనులను ఏర్పరచేవారన్న మాట. అలాంటి వారిని ఎన్నుకోవడమే ఎన్నికలని అంటారు. ఉదాహరణకు మనకో లేక మన కుటుంబ సభ్యలెవరికైనా వ్యాధులు వస్తే ఈ దీవికే పరిమితమైన మనం మనకు తెలిసిన కషాయాలు, చెట్ల ఆకుల పసరులు వేసుకొని ఒంటిని ఆరోగ్యంగా వుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా అందుకు నిరంతరంగా ప్రభుత్వపు ఆసుపత్రి నిర్మించి, అందులో పనిచేయడానికి వైద్యుడితో పాటు సిబ్బందిని ఇక్కడ మన కోసం వుంచి మన ఆరోగ్యాలు కాపాడడమన్నమాట.. అంటే వాటిని మన ఓట్లతో గెలిచిన అభ్యర్ధి ఏర్పాటు చేయడమే! ఇలా ఇంకెన్నో సంక్షేమ పథకాలను మనం ఎన్నుకునే ఈ ప్రతినిధుల ద్వారా పొందాలి. మన పిల్లలు అక్షరమన్న మూడవ నేత్రాన్ని పొందడానిగ్గాను వాళ్ళద్వారా ఇక్కడో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయించాలి! ఇంకా….”

“ఆపాపు. అందుకు మేమేం సెయ్యాలప్పయ్యా? అది సెప్పు” అప్పయ్య మాటలకు అడ్డు తగిలి అడిగాడు.

“ఇందాక చెప్పింది అదేగా! మళ్ళీ చెపుతాను వినండి. అంటే…. మీ చేత వున్న ఓటు అన్న ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవడమే! అందుకు మీకు కావలసిన వివరాలను, విషయాలను నేను,మన పడవ తాత చూసుకొంటాం. సందేహాలను నివృత్తి చేస్తాం. మీరు మాత్రం మేము చెప్పినట్టు వింటూ మాతో సహకరిస్తే చాలు” చెప్పి ముగించాడు అప్పయ్య.

అందరూ ఒక్క నిముషం మౌనం దాల్చి మళ్ళీ వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకొని ఆ గుసగుసల మధ్య వాళ్ళే ఓ నిర్ణయానికొచ్చారు. అందరూ కలసి ఆ నిర్ణయాన్ని సీత తండ్రి ద్వారా అప్పయ్యకు తెలియ జేయమని ఆయన్ను కోరారు.

సీత తండ్రి పైకి లేచాడు. జనాన్ని, అప్పయ్యను, పడవతాతను చూశాడు. నిర్ణయాన్ని తెలపడానికి వుపక్రమించాడు, “ఇదిగో అప్పయ్యా! నువ్వు చెపుతుంది మాకు మంచిదేనని పిస్తుంది. కనుక నువ్వు చెప్పేదే వేదమనుకొని మేమంతా నీ మాట వింటూ నీ వెంట నడవాలని తీర్మానించుకున్నాం.ఇక నీట ముంచినా పాల ముంచినా నీవే శరణ్యం. నీ యిష్టం” అన్నాడు అందరూ ఆమోదించినట్లు చప్పట్లు కొట్టారు. అప్పుడు అప్పయ్య, పడవతాత ముఖాల్లో వెయ్యి జ్యోతుల కాంతులు వెల్లి విరిశాయి.

(సశేషం)

Exit mobile version