పామరులు – పడవతాత 4

0
4

[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. [/box]

[dropcap]ఎ[/dropcap]న్నికల కమీషన్ సిరిపురం నియోజిక వర్గానికి తేది ఖరారు చేసింది. సిటీలో వున్న రెండు వేర్వేరు పార్టీల నాయకులు, ఆర్థికంగా బాగా బలిసిన వారైన టివీ గుర్తు నారాయణ, రేడియో గుర్తు భూపతిగార్లు వాళ్ళ పార్టీల అధిష్ఠానం ఆదేశాల మేరకు శుక్రవారం బాగుందని సిధ్ధాంతి చెప్పడంతో ఆరోజే ఇద్దరూ నామినేషనులు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ…. వాళ్ళ వాళ్ళ అనుచరులతో ‘నువ్వా-నేనా’ అన్న చందాన పావు గంట వ్యవధిలో ఇద్దరూ వెళ్ళి నామినేషన్లు వేయాలనుకున్నారు. ఆ సంగతి సంబంధిత పోలీసు స్టేషనుకు తెలియజేశారు.

అది తెలుసుకున్న పోలీసు వ్యవస్థ బహుశా ఆ సమయంలో ఏదేని అసంభావిత చర్యలు చోటు చేసుకొంటాయేమోనన్న అనుమానంతో కాస్త అప్రమత్తంగా వుండాలని, ఆ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అది పోలీసు వారికి కాస్త ఇబ్బందికరమైనా పనైనా అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను చేసుకొని ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ వున్నారు..

ఈ లోపు చిన్నా చితక పార్టీల అభ్యర్థులు దాదాపు పదిమంది వరకూ అక్కడ జరగనున్న ఉప యెన్నికల గ్గాను నామినేషన్లు వేసి ఎన్నికల రంగలోకి దిగారు. చక్కగా ప్రచార మాధ్యమాలను వుపయోగించుకొని వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాగ్దానాలు, హామీలను గుప్పిస్తూ ప్రచారంలో దూసుకుని పోతున్నారు,

శుక్రవారం రానే వచ్చింది. ఆరోజే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరు ఆఖరి రోజు.

ఎన్నికల బరిలో వున్న నారాయణ, భూపతిగారి ఇళ్ళలో ఉదయం నుంచే హడావిడి వాతావరణం నెలకొంది. ఆ ఇరువురి ఇళ్ళు రాజకీయ నాయకులు, బంధుమిత్రులు, పెద్దలతో నిండుకుపోయాయి. మేళ తాళాలతో భ్రాహ్మణ మంత్రోచారణలతో సందడిగా వున్నాయ్.

దాదాపు పది గంటల సమయానికి నారాయణ తన అనుచరులతో కారెక్కి కూర్చొన్నాడు. రిటర్నింగ్ ఆఫీసుకు కారు బయలుదేరింది. ఆ కారును వెంబడించాయి అనుచరుల కార్లు. సరిగ్గా పదిన్నరకు నామినేషను దాఖలు చేసి వెనుదిరిగాడు నారాయణ.

నారాయణ చూస్తుండగానే భూపతి కూడా అనుచరులతో రిటర్నింగ్ ఆఫీసుకు లోనికెళ్ళాడు. పావు గంటలో ఫార్మాలిటీస్ ముగించుకొని నామినేషన్ దాఖలు చేసి వెనుదిరిగాడు. అంతటితో నామినేషన్ల పర్వం ముగిసింది.

నారాయణ, భూపతులు ప్రచారంలోకి దిగారు. వాళ్ళ టీవి, రేడియో గుర్తులతో సిటీ మాత్రమే కాకుండ ప్రతి మండలంలోని వార్డుల్లోని వీధి వీధులు, ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి ఓటు తనకంటే తనకు వేయాలని లొంగదీసుకొంటున్నారు. డబ్బుకు లొంగని వాళ్ళను రకరకాలుగా భయబ్రాంతులను చేసి ఓట్లు తమకే వేయాలని ప్రమాణం చేయించుకొంటున్నారు. ఆడవాళ్ళకైతే చీరలను, ముక్కు పుడకలను, కుంకుమ భరిణలను పంచి ఓట్లు వేయమని దేవుడి పటం ముందు ప్రమాణం చేయించుకొంటున్నారు. మొత్తంలో ఇద్దరూ ఇద్దరేనన్న చందాన ఏ ఒక్కరూ తీసిపోకుండా దీటుగా ముందుకు దూసుకు పోతున్నారు. అయినా ఇద్దరిలోనూ ఓడిపోతాము అన్న భయం మాత్రం బాగా వుంది. కారణం ఇద్దరికి జనం సమంగా వున్నట్టు రిపోర్టులు రావడమే!

ఎన్నికలకు సరిగ్గా ఇరవై రోజులే వున్నాయ్. ఇద్దరు అభ్యర్దులు ఎలాగైనా గెలవాలని ఎన్నో ఎత్తులు, కుయుక్తులు చేసుకొంటూ వెళుతున్న సమయంలో వున్నట్టుండి రాష్ట్ర ఎలక్షను అధికారి నుంచి అభ్యర్థులందరికి రమ్మని కబురొచ్చింది. అందరితో పాటు ముఖ్య అభ్యర్థులైన నారాయణ, భూపతి కూడా ఎన్నికల ఆఫీసుకు వెళ్ళారు. లోనికెళ్ళి కాన్ఫరెన్సు హాల్లో కూర్చొన్నారు.

కొంతసేపటికి సంబంధిత అధికారులొచ్చారు, అప్పుడు అందరు లేచి నిలబడ్డారు. అందర్నీ కూర్చోమన్నట్టు సైగ చేసి వాళ్ళూ కూర్చొన్నారు. ఉన్నట్టుండి వాళ్ళను పిలిపించిన కారణం ఏమిటోనన్న మీమాంసలో అందరూ వుండగా ఒక అధికారి లేచి “ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడమైనది. ఎందుకంటే మీకు అందజేసిన మన నియోజికవర్గం లోని ఒటర్ల లిస్టులో పూర్తిగా ఓ గ్రామానికి చెందిన ఓటర్ల పేర్లను పొరపాటుగా ప్రింటవక అది మీకంజేసిన లిస్టులో లేదని తెలుపుకొనుటకు చింతిస్తున్నాం”అని అధికారి చెపుతుండగానే…

ఓ అభ్యర్థి లేచి “అదేగ్రామం?” అని అడిగాడు

“ఆ గ్రామం పేరు రామాపురం” అధికారి జవాబు.

“అదెక్కడుంది?”

“ఆ నదికి నడుమున్న దీవిలో వుంది”

“అక్కడికి ఎలా వెళ్ళాలి?”

“పడవల్లో వెళ్ళాలి. అక్కడున్న జనం పడవలో ఈ దరికొచ్చి వ్యాపారాలు చేసుకొని కావలసిన వస్తువులను కొనుక్కొని వెళుతుంది మీరు గమనించి వుంటారు. అక్కడ వున్న వారు మొత్తం ఆదివాసీలు…” అంటుండగా భూపతి పైకి లేచాడు.

“సార్! అక్కడ ఎన్ని ఓట్లున్నాయో తెలుపగలరా?” ఓట్లమీద గురితో అడిగాడు భూపతి.

“తప్పకుండా! అక్కడ దాదాపు నాలుగు వందల ఓట్లకు పైనే వుండొచ్చు! మా సిబ్బంది దానికీ సంబంధించిన ఓటరు లిస్టును ఒక్కొక్కరికి అయిదు ప్రతుల చొప్పున అందజేస్తారు. రిజిస్టరులో సంతకం చేసి తీసుకు వెళ్ళండి” అంటూ అధికారులు వెళ్ళి పోయారు, అభ్యర్థులందరూ ఓటరు లిస్టులను తీసుకొని వెళ్ళిపోయారు నారాయణ, భూపతులు తప్ప.

“ఏమిటి సార్! మీరిద్దరూ ఈ ఉపయెన్నికలకు ముఖ్య అభ్యర్థులనుకొంటాను. ఈ లిస్టు మీ కవసరం లేదా” అడిగాడు అధికారి.

“మేము ఎన్నికల అధికారిని చూడాలి”  ముక్త కంఠంతో ఒక్కసారే అన్నారు.

“ఆయన బిజిగా వున్నారు. మీకే సందేహాలైనా వుంటే నన్నడగండి. నేను నివృత్తి చేస్తాను.”

“ఆఁ ఏమీ లేదు. మునుపెన్నడూ ఆ దీవిలో ఓ వూరుందనిగాని, అక్కడ నాలుగు వందలు ఓట్లున్నాయనిగాని మీరు అభ్యర్థులకు తెలిపినట్టు లేదే!” నారాయణ అన్నాడు.

“నాకూ అదే సందేహం” భూపతి వంత పలికాడు.

“మీరనుకొంటుంది తప్పు. మన రికార్డుల ప్రకారం ఆ వూరి పేరూ వుంది. అక్కడ నాలుగు వందల ఓట్లూ వున్నాయి. ప్రతి ఎన్నికలకు మేము ఆ వూరిని కూడా నోటిఫై చేస్తూనే వున్నాం. కాకపోతే ఆ వూరి జనం ఇటు ఈ ఒడ్డుకొచ్చి ఓటు వేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ధాఖలాలు లేవు. వాళ్ళకు బహుశా ఓటువేయాలన్న అవగాహన లేదేమో! అందుకని ఈసారి అధికారులు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఆ జనాలను చైతన్యపరచి ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు” అధికారి వివరించాడు.

“అంటే గతంలో ఎన్నికల్లో పాల్గొన్న ఏ అభ్యర్థి వాళ్ళను సంప్రదించింది లేదన్న మాట” సందేహాన్ని వెలిబుచ్చాడు భూపతి.

“యువార్ కరెక్టు. ఎలాగో విషయాన్ని మీరైనా అడిగి తెలుసుకొన్నారు. ఇదిగో ఏదేమైనా ఒక్కమాట నిజం. ఈ సారి మీ గెలుపోటములు నిర్ణయించేది ఆ దీవిలో వున్న ఆ జనమే! వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారన్నది నా భావన. ప్రయత్నించుకొండి” అంటూ చెరో ఐదు లిస్టులను ఇచ్చి నవ్వుతూ ఫైలు తీసుకొని తన గదికెళ్ళి పోయాడు అధికారి.

నారాయణ, భూపతులు ఓటరు లిస్టులను ఓ సారి అక్కడే తిరగేసి చూసుకొని అప్పుడే గెలిచినంతగా సంబరపడిపోతూ బ్యాగులో వుంచేసుకొని అనుచరులతో వాళ్ళొచ్చిన వాహనాల్లో ఇళ్ళకు తిరుగు ముఖం పట్టారు.

***

ఎన్నికల ప్రచారం బాగా జోరందుకుంది. ఇరు పార్టీ వాళ్ళు వేదికలపై ఉపన్యసించడాలు అటుంచి ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి జండాలతో డప్పులు వాయించుకుంటూ ప్రచారం చేసుకొంటున్నారు. ఒకరికి ఒకరు తీసి పోమన్నట్టు ప్రచారంలో దూసుకు పోతున్నారు, పరిస్థితులను పట్టి చూస్తే ఇద్దరికి జనం బాగానే బ్రహ్మరథం పడుతున్నారు. గెలుపుమీద ఎవరి ధీమా వాళ్ళదే!

అయినా ఇద్దరికి వాళ్ళ విజయంపై వాళ్ళకే సందేహాలు రాగా ప్రయివేటు సంస్థల ద్వారా సర్వేలు చేయించారు.

ఇరు వర్గాల తరపున సర్వేలు చేసిన ఆ ప్రయివేటు సంస్థలు వాళ్ళ రిపోర్టులను అభ్యర్థులకు అందించాయి. ఆ రిపోర్టుల వివరాలను చూసి ఇద్దరూ విస్తుపోయారు. అందులో గెలుపు ఎవరికన్నది నిర్దారించుకోలేక పోయారు. అయితే సర్వే చేసిన ఆ సంస్థలు వాళ్ళ రిపోర్టుల్లో అభ్యర్థులిద్దరికి సంబంధించిన ఓ కీలకమైన పాయింటును అందులో పొందు పరచారు. అది గమనించారు ఇద్దరూ. అదే… ఆ పాయింటే… ఆ దీవిలోని ఆదివాసీల నాలుగు వందల ఓట్లని. అవే ఆ ఇరువురి గెపుపును నిర్ణయిస్తాయని. అంటే… ఆ దీవిలో వున్న రామాపురంలోని నాలుగు వందల ఓట్లు వాళ్ళకు ముఖ్యమని తేలిపోయింది. వాటిని ఎవరు దక్కించుకుంటే వాళ్ళే గెలుస్తారన్న నిర్ధారణకు వచ్చారిద్దరూ. అంతే వెంటనే సర్వే చేసిన ఆ సంస్థల వాళ్ళను పిలిపించుకొని ఆ ఓట్లను యెలా రాబట్టుకొని గెలవాలోనన్నది వ్యూహాత్మకంగా వూహిస్తూ తగిన పథక రచనలోకి దిగారు ఆ రాజకీయ నాయకులు.

***

ఉదయం పది గంటలకల్లా టివీ గుర్తు అభ్యర్థి నారాయణ ఆఫీసు కార్యకర్తలతో హడావిడిగా వుంది. కార్యకర్తలంతా వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా అభ్యర్థి నారాయణ గెలుపును గూర్చి మాట్లాడుకొంటున్నారు. అంతలో నారాయణ కారు అనుచరులుతో వచ్చి పార్టీ ఆఫీసు ముందాగింది. నారాయణ కారులో నుంచి దిగి లోనికి వెళ్ళాడు. పార్టీ కార్యకర్తలు కరతాళధ్వనులతో జేజేలు పలుకుతూ ఆయన్ను ఆహ్వానించారు,

నారాయణ తన కుర్చీలో కూర్చొన్నాడు. అంతకు ముందే వచ్చిన సర్వే అనలిస్టుకు సెకండిచ్చి.

“చెప్పండి సార్! నేను ఈ ఉపఎన్నికల్లో గెలిచి ఎం.ఎల్.ఏ నవ్వాలి. అందుగ్గాను మీరు చెపుతున్న ఆ నాలుగు వందల ఓట్లు నాకే పడాలి. అందుకు నేనేంచెయ్యాలి?”ప్రశ్నించాడు నారాయణ.

“ఆ ఓటర్లను మీ పక్షానికి తిప్పుకోవాలి. అందుకు ముందు మీరు వెళ్ళి వాళ్ళను కలవాలి. వాళ్ళకు కావలసిన, మీరు చేయగలిగిన హామీలను వాళ్ళ ముందు కుమ్మరించి వాటిని చేసి పెడతారని మాటివ్వాలి. మిమ్మల్ని నమ్మేలా చేసుకోవాలి” చెప్పాడు సర్వేయరు. కార్యకర్తలు వంతపాడారు.

“ఓకే…. అలాగే చేద్దాం. అందుకు ఏర్పాట్లు చెయ్యండి” అని అనుచరులకు చెప్పి మళ్ళీ సర్వేయరు ప్రక్కకు తిరిగి “అన్నట్టు ఇన్నాళ్ళు ఏ నాయకుడు పట్టించుకోని వాళ్ళను నేనెలా వెళ్ళి చూడాలండి. అసలక్కడికి వెళ్ళడానికి మార్గం లేదుగా!?” సందేహాన్ని బయటపెట్టాడు

“ఎందుకని… పడవలున్నాయిగా?! చక్కగా ఈ వొడ్డు నుంచి ఆ వూరికి పడవల్లో వెళ్ళవచ్చు. అవసరం మనది కనుక మార్గాన్నిమనమే ఏర్పాటు చేసుకోవాలి. అవునండి. ఆ దీవిలో నివశిస్తున్న ప్రజలు వాళ్ళ వ్యాపార నిమిత్తం, వెచ్చాలు కొని తీసుకు వెళ్ళడానికి ప్రతి శుక్రవారం పడవతాత పడవలో ఈ ఒడ్డుకు వస్తూ వుంటారు. అలాంటి సమయంలో మీరు తగినంత డబ్బు ఆయనకిచ్చి పడవలో ఆ వూరికీ వెళ్ళొచ్చు. లేదా అక్కడే పడవతాత పడవకు ప్రక్కనే వున్న మరో పడవలో వెళ్ళి అక్కడి జనాలతో మమేకమై అందర్ని సమావేశపరచి, వినయంగా నమ్రతతో విషయాన్ని వాళ్ళకు వివరించి కార్యాన్ని గట్టెక్కించుకోవాలి” పూర్తిగా పథకాన్ని ముందుంచాడు సర్వేయరు.

“అయితే వచ్చే శనివారమే మనం ఆ దీవికి వెళదాం. అందరితో మాట్లాడి ఓట్లను మనకు అనుకూలంగా మలుచుకొందాం” అంటూ లేచాడు అభ్యర్థి నారాయణ.

“శనివారం దాకాఎందుకు సార్! అక్కడే పడవతాత పడవకు ప్రక్కనే మరో పడవ వాడు వున్నాడు కదా! అతని పడవలో రేపే వెళ్ళి ఆ దీవి జనాన్ని కలుద్దాం. ఏమంటారు?”

“అవును సార్! ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. ఇలాంటి విషయాల్లో ఎవరు ముందెళ్ళి వాళ్ళను సంప్రదిస్తారో వాళ్ళకే వాళ్ళు ఓట్లు వేయగలరు. అందుకని మనం రేపే వెళదాం” అన్నాడొక అనుచరుడు.

“అలాగే! మనం రేపే వెళ్ళటానికి ఏర్పాట్లు చెయ్యండి” అంటూ బయలుదేరాడు నారాయణ. ఆయన్ను అనుసరించారు తతిమ్మా వాళ్ళు.

***

ఉపఎన్నికల బరిలో వున్న మరో అభ్యర్థి భూపతి ప్రచారంలో బాగా దూసుకుపోతున్నాడు. తనకు గట్టి పోటీ ఇస్తున్నది ప్రత్యర్థి నారాయణేనని తనకొచ్చిన సర్వేలు స్పష్టం చేయడంతో తను కూడా ఆ దీవిలోని నాలుగు వందల ఓట్లపై ఆధారపడి వాటిని ఎలాగైనా తను దక్కించుకోవాలని తన అనుచరులతో దీవిలో వున్న ఓటర్లను కలవాలని నిర్ణయించుకొన్నాడు. అయితే రేపే నారాయణ అక్కడికి వెళుతున్నది తెలుసుకున్న భూపతి ఆ మరుసటి రోజు ఆ జనం వద్దకు వెళ్ళాలని, నారాయణ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్ని ఓట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేసుకొని అన్ని ఏర్పాట్లతో తయారుగా వున్నాడు.

వ్యాపారానికని శుక్రవారం రాత్రే సంత కొచ్చిన ఆదివాసీలు వ్యాపారాన్ని ముగించుకుని ఉదయాన్నే లేచి వూరెళ్ళడానికి తయారవుతున్నారు.

పడవతాతకూడా ఎనిమిదికల్లా తయారై టిఫిన్ తిని, టీ తాగి పడవ నడిపే నిమిత్తం తయారుగా వున్నాడు. దీవి జనం ఒక్కొక్కళ్ళుగా వచ్చి పడవలో కూర్చొంటున్నారు.

అప్పుడు కారు దిగి అనుచరులతో మెల్లగా పడవ వద్దకొచ్చాడు నారాయణ. పడవలో కూర్చొంటూ నువ్వేనా పడవ నడిపేది? ప్రశ్నించాడు పడవతాతను.

“అవునయ్యా! తమరూ….” సందిగ్థంగా అడిగాడు పడవతాత.

“నేను ఎన్నికల బరిలో వున్న టివీ గుర్తు అభ్యర్థిని. మీ వూరికే వస్తున్నాను. తతిమ్మా వివరాలు తరువాత చెపుతానులే. పోనీయ్ !అన్నాడు.

“పడవను తీయడానికి ఇంకొంత సేపు పడుతుందయ్యా! ఇంకో ఇద్దరు మనుష్యులు రావాలయ్యా” చెప్పాడు పడవతాత. నారాయణ కోపం వచ్చింది. చేసేది లేక వూరకుండి పోయాడు.

అంతలో ఆ ఇద్దరూ వచ్చి పడవలో కూర్చొన్నారు. దేవుడికి దణ్ణం పెట్టుకొని పడవను కట్టి వుంచిన తాళ్ళను తొలగించి నడపను ప్రారంభించాడు పడవతాత. కాని తన మనసేమో పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఆలోచనలు మితిమీరడంతో ఆ చివర కూర్చొన్న అప్పయ్య ముఖంలోకి చూశాడు పడవ తాత.

‘ఏదైనా సరే నేను చూసుకొంటాను నువ్వు నిశ్చింతగా పడవను నడుపు తాతా’ అన్న భావంతో మహా భారతంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి అభయమిచ్చినట్టు కళ్ళసైగలతో తెలియ జేశాడు అప్పయ్య. ఆ సైగలతో తృప్తి పడ్డ పడవతాత తెడ్లను వొడుపుగా వేస్తూ అవతలి ఒడ్డుకు చేర్చాడు. అందరూ దిగివెళ్ళబోతుంటే “ఆగండి. మీతో మాట్లాడాలి” అని అందర్ని ఆపబోయాడు నారాయణ.

అంతకు ముందే కాస్త అవగాహనకు వచ్చిన పడవతాత “అలా కుదరదయ్యా! మరో అరగంటలో మా అప్పయ్య అందర్ని అమ్మొరి గుడి వద్దకు పిలిపిస్తాడు. మీరు ఏదైనా సరే అక్కడ మాట్లాడుకోవచ్చు. బాగా అలసి పోయొచ్చిన వీళ్ళను ఇప్పుడు ఇళ్ళకు పోనిండి పాపం”బ్రతిమాలినట్టు అడిగాడు.

“వీరిలో అప్పయ్య ఎవరు?”అడిగాడు అనుచరుడు.

“నేనేనండి. మీరు గుడి వద్ద కూర్చొని వుండండి. మరో అర్థగంటలో అందర్ని అక్కడికి పిలిపిస్తాను. అప్పుడు మాట్లాడుకొందాం”అన్నాడు. ‘సరే’నన్నట్టు గుడి వద్దకు నడిచాడు నారాయణ తన అనుచరులతో.

గంట పదకొండయ్యింది –

అప్పయ్య ఇంటింటికి వెళ్ళి వూరి జనానికందరికి చెప్పడంతో మగాళ్ళందరూ బిలబిలమంటూ గుడి ముందు వాలారు. వారిలో కొంతమంది ఆడవారు కూడా వున్నారు. అప్పయ్య, పడవతాత కూడా గుడి వద్దకు చేరారు.

“అయ్యా! మీరొచ్చినట్టు చెప్పి అప్పయ్య మావూరి పెద్దలనందరిని ఇక్కడికి చేర్చాడు. ఇక మీరేమి మాట్లాడాలనుకొంటున్నారో, ఏమి చెప్పాలనుకొంటున్నారో చెప్పండి!” పడవతాత అభ్యర్థి నారాయణతో అన్నాడు.

“అవునయ్యా! మీ మాటలను బట్టి మా ప్రజల స్పందన వుంటుంది” అన్నాడు అప్పయ్య .

“ఆఁ… ఏమీ లేదు. జరగనున్న ఉపఎన్నికల్లో నేను టివీ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. ఈ వూరిలో దాదాపు మీ అందరి ఓట్లు నాలుగు వందల పై చిలుకు వున్నట్టు ప్రభుత్వపు రికార్డులు చెపుతున్నాయి. కనుక ఆ మీ ఓట్లన్నీ మీరు నాకు వేసి నన్ను గెలిపించాలని కొరుతున్నాను” విషయాన్ని బయట పెట్టాడు నారాయణ.

“ఓట్లంటే ఏంటయ్యా?” ఒకడు అడిగాడు. ఓట్ల గూర్చి బాగా అవగాహన వున్న వాడే తను.

“వాటిని మేమింతవరకూ చూడలేదు. అవి మీకెందుకెయ్యాలి? ఎలా వెయ్యాలి?” ఇంకొకడు సందేహాలను బయట పెట్టాడు. కాని తనకూ ఓట్లంటే ఇప్పుడు బాగా తెలుసు.

“అన్నట్టు వాటిని నేను ఇంతవరకూ చూసింది లేదు. అసలు ఆ ఓటన్నది ఏంటీ? దాన్నీ మీకే ఎందుకెయ్యాలి?” – అప్పయ్యకు పిల్లనిచ్చిన మామ అడిగాడు ఈ మధ్య అప్పయ్య ద్వారా అన్ని వివరాలను తెలుసుకున్నవాడే తను కూడా.

ఆ మాటలకు మరోసారి అందరిలో రకరకాలైన సందేహాలు తలెత్తగా గుసగుసలు చోటుచేసుకున్నాయి,

వెంటనే “ఆగండాగండి! అయ్యగారి తరపున మీ ప్రశ్నలన్నీటికి జవాబులు నేను చెపుతాను. కాస్సేపు అందరూ కిమ్మనకుండా కూర్చొండి” అని వూరి జనానికి చెప్పి గొంతు సర్దుకొని అటు తిరిగి నారాయణతో “అయ్యా! మీరు కోరినట్టు మా వూరిలో వున్న ఓట్లన్నీ తమకే వేసేలా చేస్తాను. అంతకు ముందు, మా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి వాళ్ళ సందేహాలనూ నివృత్తి చెయ్యాలి! మరి…” అని ఏదో చెప్పబోయాడు అప్పయ్య.

మధ్యలోనే అడ్డుతగిలి “ఓకే! నాకదే కావాలి. మీ వాళ్ళను ఒప్పించి నాకు ఓట్లేసే ఏర్పాట్లు చెయ్యి, నీకు కావలసిందేదో నేను చేసి పెడతాను” అంటూ సంతోషంతో పైకి లేవబోయాడు నారాయణ.

“నాకేదో చేయడం కాదయ్యా… మాకు… అంటే మా వూరి జనానికి చెయ్యాల్సిన ముఖ్యమైన రెండు పనులున్నాయ్. మొదటగా తమరు వాటిని చేసి పెట్టాలి. అప్పుడే ఈ నాలుగు వందల ఓట్లు చెక్కు చెదరకుండా తమకు పడతాయి. ఇక నిస్సందేహంగా తమరే ఎం.ఎల్.ఏ అవుతారు” అన్నాడు అప్పయ్య .

“ఏం చెయ్యాలి మీకు! మనిషికో రెండు వేల వంతున డబ్బును లెక్క కట్టి ఇమ్మంటావా! చూడూ! వీళ్ళందరిలో నువ్వు కాస్త తెలివి గలవాడిలా వున్నావ్! తెలివిగా మూట్లాడుతున్నావ్! ఆఫీసుకు రా! లెక్క కట్టి పైసలు తీసుకెళ్ళు. వీళ్ళచేత నాకు ఓట్లు వేయించు. చాలా?”

అప్పుడు అందరిలో మళ్ళీ గుసగుసలు ప్రారంభమైయ్యాయి,కొందరు పైసలకు మొగ్గేలా వున్నారు,కొందరు అప్పయ్య మాటకు కట్టుబడి వున్నారు.

“సైలన్స్…సైలన్స్…! కాస్సేపు కిమ్మనకుండా వుండమన్నానా!” జనంతో అని మళ్ళీ ఇటు తిరిగి “అయ్యా….” ఏదో చెప్పబోయాడు అప్పయ్య,

“చెప్పు అప్పయ్యా! అదేదైనా సరే నిర్భయంగా చెప్పు. తప్పక తీర్చి పెడతానుగా”నారాయణ.

“అది తీర్చి పెట్టడమే కాదు అప్పయ్యా, నిన్ను సపరేటుగా గుర్తిస్తాడు అయ్యగారు”అన్నాడు అనుచరుడు.

“అయ్యా! మా కెవరికి డబ్బు ఇవ్వక్కరలేదు. నన్ను సపరేటుగా గుర్తించనవసరమూ లేదు. మేము మా ఓట్లన్నీ మీకే వెయ్యాలని మొదటే నిర్ణయించుకొన్నాం! కానీ..”

“నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి! మరి కానీ అని మళ్ళీ నన్ను సందిగ్ధంలో పెడుతున్నావ్! కానీ అంటే… ఏమిటి అప్పయ్యా!” అడిగాడు నారాయణ.

“అదేనయ్యా ఓట్లకు ముందే మా బాగుకోసం ప్రభుత్వం చేయని కొన్ని పనులను మీరు చేసి పెట్టాలి. వాటిలో ముఖ్యంగా రెండు పనులను ఇప్పుడే చేసి పెట్తాలి. అప్పుడే….” మెల్లగా నసిగాడు అప్పయ్య.

అప్పయ్య ఏవో కీలకమైన పనులను తన ముందుంచబోతున్నాడని నారాయణ అర్థం చేసుకున్మాడు. తప్పని పరిస్థతుల్లో, అప్పయ్య నిర్భందం మేరా అవి చేయవలసిన స్థితికి దిగజారేలా వుందని గ్రహించాడు. అవి చేసి పెడితే తనకే ఓట్లన్నీ వస్తాయని అర్థం చేసుకొన్ననారాయణ “మీకేం కావాలో చెప్పుకో అప్పయ్యా! చేసి పెడతాను” అన్నాడు ధైర్యంగా.

“అయ్యా! దీవిలో వుంటున్న మా పరిస్థితి చూస్తూనే వున్నారు. బయటి ప్రపంచానికి దూరంగా, నిరక్షరాస్యులుగా, అనాగరికులుగా, అమాయకులుగా కొన్ని సందర్భాలలో వ్యాధిగ్రస్తులుగా బ్రతుకుతున్న మాకు మీరు తప్ప దిక్కెవరున్నారు? రెక్కాడితే కాని డొక్కాడదన్న చందాన ఈ అడవి సంపదను నమ్ముకొని బ్రతుకుతున్నాము. అది కూడా ప్రకృతి, వాతావరణం మాకు అనుకూలంగా వుంటేనే! లేకపోతే మా బ్రతుకులు అల్లకల్లోలమే! ఆ ప్రకృతి కోపించి వాన రూపంతో విలయతాండవమాడిందంటే అతివృష్టితో అన్యాయమైపోయి మాయదారి రోగాల బారిన పడి పిల్లల్ని, ముసలాల్లని మృత్యువు కబళిస్తుంది. ఆ మరణ ఘోషతో విలవిల లాడిపోతున్నాం. మీకు తెలీదు కాని అలా మరణించే మా జనాన్ని ఖననం చేయకుండా ఈ నదిలో విడిచి పెడుతున్నాం. అలా ప్రతి సంవత్సరం జరుగుతూనే వుంది” చెప్పుకుపోతున్నాడు అప్పయ్య.

అప్పయ్య మాటల్ను ఓపిగ్గా వినలేని నారాయణ “ఇదిగో! అసలు నువ్వు చెప్పొచ్చేదేమిటయ్యా? మీకేం కావాలో… అది చెప్పు?” కాస్త విసుగుతో కోపంగానే వచ్చాయా మాటలు నారాయణ నోటినుంచి.

“అవును అప్పయ్యా! మనమేమనుకొన్నామో ఆ విషయాన్ని అయ్యగారితో చెప్పేయ్! జరిగేది జరుగుతోంది” అన్నాడు పడవతాత.

“అలాగే తాత! అయ్యా… మా నాలుగు వందల ఓట్లు మీకు కావాలంటే ముందుగా మీరు మాకు రెండు పనులు చేసి పెట్టాలి”

“ఏమిటవి?” నొసలు చిట్లించి కాస్త కోపంగానే అడిగాడు నారాయణ.

“మా ఆరోగ్యాలు కాపాడుకునే నిమిత్తం ఓ డాక్టరును, పిల్లల చదువులకోసం ఓ పంతుల్ని వెంటనే ఏర్పాటు చెయ్యాలి”

“ఓస్… ఇంతేనా! నేను ఎం.ఎల్.ఏ.ను అవుతూనే టెంపరరీగా డాక్టర్లను, పంతుళ్ళను పంపడం కాదు. నిరంతరంగా మీ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడో బడిని, మీ అరోగ్యాలను కాపాడే నిమిత్తం ఓ డాక్టర్ను నిరంతరంగా వుండేలా చేస్తాను. మీరు ముందు ఓట్లేసి నన్ను గెలిపించండి.”

“అయ్యా! అప్పయ్య ఆ పనులను ఇప్పుడు మీముందుంచింది మీరు గెలిచి ఎం.ఎల్.ఏ అయిన తరువాత చేయటానికి కాదు. వెంటనే అంటే… ఈ వారంలోనే అమలు పరచాలని అడుగుతున్నాడు” అప్పయ్యకు పిల్లనిచ్చిన మామ కుండ బ్రద్దలు కొట్టాడు.

“అదెలా కుదురుతుంది. మొదట అయ్యగార్ని ఎం.ఎల్.ఎ. కానివ్వండి. చూద్దాం”అన్నాడో అనుచరుడు.

“అలా కుదరదండి. ఆ పెద్ద మనిషి అన్నదే కరక్టు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా అన్నట్టు మీరు అనుకుంటే ఆ పనులు రేపటినుంచే మొదలు పెట్టవచ్చు” తన నిర్ణయంగా చెప్పాడు అప్పయ్య.

“అది కుదరదు అప్పయ్యా! మొదట నన్ను గెలిపించండి. తరువాత మీకవి చేసి పెడతాను”

“అది కుదరదయ్యా! అప్పయ్య చెప్పిందే సరైన మాట. మొదట ఆ పనులు చేసి పెట్టండి. మా వూరి ఓట్లు మొత్తం మీకే వేసి మిమ్మల్ని గెలిపిస్తాం” పడవతాత చెప్పాడు, అదే అందరి నిర్ణయమన్నాడు.

ఉగ్రుడై పోయాడు నారాయణ. అనుచరులక్కూడా కోపమొచ్చింది.

“అయితే నాకు ఓట్లు వేసి గెలిపించరా?” కట్టలు తెంచుకున్న కోపంతో అడిగాడు నారాయణ.

“కుదరదయ్యా! మొదట మాకు కావలసిన ఆ రెండు పనులు చేసి పెట్టండి”మళ్ళీ అన్నాడు అప్పయ్య.

“అయితే నా మూలాన మీరు ఇబ్బందులు పడతారు” కఠినంగా వచ్చాయా మాటలు నారాయణ నోటినుంచి.

“మేమిక్కడ ఇప్పుడు పడే బాధలకంటే మీరు పెట్టబోయే ఇబ్బందులు వల్ల మాకేం కాదు. మీరేం చేయగలరు? మహా అయితే గూండాలను పంపి మమ్మల్ని కొట్టిస్తారు. అంతేగా!?” అప్పయ్య అన్నాడు.

“అంతేకాదు. నీ అదృష్టం బాగోపోతే పైకి టిక్కెట్టు కూడా తీసుకుంటావు” ఒక అనుచరుడు.

“పర్వాలేదయ్య! నేను చనిపోయినా మా వాళ్ళందరూ బాగు పడుతారని నమ్ముతాను. మీరే బాగా ఆలోచించి మాకనుకూలంగా నిర్ణయం తీసుకోండి. ప్లీజ్ !”

“లేకుంటే….”

“చెప్పానుగా… మా ఓట్లు మీకు పడవని!” ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పాడు అప్పయ్య.

ఆ మాటలకు తట్టుకోలేక పోయిన నారాయణ కోపంతో “మీ అంతు చూస్తాను… చూస్తాను మీ అంతు. మీరుంటున్న ఈ వూరిని గంటల్లో వల్లకాడుగా మార్చేస్తాను. ఏయ్! వచ్చి పడవను కట్టి మమ్మల్ని ఆవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళు….రా!” కోపంగా గర్జించాడు నారాయణ పడవతాతను చూసి.

పడవతాత అప్పయ్య ముఖంలోకి చూస్తూ “అప్పయ్య నాకు కాస్త ఆయాసంగా వుంది, నేను మళ్ళీ పడవను నడసలేనయ్యా! నువ్వే వారిని ఆ గట్టుకు చేర్చి రావాలి” అని గట్టిగా వూపిరి పీల్చుకొంటూ అన్నాడు.

“సరే! నేను వెళతానులే తాతా! రండయ్యా వెళదాం” అంటూ నది వొడ్డునున్న పడవ వద్దకు నడిచాడు అప్పయ్య. కోపంగానే అతన్ని వెంబడించారు నారాయణ, అతని అనుచరులు.

***

ఎన్నికలకు ఇంకో పంతొమ్మిది రోజులే వున్నాయి, ఒక్కొక్కరోజు కాలగర్భంలో కలసి పోతుంటే ఎన్నికల వేడి తారాస్థాయిని అందుకొంది.

ఆ ఎన్నికల ఎఫెక్టుతో నారాయణకు ప్రత్యర్థి అయిన భూపతి ఏం చేయాలో అర్థం కాక తన ఆఫీసులో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. దీవిలో వున్న ఆ నాలుగు వందల ఓట్లే వాళ్ళ గెలుపోటములకు మూలమని తెలుసుకున్న తను వాటిని రాబట్టుకోవడమెలా అన్న ఆలోచనల్లో మునిగి పోయాడు .

ఈలోపు తన అనుచరుల్లో ఒకడు పరిగెత్తినట్టూ ఉచ్వాసనిశ్వాసలతో లోనికి వచ్చాడు. అక్కడే వున్న వాటర్ పిల్టరులోని నీళ్ళు తీసుకు తాగాడు. అది గమనించిన భూపతి “అలా ఇబ్బంది పడుతూ పరిగెత్తుకు రాకపోతే కాస్త మెల్లగా రావచ్చుగా” అన్నాడు అనుచరుడిని.

“మీకో ముఖ్యమైన విషయాన్ని చేరవేద్దామని పరిగెత్తుకొంటూ వచ్చానయ్యా! ఆ నారాయణ తన అనుచరులతో నిన్న దీవికి వెళ్ళి అక్కడ నివశిస్తున్న ఆదివాసీలను సంప్రదించి మాట్లాడి వాళ్ళ ఓట్లను తనకు వేయమని అడిగాడట. కాని వాళ్ళు వీలుపడదు పొమ్మని చెప్పి పంపించేశారట”

“ఎందుకని? అందుకు కారణమేంటి?”

“కారణ మంటే… వాళ్ళకు ఎన్నికలకు ముందే రెండు పనులు చేసి పెట్టాలట. ఒకటి… వాళ్ళ ఆరోగ్యాలను చూడడానికి ఓ డాక్టర్ను, రెండు… వాళ్ళ పిల్లలకు చదువు చెప్పటానికి ఓ పంతుల్ని వెంటనే… అంటే రేపటినుంచే ఏర్పాటు చేయాలట. అందుకు మన ప్రత్యర్థి నారాయణ అది వీలు పడదని, మొదట తన్ను ఎన్నికల్లో గెలిపించమని కోరాడట. అందుకు వాళ్ళు అలా కుదరదని మొదట వాళ్ళకు ఆ రెండు పనులు చేసి పెట్టే వాళ్ళకే వాళ్ళ ఓట్లని గట్టిగా చెప్పి పంపించేశారట. ఇక నారాయణ కూడా చేసేది లేక వాళ్ళ అంతు చూస్తానని కోపంగా తిరిగి వచ్చేశాడట” పూర్తి వివరాలు భూపతి ముందుంచాడు అనుచరుడు.

“ఓకే! ఛాన్సు మనకే దక్కింది, అవును. రొట్టె విరిగి నేతిలో పడింది.. మనం రేపే వాళ్ళు కోరుకున్నట్టు టెంపరరీగా ఓ డాక్టర్ను, ఓ పంతుల్ను తీసుకొని దీవికి వెళుతున్నాం. ఏర్పాట్లు చెయ్యండి” అంటూ కారులో ఇంటికి వెళ్ళి పోయాడు భూపతి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here