[dropcap]మా[/dropcap]నవుడి మేధస్సుకి తార్కాణం పనామా. 10,000 సంవత్సరాలకి ముందు ఈ పనామాను Rodrigo de Bastidas అనే అతను కనుగొన్నాడు. కొలంబస్ 1502లో వెళ్ళారు.
చిన్నప్పుడు ఒక పాట విరివిగా వినిపించేది – “మానవుడే మహనీయుడు, శక్తియుతుడు… యుక్తిపరుడు…. మానవుడే మాననీయుడు” అని. దివి నుంచి గంగను భువికి దించిన భగీరథుడు మానవుడే. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు మానవుడే అని ఆ పాట సారాంశం.
ఆధునిక మానవుని మేధస్సుకి తార్కాణమైన పనామాలో మేం జరిపిన పర్యటన అనుభవాలు ఇవి.
***
మేము క్రూజ్ నుండి దిగిన తర్వాత కొలంబియా, కొలంబియా నుండి పనామా వెళ్ళాము. కొలంబియా సాయంత్రం 6 గంటలకి వెళితే ఒక గంటలో పనామా చేరాము.
చిన్నప్పటి నుండి పనామాను గురించి చదివి అది చూడాలని – కోస్టారికా, నకర్ గోవా, గ్వాటమాల, హోండారుస్ వెళ్ళినప్పుడు చూడాలంటే వీలు కాలేదు. ఎందుకంటే అప్పటికే ఒక నెల రోజులైంది. వీలుకాక తిరిగి వెళ్ళిపొయ్యాము. అప్పటి నుండి ఇప్పటి వరకు పనామా చూడాలనే కోరిక తీరలేదు.
ఇప్పుడు కొలంబియా పనామా కలిపి అంటే 15 రోజులు వెళ్ళాము. పనామాకి టికెట్ బుక్ చేశాము నెట్‌లో. కాని అది బుక్ అయ్యిందో లేదో అర్థం కాలేదు. ఇక్కడికి కొలంబియా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన తర్వాత అడిగితే వెళ్ళే విమానంలో టికెట్స్ బుక్ కాలేదు. కాని తిరిగి వచ్చే విమానం టికెట్స్ బుకింగ్ అయ్యాయి.
సరే వెళ్ళే టికట్లు బుకింగ్ కాలేదు కాబట్టి మళ్ళీ 10 వేలు పెట్టి టికెట్లు బుక్ చేసుకొని బయల్దేరాము. పనామాకి చేరగానే ఒక టాక్సీ తీసుకొని హోటల్‌కి వెళ్ళాము. ఆ హోటల్‌లో అడుగుపెట్టగానే పనామా కెనాల్ ఆ హోటల్ నుండి కన్పడుతుంది. నాకు ఎగిరి గంతేసినంత ఆనందం, అబ్బా దీనికి దగ్గర్లోనే హోటల్ వుంది అని.
ఆ రోజు రాత్రికి మేము ఉప్మా చేసుకొని తిని పడుకున్నాము. 2వ రోజు ఆ గేట్లు తీసే సమయము ప్రొద్దున 10:30 అని చెప్పారు. నాకు రాత్రి అంతా ఎంతో సంతోషం అన్పించింది. త్వరగా నిద్రపట్టలేదు.
ప్రొద్దున 6 గంటలకి లేచి 7 వరకు రెడీ అయిపొయ్యాము. 7:30కి బ్రేక్ ఫాస్ట్ చేసి, బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎన్నింటికి గేటు దగ్గరికి తీసుకొని వెళ్తారు అని అడిగితే 10:25కి అని చెప్పారు. ఈ లోపల నేను రిసెప్షన్‌లో వున్న ఫొటో చూశాను. అప్పుడే ఒక టాక్సీ బయటికి వెళ్తుంది. గబగబా పరిగెత్తి ఆ టాక్సీ ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే ఈ హోటల్‌లో బస చేసిన ఇద్దరిని అమెరికా వారి ఆధీనంలో వున్న ఆఫీస్‌కి తీసుకొని వెళ్తున్నాను అన్నారు. ఎంత సమయం పడుంది అంటే పోను రాను కలిపి అరగంట పడుతుందని ఆ డ్రైవర్ అన్నాడు.
500 ఎకరాల పైనే ఈ పనామాలో అమెరికన్ సైనికులు ఇండ్లు వారికి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్స్, ఎన్నో రకాల బిల్డింగులు వున్నాయి. అవి అన్నీ చూస్తూ చాలా ఆశ్చర్యపోయ్యాను. ఇది ఏంటి అని అడిగితే 1989-90 లో జార్జి బుష్ పదేండ్ల సుదీర్ఘ చర్చలతో ఒక కొలిక్కి వచ్చి పనామాతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని, అప్పుడు ఏర్పాటు చేసినవని తెలిసింది.
ఈ కాలువ మొత్తం పొడవు 50 మైళ్ళు (80 కి.మీ.)
పనామా కెనాల్ చరిత్ర :
20వ శతాబ్దాన్ని ఇంజనీరింగ్ యొక్క శక్తి సామర్థ్యాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. షిప్పింగ్ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన పనామా కెనాల్ దాదాపు రూపుదిద్దుకుంది. 20వ శతాబ్దంలోనే. ప్రపంచంలో అతి పెద్ద నౌకల కోసం గత శతాబ్దంలోనే ఈ పనామా కెనాల్ ప్రాణం పోసుకుంది. అయితే మరింత విస్తరించబడిన కెనాల్ మరింత పెద్ద నౌకల రాకపోకలకు సుగమం అయ్యింది. ఇటీవల దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ కృత్రిమ కాలువ నిర్మాణ, సాంకేతిక ప్రయోజనాలు మరియు విస్తరించబడిన కాలువ ద్వారా కలిగే లాభాల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం…
అమెరికా ఖండానికి ఇరువైపులా ఉన్న అట్లాంటిక్ సముద్రం మరియు పసిఫిక్ సముద్రాలను వేరు చేస్తూ అమెరికాకు చెందిన సన్నని భూభాగం కలదు. దీని మీద కృత్రిమంగా కాలువను తవ్వి రెండు సముద్రాలను కలిపేశారు. ఈ కృత్రిమ కాలువనే పనామా కాలువ అంటారు.
1881 లోనే ఫ్రాన్స్ దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇంజనీరింగ్ పరిజ్ఞానం సమస్యలు మరియు పని చేసే వారి కొరత వలన ఫ్రాన్స్ దీని నిర్మాణం చేపట్టలేక చేతులెత్తేసింది. ఆ తరువాత అమెరికా దీని నిర్మాణ బాధ్యతలను తీసుకుని, నిర్మాణాన్ని పూర్తి చేసి 1914 ఆగస్టులో ఈ కాలువను ప్రారంభించారు.
కాలువను అనుకున్నట్లుగానే పూర్తి చేసారు. కాని 16వ శతాబ్దంలోనే ఉత్తర మరియు దక్షిణ అమెరికాలను కలిపేటటువంటి అతి సన్నని భూభాగాన్ని తొలిచి అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాలను కలపాలని భావించారు. అయితే ఆ ప్రాంతాన్ని కృత్రిమంగా కెనాల్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన సాంకేతికత లేమి వలన అప్పట్లో దీని నిర్మాణం ఆచరణలోకి రాలేకపోయింది.
ఆసియా మరియు యూరప్ రెండూ కూడా సంయుక్తంగా సూయజ్ కృత్రిమ కాలువ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. 1869లో సూయజ్ కాలువను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సూయజ్ కాలువ నిర్మాణాన్ని మరియు దాని నిర్మాణానికి వినియోగించిన సాంకేతికతలతో ఈ పనామా కాలువను నిర్మించడానికి ఫ్రెంచ్ సంస్థ ముందుకు వచ్చింది.
పనామా కాలువ ప్రాజెక్టును ఫ్రాన్సుకు అప్పగించారు. సూయజ్ కాలువ నిర్మాణంలో ముఖ్య ఇంజనీరుగా పనిచేసిన ఫెర్నాండెండ్ డి లెస్సిప్స్ ఈ పనామా కాలువకు కూడా ఇంజనీరుగా వ్యవహరించాడు. ఆ భూభాగం మొత్తం గరుకుగా ఉండే అతి పెద్ద వర్షారణ్యం. నిరతరం కాల్పులు జరుగుతూ, వర్షాలు పడుతూ అక్కడ విపరీతమైన వ్యాధులు ప్రబలాయి, ఈ కారణంగా కొన్ని వందల మంది ఈ నిర్మాణంలో చనిపోయారు.
పనామా కాలువ ప్రాజెక్ట్ అత్యధిక సవాళ్లతో కూడుకుని ఉండటం, కొన్ని వందల మంది అక్కడ ప్రాణాలు విడవడం వంటి కారణాల వలన ఫ్రాన్స్ ఈ పనామా కాలువ నిర్మాణాన్ని చేపట్టలేక వెనుతిరిగింది. ఈ ప్రాజెక్టును వదిలేయడం ద్వారా ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన నష్టం వాటిల్లింది. ఆ తరువాత సుమారుగా ఏడు సంవత్సరాల వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
ఫ్రాన్స్ పనామా కాలువ నిర్మాణ పనులను వదిలివెళ్లిన తరువాత అమెరికా 1904లో దీని నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. ప్రత్యేకమైన ఇంజనీరింగ్ నిపుణులతో, మట్టిని తొలగించే అధునాతన యంత్రాలు మరియు వాహనాలతో పనులను ప్రారంభించింది.
1904 సంవత్సరం మే 6 న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ పనామా కాలువ నిర్మాణ ప్రాజెక్టుకు ముఖ్య ఇంజనీర్‌గా జాన్ ఫిండ్లే వాల్లేస్‌ను నియమించాడు.
అమెరికా దీని బాధ్యతలు తీసుకున్న తరువాత దీని అభివృద్ధి పనులను ఎంతో వేగవంతం చేసింది. అధునాతన పరిజ్ఞానాలతో ప్రేలుళ్ళు, డ్రిల్లింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తొలగించడం వంటి కఠోర శ్రమ చేశారు.
సుమారుగా పదేళ్ల సుదీర్ఘ సమయం తరువాత పనామా కాలువ నిర్మాణం పూర్తయింది. కొన్ని వేల మంది వర్కర్లు మరియు ఇంజనీర్ల కఠోర శ్రమ తరువాత పనామా కృత్రిమ కాలువ నిర్మాణం పూర్తయింది. నౌకల కోసం ప్రత్యేకంగా కాలువను 1914లో ప్రారంభించారు. సుమారుగా 80 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువలో నౌకలు నిలవడానికి రెండు పాత్ వే లను నిర్మించారు.
పనామా కాలువ నిర్మాణం ద్వారా మూడు కృత్రిమ నదులు ప్రాణం పోసుకున్నాయి. మరి కొన్ని ఆనకట్టల నిర్మాణం కూడా జరిగింది. పనామా జలసంధిలో అతి ముఖ్యమైన భాగం గాటన్ నది, సుమారుగా 33 కిలోమీటర్లు పొడవు మేర ఉన్న ఈ నది గుండా నౌకలు ప్రయాణిస్తుంటాయి.
పనామా కాలువలో నౌకలు నిలబడే ప్రదేశంలో నీటి ఎత్తు యొక్క అసమతుల్యత వలన నౌకలు మరియు నౌకాశ్రయంలోని ప్లాట్ ఫామ్ మధ్య ఎత్తు సమానంగా ఉండదు. దీనిని సమతుల్యం చేయడానికి అతి పెద్ద ట్యాంకుల ద్వారా కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని నౌకలు నిలబడే ప్రదేశంలోకి నింపుతూ ఉండాలి. అలా మూడు అతి పెద్ద ట్యాంకులు నిరంతరం నీటిని నింపితే అపుడే నౌక సుమారుగా 90 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది.
నౌకలు ఈ పనామా కాలువలోని నిర్ణీత ప్రదేశాలలోకి వచ్చినప్పటికి సరైన క్రమంలో అవి నిలబడవు, వాటిలోని సరుకును దించాలన్నా లేదా నింపాలన్నా నౌకలు వివిధ రకాల కోణాలలో మళ్లాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాదు కాబట్టి, కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండే వెసెలు, హై కెపాసిటి ట్రాక్షన్ యంత్రాలను ఇందుకు వినియోగిస్తారు.
పనామా కాలువ నిర్మాణం పూర్తి అయిన తరువాత 1999 వరకు మెయింటెనెన్స్ మరియు రుసుము వసూలును అమెరికా చేసేది. ఆ తరువాత పనామా దేశానికి అప్పగించింది అమెరికా. పూర్తిగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన దేశంగా పనామా నిలిచింది. పనామా కాలువ గుండా ప్రయాణించే అన్ని నౌకల ద్వారా సుమారుగా కొన్ని మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది.
ఈ పనామా కాలువ ద్వారా సుమారుగా 14,000 మందికి పైగా ఉపాధి లభించింది. అందులో 5,000 మంది వరకు పనామా దేశానికి చెందిన వారే ఉన్నారు.
సమాచార వర్గాల ప్రకారం, దీని నిర్మాణ సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భయంకరమైన దోమలు కుట్టి జ్వరాలు ప్రబలి సుమారుగా 25,000 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అంతే కాకుండా వ్యాధుల బారిన పడ్డ వారిని కూడా ఆ సమయంలో చంపేశారని సమాచారం.
ప్రస్తుతం షిప్పింగ్ రవాణా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుత్కోంది. ఈ కారణంగా షిప్పుల రూపం కూడా మారిపోతోంది. అందు కోసం పనామా దేశం పనామా కాలువను ప్రస్తుతం ఆధునిక నౌకల అవసరార్థం విస్తరించే ప్రణాళికలు వేసింది. అందుకోసం 2007లో పనామా దేశం దీని విస్తరణను చేపట్టింది. అయితే ఇటీవల ఈ విస్తరించిన కాలువను ప్రారంభించారు.
ఈ కాలువ ద్వారా 4,500 కంటైనర్లకు పైగా మోసుకెళ్లే నౌకల ఈ విస్తరించిన కాలువ గుండా ప్రయాణించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పెద్ద కంటైనర్ నౌకలు అన్ని కూడా ఈ కాలువ గుండా ఎంతో సులభంగా ప్రయాణించగలవు. ఈ విస్తరించిన కాలువ సుమారుగా 110 అడుగుల వెడల్పు 1,000 అడుగల పొడవు ఉంది.
పోటీ అనేది ఎలాంటి వాటికైనా సర్వసాధారణమే, అలాగే పనామా కాలువకు కూడా పోటీ తయారవనుంది. పనామా దేశానికి ఉత్తర భాగంలో ఉన్న నికరగ్వా దేశంలో పనామా కెనాల్ తరహాలో నిర్మించడానికి 2018లో చైనాకు చెందిన సంస్థ ముందుకు వచ్చినట్లు నికరగ్వా ప్రకటించింది. అయితే ఇది అందుబాటులోకి వస్తే పనామా కాలువలో నౌకల రద్దీ తగ్గే అవకాశం ఉంది.
అప్పుడప్పుడు కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి జారి కాలువలో పడటం, నిర్వహణ పనులు మరియు ప్రమాదాలు మినహాయిస్తే పనామా కాలువ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏడాదిలో అన్ని రోజులు కూడా నిరంతరం నౌకలకు ఎంట్రీ ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 160 దేశాలకు సంభందించి ఈ పనామా కాలువతో సంబంధాలున్నాయి. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 17,000 నౌకాశ్రయాలతో రవాణా సంబంధాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ ఇండస్ట్రీకి పనామా కాలువ కేంద్ర బిందువుగా ఉంది.
***
పనామా అమెరికన్ బెటాలియన్స్ అన్నీ చూచి వచ్చిన తర్వాత 10:15 నిమిషాలకు మా హోటల్ నుండి పనామా కాలువ వరకు కార్లలో తీసుకొని వెళ్ళారు.
“పనామా” అనే పదానికి అర్థం ‘చాలా సీతాకోక చిలుకలు’ అని అర్థం అని కొందరు; మరి కొందరు కునా అనే భాషలో “బనాబా” (BANABA) అంటే ‘చాలా దూరం’ అని అర్థం అని అంటారు.
మరొక అర్థం ‘పనామా చెట్టు’ అని. అలాగే కాప్టెన్ అంటోనియో డెల్లో డి గుజ్ మాన్స్ డైరీ ఎంట్రీ ప్రకారం ఈ గ్రామాన్ని “చిన్న చేపలను పట్టే బెస్తల గ్రామం” అని వర్ణించారు.
అలాగే సోషల్ స్టడీస్ బుక్స్‌లో “చాలా ఎక్కువగా వున్న చేపల, చెట్లు మరియు సీతాకోక చిలుకలు” అని పనామా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రచురించారు.
1502లో కొలంబస్ ఇస్తుమాస్‌ని సందర్శించి చిన్న ఇల్లు కట్టుకున్నాడు “డారియన్” అనే ప్రదేశంలో. 1513లో అట్లాంటిక్ పసిఫిక్ మహా సముద్రాల మద్యవున్న దారిని ‘ఇస్తుమాస్’ అని పిలిచేవారు. ఇది (1538 నుండి 1821) వరకు స్పానిష్ వారి ఆధీనంలో వుంది. వీరికి చాలా సులభమైన మార్గం పెరు నుండి వెండి బంగారాన్ని తీసుకొని వెళ్ళడానికి. అయితే ఈ వెండి బంగారాన్ని తీసుకొని వెళ్ళే పడవలలో నుండి పైరేట్స్ (డచ్ మరియు ఇంగ్లీషు) వారు మరియు “సిమరాన్స్” అనే ఆఫ్రికన్స్ వీరందరూ ఈ పడవల్ని దోచుకొనేవారు.
ఆ టాక్సీ డ్రైవర్ ముందే మాకు చెప్పాడు “ఫొటోలు తీయకండి, కారు ఎక్కడా ఆగదు. మీరు ఆపమని అడగకండి” అన్నాడు. “ఇప్పుడు 2 నిమిషాలు ఆగితే మనల్నందర్నీ కొల్లగొట్టుకొని తన్ని వెళ్ళిపోతారు. కేస్ పెట్టడానికి కూడ వుండదు, అందరూ భయపడ్డారు” అని చెప్పారు.
అప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఇద్దబ్బాయిలు నడుస్తూ వెళ్తున్నారు. వీరు టూరిస్టులను ఎక్కువగా దోచుకుంటారు అని మా గైడ్ చెప్పారు. ఎంతో ఆశ్చర్యంగా వారిని చూచి పాపం వేరే ఆ కాలంలో ‘పైరేట్స్’ అన్న మాట అని గుర్తుకొచ్చింది.
ఇప్పటికీ పైరేట్స్‌గా వెళ్ళే టూరిస్ట్ పడవల్ని కత్తి చూపించి మీ దగ్గరవున్న విలువైన సామాను అంతా ఇవ్వండి లేకుంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలను అని అంటారని ఒక బ్లాగ్‌లో చదివాను. ఈ బ్లాగ్ చదివిన తర్వాత పైరేట్స్ నౌకను బోట్లను ఎక్కాలంటే భయమేసింది.
పనామాలో చాలా పురాతనమైన చర్చి చూశాము. ఇది కాస్కో వీయిజోకి ఎదురుగా ఈ చర్చి వుంది. ఇది కట్టడానికి 70 సంవత్సరాలు పట్టిందట. చాలా అందంగా ఉంది. అక్కడున్న బొలివర్ విగ్రహం గురించి, బొలివర్ గురించి వివరాలు కనుకున్నాను.
ఎన్నో మధురమైన అనుభూతులలో పనామాలో మా పర్యటనను ముగించాము.