Site icon Sanchika

పండగ

[dropcap]వి[/dropcap]నాయక చవితికి నాలుగు రోజుల ముందు రాము ఫోన్ చేసాడు. “అమ్మా, మీరు పండక్కి ఇక్కడికి వచ్చేయండి. దసరా వెళ్లాక వెళ్ళచ్చు. అక్కడ ఎందుకు మీరిద్దరూ అంటే వినరు. ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు ఎలాగూ రావలసిందేగా, ఇక్కడైతే అలవాటైన మనుషులు, గుడి, మొక్కల పోషణ కాలక్షేపం అయిపోతుందంటారు. నిజమే, ఇక్కడ మీ అంతట మీరుగా ఎక్కడికి వెళ్లలేరు. మేం రోజంతా ఇంట్లో వుండము. మీకు తోచదు ఇక్కడ. కానీ, ఎలా ఉన్నారో అనే ఆలోచన ఎప్పుడు మమ్మల్ని వెంటాడుతూ వుంటుంది. మీరిద్దరూ ఇక్కడకు వచ్చి చాలా రోజులైంది. కొన్నాళ్ళుంటే మాకూ బాగుంటుంది. మేం ఎదురు చూస్తుంటాం” అన్నాడు. తల్లికి కూడా చేసాడు. రాము భార్య సుధ కూడా మాట్లాడింది.

కొడుకు ఫోన్ వచ్చిందగ్గర్నుంచి తులసి మనసు గాల్లో తేలిపోతోంది. ఎప్పుడెప్పుడు వెళదామా అని ఆత్రంగా ఉంది. భర్త రంగారావుకు ఎక్కడకు వెళ్ళటం ఇష్టం ఉండదు. ఇల్లే స్వర్గం. పొద్దున్నే గుడికి వెళ్ళటం, వచ్చి పేపర్ చదవటం, నచ్చిన పుస్తకాలు చదువుకోవడం, ఇంటికి ఎవరైనా వస్తే ఆత్మీయంగా మాట్లాడటం, సాయంత్రం ఇరుగుపొరుగు పిల్లలకు పాఠాలు చెప్పటం, ఇంటి ముందున్న చిన్న తోటలో మొక్క మొక్కనీ పలకరిస్తూ తిరగటం ఆయన దినచర్య. ఊళ్ళో ఎవరికి సాయం కావాలన్నా భార్యాభర్తలు ముందుంటారు. రంగారావు గారికి పెన్షన్ వస్తుంది. సొంత ఇల్లు. భుక్తికి లోటు లేదు.

ఈ జీవితం బాగానే ఉన్నా, తులసికి మనవలతో గడపాలనుంటుంది. కోడలు బాగానే మాట్లాడుతుంది. కానీ, వంటింట్లో ఏ పనీ చేయనివ్వదు. గౌరవమో, నాలుగు రోజులుండి పోయేవాళ్ళతో ఎందుకు చేయించుకోవటం అనో తెలీదు. పోనీ వాళ్లకు నచ్చినట్లుగా ఉంటే సరిపోతుంది నాలుగు రోజులు. ఈ సారి పండగకి అన్ని తనే చేస్తానని చెప్పాలి. తనేలాగైనా ఉండగలదు. భర్తే సర్దుకోలేడు ఎక్కడా! వెళ్లిన మర్నాటి నుంచి మొదలు పెట్టేస్తాడు వెళ్లిపోదామని!

పిల్లల కోసం జంతికలు, రవ్వ లడ్లు, కొడుకు కోడలు కోసం ఊరగాయలు కారప్పొడులు అన్ని తులసి సిద్ధం చేసింది. వినాయక వ్రతకల్పం పుస్తకం కూడా పెట్టుకుంది. పక్కింటివాళ్ళని ఇల్లు చూస్తుండమని చెప్పి బయలుదేరారు ఇద్దరూ. తాత నానమ్మలను చూసి పిల్లలు గంతులే గంతులు. తులసి ఆనందానికి హద్దు లేదు.

వచ్చిరెండు రోజులయింది. అంతాబాగానే ఉంది. శనాదివారాలు కావటంతో మనవలు ఇంట్లో ఉండటంతో టైం తెలియట్లేదు ఇద్దరికీ. వాళ్ళ స్కూలు కబుర్లు వింటూ, వాళ్లకు కథలు చెపుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. పనేమీ లేదు.

మర్నాడు పండగ అనగా ముందు రోజు తులసి కోడలితో “సుధా, రేపటికి పెసరపప్పు, బియ్యపురవ్వ, బియ్యపు పిండి అన్నీ కావాలిగా, లిస్టు చెపుతా, రాసుకుని తెస్తావామ్మా”అంది.

“అన్నీ ఉన్నాయత్తయ్యా, మీరేం కంగారు పడకండి” అంది సుధ.

రాత్రి కొడుకు ఆఫీసు నుంచి వచ్చాక “బాబూ, మట్టి వినాయకుణ్ణి, పత్రిని పొద్దున్న తెస్తావా, తొందరగా స్నానాలు చేసి, పూజ చేసుకుంటే పిల్లలు ఏమైనా తింటానికుంటుంది, ఆకలి కాగలేరు” అంది తులసి.

“ఆ, పొద్దున్నే తెచ్చుకోవచ్చు, అన్నీ దగ్గరలోనే దొరుకుతాయి.నువ్వేం కంగారు పడకు” అన్నాడు రాము.

ఏమిటో, అన్నింటికీ కంగారు పడకు అంటారు ఇద్దరూ! అప్పటికప్పుడు అది లేదు, ఇది లేదు అంటూ పరుగెడతారేమో,అనుకుంది తులసి

పండగ రోజు రానే వచ్చింది. తులసికి ఐదింటికే మెలకువ వచ్చింది. కోడలికి రోజువారీ వంటే గాని పండగకి చేసేవి అంతగా రావు కాబట్టి తానే మడి కట్టుకుని వంట చేసి, అందరి చేత పూజ చేయించాలనుకుంది. కొడుకు, కోడలు లేవలేదు. తలుపులు మూసి ఉన్నాయి. “వాళ్ళు లేచేలోపు కిందకి వెళ్లి గ్రౌండ్‌లో నడిచొద్దాం పద” అన్నాడు రంగారావు. సరేనని బయలుదేరింది తులసి.

అదే తమ ఊళ్ళో అయితే ఈ పాటికి! ఉన్నది తమిద్దరే అయినా సందడి సందడిగా ఉండేది. పొద్దున్నే భర్త మామిడి కొమ్మలు తెచ్చి అన్ని గుమ్మాలకు తోరణాలు కట్టే పనిలో ఉంటే, తాను స్నానం చేసి, వంట మొదలు పెట్టేసేది. ఉండేది ఇద్దరమని పేరుకే గాని,ఆ పక్క వాళ్లకు,ఈ పక్క వాళ్లకు,ఊళ్ళో ఉన్న ఆడపడుచు కొడుక్కి, పంచటానికి ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర లాంటివి భారీగానే చేసేది. ఇంటింటా పిల్లలు రెక్కలొచ్చి ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోయినా టీ.వి. తోనే పండగ సందడి వచ్చేసేది. పొద్దున్నే భర్త టీ.వి. పెట్టి అందులో పండగ కబుర్లు ,ఆటపాటలు చూస్తూ ఉంటే తనూ ఓ కన్ను, చెవి అటువేస్తూ వంట చేసేసేది. తరవాత పూజ చేసుకునే వారు. వండినవి ఇరుగుపొరుగులకు ఇచ్చి వచ్చాక తినేవారు.

ఇక్కడ అంతా నిశ్శబ్దం! కొడుకు ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనూ చప్పుడు లేదు. మూసి ఉన్నతలుపుల వెనక ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిల్లు తలుపు తీసి ఉండదు. కొడుకింటి పక్కన రెండు అపార్టుమెంట్లు, ఎదురుగుండా రెండు ఉన్నాయి. తమకి, ఎదురు వాళ్ళ గుమ్మానికి మధ్య నాలుగే అడుగుల దూరం! అయినా, ఈ రెండు రోజుల్లో వాళ్ళు, కోడలు మాట్లాడుకోవడం చూడలేదు. ఆలోచిస్తూ నడుస్తోంది తులసి. భర్త నడక ముగించి అక్కడ అరుగు ఉంటే కూర్చున్నాడు.తులసి కూడా వెళ్లి కూర్చుంది.

“పండగ నాడు కూడా ఇళ్లల్లో పనులు చేసుకోకుండా ఆడవాళ్లు ఈ నడకేమిటో విచిత్రంగా! తొందరగా మొదలెట్టికోపోతే వంట పూజ అవద్దూ” అంది అక్కడ నడిచే ఆడవాళ్ళని చూస్తూ. “మనింట్లో లేచారో లేదో, ఏడవు తోంది టైంవెళదామా” అంది తులసి. భర్త తలూపుతూ లేచాడు.

ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలు పాలు తాగుతున్నారు. కొడుకు పేపర్ చూస్తున్నాడు. కోడలు వంటింట్లోంచి కాఫీ తెచ్చి “వాకింగ్‌కి వెళ్ళారా అత్తయ్యా ఇద్దరూ”అంటూ పలకరించింది.

పనమ్మాయి ఇల్లంతా తుడుస్తోంది. సుధ ఫోన్లో ఇలా రావాలి, ఇటువైపు అంటూ ఇంటి గుర్తులు చెపుతోంది. పొద్దున్నే ఎవరొస్తారబ్బా పండగ పూట, అని తులసి చూస్తోంది

అంతలో ఒక అబ్బాయి ఒక అట్టపెట్టే పెద్దది తెచ్చి హాల్లో పెట్టాడు. వెనక ఇద్దరు ఆడవాళ్లు పూలు, అరటిపళ్ళు, బంతిపూల దండలు, మామిడి కొమ్మలు ఉన్న పెద్ద సంచులతో వచ్చారు.

తులసి “సుధా, ఏమిటిదంతా?ఎవరు వీళ్ళు?, నువ్వు వీళ్ళ సంగతి చూడు. నేను మడి కట్టుకుని వంట మొదలుపెడతాను” అంది.

“ఏమీ అక్కర్లేదత్తయ్యా,! ఆడవాళ్ళిద్దరు వంట చేస్తారు. మడి కట్టుకునే చేస్తారు.  అబ్బాయి హాలంతా డెకరేట్ చేస్తాడు. మనం పదింటికంతా పూజ చేసుకోవటమే. ఈ లోపల మీరు చక్కగా టి.వి. చూడండి. మంచి మంచి కార్యక్రమాలు వస్తాయి” అంది సుధ.

పండగ పూట పొద్దున్నే టీ.వి. చూడటం ఎరుగుదుమా ఎప్పుడైనా చోద్యం కాకపోతే!ఇంతోటి వంటకు వంట వాళ్లేందుకో అర్థం కాలేదు తులసికి. ఆ అబ్బాయి చక చకా గుమ్మాలకు మామిడి తోరణాలు, బంతి పూల దండలు కట్టాడు. గోడలకు పూల గుత్తులు అతికించాడు. హాలులో ఓ పక్క చిన్న టేబుల్ లాంటిది వేసి, పైన దాని చుట్టూ రంగు రంగుల పూలు పెట్టాడు. అటూ ఇటూ అరటి పిలకలు కట్టాడు.వంట చేస్తూనే వాళ్లలో ఒకావిడ టేబుల్ మీద మట్టి వినాయకుణ్ణి పెట్టింది. పైన పాలవెల్లి కట్టింది. సుధ ఇచ్చిన పెద్ద వెండి కుందుల నిండా నూనె పోసి వత్తులు వేసింది. అగరొత్తులు సిద్ధం చేసింది. పళ్ళు, పూలు, పత్రి విడి విడిగా ట్రే లలో పెట్టింది. ఇంకో ఆవిడ పానకం, వడపప్పు,చలిమిడి తెచ్చి పెట్టింది.

ఇంతసేపు సుధ స్నానం చేసి, పిల్లలకు కొత్త బట్టలు వేసి, తను పట్టుచీర నగలు పెట్టుకుని తయారయింది. తులసి, రంగరావులు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు. రాము కూడా పట్టుబట్టలు కట్టుకున్నాడు. పదవుతోంది టైం. ‘పూజ తనేగా చేయించాలి’ అని తులసి వినాయక వ్రతకల్పం తీసుకొచ్చింది. ఇంతలో చేతి సంచితో, పురోహితుడు వచ్చాడు. అందరూ పీటల మీద కూర్చున్నారు. బ్రాహ్మణుడు పూజ చేయిస్తున్నంత సేపు డెకరేషన్ చేసిన అబ్బాయే వీడియో తీసాడు. రక రకాల ఫోటోలు తీసాడు. వంట చేసిన అమ్మాయిలు పులిహోర, వుండ్రాళ్ళు, పూర్ణాలు, బజ్జీలు, పాయసం, ఇంకా వండినవన్నీ దేవుని ముందు పెట్టారు. మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ పురోహితుడు మొత్తం మీద పూజ, నైవేద్యాలు అయ్యాయనిపించాడు. రాము ఆయనకి తాంబూలంలో రెండు వేలు పెట్టాడు. అందరూ ఆయనకి నమస్కరించి అక్షంతలు వేయించుకున్నారు. ఇంకో చోట పూజ చేయించాలని ఆయన వెళ్లిపోయాడు.

ఈ పూజకు రెండు వేలా! నోరు వెళ్ళబెట్టింది తులసి. రంగారావు పరిస్థితీ అదే! పన్నెండింటికి వంటమ్మాయిలు అందరికీ భోజనాలు వడ్డించి,ఇంట్లో వాళ్ళ వయ్యాక వాళ్ళు కూడా తిని అన్ని సర్దేసారు. వెళ్లేముందు వాళ్ళకి సుధ పదిహేను వేలు ఇచ్చి పంపింది. తులసమ్మ దంపతుల ఆశ్చర్యానికి అంతు లేదు. అయినా, వాళ్ళేం మాట్లాడలేదు. అంతా అయ్యేటప్పటికి ఒంటిగంట అయింది.

“అమ్మా! మీరక్కడ సినిమాలకు వెళ్లరు. ఇవాళ నాలుగుగంటలకు అందరం సినిమాకు వెళదాం. కొత్త సినిమా. మీకూ నచ్చుతుంది.” అన్నాడు రాము. పిల్లలు ఎగిరి గంతులేశారు. తులసి, రంగరావులు “మీరు వెళ్ళండి నాన్నా, మేం ఆ కొత్త సినిమాలు చూడలేం. అంతసేపు కూర్చోలేము. పండగ పూట సాయంత్రం దేవుడు ముందు దీపం లేకుండా ఉండకూడదు. మేముంటాం. మీరు వెళ్ళండి” అన్నారు.

సుధ, పిల్లలు కూడా బలవంతం చేశారు కానీ వీళ్ళు సున్నితంగానే తిరస్కరించారు. వాళ్ళు నలుగురూ నాలుగింటికి సినిమాకి వెళ్లిపోయారు.సాయంత్రం ఆరు గంటలకు తులసి స్నానం చేసి, దీపం వెలిగించి దేవుని స్తోత్రాలు అన్ని చదువుకుంటూ కూర్చుంది. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రంగారావు టీ.వి. లో వినాయక చవితి సినిమా చూస్తున్నాడు. సుధ రాత్రికి ఏమీ చెయ్యక్కరలేదని అన్నీ ఉన్నాయని చెప్పింది. పనేం లేదు. భర్తతో సినిమా చూస్తూ కూర్చుంది.

సినిమా నుంచి వచ్చాక, అందరూ కలిసి పొద్దున్న ప్యాకేజి వాళ్ళు మిగిల్చిన తలో రెండు ఉండ్రాళ్ళు,కొంచెం పులిహోర తిన్నారు.ఇంకా,కావలనిపించినా కిక్కురుమనలేదు ఒక్కరూ!

మర్నాడు పొద్దున్న అందరూ కాఫీలు తాగుతుండగా, సుధ “అత్తయ్యా, మామయ్యా చూడండి” అంటూ పక్కన కూర్చుని “నిన్న మన ఇంట్లో జరిగిన పూజ అంతా ఫేస్ బుక్‌లో వాట్సాప్‌లో పెట్టాను. ఎంతమంది బాగుందని రాశారో! వీడియో ఎంత బాగా వచ్చిందో కదా!” అని ఫోన్లో చూపించింది. నిజంగానే చాలా ఆకర్షణీయంగా దేవుణ్ణి, పూలను, దీపాలను నైవేద్యాలను రక రకాలుగా దగ్గరగా, దూరంగా వీడియో తీసాడు ఆ అబ్బాయి.

“చాలా బాగుందమ్మా నిజంగానే! కానీ, ఏమిటిదంతా! దీని కోసం పదిహేడు వేలు ఖర్చు చేశారు. ఈ పూజ నేను చేయించలేనా? ఈ మాత్రం వంట నేను చేయలేనా? పై అలంకరణలు నువ్వు చూసుకునేదానివి కాదా? డబ్బు ఖర్చు చేస్తేనే గొప్పగా చేసినట్లా? మీవేమైనా గవర్నమెంటువీ,  పెన్షన్ లొచ్చే ఉద్యోగాలా? ఎప్పటికప్పుడు కంపెనీలు మారిపోతూ వుంటారు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి. డబ్బు వస్తున్నప్పుడే కాస్త వెనకేసుకుని పిల్లల ముందు జీవితానికి ప్రణాళిక వేసుకోవాలి. ఈ ముసలాళ్ళని ఎందుకు పిలిచాం అనవసరంగా, వచ్చి సంతోషాన్ని పాడుచేశారు అని తిట్టుకోకండి. ఇప్పటికైనా జాగ్రత్త పడతారని చెపుతున్నాను”.

“నేను, మీ మామయ్యా అక్కడ ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటామో తెలుసా? సాయంత్రమయ్యేటప్పటికి ఇరుగుపొరుగు అందరం కలిసి మనింట్లో పాటలు పాడుకుంటాం. ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇక్కడ కూడా అలా నా చేత్తో వంట చేసి పూజ చేయించాలనుకున్నాను. ఆ బ్రాహ్మణుడు వెళ్లాలనే తొందరలో హడావిడిగా చేయించేసాడు. దేవుడి మీద పూలు వేస్తూ కెమెరా వంక చూస్తున్నారు మీరంతా. మనసు లేని,ఏకాగ్రత లేని పూజలు దేవుడు మెచ్చడమ్మా! నిన్ను బాధ పెట్టటం నా ఉద్దేశం కాదు. నీ స్థానంలో నా కూతురున్నా ఇలాగే చెప్పేదాన్ని. మమ్మల్ని సంతోష పెట్టాలనే నువ్వు,రాము కలిసి ఇదంతా చేశారు. మాకు తెలుసు. కానీ, ఇంత ఖర్చు లేకుండా కూడా ఇంత సంతోషంగా పండగ చేసుకోగలం కదా అనే నా బాధ,”అంది తులసి.

రాము ఏం మాట్లాడలేదు.సుధ మాత్రం “సారీ అత్తయ్యా, మీరు ఆ ఊళ్ళో ఉంటే తెల్లవారు జామునే లేచి రోజంతా పని చేస్తూనే వుంటారు. ఇక్కడైనా విశ్రాంతిగా ఉంటారని ఇలా చేసాం. తర్వాత వచ్చే దసరా పండక్కి అన్నీ మనమే చేసుకుందాం,సరేనా!” అంది.

“మనమే అంటున్నావు, నువ్వేమైనా చేస్తావా, వంటిల్లు అమ్మ కప్పచెప్పేయటమేగా!” అన్నాడు రాము.

“పోనీలేరా! నాకదే ఆనందం. నా చేత్తో వండి నా పిల్లలకు పెట్టుకుంటేనే నాకు నిజమైన పండుగలా ఉంటుంది” అంది తులసి.

“నానమ్మా, రవ్వ లడ్లు, జంతికలు ఇక్కడే చెయ్యాలి. అవి చాలా బాగున్నాయి” అన్నారు పిల్లలిద్దరూ.

“తప్పకుండా చేస్తాను” అంది తులసి.

రెండు రోజులయ్యాక కొడుకు,కోడలు, పిల్లలు ఉండమని ఎంత బలవంతం చేస్తున్నా, ఇక్కడేం తోచదని, పిల్లలకి దసరా సెలవలిచ్చాక తప్పకుండా వస్తామని చెప్పి బయలు దేరారు తులసి, రంగారావులు.

Exit mobile version