పండగతో ఒక మాట

2
2

~
[dropcap]ఒ[/dropcap]క చిగురాకుల పాటగానో
పూమొగ్గల తోట గానో
వచ్చి పోయే ఉగాది
పరాకుగా ఉన్న నా ముందు నిలిచి
పలకరించింది

ఎలా వున్నావు
ఇన్ని ఉగాదులు చూశావుగా
ఏం నేర్చుకున్నావని అడిగింది
ఎప్పటికప్పుడే నేర్చినవి మరిచే మనిషిని గదా
నేనేం నేర్చుకుంటున్నానని
ప్రశ్నించుకున్నాను

విషాన్ని ముఖాన చిమ్మినా
మనసును కడిగి ముగ్గుపెట్టడం నేర్చుకున్నాను

సంతోషంగా పలకరించిన మాటను
గుండెకు తోరణంలా కట్టడం నేర్చుకున్నాను

చేదుగా వున్నా నిజాన్ని మాత్రమే
మాటాడటం నేర్చుకున్నాను

ఒడిదుడుకులను తట్టుకుని
ప్రతిసారీ చిగిర్చడం నేర్చుకున్నాను

ఎన్ని కాపులు కాసినా
మామిడిలా మళ్ళీ మంచిని పంచడానికి
నిగర్వంగా పండటం నేర్చుకున్నాను

మండే ఎండలా కసిరి చూసినా
మానవతతో పరిమళించడం నేర్చుకున్నాను

అన్ని రకాల మాటలను విన్నా
షడ్రుచులుగా తలచి
ఆనందిస్తూ వినడం నేర్చుకున్నాను

ఉన్నంతలోనే పంచుకోడాన్ని
సంబరాన్ని నింపడాన్ని
మల్లెలా సున్నితంగా గుబాళించడాన్నీ
దిగులును తుడిచి కోయిల పాటలా వూరటపరచడాన్నీ
కొమ్మల్లో పూలలా కలిసిపోవడాన్నీ
ప్రతి ఉగాదికీ నేర్చుకుంటూనే వుంటాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here