[box type=’note’ fontsize=’16’] దివాకర్ల వేంకటావధాని గారి పాండిత్యాన్ని సీస పద్యం, తేటగీతులలో శ్లాఘిస్తున్నారు కారుపల్లి నరసింహమూర్తి గారు. [/box]
సీ:
సుశ్లోకుడైనట్టి సుందరరామయ్య
సతి వేంకమాంబయు జన్మనిడగ
తెలుగునాడున ఆకుతీగపాడను ఊర
విద్వత్కుటుంబాన వెలసినావు
అతి పిన్న వయసులో అవధాన విద్యలో
ప్రతిభ చూపించిన ప్రాజ్ఞుడీవు
చదువునందే కాదు సాహితీ రచనలో
ఎనలేని ప్రతిభతో ఎదిగినావు
తే.గీ:
వేంకటావధానియనెడు పేరులోన
వైష్ణవం కనిపించెడి వైనమైన
పెండెకట్లు కుంకుమబొట్టు వెలయు నుదుట
భస్మధారియౌ ఫాలాక్షు పాలమట్లు!
సీ:
గంభీర గళముతో గంటల తరబడి
మాట్లాడ గలిగెడి మాట నేర్పు
అప్పటికప్పుడే ఆశుపద్యాలను
దిటవుగా చెప్పెడి దిట్టతనము
కావ్యాలలో నుండు ఖండిక లేవైన
చదువగలుగునట్టి జాణతనము
ఏ విషయమెచట ఏ కావ్యమందుందొ
చెప్పగలుగునట్టి గొప్ప తెలివి
తే.గీ:
అతుల పాండితీ ప్రతిభయు ఆశుకవిత
వీటి యన్నింటి కలయిక మేటి రీతి
వేంకటావధాని కవిగా వెలసి జగతి
వాఙ్మయ దివాకరుండని వాసి గాంచి
వేంకటావధాని సుకవి వీడె జగతి!