Site icon Sanchika

పండుటాకులు..

[శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ రచించిన ‘పండుటాకులు..’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కనాడు అవి చిగురుటాకులు..
ఈనాడు అవి పండుటాకులు..
పాపం పండుటాకు!!!
కొమ్మ నుండి పట్టు తప్పుతున్నా..
చెట్టు తనని వద్దనుకుంటున్నా..
ఆ చెట్టు తనదే అంటిపెట్టుంటుకునే వుంటుంది..
తన కథలూ, వ్యథలూ అన్నీ చిగుళ్ళకు చెప్పాలనుకుంటుంది..
ఎందుకంటే
ఆ పండుటాకుల ముందు..
ఎన్నో వసంతాలు వెలిగిపోయాయి..
ఎన్నో శిశిరాలు కరిగిపోయాయి..
మరెన్నో ఎండలు వాటిని మలమల మాడ్చాయి..
ఎన్నెన్నో చినుకులు వాటిని ముద్దాడాయి..
చలికన్నె వాటిపై, ఎన్ని మంచువానలు కురిపించిందో..
పండు బారుతున్న ఆకుల్లో..
విధి గీచిన వక్రరేఖలెన్నో..
అందుకేనేమో వాటికన్ని ముడుతలు..
చిగురుటాకులను.. వెక్కిరింతలు వెంబడిస్తున్నా..
పచ్చనాకుల సొగసులెన్నో ఈసడిస్తున్నా..
పండుటాకుల పసిడి సారం ఇంకి పోతుందా..
వృద్ధి పొందిన జ్ఞాన భారం కరిగిపోతుందా..
అనుభవాల సారమంతా మలిగిపోతుందా..
శిశిరాల అందాలకు పులకింత పోతుందా..
చిగురేసిన ఆకేదైనా.. రాలిపోక మిగిలుంటుందా..
రాల్చేదాకా ఆ చెట్టు ఆకుగా వుంటూ..
రాలిన తరువాత ఆ చెట్టు గురుతుగా మిగిలిపోతుంది..
పాపం పండుటాకు!

Exit mobile version