[box type=’note’ fontsize=’16’] “ఇందులో వున్న అంశం అంత అపురూపం కాదు. కానీ రావాల్సిన చిత్రమే. మంచి చిత్రమే” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘పంగా’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]భ[/dropcap]ర్త నితీష్ తివారి ఆమిర్ ఖాన్ తో కుస్తీల మీద “దంగల్” తీస్తే, ఇప్పుడు భార్య అశ్వినీ తివారి అయ్యర్ చెడుగుడు ఆట ప్రధానంగా కంగనా రనౌత్ తో “పంగా” తీసింది. ఈమె ఇదివరకు “నిల్ బట్టే సన్నాటా”, “బరేలీ కీ బర్ఫీ” తీసిన దర్శకురాలు. ఆ రెండు చిత్రాలతో పోలిస్తే కొంత బలం తగ్గినట్టే అనిపిస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఆ రెండు చిత్రాలూ ఎక్కువగా స్పర్శించని కథాంశాలు. ఇందులో వున్న అంశం అంత అపురూపం కాదు. కానీ రావాల్సిన చిత్రమే. మంచి చిత్రమే.
స్త్రీలకు పురుషులకు పెళ్ళి అనంతరం వొక ముఖ్యమైన మార్పు వస్తుంది జీవితంలో. ఏదేనా కళలోనో, క్రీడలోనో నేర్పు, పేరు కలిగివున్న పురుషుడికి పెళ్ళి ఆటంకం ఏర్పడకపోగా, ఇంకా బలాన్ని, దన్నునూ ఇస్తుంది. అదే పెళ్ళి స్త్రీల విషయానికి వస్తే ఆమెచేత అస్త్ర సన్యాసం చేయించి ఇంట్లో గృహిణిగా, గృహదేవతగా ప్రతిష్టిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆమె మనసు ముందుగానే ఈ మార్పుకు అనుకూలంగా మలచబడి, ఎక్కువ ప్రతిఘటన లేకుండానే తనకు తానే వొదిగిపోవడానికి వీలుగా వో చట్రం వుంటుంది. ఆ చట్రం మనం సమాజం లో చూసేదే కాకుండా మనస్సుల్లో రేఖాచిత్రంగా లిఖించబడినది కూడా.
జయా నిగం (కంగనా రనౌత్) ఇదివరకు రైల్వే తరఫున చెడుగుడు ఆడి అంతర్జాతీయ టీం లో కూడా నాయకత్వం వహించిన వ్యక్తి. ఇప్పుడు పెళ్ళయి, వో కొడుకుతో ఇంటి పనులూ, భర్తా పిల్లవాడిని చూసుకోవడం, ఉద్యోగం చేయడంలో ఎంత కూరుకు పోయిందంటే ఆమెకు ఆ ఆట పట్ల వున్న ప్రేమ మనసు లోతుల్లోనే నిద్రాణంగా వుంది. నిద్దట్లో భర్తను తన్నడంతో బయటపడే ఆ చెడుగుడు మీద ప్రేమ, మెలకువగా వున్నప్పుడు ఎప్పుడన్నా చెడుగుడుకి సంబంధించిన సందర్భం ఎదురొస్తే,ఉదాహరణకు వో సారి స్టేషన్లో చెడుగుడు ఆడే కుర్రకారు టీం ని చూసినపుడు, మనసు కాసేపు పీకుతుంది, తను తనకు చాలా ప్రియమైన దాన్ని కోల్పోయిందని. మళ్ళీ తనే సర్ది చెప్పుకుంటుంది, ఇప్పుడు తనకు ఆటకన్నా తన కుటుంబమే ముఖ్యం అని. ఇలా తనకు ఇష్టమైన దాన్ని కుటుంబంకోసం త్యాగం చెయ్యడం అన్నది ఆమె ఎవరూ చెప్పకుండానే, ఇష్టంగానే చేసినా మనసులోపల వొక బాధ సజీవంగా వుండి, అప్పుడప్పుడు బయట పడుతూ వుంటుంది. గారాబంగా పెంచిందేమో, వో సారి కొడుకు తల్లితో మోటుగా మాట్లాడుతాడు : నువ్వు ఉద్యోగం అంటావు గాని, టిక్కెట్లు చించే పనేగా చేసేది అని ఈసడింపు మాటలు మాట్లాడుతాడు. (ఆ వయసు పిల్లవాడికి అంత తెలీదు గాని, అన్నాడూ అంటే అలాంటి మాటలు విని వున్నాడు కాబట్టి అన్నాడు. అంటే కథలో ప్రత్యక్షంగా లేని సమాజ వైఖరి ఇలా బయటపడుతుంది. అందునా తండ్రి ఏమీ అనకపోవడం కూడా బలమైన విషయాన్నే ప్రకటిస్తుంది.) భార్య మనసు గిలగిలా కొట్టుకోవడం చూసిన భర్త ప్రశాంత్ (జస్సి గిల్) కొడుకు ఆది (యజ్ఞా భసిన్) ని కూర్చోబెట్టి తమ కుటుంబం కోసం అమ్మ చేసిన త్యాగాలు, ముఖ్యంగా తను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి అయినప్పటికీ తమకోసం ఎలా త్యాగం చేసినదీ చెబుతాడు. అక్కడి నుంచి కథ మారుతుంది. ఆది తన తల్లి తిరిగి క్రీడల్లో పాల్గొనాలని, comeback చెయ్యాలని తలచి, ముందు తండ్రిని నచ్చజెప్పుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జయను వొప్పిస్తారు. ఆ తర్వాత జయ మళ్ళీ చెడుగుడు టీంలో స్థానం సంపాదించడం, ఆడడం అన్నది మిగతా కథ.
ఉన్నతమైన ఆశయాన్ని తీసుకున్నప్పటికీ ఈ చిత్రం చాలా పొడవు లెక్చర్లు దంచదు, అలాంటి చిత్రీకరణా లేదు. జయకు తన కుటుంబం పట్ల ప్రేమ, వాళ్ళ నుంచి తిరిగి పొందుతున్న ప్రేమ ముందు తను ఆటను మానేసినందుకు తప్పేం చెయ్యలేదనిపిస్తుంది. ఎప్పుడో మనసులోతుల్లోంచి “ఇంతేనా” అన్న ప్రశ్న లేచి ఆమెను కలవర పెడుతుంది, కన్నీరు తెప్పిస్తుంది. ఆ గింజులాటను దర్శకురాలు, నటి చాలా బాగా ప్రదర్శించారు. భర్త భార్యను అర్థం చేసుకునే ప్రేమాళువుగా చూపించినా అతనిలో కూడా మూస మగవాడి అవశేషాలు కూడా వుంటాయి. భార్యను కొడుకు సంతృప్తి కోసం ప్రయత్నం చెయ్యమంటాడు, తర్వాత కుదరలేదని చెప్పొచ్హు,నువ్వు యెప్పటిలా ఇల్లూ ఉద్యోగమూ చెయ్య వచ్చు అంటాడు. అలా మొదలు పెట్టినా ఆనక ఆమెకు నిజంగానే పౌరుషం వచ్చి ఎలాగైనా పోరాడి (ఇదే పంగా అర్థం) సాధించాలనుకుంటుంది. అది ప్రకటించినపుడు అతను తెల్లమొహం వేస్తాడు, ఏమీ మాట్లాడడు. నువ్వేం చెప్పక్కర్లేదులే, నీ మొహమే చెబుతోంది అంతా అంటుంది. కొడుకు కూడా ఆ వయసుకు వుండే పక్వత లోబడే కొన్నిసార్లు చిరాకు పడుతూ, ఇంకొన్ని సార్లు ప్రోత్సాహకరంగా ప్రవర్తిస్తాడు. ఇక జయ కాక మరో ఇద్దరు స్త్రీల కథ ఇది. తల్లి నీనా గుప్తా. కొన్ని సీన్లే వున్నా, పెద్ద విషయాన్ని చెబుతుంది ఈ పాత్ర. మొదట వ్యతిరేకించిన మనిషి తీరా కూతురు అంతర్జాతీయ టీం లో ఎన్నికైనప్పుడు ఫోన్ లో అంటుంది : నీ వెనుక నీ భర్త ప్రోత్సాహమే కాదు, నా పెంపకం కూడా వుందని చెప్పు ఇంటర్వ్యూలలో. ఎందుకంటే అందరు స్త్రీలలాగే ఆమె కూడా ఇల్లు అల్లుతూ తన ఇతర ఉనికిని కోల్పోయిన స్త్రీనే. ఇక రెండో స్త్రీ నెచ్చెలి రిచా ఛడ్డా. తనతో పాటు చెడుగుడు ఆడిన అమ్మాయి. అవివాహితగా మిగిలి, కోచ్ గా చేస్తుంటుంది. ఆమె పాత్ర నెరవేర్చే ప్రయోజనం జయ డీలా పడ్డ ప్రతిసారీ నీ పోరాటం నువ్వు చెయ్యాలి, ఇలా నీరసపడే దానివైతే మా సమయాన్నెందుకు వృథా చేశావు అంటుంది. ఆ విధంగా తన లక్ష్యం కోసం తనే బాధ్యత తీసుకోవాలని నేర్పుతుంది. నిత్య జీవితంలో సంఘటనలే హాస్యం జోడించి సరదా సరదాగా చెప్పిన కథనం. ముఖ్యంగా మొదలూ చివరా చెప్పుకోవాలి. మొదట్లో దృశ్యాలు జయ వంట చేసి భర్తా, పిల్లవాడికి పెట్టి, టిఫిన్లు కట్టి, తర్వాత తను ఉద్యోగానికి వెళ్తుంది. ఆమె లేకపోతే వీటిలో ఏ వొక్క దృశ్యమూ సంపూర్ణమవదు, కేన్వాస్ మీద నిలవదు. అదే చివరికొచ్చేసరికి మనం చూసేది భర్త తన పనులు తాను చేసుకోవడం, అలాగే కొడుకూనూ. అప్పుడే కదా నిజమైన అర్థంలో వొకరినొకరు దన్నుగా వుంటూ ఎవరూ అన్యాయమైన త్యాగాలు చేయకుండా వుండేది.
ఈ చిత్రానికి మూలపురాయి కంగనా. ఆమె నటన ఏ వంకా పెట్టలేము అన్నట్టుగా వుంది. రిచా, నీనా గుప్తా, జస్సి, యజ్ఞా అందరూ బాగానే చేశారు. అశ్విని తివారి అయ్యర్ దర్శకత్వం బాగుంది. కొంచెం నిడివి తగ్గించి వుంటే ఇంకా బాగుండేది చిత్రం.