పని – మని – షి తో వెతలు

0
4

[dropcap]అ[/dropcap]ది శ్రీనగర్ కాలనీ, అక్కడ వున్న వాళ్ళందరు స్థిర నివాసులే. కాలనీకి ముందు కాలనీ పేరుతో అందమైన ఆర్చి, రోడ్డు కిరువైపుల క్రోటన్ మొక్కలు పూలమొక్కలతో ఆకర్షణీయంగా వుంది. ప్రతి ఇంటిలో పూలు, పండ్ల చెట్లున్నవి. దాదాపు అందరూ కలిసే గణేశ్ నవరాత్రులు, దసరా ఉత్సవాలు జరుపుకొంటారు. కాలనీలో పార్కుంది. అందులో అన్నిరకాల చెట్లున్నవి. పిల్లలు ఆడుకోవడానికి, పెద్ధలకు అనుకూలంగా వుంది. ఆ పార్కుకు దగ్గరలోనే హరిణి, వినోద్‌ల ఇల్లుంది.

పక్షుల కిలకిలరావాలతో మెలకువ వచ్చింది హరిణికి, ‘అయ్యబాబోయ్ ఇంత లేటైంది. ఎలా?’ అంతే భయం భజన మొదలైంది మదిలో, ‘అమ్మో, ఇంతసేపు ఎలా పడుకున్నాను.ఇంత మొద్దు నిద్ర పోయానేమిటి’ అనుకుంటూ, హడావిడిగా నోట్లో బ్రష్ తోటే పిల్లలను భర్తను లేపింది హరిణి.

ఇంకాసేపు పడుకుంటామంటు మారాం చేస్తున్న పిల్లలను ఇప్పటికే లేటైంది లేవండంటు దాదాపు ఎత్తుకు వచ్చి కూర్చోబెట్టింది సోఫాలో.

బయట చూస్తే ఇంకా పనిమనిషి రాలేదు. అదే హడావిడిలో పనిమనిషి సంధ్యకు ఫోన్ చేసింది. నాలుగైదుసార్లు ఫోన్ రింగయిన తరువాత నెమ్మదిగా నీరసంగా ఫోన్లో ‘హలో’ అన్న మాట విని, “సంధ్య లేదా?” అన్నది.

“అమ్మా, నేను సంధ్యనే మాట్లాడుతున్న. రాత్రి బాగా తాగి వచ్చి ఇంకా డబ్బులు కావాలని అడిగితే లేవన్నందుకు నన్ను బాగా కొట్టిండు. నాకు చేత కావడం లేదు. ఫోన్ చేద్దామంటే సెల్లులో డబ్బులు లేవు” అన్నది సంధ్య.

దాంతో హరిణి కోపం నషాళానికంటింది. “ఇట్లా అయితే ఎట్లా ఎవరి ఫోన్ నుండైనా చేసి, చెప్తే బాగుండేది. నేను లేటుగా లేసిన సంధ్యా” అంటూ “సాయంకాలం రా హాస్పిటల్కు తీసుకు వెళ్తాను” అంది హరిణి.

సరేనమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది సంధ్య.

‘నెలకు పది రోజులు ఈ ప్రహసనం సాగుతూనే ఉన్నది, ఉంటది. తప్ప తాగి వచ్చి భార్య పిల్లలను కొట్టడం ఇంట్లో ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళడం అలవాటైపోయింది రవికి’ అనుకుంటూ “ఇలాంటి వాళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్‌లో పెడితే వస్తుంది” అంటే, “అమ్మా పోలీసులు బాగా కొడతారంట కదా! వద్దమ్మ మల్ల కష్టమంతా నాకే కదా! పోలీస్ స్టేషన్‍లో పెడితే ఇంకా ఎక్కువ నన్ను కొడతాడు. మొన్న కొడుతుంటే అడ్డం వచ్చిన నా బిడ్డ చెయ్యి విరిగింది. తెల్లారినంక తప్పైందన్నాడు. పిల్లను దావఖానాకు తీసుకుపోతే, ‘ఇంత చిన్నపిల్ల చెయ్యెట్ల విరిగింద’నగానే, ‘ఆడుకుంటుంటే కింద పడితే విరిగింద’ని అబద్దం చెప్పిండు. నేను కూడా ఏమి అనలేక పోయాను” అన్నది సంధ్య.

అయ్యో చిన్న పిల్ల అని బాధనిపించి డబ్బు లిస్తూ, ఇలా ఎన్నాళ్లు అనుకున్నది హరిణి. ఆ కాలనీ లో ఒక పది మంది ఇళ్లలో పనిచేస్తుంది సంధ్య.

ఇవాళ ఇంత మందికి ఇంటి పనులలో హడావుడి అనుకున్నది హరిణి.

పనులన్ని త్వర,త్వరగా చేసుకుంటూ, పిల్లల్ని రెడీ చేసింది టిఫిన్ చేసే టైం లేదని పెరుగన్నం తినిపించి బాక్సులు సర్ది పిల్లలను వదిలి పెట్టమని భర్తకు చెప్పింది.

అతను వదిలిపెట్టి వచ్చే వరకు తమ బాక్స్‌లు సర్ది,రెడీ అయి కూర్చుని ఊపిరి తీసుకొంది హరిణి.

‘ఒక్క రోజు పనిమనిషి రాకుంటే ఎన్ని ఇబ్బందులో’ అనుకుంటూ మిగిలిన పనులన్నీ సాయంకాలానికి వాయిదా వేసింది హరిణి.

వినోద్, హరిణి ఇద్దరూ స్కూల్ టీచర్లే. హరిణిని బస్టాప్‌లో దించి అతను బండిమీద వెళ్ళిపోతాడు. సాయంకాలం కూడా ఇద్దరు కలిసే వస్తారు.

ఒకవేళ లేట్ అయితే పిల్లలను స్కూల్లో ఉంచాలని ఎవరొచ్చినా పంపొద్దని ముందే చెప్పి ఉంచారు కనుక ఆయమ్మ పిల్లలను కనిపెట్టుకొని ఉంటుంది. తల్లిదండ్రులువస్తే, వాళ్లతోనే పంపిస్తుంది. కొంచెం లేటుగా వచ్చే వాళ్ళు ఆమెకు డబ్బులు ఇస్తారు. హరిణి పిల్లలను కూడా చూడడానికి మాట్లాడుకున్నారు. కనుక లేట్ అయిన పిల్లలు స్కూల్లో ఉంటారన్నది వాళ్ళ ఆలోచన.

వీళ్ళు వచ్చేటప్పుడు స్కూల్ నుండి పిల్లలను తీసుకొని వస్తారు. హరిణి మిగిలిన పనులు చేస్తుంటే వినోద్ సహాయం అందించాడు. పిల్లలు కూడా బాక్స్లు బయటపెట్టిన నీళ్లు పోసి వచ్చారు. పాలు తాగి హోంవర్క్ చేసుకుంటుంటే దగ్గరుండి వినోద్ చేయించాడు. ఇద్దరిలో ఎవరికి తీరికుంటే వాళ్లు పిల్లల హోం వర్కులు చేయిస్తారు. ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగే జీవితం వారిది.

“సంధ్యకు ఫోన్ చేయనా” అని అడిగింది వినోద్‌ను. “హరిణి నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు? ఆమె పని చేసే ఇద్దరు ముగ్గురు నీకు తెలుసు కదా! వాళ్ళను నువ్వు కనుక్కో” అన్నాడు వినోద్.

తనకు తెలిసిన కొందరికి ఫోన్ చేసింది హరిణి. అందరూ సంధ్య రాలేదని తమకెంతో కష్టమైందని అన్నారు, ఒకామె ఇంకా ఆఫీస్‌కు లీవు పెట్టిల్సి వచ్చిందని, ఇలా చెప్పాపెట్టకుండ మానేస్తే ఏం చేయాలి అని అందరూ ఆలోచించండి అన్నారు. దాదాపు నెలకు ఏడు, ఎనమిది రోజులు ఒక్కోసారి పది రోజులు కూడా మానేస్తుంది. అందరం పాపం అని డబ్బులు ఇచ్చే వాళ్ళమే, ఒక రోజు భర్త కొట్టాడని, తన ఆరోగ్యం బాలేదని, పిల్లల ఆరోగ్యం బాలేదని, ఇలా చేస్తున్న తప్పని పరిస్థితుల్లోఅందరం భరిస్తున్నాం. చాలా మందికి విసుగొస్తోంది. వేరే వాళ్ళను పెట్టుకుంటామంటే, నేను చేసే ఇండ్లకు వేరే వాళ్ళు ఎట్లా వస్తారమ్మ. నేను ఎక్కడ ఇల్లు వెతుక్కోవాలి అంటుంది. అని అందరూ తమ బాధలు చెప్పుకున్నారు హరిణికి.

అందర్నీ ఆదివారం తన ఇంటికి రమ్మన్నది హరిణి. మనందరం కలిసి నిర్ణయం తీసుకుంటేనే మనకు ఈ తిప్పలు తప్పుతవి లేకుంటే ఇలా బాధ పడవలసిందే అనుకున్నారు.

తాగుబోతు భర్తలతో దెబ్బలు తినే ఆడవాళ్ళే ఎక్కువ, కనుక వీళ్ళు డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు తాగరు. భార్యలను పనులలో నుండి తీసేస్తే నన్న వాళ్ళలో మార్పు వస్తుందో చూద్దామనుకొన్నారందరు.

మనందరం ఈ నెల రోజులు పనిమనుషులను మాన్పించి మనమే పని చేసుకొందామనుకొన్నారు.

మనందరం ఒక నెలరోజులు పని మనుషులను మాన్పిస్తే పని అంటే ఏమిటో, ఆకలంటే ఏమిటో తెలిసేలా చేద్దాం అనుకున్నారు అందరు.

సంధ్య, లక్ష్మీ, సమ్మక్క ఇలా ఆ కాలనీలో పది మంది దాకా ఉన్న పని మనుషులను “మేమే పని చేసుకుంటాము. మీరు అవసరం లేదు. టైం కు రాక మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీతో మేము ఆఫీసులకు స్కూళ్లకు వెళ్లడం లేటై, పెద్దవారితో మాటలు పడాల్సి వస్తుంది. కానీ కొంచెం అన్నా వాళ్ళు బయటికి వెళ్లే వాళ్ళు కదా అన్న ఆలోచన మీలో లేదు. మీరు ఇంకో పని చూసుకోండి.” అని చెప్పే వరకు వాళ్ళు చెప్పేది ఏంటో అర్థమై ‘అయ్యో అట్లంటే ఎట్లమ్మా! మా పిల్లలో’ అన్న ఆలోచన కొందరికి మాత్రమే కలిగింది.

‘లేదమ్మ కావాలని చేస్తలేం కదా! ఒక్కొక్కరి ఇంట్లో ఆలస్యమైతే అలా జరుగుతుంది. ఇప్పటినుండి తప్పకుండా తొందరగా వచ్చి పని చేస్తామ’న్నారు కొందరు.

కాని చాలామంది పనిమనుషులు – ‘అటున్న పుల్ల ఇటు తీసిపెట్టుకోవడం చాతకాదు వాళ్లకు, తెల్లారేవరకు ఫోన్ చేయక పోతే నన్నడగమని;  వాళ్ళే పిలుస్తారని కొందరు. కొందరు ఎక్కడ ఏం పని చేసుకోవాల’ని ఆలోచిస్తుంటే, కొందరు ఇలా పని నుండి తీసేస్తే ఎట్లమ్మా, ఇప్పటినుండి టైం కు వస్తామని ఎక్కువ మానేయమని బ్రతిమాలాడిన వాళ్ళు కొందరు, ఎవరేమన్నా మాకు అవసరం లేదని ఆ కాలనీ వాళ్ళందరూ చెప్పేశారు.

***

ఆ కాలనీకి పక్కన గుడిసెలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర పనులు చేసుకొని బతికేవాళ్ళే, వేరే పనులు దొరుకుతున్నాయి కానీ దూరం వెళ్ళాలి, ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళ అందరికీ టిఫిన్,టీ మిగిలిన అన్నము అన్ని తెచ్చుకుంటారు. కనుక ఇంట్లో పిల్లలకు తెచ్చింది పెట్టి బడికి పంపుతారు. ఇప్పుడు ఎలా అన్నదే చాలా మంది ఆలోచన.

ఎప్పుడో ఐదు గంటలకు లేసి ఇంట్లో పనులు చేసి పనికి పోయే వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉండటం, ఏదో ఒకటి తెచ్చిపెడితే హాయిగా తిని పిల్లలు, మొగవాళ్ళలో ఆ గుడిసెలో కలకలం మొదలైంది. ఏమైంది అని అడిగిన వాళ్ళందరికీ మమ్మల్ని పనిలో నుంచి తీసేసారు. వాళ్లే పనులు చేసుకుంటున్నారు అని చెప్పడంతో అట్లెట్ల తీసేస్తరు అడిగటోళ్ళు లేకనా? అంటూ సీసా పట్టుకొని శివాల తొక్కుతున్నాడు నాగయ్య.

కూలి పనులకు పోదామంటే కూలీలు దొరక్క, పని లేక డబ్బుల్లేక పిల్లల ఆకలి తీర్చలేక ఆడవాళ్లందరూ బాధపడుతున్నారు. చేసిన పనికి, వచ్చిన డబ్బులతో యథావిధిగా తాగొస్తున్నారు మగవాళ్ళు.

ఇదివరకులా తాగొచ్చి కొట్టి తిట్టి డబ్బులు లాక్కునే వాళ్ళను, ఆడవాళ్ళు మేము పనికే పోతలేము మాదగ్గర డబ్బు లెక్కడివని ఎదురు తిరుగుతున్నారు.

మేము తీసుకొస్తుంటే ఉన్న నాలుగు డబ్బులు లాక్కుపోయారు ఇప్పుడు మీకు పనులు లేవు మాకు పనులు లేవు, పైసలు లేవు, పిల్లలు ఆకలని ఏడుస్తున్నారు, ఏం చేయాలో తోస్త లేదని ఆడవాళ్ళు కూడా బాధపడటం మొదలుపెట్టారు.

‘మీ పైసలు అంటూ మీరు తాగినా, తిన్నా ఊరుకున్నాం. ఇప్పటినుండి ఇంట్లో పైసలు ఇవ్వకుంటే పిల్లలను బడికి రానీయరు. మా చావులు మేము చావాల్సిందేనని, తప్పకుండా డబ్బులు తీసుకొచ్చి మాకు ఇవ్వాల’ని చెప్పారు.

‘మీరు కొట్టే దెబ్బలకు మా ఒళ్ళంతా హునమైనా ఊర్కున్నాం. పనిలోకి పోకపోతే ఎన్నిరోజులు ఊర్కుంటరు. అందుకే మమల్ని పనిలోకి రానివ్వటం లేదు’ అన్నారు. దీని కంతటికి కారణం ఆ మందుల షాపేనని అనుకొన్నారు. మీరందరు తాగుడు మానేయాలని భర్తలతో గొడవ పెట్టారు.

తాగి వచ్చిన వాళ్ళను ఇంట్లో కి రానివ్వక తలుపులేసుకొన్నారు. మరునాడు గొడవ పెడితే, ఏదైనా తాగి పిల్లలను చంపి మేమూ చస్తామంటు బెదిరించారు.

ఇక ఇలాకాదని ఒకరోజు ఆడవాళ్ళందరు చీపుర్లు, చాటలు, కర్రలు పట్టుకొని వెళ్ళి షాపు మూయకుంటే, అన్ని పగల కొడతామని, ఇక్కడనుండి తీసేయాలని చెప్పి వాళ్ళు వేసిన తాళం మీద తాళం వేసి వచ్చారు.

ఇలా ఆడవాళ్ళందరు ఒక్కటై మద్యాన్ని మట్టుపెట్టారు. అప్పటికే ఇరవైరోజులు గడచినవి. ఒక్కొక్కరు తాము పని చేసే ఇంటి యజమానులకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కరూ లిఫ్టుచేయలేదు. ఇక పనులు లేకుంటే బతకలేమని నిర్ణయించుకున్న వాళ్ళందరు కాలనీ పెద్దలను కలిసారు.

మీరు పనులు చేయచుకోకపోతే ఎలా అని, మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని కుటుంబాలు బతుకుతున్నమని, ఇప్పటి నుండి సరిగా పని చేస్తామని,తాగుడు మానుతామని మాకేదైనా దారి చూపండన్నారందరు. ఇప్పటినుండి మా భార్యలతో పాటు మేము పనికి వస్తామన్నారు.

ఎవరైనా తాగినా, భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేసినా ఉర్కోమని పోలీసులకు అప్పగిస్తామన్నారు కాలనీ పెద్దలు.

అందరు ముందే రెండు నెలల డబ్బులిచ్చి, ఎవరు ఏఏ పనులు చేస్తారో అడిగి వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ బ్యాంక్ లోను ఇప్పించారు కాలనీవాసులు.

కొందరు ఆటోలు కొనుక్కున్నారు. కొందరు కిరాణా షాపు పెట్టుకున్నారు.

ఎవరకి అందుబాటులో వున్న పనులలో వాళ్ళు చేరిపోయి మాట తప్పకుండా లోన్లు కట్టుకొంటూ జీవితాలను మంచి మార్గం లోకి నడిపించుకొన్నారు.

చెడును వదలించి మంచికి మార్గం వేసిన కాలనీవాసులతో కలసి జీవనం కొనసాగిస్తు బతుకు దిద్దుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here