[box type=’note’ fontsize=’16’] చదువులు మొదలుపెట్టే పసిపిల్లలచే పాఠశాలలలో వల్లె వేయిస్తున్న రైమ్స్ బ్రిటిష్ పుస్తకాల నుండి అరువుతెచ్చుకున్నవి, మనదేశ సంస్కృతి, ఆలోచనలకు ఏ మాత్రం సరిపోనివి” అని అంటున్నారు డా. దుగ్గిరాల రాజకిషోర్ “పనికిమాలిన రైమ్స్”లో. [/box]
[dropcap]పి[/dropcap]ల్లల చదువులు మాతృభాషా మాధ్యమంలోనే మొదలు కావాలని ఎందరో విద్యావేత్తల అభిప్రాయం. కానీ మనదేశంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తప్పనిసరి అనర్థంగా పాతుకుపోయేయి. అందులోనూ చదువులు మొదలుపెట్టే పసిపిల్లలచే ఈ పాఠశాలలలో వల్లె వేయిస్తున్న రైమ్స్ బ్రిటిష్ పుస్తకాల నుండి అరువుతెచ్చుకున్నవి, మనదేశ సంస్కృతి, ఆలోచనలకు ఏ మాత్రం సరిపోనివి.
ఉదాహరణకు కొన్ని ఇంగ్లీష్ రైమ్స్ చూద్దాం.
Baa baa black sheep
ఇది మొదట ఇంగ్లాండులో 1744లో ప్రవేశపెట్టారు. 13వ శతాబ్దం నాటి పాలకులు గొర్రెల నుండి వచ్చే ఉన్నిపై విపరీతంగా పన్నులు విధించే వారు. అందులో భాగంగా ప్రజలు తమ గొర్రెల నుండి తీసిన ఉన్నిలో మూడవ వంతు పాలకులకు పన్నుగా పంపించేవారు, మరో భాగం చర్చికి పంపించేవారు, ఇక మిగిలిన మూడవ భాగం గొర్రెల కాపరికి వెళ్ళిపోయేది. ఈ అర్థం వచ్చేటట్లుగా వాళ్ళు ఆ రైమ్ పాడుకుంటారు.
Rain, rain go away
ఇది ఎలిజబెత్-1 (1533-1603) రాణి పాలించే రోజుల్లో వ్రాసినది. ఇంగ్లిషు వారు స్పానిష్ ఆర్మడాపై యుద్ధం చేస్తున్నప్పుడు తుఫానులో చిక్కుకున్న సైనికులు భయంతో వర్షాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మంటూ పాడుకున్న పాట ఇది.
Humpty-Dumpty sat on a wall
ఇంగ్లాండులో 1642-49 మధ్య సివిల్ వార్ జరుగుతున్నప్పుడు వ్రాసిన రైమ్ ఇది. John Tenniel వ్రాసినట్లు Humpty-Dumpty అనేది ఒక గుడ్డు కాదు. ప్రత్యర్థి వర్గాలైన ఆర్మీ ఆఫ్ పార్లమెంటేరియన్లకు వ్యతిరేకంగా చార్లెస్-1 సైన్యం కోల్చెస్టర్ పట్టణంలో ఒక ఎత్తైన చర్చి బురుజుపై నిలబెట్టిన చిహ్నమును ఇది సూచిస్తుంది. ప్రత్యర్థుల దాడిలో ఎత్తైన బురుజు నేలమట్టం కావడంతో Humpty-Dumpty కూడా క్రింద పడిపోయింది. అలా క్రింద పడ్డ ఆ చిహ్నం ఎవరికీ కనిపించకపోవడంతో దానిని ఎవరూ తిరిగి నిలబెట్టలేకపోయారు. అప్పుడు వ్రాసినదే ఈ “Humpty Dumpty sat on a wall/ Humpty Dumpty had a great fall” అనే రైమ్.
Johny! Johny! What Pappa?
Johny! Johny! What Pappa?
Eating sugar? No Pappa!
Telling lies? No Pappa!
Open your mouth! Ha ha ha.
ఇది నేర్పడం ద్వారా అమాయకులైన పసి పిల్లలకి తల్లి దండ్రుల వద్ద అబద్ధాలాడవచ్చని చెప్పడంలేదూ!?
London Bridge Is Falling Down
ఇది 1744 కి చెందిన Tommy Thumb’s Pretty Song Book లోనిది. మొదట లండన్ బ్రిడ్జి కట్టింది రోమన్ దేశస్థులు. సరైన మరమ్మత్తులు లేకపోవడం వల్ల ఆ బ్రిడ్జి తరచుగా కూలిపోతూ ఉండేది. అది గుర్తుచేసుకుంటూ ఈ రైమ్ వ్రాసేరు.
ఇంగ్లాండులోని బర్మింగ్ హామ్ సిటీ కౌన్సిల్ 1999లో Ba Ba black sheep, Rain, rain go away, Humpty-Dumpty sat on a wall లను పిల్లలకి నేర్పించడం వల్ల ఏ విధమైన ప్రయోజనమూ లేదనీ, వాటిని వారి పాఠ్యాంశాల నుండి తొలగించాలనీ నిర్ణయించింది.
పైన పేర్కొన్నవే గాకుండా మరి కొన్ని అర్థంలేని ఇంగ్లిష్ రైమ్స్‌ని గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్యపుస్తకాల నుండి తొలగించింది కూడా. వాటికి బదులుగా మన భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆలోచనా ధోరణిని తెలిపే పద్యాలను పాఠ్యాంశాలలో చేర్చింది. మన దేశ సంస్కృతిని ఏ విధంగానూ ప్రతిబింబించని, ఎందుకూ పనికి రాని ఇంగ్లీషు పద్యాలని పాఠ్యాంశాలలోంచి తొలగించగానే అదేదో పెద్ద నేరమన్నట్లు తమను అభ్యుదయవాదులుగా చెప్పుకునే వామపక్ష వాదులూ, కుహనా లౌకికవాదులూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మతతత్వ చర్యలకు పాల్పడుతోందని గగ్గోలుపెట్టేరు.
ఇలాంటి రైమ్స్ పాశ్చాత్య దేశాలలో ఆయా సందర్భాలలో సరదాగా వ్రాసుకుని ఉండవచ్చు. వాటిలో చాలా వరకూ ఇప్పుడు ఎందుకూ పనికిరానివని వారే అవతల పడేసారు. మరి మనదేశంలో మాత్రం స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు దాటినా ఇంకా ఇలాంటి అర్థం లేని రైమ్స్ ని పిల్లలచేత వల్లె వేయిస్తూ గొప్పగా మురిసిపోతున్నాం. ఇది ఏరకంగా విజ్ఞత అనిపించుకుంటుంది?