పన్ను పోటు

0
2

[బాలబాలికల కోసం ‘పన్ను పోటు’ అనే కథ అందిస్తున్నారు భానుశ్రీ తిరుమల.]

[dropcap]వి[/dropcap]శ్వపురి రాజ్యానికి సేనాధిపతి అయిన చండశాసనుని నివాసం కొంతమంది ముఖ్యమైన సైనిక అధికారులతో ఇతర అధికారులతో కోలాహలంగా ఉంది.

అప్పుడే మార్తండ మిత్రుడు అనే సైనికాధికారి చండశాసనుని కలవడానికి అటువైపు వచ్చాడు. ఆ కోలాహలాన్ని చూసి ఏమయ్యిందని అక్కడే ఉన్న తోటి సైనికాధికారిని అడిగాడు.

“ఓ అదా, మన సేనాధిపతి వారు రెండు రోజుల నుండి విపరీతమైన పంటి నొప్పితో బాధ పడుతున్నారు. రాజధానిలో ఉన్న వైద్యులందరూ వచ్చి చూసారు. చివరికి రాజ వైద్యుడు కూడా. పాపం వారి ప్రయత్నం వాళ్లు చేసారు. కొంత ఉపశమనం కలిగినా పూర్తిగా వారి పంటినొప్పి తగ్గలేదు” వివరించాడు తోటి సైనికాధికారి గరుడుడు.

“అయ్యో! అలాగా, సరే నేను ఓసారి వారిని కలిసి వస్తాను” అని చెప్పి లోపలికి వెళ్లిన మార్తండ మిత్రుడు, సేనాధిపతిని కలిసి క్షేమ సమాచారలడిగి తానొచ్చిన పని ముగించుకుని “మీకు ఈ బాధనుండి సత్వర ఉపశమనం కలిగాలి” అని చెప్పి బయటకు వచ్చేసాడు.

చండశాసనుడు, మార్తండ మిత్రుడు ఓ రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో ఆ రాజ్యంలో సైనికులుగా చేరారు. ముందు చండశాసనుడే చేరాడు. అతను చాలా చిన్న వయసులోనే సైన్యంలో చేరాడు. మార్తండ మిత్రుడు ఉన్నత విద్య పొందిన తరువాత వచ్చి సైన్యంలో చేరాడు. అయితే వారిద్దరూ సైన్యంలో వేరు వేరు శాఖలలో పనిచేసే వారు. అయినప్పటికీ ఎందుకో చండశాసనుడు మాత్రం మార్తాండ మిత్రుడిని మొదటినుండీ తనకు పోటీగా పరిగణించాడు. అయితే మార్తాండ మిత్రుడు చండశాసనునికి తాను పోటీదారుడనని ఎన్నడూ అనుకోలేదు, పోటీ పడాలనీ అనుకోలేదు. బహుశా తనని తాను తక్కువగా అంచనా వేసుకోవటం వల్లనేమో!

సహజంగా కొంత ఉద్రేక స్వభావం గల మార్తండ మిత్రుడు, తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగినప్పటికీ, తన ఆవేశం వలన, తనకు అర్హమైన కొన్ని గొప్ప అవకాశాలను చేజిక్కుంచుకోలేక పోయాడు. పైగా కొందరు సహచరులు, పైవారు కావాలనే అతనిని రెచ్చగొట్టేవారు. దానికి మార్తాండుడు తీవ్రంగా స్పందించడం వలన రాజా వారి దృష్టిలో చెడుగా పరిగణింపబడే వాడు. అయితే ఆ తగాదాలన్నీ వాదోపవాదాలతో ముగిసేవి కాబట్టి రాజు గారు కూడా అంతగా పట్టించుకునే వారు కాదు. కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మార్తాండ మిత్రుడుకి ఉన్న అంకిత భావం వలన మామూలు సైనికుని స్థాయి నుండి సైనికాధికారి వరకూ ఎదిగాడు.

పేరుకు చండశాసనుడైనా సేనాధిపతి సౌమ్యుడు. లౌక్యం తెలిసిన వాడు. తను చేరాల్సిన గమ్యాలను ఎప్పటికప్పుడు నిర్థేశించుకుంటూ తన మజిలీ అయిన సేనాధిపతి పదవిని అనతి కాలంలోనే చేరి రాజుగారికి విశ్వసపాత్రునిగా దశాబ్దాలుగా చెలామణీ అవుతూ వస్తున్నాడు.

ఆ ఇరువురి మధ్య అధికారపరంగా అంతరం పెరిగినప్పటికి మార్తాండ మిత్రుడు, సేనాధిపతి పై అక్కసు పెంచుకున్నది లేదు. అసూయ చెందింది లేదు. ఎందుకంటే తన బలాలు, బలహీనతలు మార్తాండ మిత్రుడుకి బాగా తెలుసు.

సేనాధిపతి మార్తాండ మిత్రుడిని నలుగురిలో ఉన్నప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడినప్పటికి, అతనిని విశ్వసపాత్రునిగా పరిగణించే వాడు కాదు.

ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు కూడా మార్తాండ మిత్రుడి సలహా సూచనలకు అంత ప్రాధాన్యత నిచ్చేవాడు కాదు సేనాధిపతి.

దేనినైనా ఇట్టే అంచనా వేయగల మార్తండ మిత్రుడు, చండశాసనుని అంతరంగాన్ని ఎందుకో చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగాడు. ఇక అప్పటినుండి తనకు అడిగిన దానికే జవాబు చెప్పేవాడు తప్ప ఏ విషయంలోనూ సలహాలిచ్చే వాడు కాదు.

మొత్తం మీద ఎవరో ఒకరు ఓ మంచి ఔషధం ఈయటం వలన సేనాధిపతి చండశానుని పంటినొప్పి పూర్తిగా ఉపశమించింది. అటుపైన రాజ దర్భారుకి పోవటం మొదలు పెట్టాడు సేనాధిపతి. ఇలా ఓ వారం రోజులు గడుస్తున్నాయనగా, పక్క ఊరికి ఓ ముఖ్యమైన పని మీద పోయి వచ్చిన చండశాసనుని మిత్రుడయిన అనంతుడు, చండశాసనుని పలకరించి పోదామని ఆతని నివాసానికి వచ్చి మాటల సంధర్భంలో “ఈ పంటినొప్పికి మన మార్తండ మిత్రుడి దగ్గర మంచి ఔషధం ఉంది, బహుశా ఆ ఔషదమే మీరు కూడా సేవించి ఉంటారనుకుంటాను, ఏది ఏమైనా మీకు ఉపశమనం కలిగింది, అదే పదివేలు మిత్రమా, మళ్లీ కలుద్దాం,సరే నేనింక వెళ్లి వస్తాను” అని చెప్పి నిష్క్రమించాడు అనంతుడు.

అటుపైన చండశాసనుడు ఆలోచనలో పడ్డాడు. అదేంటి? మొన్న నా వద్దకు వచ్చినప్పుడు మార్తండ మిత్రుడు, పంటి నొప్పికి తన దగ్గర ఔషదం ఉందనికాని, ఇస్తానని కాని చెప్పలేదు. అంటే నేనంటే గౌరవం లేకనా లేక నేను ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందిద్దామనా, ఏమిటి అతని అంతరంగం, నా ఈ పంటి నొప్పివల్ల ఎన్ని రాచకార్యాలు వాయిదా పడ్డాయో అతనికీ తెలుసు, సహాయం చేయగలిగి ఉండీ సహాయం చేయలేదెందుకో అనుకుంటూ తీవ్రంగా మదనపడుతూ అతను చేసిన పని శిక్షార్హమైనది కాకపోయినా, ఆ తిరస్కారాని జీర్ణించుకోలేక ఉక్రోషంతో ఈ విషయం రాజు గారికి కాకపోయినా, కనీసం మంత్రికైనా తెలియజేయాలని దర్భారుకు బయలుదేరాడు, మంత్రిని ప్రత్యేకంగా కలసి మార్తండ మిత్రుడిపై తన పిర్యాదును తెలియజేసాడు.

అంతా విన్న మంత్రి కొంచెం సేపు ఆలోచించి “సరే! చండశాసనా ఈ రోజు దర్భారు పూర్తి అయిన తరువాత అతనిని పిలిచి మీ సమక్షంలో అడుగుతాను. అది సరే, మరి మీకు ఔషధం ఎవరిచ్చారు” అడిగాడు మంత్రి.

“నాకు ఔషదమిచ్చింది గరుడుడు మంత్రి గారు” చెప్పాడు సేనాధిపతి.

“సరే అతనని కూడా ఆ సమయానికి ఓసారి రమ్మనండి” అని చెప్పి, సమయం మీరుతుండటంతో దర్భారు వైపు నడిచాడు మంత్రి. అతనితో సేనాధిపతి కూడా.

దర్భారు ముగిసిన తరువాత మంత్రి గారి కార్యాలయంలో చండశాసనుడు, మంత్రితో వేచి ఉండగా, మార్తండ మిత్రుడు, గరుడుడు వచ్చారు. చండశాసనుని, గరుడుడిని పక్క గదిలో వేచి ఉండమని చెప్పి పంపాడు మంత్రి.

మంత్రి, చండశాసనుడి పిర్యాదును మార్తండ మిత్రుడి ముందుంచి, “మార్తండా నీవు అలా చేయటం తప్పు కదా అని అడిగాడు” మంత్రి.

ఆ పిర్యాదు విన్న వెంటనే మార్తండ మిత్రుడి మొహంపై ఒకింత ఆశ్చర్యం కనిపించింది. ఎందుకంటే ఇది అతను ఊహించని పరిణామం. వెంటనే సర్దుకొని..

“లేదు మంత్రివర్యా! అందులో నాది ఎటువంటి తప్పులేదు. నాకు సేనాధిపతి ఏమైనా సహాయం అడిగుంటే చేయకపోతే తప్పు కానీ, ఈ విషయంలో నాదెలా తప్పవుతుంది?” ధైర్యంగా పశ్నించాడు మార్తండ మిత్రుడు.

తన మాటలను కొనసాగిస్తూ “అయినా నేను వృత్తి రీత్యా వైద్యుడను కాను, మా తాత,తండ్రి మా ఊళ్లో కొన్ని రకాలైన వ్వాధులకు మూలికా వైద్యం చేసేవారు. వారి నుండి నాకు ఆ వైద్యం వారసత్వంగా వచ్చింది. వీలైనంత వరకు అవసరం ఉన్నవాళ్లకి, నాపైన నమ్మకం ఉన్నవాళ్లకి ఇస్తూనే ఉన్నాను” నమ్మకం అనే పదాన్ని నొక్కి పలికాడు మార్తండ మిత్రుడు.

“ఔనా! మరి ఆ ఔషదం సేనాధిపతి అంత వేదన చెందుతున్నప్పుడు, తెలిసీ మరి ఎందుకు ఇవ్వలేదు మార్తండా?, అతనిపై నీకు కోపం, ద్వేషం లాంటివి ఏమైన ఉన్నాయా” అడిగాడు మంత్రి.

“లేదు మంత్రివర్యా! ఇక్కడ అసుయా, ద్వేషాల ప్రస్తావన అవసరం లేదు. ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకానికి సంభందించిన అంశం మాత్రమే, నిష్ఠూరమనిపించినా ఓ నిజం చెబుతాను, సేనాధిపతి వారికి నాపై నమ్మకం తక్కువ అనే కన్నా ఉండదనే చెప్పాలి. అయితే ,ఆ విషయం నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. నాపై వారికి ఎందుకు కినుకో నాకైతే తెలియదు. ఇంతకు ముందు పలు సంధర్భాలలో వారికి సలహాలిచ్చి భంగపడ్డాను. అందుకే వారు చెప్పింది చేయటం తప్ప నా అనుభవాన్ని, ఆలోచనలను పంచుకోవటం మానేసాను. నాకైతే ఔషదం ఇవ్వాలని ఉన్నా నేనిస్తే వారు దానిని స్వీకరిస్తారనే నమ్మకం లేక దాన్ని ఇంకో విధంగా, ఇంకొకరు ఆ ఔషదం ఇచ్చారని చెప్పమని చెప్పి గురుడునితో పంపించాను. వారు ఆ ఔషదం వలనే పూర్తి ఉపశమనం పొందారు” అంటూ అసలు విషయం చెప్పేసాడు మార్తండ మిత్రుడు.

“ఆ విషయం వారికి తెలిసే అవకాశం లేదు మహామంత్రి, ఎందుకంటే గురుడుడికి నేనీ విషయాన్ని సేనాధిపతి వద్ద గోప్యంగా ఉంచమని చెప్పాను. అందుకే నాపై మీకు పిర్యాదు చేసుంటారు. వారు పిర్యాదు చేసారు కాబట్టి నిజాన్ని మీ ముందు ఉంచాల్సి వచ్చింది తప్ప వారిని తక్కువ చేయాలని కాదు. ఈ సందర్భంగా వారికి నేను మీ ద్వారా మనవి చేసేదొక్కటే, వారి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఈర్ష్యా, అసూయాలు అంతకన్నా లేవు. వారు అది గ్రహిస్తే చాలు. మీరంతా ఇంకా నాది తప్పు ఉందనుకుంటే మీకు తోచిన శిక్ష విధించండి మంత్రివర్యా” అంటూ చేతులు కట్టుకు నిలుచున్నాడు మార్తండ మిత్రుడు.

“చండశాసనా, గరుడా, మార్తాండ మిత్రుడి వివరణ విన్నారు కదా, ఇప్పడు బయటకు రండి “ తమ సంభాషణలన్నీ వినపడే పక్క గదిలోనే ఉన్న వారిద్దరని పిలిచాడు మంత్రి.

గరుడునితో మార్తండ మిత్రుడు చెప్పినది నిజమేనని నిర్థారించుకుని, సేనాధిపతి వైపు తిరిగి “చండశాసనా అంతా విన్నారుగా, మార్తండునికి ఏ శిక్ష వేస్తారో మీకే వదిలేస్తున్నాను” అన్నాడు మంత్రి ఓ చిరునవ్వు నవ్వుతూ.

చండశాసనుడు పశ్చాతాప వదనంతో “మంత్రివర్యా! నేనే మార్తండుని అపార్థం చేసుకున్నాను, అతనితో నా గత ప్రవర్తన వలనే అతను నాతో అలా ప్రవర్తించాడు తప్ప, అతనికి నాపై ఎటువంటి ద్వేష భావం లేదని, రహస్యంగా, తన పేరు ప్రకటించుకోకుండా నాకోసమని ఔషదం పంపించడంతో నిరూపించుకున్నాడు. పైగా నా కోసమని దంతధావనానికై ప్రతి నిత్యమూ వినియోగించేందుకై ప్రత్యేక మూలికలతో తయారు చేసిన పళ్ళపొడిని కూడా పంపించాడు” అని మార్తాండ మిత్రుడు చెప్పని ఓ కొత్త విషయం చెప్పాడు.

“దానికి అతనికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ, “నా ఆ తీవ్రమైన పంటి పోటును పూర్తిగా నివారణ చేసినందుకు గాను, మీ అనుమతితో ఈ నా ఖడ్గాన్ని అతనికి బహుమతిగా ఇస్తున్నాను, మరియు నా ఆంతరంగికులలో ఒకనిగా నియమించదలిచాను మంత్రివర్యా” అని చెప్పి తన ఖడ్గాన్ని మార్తాండ మిత్రుడినికిచ్చి అతనిని ఆలింగనం చేసుకున్నాడు సేనాధిపతి.

మంత్రి గారు చిరు మందహాసంతో “శుభం! అపోహల మేఘాలన్నీ ఆవిరై సుహృద్భావనల వర్షంలో మీరిద్దరూ తడిసి శుధ్ధులైనారు. దీన్ని ఇలా కొనసాగించండి” అంటూ..

మార్తండు మిత్రుడి వైపు తిరగి “మార్తండా! నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను, పైగా నా మీద నీకు ఈర్ష్య,అసూయా ద్వేషాలు లేవనుకుంటాను” కొంటెగా అన్న మంత్రి వైపు, సంధిగ్ధంగా ఓ క్షణం చూసి ఏదో అర్థమైందన్నట్టు.. నవ్వూతూ.

“మంత్రివర్యా! మీ అంతరంగం నాకు అర్థమైంది, నేను ప్రత్యేకంగా తయారు చేసిన పళ్ళపొడిని ఈ రోజే మీ గృహానికి పంపిస్తాను” అన్న మార్తండ మిత్రుని మాటలకు ఆ గదిలో నవ్వులు విరిసాయి.

“మార్తాండా! నీవు చతురడవే సుమా!” అని మంత్రి అతని భుజం తట్టి బయటకి నడిచాడు.

హమ్మయ్య అనుకుని అతని అనుసరిస్తూ మిగతా వాళ్లున్నూ!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here