[box type=’note’ fontsize=’16’] “అవసరాలు తీరుస్తుంటుంది, అనుక్షణం కనిపెట్టుకుని వెంటుంటూంది నీడలా” అని వర్తమానం గురించి చెబుతున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. [/box]
[dropcap]ఎం[/dropcap]త గడుసుదో గతం
వీడి వెళ్ళినా మనసులో తిష్టవేసి కూచుంది
అప్పుడెప్పుడో పెళ్ళయి వెళ్ళిపోయిన ప్రేయసిలా
కన్ను మూస్తే చాలు
కలల్లనో కలవరింతల్లోనో
పలవరింతల్లోనో పలుకరిస్తుంటుంది
కమ్మని కౌగిలింతలతోనో
మూతిబిగింపు అలకలతోనో
జడవిసురు కోపాలదాడులతోనో
మంచివో చెడ్డవో మనసు విస్తరి నిండేంతగా
జ్ఞాపకాల వడ్డన చేస్తూ ఉంటుంది
కనురెప్పల తలుపులను
తన తలపులతో గడియవేసి బిగిస్తుంది
ఎంత చిలిపిదో భవిష్యత్తు
అల్లరి కళ్ళతో మనస్సుకు గాలం విసురుతుంటుంది
ఎదురింటి గడపలో కూర్చున్న సొగసరి చిన్నారిలా
తెరచి ఉన్న కళ్ళను
ఊహాలోకపు ఊరేగింపులోకి తీసుకెళుతుంది
కోరికల గుర్రాలపై స్వారీకి సయ్యంటుంది
రంగురంగుల కలలను కళ్ళముందు ఆరేస్తుంది
అందమైన ఆశలను అలా అలా అందించి
ఆనందాన్ని ఆకాంక్షల మిఠాయి పొట్లంలా చుట్టిస్తుంది
మంచే జరుగుతుంది అనే మాటను
మళ్ళీ మళ్ళీ మంత్రాక్షరాల్లా వళ్ళిస్తూ
నా మనసును వశీకరణం చేసుకుంటుంది
పాపం! అమాయకురాలు వర్తమానం
కళ్ళు మూసుకున్నా, తెరచి చూస్తూ ఉన్నా
నా చుట్టే తిరుగుతుంటుంది ఇంటి ఇల్లాలులా
అవసరాలు తీరుస్తుంటుంది
అనుక్షణం కనిపెట్టుకుని వెంటుంటూంది నీడలా
మంచివో చెడ్డవో మామూలువో
నావంతువన్నీ అమర్చిపెడుతుంది నాచుట్టూ
తనని మెచ్చుకున్నా, తిట్టి తన్ని విసిరేసినా
పట్టించుకున్నా లేకపోయినా,
పాడుపనులెన్ని పిచ్చిపట్టినట్టుగా చేసినా
కాపాడుకొస్తుంది కంటికి రెప్పలా
నా మనసు లోయల లోతులలోనూ
నా ఊహల ఊర్ధ్వ లోకాలలోనూ
తను లేనేలేదని తేటతెల్లంగా తెలిసిపోయినా
జరుగుతున్నది ఏమిటో తెలుస్తున్నా
కాలం వెళ్ళదీస్తుంటుంది … గుంభనంగా గుట్టుగా
పాపం! అమాయకురాలు వర్తమానం