[dropcap]క[/dropcap]మల భారతమ్మ ముందు కన్నీళ్ళతో నుంచుంది.
అది మాట్లాడిన తీరు చాలా బాధపెట్టింది. “నాకేమీ పర్వాలేదు కానీ నా కొడుకూ, కోడలూ ఏమంటారో కమలా”
“మీరు చెప్పండమ్మా, నన్ను ఎప్పుడూ ఆదరించింది మీరే”
“సరే, నేను ఎలాగూ కింద ఒక్కతినే పడుకు౦టాను. నా దగ్గరే వుందువు కానీ వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పిస్తా. సరేనా?” అన్న భారతమ్మ కాళ్ళను పట్టుకుని దండం పెట్టుకుంది కమల.
“అమ్మా నేను రాత్రికి వస్తా” అని సంతోషంగా వెళ్ళింది.
***
కరోనా వచ్చినప్పటి నుండీ కొడుకు ప్రకాష్, కోడలు హరిణి ఇంటినుండీ పనిచేస్తునారు. మనమడు రాహుల్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అని బిజీగా ఉంటాడు. ఇంట్లో కిందవైపు వున్న చిన్న రూమ్‌లో భారతమ్మ వుంటుంది. ఇంకా కిచన్, డైనింగ్, ఒక హాలు వుంటాయి. పైన వున్న మూడు బెడ్ రూమ్స్, మధ్యలో ఒక చిన్నలివింగ్ రూమ్ వుంటుంది. అందరూ ఒక్కొక్క రూమ్‌లో వారి వర్క్ చేస్తూ వుంటారు. అందరూ బ్రేక్‌ఫాస్ట్ టైంలో, భోజనానికీ కిందికి వస్తున్నారు. టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన భారతి వాళ్ళ వర్క్ విషయంలో పూర్తిగా సహకరిస్తుంది.
ఈ రోజు కమల వచ్చి వెళ్ళాక ఆలోచనలో పడింది భారతమ్మ.
కమల ఆ వూరి ఆడబడుచే. చిన్నతనంలోనే భర్త చనిపోయి పుట్టింటికి వచ్చింది. వూరిలో వున్నఒకే బంధువు అమ్మ చనిపోయినా అందరి ఇళ్ళల్లో పని చేస్తూ అందరికీ తలలో నాలుకలా మసలుతూ వుంటుంది, పగలంతా ఇంట్లో అందరూ పనికి వెళ్లిపోతే చాలాసార్లు భారతమ్మకు తోడుగా వుండేది. అంతే ఆప్యాయతతో కమలని చూసుకుంటుంది భారతమ్మ. ఎక్కడ పని లేకపోయినా అన్నం దొరికేది భారతమ్మ దగ్గరే.
ఈ మధ్య కరోనా అని ఇంటికి ఎవరినీ రానివ్వటం లేదు ప్రకాష్ వాళ్ళు కూడా…
ఈ రోజు కష్టం ఏమిటంటే కమల ఉంటున్న వీధిలో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చిందని వీధి మూసేసి ఆ ఊరినంతా రెడ్ జోన్‌గా ప్రకటించారు.
కమల ఇల్లు అదే వీధి చివరగా వున్నా ఆ వీధి వాళ్ళని ఎవరూ దగ్గరికి రానివ్వటం లేదు. మూడు రోజులుగా వర్షం కురవటంతో కమల ఇల్లు కారుతా వుంది. పడుకునే జాగాలేదు ఆ రోజు ఎలాగో బయట పడి భారతమ్మ దగ్గరికి వచ్చి “అమ్మ నన్ను రెండు రోజులు ఇక్కడ పడుకోనివ్వండి… పక్కవీధిలో మా వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు రానివ్వలేదు. నాకు కరోనా లేదు కదా అన్నా వినిపించుకోలేదు. అందుకే మీదగ్గరికి వచ్చినా… దయచూపండి” అంది దీనంగా.
కమల శుభ్రత తనకు తెలుసు కాబట్టి కొడుకుకు నచ్చచెప్పుకోవచ్చు అనుకుంది భారతమ్మ. కింద వెనుక వైపున వున్నవరండాలో పడుకోమని చెప్పచ్చు అనుకుంది. అందుకే భరోసా ఇచ్చింది కమలకు. కమల సంతోషంగా వెళ్ళింది.
భోజనానికి వచ్చినప్పుడు ప్రకాష్ వాళ్ళతో విషయం చెప్పింది.
“అదెలా పడుకోనిస్తాము అమ్మా. నీకా డెబ్బై ఏళ్ళు దాటాయి ఇంకా జాగ్రత్తగా వుండాలి అనేకదా ఎవరినీ రానీయటం లేదు. పడుకోవడానికి వీలుకాదు అని చెప్పేసెయ్” అనగానే భారతమ్మకు షాక్ అనిపించింది.
కమల ముఖం కళ్ళ ముందు కదలాడింది.
అయ్యో… ఇదే తనకు వస్తే…. అన్నది పెద్ద సమస్యలా అనిపించలేదు. కమలను ఆదుకుంటే బాగుండు అనుకుంది. కానీ నిస్సహాయత…
ఏదీ ఎవరి చేతులోనూ లేదు…. ఎవరూ రిస్క్ తీసుకోవటం లేదు.. ఈ ఆలోచనలతో కమలకు ఫోను చేసి రావొద్దని చెప్పాలని అనిపించలేదు భారతమ్మకు.
రాత్రి ఏడుగంటలకు వచ్చిన కమలను గేటు దగ్గరే ఆపేశాడు ప్రకాష్ “కమలా, అమ్మకు తెలీక నిన్ను రమ్మంది. అమ్మ ఆరోగ్యమే మాకంతా ఆందోళన. అందుకే బయటనుండీ ఎవరినీ రానీయటం లేదు” అంటూంటే కిటికీలో నుండీ చూస్తున్న భారతమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఏడుస్తూ వెడుతున్న కమలను ఓదార్చాలని అనిపించినా ఏమీ చెయ్యలేకపోయింది.
ఆ రోజంతా కలత నిదురే! దిక్కులేనిది కమల. అన్ని పనులకూ వాడుకునే వాళ్ళు కూడా ఈ రోజు తమకు ఎక్కడ జబ్బు సోకుతుందో అన్న భయంతో ఎవ్వరూ రానివ్వకపోతే ఏమి చేస్తుంది? అనుకుని బాధపడింది. మరురోజు నిద్ర లేచాక కూడా అది ఎక్కడ వుందో… అనుకుంటూ కోడలితో అంది.
“ఎక్కడో ఒకచోట వుంటుందిలే అత్తయ్యా, ఇంట్లో వయసు పైబడి బి.పి, షుగర్ వున్న మీకూ, చిన్నవాడైన రాహుల్ కోసం అయినా మన జాగ్రత్తలో మనం వుండాలి కదా… లేకపోతే కమలను రానివ్వడానికి అభ్యంతరాలేముంటాయి?” అంది. నిజమే కదా మనకోసం మనం ఆలోచించుకోవాలి.
మరి కమల కోసం ఆలోచించేవాళ్ళు కూడా లేరాయె.
మధ్యాహ్నం ఉండబట్టలేక కమల ఫోనుకు కాల్ చేసింది భారతమ్మ.
“రాత్రి ఎక్కడ పడుకున్నావే” అని అడిగింది.
“ఎవ్వరూ రానివ్వలేదమ్మా… మన గుడి దగ్గర అరుగుమీద పడుకున్నా… దోమలు, చలితో చచ్చిపోయాననుకో…” ఏడుస్తూ చెప్పింది కమల.
“ఒకసారి వెనక గేటు దగ్గరికి రావే అన్నం పప్పు వేసి ఇస్త్తాను” అంది జాలిగా
“ఒద్దు అమ్మగారూ పూజారిగారు ప్రసాదం ఇస్తానన్నారు…” అని పెట్టేసింది.
పోనీ అనుకున్నా, ఒకసారి చూస్తే బాగుండుననిపించినా ఏమీ చెయ్యలేక పోయింది. ఆ తరువాత వారం లోపలనే జ్వరంతో వున్న కమలను చూసి వూరి వాళ్ళు కోవిడ్ టెస్టు చేయిస్తే పాజిటివ్ వచ్చిందనీ, తిరుపతికి తీసుకెళ్లారని వినింది భారతమ్మ.
ఒక వారం తరువాత కమల మరణం సంగతి తెలిసింది.
మరణం తరువాత అడ్రెస్ ప్రకారం ఆ వూరి వారికి ఫోను చేసిన అధికారులతో కమల శవం కొరకు ఇక్కడ ఎవరూ లేరనీ అనాథగా అక్కడే దహనం ఏర్పాట్లు చెయ్యాలనీ చెప్పారుట.
అలా కమల చివరకు ఆ ఊరినే చేరకుండానే పోయింది.
కరోనాకు ధనిక,పేద, కులం మతం ఏదీ లేదని అందరికీ సమానంగా చూస్తుందనీ అన్నారు.
కానీ కరోనా సోకిందని తెలియగానే సెలిబ్రిటీల కొరకు స్పెషల్ క్వారంటైన్, స్పెషల్‌గా చూసే ఆస్పత్రులే కాకుండా వారికొరకు దేశం నలుమూలలా ప్రార్థన చేసేవారు వున్నారు అంటే అతిశయోక్తి కాదు.
మరి ఒక అనాథ పిల్లకి కరోనా సోకితే ఇళ్ళల్లోకి రానివ్వడానికి భయపడుతున్నాము.
పేపర్లో పలానా చోట ఒక మరణం నమోదు అంటూ వచ్చిన వార్తలు చదివాక కమల అలా బయట పడుకోవడం వల్లనే కరోనా సోకి ఉంటుందనీ ఒక సాటి మనిషిగా సాయం చెయ్యలేకపోయాననీ చాలా గిల్టీగా ఫీల్ అయ్యింది భారతమ్మ.