Site icon Sanchika

పరహితమే సర్వశ్రేష్ఠ విధానం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పరహితమే సర్వశ్రేష్ఠ విధానం’ అనే రచనని అందిస్తున్నాము.]

పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః।

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్‌॥

[dropcap]ప[/dropcap]రోపకారం కోసమే వృక్షాలు ఫలిస్తాయని, పరోపకారం కోసమే నదులు ప్రవహస్తాయని, పరోపకారం కోసమే ఆవులు పాలనిస్తాయని, పరోపకారం కోసమే మానవ శరీరం ఉందని, ఇలా ప్రకృతిలోని చెట్లు, నదులు మొదలైనవాటి వలన జీవకోటికి ఎంతో ఉపకారం జరుగుతోందని శ్లోకం యొక్క భావం.

ప్రజలకు ఉపకారం చేయాలి అనే నియమాన్ని ధృఢ నిశ్చయంతో నిత్యవ్రతంగా ఆచరించటమే ‘లోకోపకార వ్రతం’ అని పేరు. కృత, త్రేత, ద్వాపరయుగాల నుండీ భరత వర్షంలో ఎందరో మహర్షులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు, పండితులు, వేదవిదులు ప్రజలకోసం ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభకార్యాలు లోకోపకారం కోసం నిర్వహించారు.  ఇందులో వారికి పరహితం, సర్వమానవ కళ్యాణం తప్ప లాభాపేక్ష లవలేశమైనా వుండేది కాదు. ప్రతీ శ్వాసలోనూ పరుల హితం కాంక్షించడమే సదాశయంగా వుండేది. పరహితము ఎంత గొప్పది అంటే.. ‘ఖలుని సజ్జనుఁగాగ..’ చెడ్డవాణ్ణి కూడా మంచివాణ్ణి చేస్తుంది. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి ‘పరోపకారమిదం శరీరం’ అన్న శిబి చక్రవర్తి, జీమూతవాహనుడు, బోధిసత్వులు వంటి వారు మహనీయులు. అటువంటి వారి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వ్యాస మహర్షి విరచించిన అష్టాదశ పురాణాల సారాంశం పుణ్యము కొరకై ఇతరులకు ఉపకారము చేయవలెను, పాపము కొరకై పరులకి హాని చేయవలెను అంతే పరులకి ఉపకారము చేయుట వలన పుణ్యం సంపాదించవచ్చును. హాని చేసినచో పాపము కలుగును అని అర్థం. బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయి.

సృష్టిలోని ఎన్నో రకాలైన జీవ జాతులలో మనుష్య జన్మ ఎంతో విశిష్టమైనది. మనిషి ఒక్కడే ఆలోచన శక్తి, విశేషమైన మేధా శక్తి కలిగి ఉన్నాడు. అప్రతిహతమైన శక్తి సామర్థ్యాలు మనిషి సొంతం అన్నది నిర్వివాదాంశం. మరి అటువంటప్పుడు అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగి ఉండి ఇతరులకి మేలు చేయకపోవడం, ఉపయోగపడకుండా ఉండడం అనేది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం అన్న విషయం మనందరం అవగతం చేసుకోవాలి.

లోకోపకార వ్రతం నిత్యవ్రతంగా భావించి నిర్వహించిన వారికి మహర్షుల ఆశీస్సులు నిత్యం ప్రసరించి మానసిక ప్రశాంతత, మోక్షప్రాప్తి లభిస్తుందనుటలో సందేహం లేదు. “నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి” అని గీతలో భగవానుడు ప్రభోదించినట్లు లోకం కోసం మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శాశ్వతుడు అవుతాడు. ఎవడు తనకోసం ఆలోచిస్తాడో – తాను ఉన్నంత వరకే ఉంటాడు. ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం చిరంజీవిగా ఉండిపోతాడు.

Exit mobile version