పరమపద సోపానం

0
2

[dropcap]వే[/dropcap]సవి సెలవులకు పిల్లలు అమ్మమ్మ, నానమ్మ, తాతల ఊర్లకు వెళ్ళటం సర్వసాధారణం. కానీ ఈసారి అదితి, అఖిల్‌ల ప్రయాణంలో మార్పు జరిగింది. వారి దగ్గరికి ఊరి నుండి నానమ్మ తాత వస్తున్నారు. పిల్లలకి ఈ ఏర్పాటు నచ్చింది. సాధారణంగా ఊరెళ్లినా కొద్దిరోజుల తరువాత కొత్త ఊర్లో వాళ్ళకి బోర్ కొడుతోంది. ప్లే ఏరియాస్, పెద్ద పార్క్స్, మాల్ లేవు. ఫ్రెండ్స్ కూడా కొద్దిమందే. వాళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళితే? ఎవరితో ఆడుకోవాలి? ఆదో పెద్ద సమస్య.

అందుకని ఈసారి నానమ్మ తాత వాళ్ల దగ్గరికే వచ్చారు. పిల్లలు వారి ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలుచుకు వచ్చి నానమ్మా తాతలకి పరిచయం చేసారు. నానమ్మ చేసి తెచ్చిన సున్నుండలు, కారప్పూస తినటానికి పెట్టింది. ఎండగా ఉండటంతో తప్పనిసరై పిల్లలు ఇండోర్ బోర్డు గేమ్స్ తీశారు. ఇంట్లో పిల్లల కేరింతలతో సందడిగా ఉంది.

పని ముగించుకున్న అమ్మ, నానమ్మ కబుర్లు చెప్పుకుంటూ పిల్లల్ని గమనిస్తున్నారు. అఖిల్ బొమ్మల పెట్టెలోంచి పరమపద సోపానం క్లాత్ షీట్‌ని బయటకు తీసాడు.

“అక్కా! స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడదామా?”

“ఓహ్! అలాగే. తీసుకురా” అంది అదితి.

అఖిల్ ఇచ్చిన షీట్‌ని చూసిన వాళ్ళ మిత్రులు “ఇదేంటి ఇలా ఉంది? ఇది స్నేక్స్ అండ్ లాడార్స్ కాదు” అన్నారు.

 

తెరిచిన షీట్ చూస్తున్న అదితి కూడా “అవును ఇది వేరేలా ఉంది”  అంది.

“అక్కా! గళ్ళలో ఉన్న బొమ్మలు వేరేగా ఉన్నాయి. ఎందుకని?” అన్నాడు అఖిల్

అందరు ‘అవును అవును’ అన్నారు. ఇదంతా చూస్తున్న అమ్మ వచ్చి “ఏది? నన్ను చూడనివ్వండి” అని షీట్‌ని తీసుకుని చూసారు.

“ఓహ్! ఇదా? అఖిల్ ఇది నీకు ఎక్కడ దొరికింది? నేను దీనికోసం వెతుకుతున్నాను” అన్నారు.

“అమ్మ! నీ పాత పెట్టెలో దొరికింది. నా బొమ్మల పెట్టెలో పడేసాను” అన్నాడు అఖిల్.

“అవునా. మంచిది. థాంక్స్” అంటూ షీట్‌ని చేతిలోకి తీసుకుని “పిల్లలూ, మీకు తెలుసా? ఈ గేమ్ షీట్ చాలా పాతది” అంది.

“అవునా? ఎంత పాతది?” అన్నాడు సోహం.

“చాలా చాలా… అంటే మా అమ్మకి దీన్ని వాళ్ళమ్మ ఇచ్చింది.”

“వావ్! అమ్మమ్మ షీట్” అన్నాడు అఖిల్.

“కాదు, అది అమ్మమ్మ అమ్మది” అని సరిచేసింది అదితి.

“పిల్లలూ ఆగండి. వినండి. మా అమ్మమ్మకి ఇది వాళ్ళమ్మ ఇచ్చారు” అంది అమ్మ.

ఈ అమ్మ అమ్మమ్మల వరుస అర్ధం కానీ పిల్లలు ‘ఓహ్! వద్దు! సులువుగా అర్థమయ్యేలా చెప్పు!” అన్నారు.

“సరే సరే, చెప్తాను. చాలా పాతది అన్నమాట” అన్నారు అమ్మ.

“బావుంది. కానీ ఇది మా స్నేక్ అండ్ లాడర్స్ కంటే ఎందుకు తేడాగా ఉంది?” అని అడిగారు పిల్లలు.

“ఎందుకంటే అందుకే” అంది అమ్మ.

పిల్లలకు వాళ్లలో ఉన్న తెలుసుకోవాలనే ఉత్సాహానికి ఆ సమాధానం నచ్చలేదు.

“అందుకే అంటే? వివరంగా చెప్పు. ఎందుకు?” అన్నాడు అఖిల్ రెట్టిస్తూ.

ఇంతలో నానమ్మ “అఖిల్! నా దగ్గరకు రండి, నేను చెబుతాను ఎందుకో” అన్నారు.

“హే!” అని పరుగెత్తాడు అఖిల్. “అదితి, మీ స్నేక్స్ అండ్ లాడర్స్ కూడా తీసుకుని రా” అన్నారు నానమ్మ.

పిల్లలు రెండింటిని తీసుకెళ్లి నానమ్మ ముందు పరిచారు.

“పిల్లలు మీకొక కథ చెబుతాను.”

“బోర్డు గేమ్ గురించి అడిగితే కథ అంటావేంటి నానమ్మ?” అంది అదితి.

“దాని గురించి కధే. స్టోరీ అబౌట్ యువర్ గేమ్.”

“అవునా? మా బోర్డు గేమ్‌కి కథ ఉందా? భలే” అంది అదితి.

అందరు వినటానికి సిధ్దమయ్యారు అమ్మతో సహా.

“మీరు చూస్తున్న ఈ ఓల్డ్ గేమ్ షీట్‌ని వైకుంఠ పాళీ లేదా పరమపద సోపాన పటం లేదా దశ పద పటం అంటారు.”

“నానమ్మా! ఇది స్నేక్స్ అండ్ లాడర్స్ కాదా?” అన్నది అదితి.

“ఆ పేరు కూడానూ” అన్నారు నానమ్మ

“ఈ ఆట ఎంత పాతదో తెలుసా?”, “అనూ! నీకు తెలుసా?”

“తెలీదు” అన్నది అమ్మ

“అయితే విను. క్రీ.పూ. 2వ శతాబ్ది కాలం నుండి ఈ ఆటని మనదేశంలో ఆడుతున్నారట.”

“నానమ్మా! అంటే ఎంత పాతది?” అన్నాడు అఖిల్

“వేలాది సంవత్సరాలు.”

“అయ్య బాబోయ్!” అన్నారు పిల్లలు.

“మీరు అడిగిన స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ నిజానికి ఇండియన్ గేమ్. ఇప్పుడు నేను చెబుతున్నది అదే.”

“నానమ్మా! అప్పటి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా?” అన్నాడు అఖిల్.

“సిల్లీ ఫెలో!” అన్నారు ఫ్రెండ్స్.

నానమ్మ నవ్వి “ఒక వాదం ప్రకారం మీరు అడిగిన ఆటని 13వ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే గొప్ప ఋషి తయారు చేశారట. వందల వేల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ ఆట లో కొన్ని చిన్న మార్పులు వచ్చాయిట. కానీ అసలయిన అర్థం, నియమాలు మారలేదు. ఇండియాలో పుట్టి అందరి ఇళ్లల్లో ఆడుకునే ఈ ఆట బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినప్పుడు ఇంగ్లాండ్‌లో ఈ ఆటని స్నేక్స్ అండ్ లాడర్స్‌గా పరిచయం చేసారు. తరువాత 1943లో అమెరికా దేశంలో మిల్టన్ బ్రాడ్లీ ఈ ఆటని, దాని అర్థాన్ని chutes and ladders గా పరిచయం చేసాడు.”

“నానమ్మా! ఈ ఆటకి అర్థం ఉంటుందా? వింతగా ఉంది!” అంది అదితి.

“అదెలా? నానమ్మా!” అన్నారు మిగతా పిల్లలు.

“ఎలా?” అన్నట్లు అమ్మ అను కూడా తల ఊపారు.

“ఎలా అంటే అలా!” అని గలగలా నవ్వుతూ అఖిల్‌ని అనుకరించారు నానమ్మ.

“ఈ ఆటలో – మంచి పనులు, చెడ్డపనులు చేస్తే మనకి వచ్చే బహుమతులు, శిక్షల గురించి – నిచ్చెనలు/సోపానాలు, ఇంకా పాములని చూపిస్తూ చెబుతారు.”

“వివరంగా చెప్పు నానమ్మ! ప్లీజ్! ప్లీజ్!”

“మంచి పనులు చేస్తే మనకి మంచి జరిగి నిచ్చెన ఎక్కి పైకి వెళ్లినట్లు జీవితంలో మంచి స్నేహితులు, దీవెనలు, కానుకలు దేవుడు ఇస్తాడని నమ్మకం. నిజం కూడా. సో నిచ్చెన మంచికి సూచన అన్నమాట.”

“మరి పాములో?”

“పాములు చెడుకి చిహ్నం. మనలో చెడు ఆలోచనలు ఉంటే చెడ్డ పనులు చేస్తాము. ఉదాహరణకి మీ మిత్రుడి దగ్గర నీకు నచ్చిన పెన్ లేదా పుస్తకం ఉంది. నువ్వు అడగకుండా, చెప్పకుండా వాడి బాగ్ లోంచి తెస్తే ఏమవుతుంది?”

“నానమ్మా! ఆలా చేస్తే దొంగ అవుతారు” అన్నాడు అఖిల్

“దొరికిపోతే పెద్ద గొడవ అయ్యి టీచర్, అమ్మ కొడతారు” అన్నాడు అఖిల్ ఫ్రెండ్ నిఖిల్.

“నిజం. అంటే పాములు మన చెడు ఆలోచనలు. గేమ్ చార్ట్‌లో ఎన్ని గడులు ఉన్నాయి?”

“బోలెడు” అన్నాడు అఖిల్ చేతులు చాచి.

“అవును. 100 గళ్ళు ఉన్నాయి. నేను చెప్పినట్టు నిచ్చెనలు మంచి విలువలని, పాములు చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలను సూచిస్తాయి. ఆటలో ఉన్న 100 గళ్ళలో కొన్ని ప్రత్యేకమైన గళ్ళు, కొన్ని ముఖ్యమైన విలువలని చెబుతాయి. 12వ గడి ‘నమ్మకం’ గురించి చెబుతుంది. జీవితంలో ఎవరైనా నమ్మకంగా లేకపోతె, విశ్వాసాన్ని తుంచేస్తే వాళ్ళు మిత్రులని పోగొట్టుకోవచ్చు.”

“అవును నానమ్మా! నన్ను తరుణ్ మోసం చేస్తే కటీఫ్ చెప్పా!” అన్నాడు అఖిల్

“అబ్బా! అఖిల్ నానమ్మని డిస్టర్బ్ చెయ్యకు” అంది విసుగ్గా అదితి.

“చెప్పండి నానమ్మా!” అన్నారు పిల్లలు.

“51 విశ్వాసం, 57 ఔదార్యం అంటే దాన గుణం ఉండటం”

“అంటే ఏంటి?”

“ఎవరికైనా అడిగితే అవసరంలో సాయం చెయ్యటం. బదులుగా ఏమి ఆశించకపోవటం. 76 జ్ఞానం/ చదువు, 78 వేదాంతం/ఆధ్యాత్మికం. ఇవి మంచి విలువలని చెబుతాయి.”

“నానమ్మ మరి పాములు ఏమి చెబుతాయి?”

“చెడు గురించి చెబుతాయి. 41వ గడి అవిధేయత/ మాట వినకపోవడం. అఖిల్‌ని అమ్మ హోమ్ వర్క్ చెయ్యమంటే ఆటలకి పరుగెత్తటం లాంటివి. 49 అసభ్యత/చెడ్డగా ప్రవర్తించటం. 52 దొంగతనం. 58 అబద్ధాలు చెప్పటం, 62 మైకం/ తాగటం, 69  అప్పులు/ఋణాలు తీసుకోవటం.”

“నానమ్మా! మా ఫ్లాట్‌కి తీసుకున్న బ్యాంకు లోన్ కూడా పాములా చెడ్డది అన్నమాట” అన్నాడు అఖిల్.

అమ్మ, నానమ్మ ఆశ్చర్యపోయారు వాడి తర్కానికి.

“73 హత్య. 84  కోపం. 92 అత్యాశ. 95 గర్వం. 99 వ్యామోహం 100 నిర్వాణం. ఫైనల్ గుడ్ డెస్టినేషన్.”

“ఆమ్మో! ఏదో కాలక్షేపం ఆట అనుకుంటే ఇంత అర్థం ఉందా?” అంటూ పిల్లలు గుండెల మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్య పొయ్యారు.

“ఇంకో కథ ప్రకారం పాములు మరణానికి, నిచ్చెనలు జననానికి సూచికలు. గళ్ళలో రకరకాల అర్థవంతమైన బొమ్మలు ఉంటాయి. ఆట చివరి దశకు చేరాలంటే కొన్నిసార్లు ఓపిగ్గా ఎదురు చూడాలి. కావాల్సిన అంకె పాచికలో వచ్చేదాకా.”

“నానమ్మా! దీన్ని ఎంత మంది ఆడవచ్చు?”

“ఇద్దరు లేదా ఎక్కువ. ఇద్దరు నుంచి ఆరుగురి వరకు ఆడొచ్చు. అది మీ ఇష్టం. పరమ పద సోపానం ఆటలో 132 గళ్ళు ఉంటాయి. కానీ ఎక్కువగా 100 గళ్ళ ఆటే ఆడుతున్నారు.”

“అత్తయ్యా! ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా?” అంది అమ్మ అను.

“విశేషాలంటే? ఆ! జైన్ మత సిద్ధాంతం ప్రకారం దీన్ని gyan chauper game అంటారట. అంటే game of wisdom. దాని ప్రకారం కర్మ అంటే మన చర్యలు /పనులు; వాటి ఫలితాలు చివరిగా మంచి పనులకు మంచి బహుమతి – మోక్షం అనే విలువ చెబుతుంది. దానికంటే ముందు హిందూమతం ‘గమ్యం మరియు కోరిక’గా చెప్పింది. అంటే మన కోరికలు ఆశలు తీర్చుకోవటానికి మనం చేసే పనులు లేదా ప్రయత్నాలు మనల్ని ఎక్కడికి చేరుస్తాయనే గమ్యం అనేదాన్ని స్నేక్స్ అండ్ లాడర్స్‌గా చెప్పింది.”

అమ్మ, నానమ్మల మాటలు అర్ధం కానీ పిల్లలు “అమ్మా! ఆడుకోడానికి నిఖిల్ వాళ్ళింటికి వెళ్తున్నాం” అని తలుపు తీసి పరుగెత్తారు.

తలుపు వేసివచ్చిన అను, “అత్తయ్య చెప్పండి. నాకు ఇవేవి తెలియవు. ఏదో ఒక ఆట మాత్రమే అనుకున్నాను” అంది.

“అనూ! పాములు – కోపం, హత్య, కామం, దొంగతనం లాంటి చెడు గుణాలకి గుర్తులు. నిచ్చెనలు – నీతికి/విలువలకు గుర్తు. ఇంగ్లాండ్‌లో రూపాంతరం చెందిన స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్‍ విక్టోరియా కాలం నాటి విలువలకు గుర్తు. నిచ్చెనలు నెరవేర్పు, అనుగ్రహం, విజయం లాంటివి. పాములు – జబ్బులు, పేదరికం, అవమానం, అవిధేయత లాంటివి. తెలుగులో దీన్ని పరమపద సోపానంగా, హిందీలో సాంప్ ఔర్ సీడీ మోక్ష పట్, తమిళ్ లో పరమపదంగా పిలుస్తారు. భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు జాగరణంలో మెలకువగా ఉండటానికి ఈ ఆట ఆడేవాళ్ళు. ‘Winning ways’ అనే పుస్తకంలో రచయిత ఈ ఆటని ఆడేందుకు అనేక రకాల వైవిధ్యాలని చెప్పారట. ‘Back to square’ అనే ఫ్రేస్ స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్‍ నుండి వచ్చిందిట. ఇదీ క్లుప్తంగా ఈ ఆట కథ. పద. దీపాలు పెట్టే వేళ అయ్యింది” అంటూ లైట్ వేసి పూజ రూమ్ లోకి వెళ్ళారు నానమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here