Site icon Sanchika

పరశురాముడు

[dropcap]ప[/dropcap]రశురాముడి గురించిన కథలు విచిత్రంగా ఉంటాయి. దశావతారములలో పరశురామావతారముగా ఒక అవతారము. నూటొక్క మారులు భూవలయమంత కలియతిరిగి దుష్ట క్షత్రియ సంహారముగా ఒక అపూర్వగాథ. దశావతారములలో విష్ణువుగా అవతరించిన అర్చామూర్తి. కాని పురాణ గాథలలో రామాయణ కాలము వరకు విష్ణ్వంశ. తరువాత కృష్ణావతార కాలములో ముఖ్యంగా భారత భాగవత ఘట్టములలో ప్రత్యేక సమయాలలో నిర్వహించిన పాత్ర గల ప్రత్యేకతగా ఎన్నో అపూర్వ గాథలకు ఆసక్తికరమైన పరశురాముడు బ్రాహ్మణ తేజోమయమైన మునిగా అవతారము.

వరాహావతార లక్ష్యము హిరణ్యాక్ష సంహారము చేసి మునిగిపోకుండా సముద్రము నుండి భూమిని కోరలపై నిలిపి కాపాడిన 3వ అవతారముగా దశావతారములలో పురాణ గాథ. బ్రహ్మాండ పురాణము ప్రకారము భూదేవత గోరూపము ధరించి భూభారము అణచమని కోరిన 6వ అవతారము పరశురామావతారము. గోరూపధారిణి భూదేవి దుష్ట క్షత్రియ సంహారముగా భూభారనివారణ సృష్టిరక్ష ప్రార్ధనకు విష్ణువు ఒక మునిగా జమదగ్ని మహాముని కుమారుడుగా విష్ణ్వంశలో పరశురాముడు జన్మించాడని బ్రహ్మాండ పురాణము చెబుతుంది. తల్లి రేణుక. ఈ పరశురాముడు 21 మారులు వెదికి వెదికి శివానుగ్రహ పరశువుతో క్షాత్రసంహార సార్థక నామధేయముగ రామాయణ కాలములో వైష్ణవ చాపముును శ్రీరామునకు యిచ్చి ఎక్కుపెట్టించి విష్ణ్వంశ విసర్జించాడు. అవతారపురుషుడుగా కాక తరువాత బహు సందర్భాలలో భార్గవరాముడుగా మాత్రమే పురాణపురుషుడుగా జమదగ్ని కుమారుడుగా మహాభారతకాలములో ప్రసిద్ధుడు.

కార్తవీర్యుడనే రాజుకు అగ్నిదేవుడి కారణంగా ఒక ముని యిచ్చిన శాపము వల్ల పరశురాముడి అవతారము తప్పనిసరయిందని చెబుతారు. అగ్ని విపరీతమైన అకలితో కార్తవీర్యుని ఆశ్రయించాడు. రాజు అనుమతితో సర్వభక్షకుడిగా మేరమీరి ఆకలి తీర్చుకున్పాడు. ఒక ముని ఆశ్రమము దగ్ధమయింది. “నా ఆశ్రమము లాగే నీతో సహా భూమియందలి క్షత్రియ జాతులు ఒక బ్రాహ్మణ వీరవిజృంభణ కోపాగ్నిలో నశించిపోతారు” అని కార్తవీర్యునికి ఆ ముని శాపమిచ్చాడు. అవతారముగా భృగువంశ బ్రాహ్మణుడై క్షాత్రతేజము వరమై పురాణ పురుషుల సరసన నిలిచాడన్నది అపూర్వగాథ.

రాముడు నామధేయముగా భృగువంశీయుడు. భృగువుకు భార్గవుడని కూడ పేరు. భార్గవరాముడుగా శివుని ఆరాధించి పరశువు అనే దివ్యాయుధమును వరముగా పొంది ధరించి పరశురాముడిగా ప్రసిద్ది వహించాడు. జమదగ్ని మహర్షి కుమారుడుగా తండ్రిని మెప్పించాడు. జమదగ్ని భార్య రేణుక పతివ్రత. అయినా సరే భర్త కోపానికి గురయింది. శిరశ్ఛేద శిక్ష అనుభవించవలసి వచ్చింది. తండ్రి ఆజ్ఞకు బద్ధమైన పరశురాముడే అమలుపరచడం జరిగింది. కాని పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించిన తరువాత తండ్రికి కోపముడిపి తల్లిని బ్రతికించుకున్నాడు. తండ్రి జమదగ్నిని రాజాహంకారముతో కార్తవీర్యుడు చంపాడు. శోకించి తల్లి రేణుక 21 మార్లు గుండె బాదుకుంది. అందుకు 21 మార్లు భూవలయమంత తిరిగి దుష్టశక్తి క్షత్రియ సంహారము ప్రతిజ్ఞ అవతారముగా పరశువుతో విజృంభించిన రాముడుగా ఖ్యాతి. కురుక్షేత్ర భూమిలో ఉన్న శమంతపంచక మడుగులలో పరశువును శుద్ధి చేసాడు. భారత భాగవత పురాణ గాథలలో మునిగా కనిపించాడు.

కార్తవీర్యుని చేత హతుడైన జమదగ్ని పువర్జీవుతుడైనట్లు కూడ పురాణాలు పేర్కొన్నాయి. సప్తర్షులలో జమదగ్ని కూడ పేర్కొనబడ్డాడు. కోనసీమ గోదావరి పరీవాహక సప్తపాయలలో గుర్తించడము కష్టమే. కాని జమదగ్ని ముని పాయ ఉందని చెప్పడం జరుగుతోంది. కోనసీమ లోని పాశర్లపూడి గ్రామము పరశురాముడు నిర్మించాడని ప్రతీతి. జమదగ్ని కుమారుడుగా పరశురాముడుగా చెబుతారు. అగ్నిప్రమాదాలకు పరశురామ ప్రీతి అని జనశ్రుతి.

1995 జనవరి 8వ తారీఖున సహజవాయువు డ్రిల్లింగు పనుల సమయములో 65 రోజులు కలత పెట్టిన బ్లోఔట్ జమదగ్ని పాయ పరశురామప్రీతి ఉనికి చర్చ జనశ్రుతికి ఈ పరశురాముడు జమదగ్ని కుమారుడని చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజనిర్దారణకు సహకారము కాదు. రాబోవు సూర్య సావర్ణిక మనువు కాలంలో ఉండే సప్తర్షులలో పరశురాముడు ఉంటాడు.

ఎఱ్ఱన హరివంశములో శ్రీకృష్ణ బలరాములు జరాసంధుడు ముట్టడించినపుడు అనవసర రక్తపాతము జరగకుండ మధుర నుండి పారిపోయిన భ్రమ జరాసంధునికి కలిగించారు. అలా పారిపోతున్న వారిని విజయగర్వముతో జరాసంధుడు వేణ్యా నది వరకు వెంబడించి వెనుదిరిగాడు. ఆ వేణ్యా నదీపరివాహక ప్రాంతములో ఒక మర్రి చెట్టు చూసారు. ఊడలు, శాఖోపశాఖలు కలిగి అడవంతా ఆక్రమించి భూమంతా తానే అన్నట్లు నీడలు పరిచి ఆకాశమంత ఎత్తు ఎదిగింది. బలరామ కృష్ణులకు పరశురాముడు అక్కడ పరిచయమైనట్లు ఉంది. ముక్కంటి ఆరాధనలో శిష్యసమేతుడై ఉత్తమ బ్రాహ్మణులకు భోజనము అందిస్తూ బ్రహ్మ, క్షాత్ర తేజోమయమైన రూపముతో ప్రకాశిస్తున్నాడు. ఆ ఆశ్రమ వాతావరణములో పరశురాముని చేత జమదగ్ని కుమారుడుగా భార్గవరాముడు నుంచి బలరామ కృష్ణులు దీవనలందారు.

కృష్ణావతారములో విష్ణ్వంశ విసర్జన ప్రశంస రాలేదు. పరశురాముడు శివభకక్తుడు. కృష్ణ కవచము కోసము తపస్సు చేసిన సమయంలో విష్ణువు కృష్ణుని రూపములో ప్రత్యక్షమై కృష్ణావతారము వరకు తన అంశ పరశురాముడులో ఉండాల్సిన వరము కథనం ప్రచారముంది. కాని భార్గవరాముడుగానే బలరామ కృష్ణులను తనను కలిసినపుడు దీవించాడు. బ్రహ్మాండ పురాణ గాథ ప్రకారము పితామహుడు భృగుని ఆదేశానుసారము శివుని గురించి హిమాచలమున తపస్సు చేసాడు. కిరాత వేషమున పరీక్షించి శివుడు తీర్థయాత్రలు చేసివచ్చి మరల తపస్సు చేయమన్నాడు. ఆ కారణము చేత తీర్థయాత్రలు చేసి వచ్చి మరల తపస్సు ప్రారంభించాడు. శివుని యొక్క తేజస్సు, పరశువు అనే అస్త్రము లభించాయి.శివుని ఆజ్ఞతో ఇంద్రుడికి సాయము చేసాడు. స్వర్గము నుండి రాక్షసులు తరిమి వేయబడ్డారు. శివుడు మెచ్చుకొని భార్గవాస్త్రము అనుగ్రహించాడు.

శాపము వల్ల ఒక గంధర్వుడు పులిగా జీవిస్తూ శాంతుడనే మునికుమారుడైన అకృతవరణుని చంపబోవడం పరశురాముడు చూసాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగముచేసి రక్షించాడు. గంధర్వునికి శాపవిమోచనమయింది. అకృతవరణుడు శిష్యుడయాడు. ఈ సమయము లోనే తండ్రి జమదగ్ని కార్తవీర్యుని దౌష్ట్యమునకు బలయ్యాడు. అందుకు శివుని యొక్క కరుణతో కార్తవీర్యాదిక్షత్రియ సంహారముగా పరశువు ఉంది. అగస్త్యాశ్రమమున కృష్ణ కవచము గురించి ప్రస్తావించదగ్గది. అక్కడ కొలను గట్టున ఆయుధములుంచి నీటిలో దిగి జపము చేసిన సమయములో రెండు మృగములు పరశురాముడున్నాడన్న ధైర్యముతో నిర్భీతితో దాహం తీర్చుకున్నాయి. పరశురాముడు జపము చేస్తే చాలదని కృష్ణ కవచము అగస్త్య ముని నుండి గ్రహించాలని మాట్లాడుకొనుట విని కృష్ణ కవచము అగస్త్య ముని నుండి గ్రహించిన తరువాత విష్ణువు కృష్ణుడుగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణ్వంశ అనుగ్రహించాడు. కృష్ణావతారముగా శ్రీరామచంద్రునిలో లీనమైన పరశురాముని విష్ణ్వంశ ప్రశంస కృష్ణుడుగా తిరిగి తీసుకున్న వృత్తాంతము లేదు.

కర్ణుడు పరశురాముడికి గల క్షత్రియ ద్వేషము వల్ల గురుశుశ్రూష చేసినా శాపమునకు గురయ్యాడు. అంబ, అంబిక, అంబాలిక లను భీష్ముడు రాక్షస వివాహ చేయడంలో అంబ ప్రేమించిన సాల్వభూపతి తిరస్కరించడముతో, విచిత్ర వీర్యునితో వివాహము జరగలేదు. పరశురాముడు అంబకు న్యాయము చేయాలని భార్గవరాముడుగా పోరాడాడు. క్షత్రియ ద్వేషమున్నా ఒక వీరుడుగ భీష్ముని పరాక్రమము అజేయమైనదని అంగీకరించినందున బ్రాహ్మణ తేజోమయమైన రూపభావన విష్ణ్వంశ ధ్రువీకరణ లేదు. క్షత్రియ సంహారముగా దూకుడు తగ్గింది. పరశురాముడుగా మాత్రం స్త్రీల మధ్య దాగినా, పశువుల మంద మధ్య దాగినా క్షత్రియ పసిబాలకులను వెదికి చంపిన పరశువును శమంతపంచక మడుగులలో కడిగి పవిత్రత కలిగిన శాంతమూర్తిగా పితృతర్పణము గావించాడు.

క్షత్రియ పరశురామావతారముగా హైహయ క్షత్రియ సంహారముగా శాంతించి నర్మదనదిలో స్నానము చేసాడు. తపస్సుకు వెళ్లాడు. ముందుగ శివుని దర్శించుకుని వెళ్లాలని కైలాసము వచ్చిన పరశురాముడు వినాయకుని ఎదిరించాడు. ఓడిన ఉక్రోషముతో వినాయకుడి దంతమును భగ్నము చేసాడు. పార్వతి కోపగించింది. కృష్ణుడు కోపముడిపి పరశురాముని పట్ల పుత్రభావము కలిగించాడు. తరువాత మహేంద్ర గిరిపై తపస్సు చేసాడు. మునుల కోరికపై మునిగిపోయిన గోకర్ణ క్షేత్రమును సముద్రము నుండి ఉద్ధరించాడు. కర్ణుడు ఈయనను మహేంద్ర గిరివద్ద శిష్యుడై సేవించాడు.

క్షత్రియ సంహారముగా వశమైన, భూవలయమంతటిని కశ్యప మహర్షికి దానమిచ్చి దక్షిణాబ్ది దాటి నేటికీ చిరంజీవిగా ఆ భూప్రదేశములో ఉన్నాడని విశ్వసిస్తున్నారు. అక్షయ తృతీయను పరశురాముని జన్మదినముగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా PEDHE లో పరశురామ భగవానునిగా స్వయంభువదేవాలయముంది. 18వశతాబ్దిలో సరుకులతో వస్తున్న ఓడను పరశురాముని భక్తిప్రపత్తులతో ప్రార్థన చేసి రక్షించుకున్న ఒక ముస్లిము మహిళ నిర్మాణమని ROSHEN DALAL హిందూయిజమ్ పరశురామ వృత్తాంతములో పేర్కొన్నారు. విష్ణ్వంశ విసర్జన భార్గవరాముడుగా పరశురాముడుగా విష్ణ్వంశ అవతార పురుషుడుగా ఖ్యాతి కాదనరానిది.

Exit mobile version