పార్ధల

0
2

ఈ కలకలానికి అక్కడికి పరిగెత్తుకుని వచ్చిన పార్ధల, ఆమె తల్లి, సోదరులుతో సహా శంకరుడు కూడా జరిగిందేమిటో అర్ధం కాని అయోమయ స్థితిలో పడిపోయారు… అనుకోకుండా వచ్చి వెళ్లిన ఆ వ్యక్తి ఎవరో, ఆయన చెప్పిందేమిటో శంకరుడు అర్థం చేసుకునే లోగా గూఢచారులు “పదండి… పదండి… మహారాజుకి వర్తమానం అందించాలి” అంటూ పరిగెత్తడంతో విషయం అర్ధమైంది.. వచ్చిన వ్యక్తి విజయనగరరాజు దేవరాయలని, ఈ గూడచారులు ఫిరోజ్ షా నియమించినవారని తెలియగానే స్వర్ణకారుడైన శంకరుడి మదిలో ఆందోళన చెలరేగింది…

“ఏమైంది నాన్నగారూ”అని అడుగుతున్న కూతుర్ని చూసి బావురుమన్నాడు… “అమ్మా పార్ధలా… అయిపోయింది… నీ సౌందర్యం మళ్లీ మరో రక్తపాతానికి కారణం అవుతుంది… విజయనగరరాజుకి నీ సౌందర్యం గురించి ఎవరో చెప్పారు. వారు నీకు రాణీవాసానికి పల్లకీ పంపిస్తానని చెప్పి వెళ్లిపోయారు… ఇప్పుడీ గూఢచారులు వారు మనింటికి రావడం చూశారు… ఇంక మన గతి ఏమిటో నాకేం అర్థం కావడంలేదు… ఏం జరగబోతోందో తెలియడం లేదు…” అన్నాడు.

అప్పుడే అక్కడికి ప్రవేశించిన తిరుమలాచార్యులు “భయపడకు శంకరా… నీ కూతురుకి దశ తిరిగింది… త్వరలో రాణీవాసానికేగుతుంది… రాజుగారు పల్లకీని, పరివారాన్ని, రత్నాభరణాలను, పీతాంబరాలను నీకోసం బంగారు నాణాలను పంపిస్తున్నారు… అమ్మా పార్ధలా… సిద్ధం కమ్మా రాణీవాసానికి” అన్నాడు.

పార్ధల అయోమయంగా చూస్తూ ఆచార్యులవారికి నమస్కరించి… “నాకేం అర్థం కావడం లేదు స్వామీ” అంది

“అర్థం కావడానికి ఏమీ లేదమ్మా… నీకు త్వరలో రాణీవాసయోగం కలగబోతోంది… మహారాజు దేవరాయలవారు నీ సౌందర్యం చూసి మనసు పారేసుకున్నారు… నీ పట్ల అంతులేని అనురాగం జనించింది ఆయన మదిలో… నిన్ను తన రాణీగా చేసుకోడానికి ఉబలాటపడుతున్నారు” అన్నాడు.

“మన్నించండి ఆచార్యా…” పార్ధల మృదువుగా అయినా ఖచ్చితంగా అంది… “నాకు ఈ రాణీవాసాలు, ఈ భోగభాగ్యాలు వీటి మీద మమత లేదు… నేను సామాన్యురాలిని… సామాన్యురాలిగానే ఉండదలిచాను… మహారాజుగారికి ఈ విషయం విన్నవించండి.”

ఆమె మాటలకి తిరుమలాచార్యుడికి ఆగ్రహం కలిగింది. “పార్దలా… ఆలోచించు. కోరి వచ్చిన అదృష్టాన్ని అవివేకంతో నిరాకరించడం సరికాదు. రాణీవాసం అందరికీ లభించదు. నువ్వేదో పుణ్యం చేశావు కనకనే నీకు ఈ అదృష్టం లభించింది…” అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా.

పార్ధల వినయంగా అంది… “క్షమించండి ఆచార్యా… అర్హత లేని వాటి కోసం వెంపర్లాడడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు… ఒక సామాన్యుడి భార్యగా జీవించడంలో ఉన్న ఆనందం, రాజుగారి అంతపురంలో వందమంది రాణులమధ్య లభిస్తుందని నేను అనుకోను” అంటూనే గిరుక్కున తిరిగి లోపలికి వెళ్లిపోయింది…

రాణీవాసం కోసం అర్రులు చాచుతూ, తమ సౌందర్యం ఎప్పుడెప్పుడు రాజుగారి కంటబడుతుందా, ఎప్పుడెప్పుడు రాణీవాసానికి వెడదామా అని నిరీక్షించే కన్యలెందరినో ఎరిగిన ఆచార్యుడు పార్ధల నిర్ణయానికి అచ్చెరువందాడు..

వెంటనే ఆగ్రహంతో శంకరుడిని చూస్తూ… “శంకరా… నీ కూతురు అహంకారానికి నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది… రాజాజ్ఞ కాదని సుఖంగా బతుకుదామనేనా… వెంటనే ఆమె మనసు మార్చి, రాణీవాసానికి సిద్ధం చేయి… ఇది రాజాజ్ఞ…” అంటూనే అక్కడి నుంచి వేగంగా కదిలిపోయాడు.

శంకరుడు, అతని భార్య జరిగిందేమిటో, జరగబోయేదేమిటో తెలియక తెల్లబోయి, నిశ్చేష్టులై నిలబడిపోయారు.

మహారాజు దేవరాయలు మారువేషంలో స్వర్ణకారుడి ఇంటికి వెళ్లడం, అతని కుమార్తె పార్ధలని మోహించి ఆమెని రాణీవాసానికి తోడ్కొని పోడానికి పల్లకీ పంపించబోవడం మొదలైన విషయాలన్నీ గూఢచారులు గుల్బర్గాలో ఉన్న బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షాకి పూసగుచ్చినట్లు తెలియచేశారు.

అదంతా విన్న ఫిరోజ్ షా ఆగ్రహంతో మండిపడ్డాడు.

“ఎంత ధైర్యం… నా రాజ్యంలోకి అక్రమంగా వచ్చిందికాక, నా రాజ్యంలో ఉన్న కన్యమీద మోజుపడతాడా… పైగా పల్లకీ పంపిస్తాడా… ఎవరక్కడ?” గట్టిగా చప్పట్లు చరిచాడు.

సేవకుడు తల వంచి అభివాదం చేస్తూ వచ్చాడు…

“వెంటనే సైన్యాన్ని తరలివెళ్లి స్వర్ణకారుడైన శంకరుడి కుటుంబాన్ని తోడ్కొని రమ్మని చెప్పు…”

“చిత్తం మహారాజా…”

పెద్దపులిలా రంకెలేస్తున్న ఫిరోజ్ షాను చూసి గూఢచారులు భయంతో నెమ్మదిగా అక్కడినుండి నిష్క్రమించారు.

విజయనగర రాజు పల్లకీ పంపిస్తే ఏం చేయాలో, రాణీవాసానికి అంగీకరించని పార్ధలను ఎలా ఒప్పించాలో ఈ పరిస్థితి తమకి మంచినా, చెడునా ఏం చేస్తుందో అని మధనపడుతున్న శంకరుడు అదాటుగా వచ్చి మహారాజు ఫిరోజ్ షా తమ కుటుంబాన్ని గుల్బర్గా రమ్మన్నాడన్న వార్త తెచ్చిన సెన్యాన్ని చూసి భయంతో నిలువెల్లా వణికిపోయాడు.. పార్ధల తన వల్ల తన తండ్రికి కలిగిన విషమస్థితినుంచి ఎలా తప్పించుకోవాలో, తన తండ్రిని, తల్లిని, సోదరులను ఎలా రక్షించాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతోంది అప్పటికే…

ఇదేమీ పట్టించుకోని ఫిరోజ్ షా సైన్యం పార్ధలను బలవంతంగా గుర్రంపైకి ఎక్కించారు… కొందరు శంకరుడిని, ఆయన భార్యను, పార్ధల సోదరులను తోడ్కొని అతి వేగంగా గుల్బర్గా చేరారు…

మారువేషంలో సంచరిస్తోన్న విజయనగర సామ్రాజ్యపు గూఢచారులు ఈ సమాచారం వెంటనే దేవరాయలకి అందించారు…

దేవరాయలు సింహంలా గర్జించాడు… తాను మరులుగొన్న కన్యను అపహరించుకుపోతాడా బహమనీ సుల్తాను… “ఎంత కండకావరం .. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి” అంటూ హుకుం జారీ చేశాడు. అక్కడినుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్బర్గా మీదికి దండెత్తాడు దేవరాయలు. అయితే అప్పటికే అప్రమత్తులై ఉన్న బహమనీ సైన్యం దేవరాయల సైన్యాన్ని ఎదుర్కొన్నారు… ఫిరోజ్ షా చేతిలో దేవరాయలు పరాజయం పాలయ్యాడు… ఫిరోజ్ షా దేవరాయలని బంధించబోగా మెరుపువేగంతో అదృశ్యమైన దేవరాయలు తన సామ్రాజ్యాన్ని చేరి, కోటలో రహస్యంగా దాక్కున్నాడు…

దేవరాయలని అనుసరించి వచ్చిన ఫిరోజ్ షా విజయనగరాన్ని ముట్టడించాడు… కోట చుట్టూ సైన్యంతో ఆక్రమించిన ఫిరోజ్ షా సుమారు మూడు నెలలపాటు దేవరాయల కోసం అక్కడే తిష్టవేశాడు.. ఈ లోపల శత్రురాజైన ఫిరోజ్‌ షాను ఎదుర్కొని ఓడించడానికి తన మంత్రులతో మంతనాలాడుతున్న రాజుకి ఆస్థాన పండితుడైన దేవాచార్య శత్రువినాశిని యజ్ఞం నిర్వహించవలసిందిగా చెప్పాడు… దేవాచార్య సలహాను అనుసరించి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా మంత్రులను ఆదేశించాడు దేవరాయలు…

శత్రువినాశ యజ్ఞం ప్రారంభమైంది.. ఈ లోగా ఫిరోజ్ షా మరింత సెన్యాని రప్పించి తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు… కోటలోపలికి ఎటువంటి ఆహారపదార్థాలు, పానీయాలు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశాడు… మూడు నెలలు గడిచినా యజ్ఞం వల్ల ఎలాంటి ఫలితం లేకపోగా, విపరీతంగా ధనం కూడా వెచ్చించవలసి రావడం, ఈలోగా ఫిరోజ్ షా తన సెన్గ్యాన్ని పటిష్టం చేయడంతో దిక్కుతోచని దేవరాయలు తన పరాజయాన్ని అంగీకరించి మంత్రులను సంధికి పంపించాడు.

సంధికి వచ్చిన మంత్రులను చూసిన ఫిరోజ్ షా విజయగర్వంతో నవ్వాడు.. రాయచూర్, ముద్గల్ కోటలతోపాటు విజయనగరరాజులు ఆక్రమించిన భూభాగాన్ని మొత్తం తనకి అప్పగించాలని, ఏడాదికి 10 లక్షలు కప్పం కట్టాలని, దేవరాయల కుమార్తెనిచ్చి తనకు వివాహం చేయాలని అలా అయిన పక్షంలో తాను సంధికి సిద్ధమని కబురు చేశాడు ఫిరోజ్ షా.

అతని షరతులకు నివ్వెరపోయిన దేవరాయలు భూభాగాన్ని ఇవ్వడానికి, ఏడాదికి 10 లక్షలు కప్పం కట్టడానికి సిద్ధపడ్డా తన కుమార్తెన్లు మాత్రం ఫిరోజ్ షాకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించడు.

“ఇదెలా కుదురుతుంది మంత్రిగారూ… మతాంతర వివాహానికి నేనంగీకరించను” అన్నాడు దేవరాయలు.

“తప్పదు మహారాజా… లేనిచో ఫిరోజ్ షా ఈ కోటను ముట్టడించడం తధ్యం… ప్రస్తుత పరిస్థితుల్లో అతని షరతులకు అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు” అన్నాడు మంత్రి.

“కానీ, అపురూపంగా పెంచుకున్న నా కుమార్తెను ఆ దుర్మార్గుడికి ఎలా అప్పచెప్పను మంత్రిగారూ” దీనంగా అన్నాడు రాజు.

నిజమే.. ఎంతైనా అతను తురకుడు… రెండు మతాల మధ్యా ఇప్పటికే నిప్పులు చెలరేగుతున్నాయి… ఈ వివాహంతో ఇరువురి మద్యా సంబంధ, బాంధవ్యాలు ఏర్పడుతాయో.. ఫిరోజ్ షా, దేవరాయలి ఈ పరాజయాన్ని అలుసుగా తీసుకుని ఇంకా చెలరేగుతాడో ఎలా? కానీ, ఇప్పుడు అతని షరతులకు అంగీకరించకపోతే కూడా దాదాపు అదే పరిస్థితి… మంత్రికి కూడా పాలుపోలేదు. కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి అన్నాడు… “మహారాజా మీరంగీకరిస్తే నాదొక మనవి…”

“చెప్పండి అమాత్యా…” అడిగాడు ఆశగా.

“మీ నాలుగో రాణిగారి కుమార్తెనిచ్చి ఫిరోజ్ షాకి వివాహం జరిపిస్తే? ఎలాగో ఆమె మతం మనకి తెలియదుకదా…” అన్నాడు.

రాజుగారి కళ్లు మెరిశాయి… “శభాష్ మంత్రిగారూ.. వెంటనే ఫిరోజ్ షరతులకు అంగీకరించినట్టు వర్తమానం పంపండి” అన్నాడు.

మంత్రి తెచ్చిన సంధి సమాచారంతో ఫిరోజ్ షా తాత్కాలికంగా తన సైన్యాన్ని విరమించుకుని తన అంగీకారం తెలిపాడు..

రాజమహల్ నుంచి కోటగోడకి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది… ఆ దూరానికి కాలినడకన బయలుదేరిన మహారాజు మొదటి దేవరాయలు, ఫిరోజ్ షాని సాదరంగా ఆహ్వానించి అంతపురంలో విడిది ఏర్పాటు చేసి, తన నాలుగో భార్య కుమార్తె మంజులతాదేవినిచ్చి ఫిరోజ్ షాకి వివాహం చేశాడు… మూడు రోజులపాటు అంతపురంలో ఉన్న ఫిరోజ్ షా ని నాలుగోరోజు ఆయన కోరిన విధంగా తాను ఆక్రమించిన రాజ్యాలను రాయచూరుకోటతో సహా ఇచ్చివేసి, సగౌరవంగా కోటదాకా వచ్చి సాగనంపాడు…

విజయోత్సాహంతో , నూతన వధువుతో గుల్బర్గా చేరిన ఫిరోజ్ షా ముందుగా తన నిర్బంధంలో ఉన్న పార్ధల కుటుంబాన్ని పిలిపించాడు.. శంకరుడు తన భార్య, పిల్లలతో నిలువునా వణికి పోతూ సుల్తాను ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి కంపించే స్వరంతో “జరిగిన సంఘటనతో మాకెంత మాత్రం సంబంధం లేదు సుల్తాన్… ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మాకు తెలియదు… దయచేసి మమ్మల్ని ఈ నిర్బంధంనుంచి కాపాడండి… సామాన్యులమైన మేము తమరిలాంటి సుల్తానుకి విరోధియైన మహారాజుతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోము… నన్ను నమ్మండి సుల్తాన్…” అని వేడుకున్నాడు.

తలవంచుకుని నిలబడిన పార్ధలను చూసిన సుల్తాన్ అచ్చెరువందుతాడు. ఆమె సౌందర్యం నిరుపమానం, అత్యత్భుతం. మట్టిలో మాణిక్యంలా ఒక పేదవాడి ఇంట ఉండాల్సిన సౌందర్యం ఎంతమాత్రం కాదు అనిపించింది. ఆయనకి.. అంతేకాక లేత వయసులో ఉన్న ఆ సౌందర్యవతిపట్ల ఆమె పట్ల వ్యామోహం కాక, వాత్సల్యం ఏర్పడింది… ఆ వాత్సల్యంతోటే ఆమె తన కుమారుడైన హుస్సేన్‌కు సరిజోడీ అని భావన కలిగింది. వెంటనే పార్ధల తండ్రితో తన నిర్ణయం తెలియచేయడానికి నిశ్చయించుకున్నాడు.. తల వంచుకుని నిలబడిన శంకరుడిని, పార్ధలను చూస్తూ

“శంకరా .. నీ కుమార్తెను నా కుమారుడు హుస్సేన్ కిచ్చి వివాహం జరిపించదలిచాను…” అన్నాడు గంభీరంగా అప్పటికప్పుడు తన నిర్ణయం తెలియచేస్తూ.

శంకరుడు నిర్ఘాంతపోయాడు… పార్టీల కంపించిపోయింది… ఫిరోజ్ షా తుర్కుడు… రక్తపిపాసి అని పేరు. అలాంటివాడి కుమారుడు ఇంకెంత దుర్మార్గుడై ఉంటాడో… పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు అనిపించింది ఆమెకి.

శంకరుడు వణుకుతున్న స్వరంతో “సుల్తాన్ మేము హిందువులం” అన్నాడు. “నాకు తెలుసుకదా” అన్నాడు గంభీరంగా సుల్తాను.

పార్ధల కంపించిపోయింది. తలవంచుకుని మేలి ముసుగు మరింతగా కిందకి లాక్కుని సన్నని స్వరంతో అంది. “మన్నించండి సుల్తాన్. నేను సామాన్యురాలిని… ఇంత పెద్ద మహల్లో ఎలా మసులుకోవాలో కూడా నాకు తెలియదు… దయుంచి మామానాన మమ్మల్ని వదిలేయండి సుల్తాన్…”

సుల్తాన్ హూంకరిస్తూ అన్నాడు… “ఎంత ధైర్యం నీకు? మా అంతపురంలో రాణులెవరూ మా ముందుకు కూడా రారు… అటువంటిది నువ్వు మాకు ఎదురు సమాధానం చెప్తున్నావు… దీనికి శిక్ష మీ అందరికీ మరణదండన అని నీకు తెలుసా…?”

పార్ధల నిలువెల్లా వణికిపోయింది… అలా జరక్కూడదు.. తన వల్ల తన తండ్రికి ఇప్పటిదాకా జరిగిన కష్టం చాలు… ఇంత భయంకరమైన శిక్ష… వద్దు… తన నుదుట ఇదే రాసిపెట్టి ఉందేమో! అనుకుంటూ

“మన్నించండి సుల్తాన్… నా గురించి నా కుటుంబాన్ని శిక్షించకండి… మీ నిర్ణయానికి మా అంగీకారం తెలియచేస్తున్నాం అంది”.

ఫిరోజ్ షా గర్వంగా నవ్వుకున్నాడు. వెంటనే నిఖా ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కూతురు బందిఖానా వంటి అంతపురానికి వెళ్లడానికి ఎందుకొప్పుకుందో తెలిసిన శంకరుడు బాధపడినా… ఆ భోగాలు, వైభవాలు చూసి, ఏ మతమైతే ఏం నా కూతురు ఇంకనుంచి మహారాణి అని తృప్తిగా శుభకార్యంలో పాల్గొన్నాడు… అంతేకాక పార్ధల తల్లి కూడా ఈ సంబంధానికి సంతోషంగా ఒప్పుకుంది…

సున్నిత మనస్కుడు, నెమ్మదస్తుడు అయిన హుస్సేన్ వధువు ఎవరు, ఏమిటి అని కూడా అడగలేదు. తండ్రి నిర్ణయించిన నిఖాకి తలవంచాడు. నిఖా అనంతరం వారికిద్దరికీ ఫిరోజాబాద్‌లో ఒక ప్యాలెస్ నిర్మించి ఇచ్చాడు. అక్కడ పార్ధల, హుస్సేన్‌ల వైవాహిక జీవితం ఆనందంగా ప్రారంభం అయింది..

పార్ధల సౌందర్యానికి ముగ్ధుడైన హుస్సేన్ ఆమెని అమితంగా ప్రేమించడమేకాక ఆమె అభిప్రాయాలకు హుస్సేన్ ఎంతో విలువా, గౌరవం ఇవ్వసాగాడు…

తండ్రిలాగే రక్తపిపాసి అయిఉంటాడనుకున్న భర్త సున్నితమైన మనసు, భావుకత పార్ధలని ఆకర్షించింది. యువకుడు, అందగాడు, అంతకన్నా మంచి మనసున్నవాడైన హుస్సేన్ త్వరలోనే పార్ధల హృదయపీఠంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా, రసరమ్యంగా సాగిపోతోంది.

సుమారు 10 సంవత్సరాలు గడిచాయి. ఆ పది సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి… అన్నగారి వైభవం, ఆ తరవాత సోదరుడి కుమారుడు అయిన హుస్సేన్ సింహాసనాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉండడంతో ఫిరోజ్ షా సోదరుడు అయిన అహమ్మద్ షా మనసులో నెమ్మదిగా విషం పాకసాగింది… అన్నగారిని అంతమొందించి ఎలాగైనా తనా సింహాసనం ఆక్రమించుకోవాలి… అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అనుకున్నాడు. పన్నాగాలు పన్నుతూ, అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతనికి ఓ శుభసమయం రానే వచ్చింది.

అన్నగారు ఓ ఆహ్లాదకరమైన సాయంత్రం తన మందిరంలో మగువలతో, మదిరతో మత్తుగా జోగుతున్న సమయంలో తన ప్రణాళిక ప్రకారం ఫిరోజ్ షాని అంతమొందించాడు.

ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడానికి గాను సాక్ష్యాలుగా మిగిలిన ఫిరోజ్ షా ప్రియురాళ్లను డబ్బులు వెదజల్లి నోర్లు మూయించాడు.. బుడి, బుడి ఏడుపులు ఏడుస్తూ, తండ్రి తరవాత సింహాసనాన్ని అధిష్టించి పాలించవలసిన బాధ్యత హుస్సేన్‌దని అతనినే సుల్తానుగా ప్రకటించబోతున్నానని హుస్సేన్‌కి చెప్తాడు. కానీ, తనకి రాజ్యాధికారం మీద ఆసక్తి లేదని, పినతండ్రిగారినే సుల్తానుగా ప్రకటించి తాను రాజకీయాలకు అతీతంగా బతకడం ప్రారంభించాడు హుస్సేన్.

ఇప్పటినుంచీ రాజ్యానికి సంబంధించిన అన్ని విషయాలు తానే చూసుకుంటానని, అవసరమైతేనే హుస్సేన్‌ని సంప్రదిస్తానని చెప్పి, అతనిని ఫిరోజాబాద్ లోనే సుఖంగా ఉండమని అన్యాపదేశంగా ఆదేశించాడు అహమ్మద్ షా. సహజంగానే మంచివాడు, మనసులో ఎలాంటి ఆలోచనలు, ప్రణాళికలు లేని హుస్సేన్ పినతండ్రిగారి మాట శిరసావహించాడు.

అయితే, రాజ్యకాంక్ష ఎవర్నీ నమ్మనివ్వదు… తన నీడను కూడా అనుమానిస్తుంది… నిజానికి ఫిరోజ్ షా తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సినవాడు, అతని వారసుడు హుస్సేన్… కానీ, హుస్సేన్‌కి రాజ్యకాంక్ష లేకపోవడంతో అహమ్మద్ షా రాజు కాగలిగాడు.. అయినా, ఏనాటికైనా అతని వారసుడు ఈ సింహాసనం కోసం తనతో తలపడతాడేమోనన్న అనుమానం అహమ్మద్ షాని పట్టి పీడించసాగింది… అందుకు ఒకటే తరుణోపాయం అనుకున్నాడు.. హుస్సేన్‌ని హతమార్చడం .. కానీ, అమాయకురాలైన పార్దల పట్ల అంతో ఇంతో అభిమానం సానుభూతి ఉన్న అహమ్మద్ షా… ఒకానొక రాత్రి తన అనుచరుల్లో ఇద్దరిని పంపించి, హుస్సేన్ కళ్లు పెరికించి వేయాల్సిందిగా ఆదేశిస్తాడు.. ఒక అర్ధరాత్రి వేళ, ఆదమరిచి నిద్రపోతున్న హుస్సేన్ పడకగదిలోకి నిశ్శబ్దంగా ప్రవేశించిన ఆ అనుచరులు హుస్సేన్‌ని శాశ్వతంగా అంధుడిని చేస్తారు ..

ఆ నిశీధివేళ అమాయకుడి ఆర్తనాదం ఆ కోటలో ప్రతిధ్వనించింది .. ఆదమరచి నిద్రపోతున్న పార్ధల ఉలికిపడి లేచింది… రక్తం కారుతున్న వదనంతో, అందమైన కళ్ల స్థానంలో గుంటలతో కనిపించిన భర్తను చూసి కెవ్వున కేకవేసి సొమ్మసిల్లి పడిపోయింది.

ఆ ఇరువురి ఆర్తనాదాలతో కోట అణువణువూ మార్మోగింది… అంతపురంలో అహమ్మద్ షా తనువు, మనసు ఆనందంతో విలయతాండవం చేసింది.

ఆ సంఘటన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకున్న పార్ధల మరెప్పుడూ, ఏ విషయంలో కూడా అహమ్మద్ షా పైన ఆధారపడలేదు. ఒంటరిగానే జీవితంతో పోరాడుతూ అంధుడైన భర్తతో ఆ భీమానది ఒడ్డున పార్ధల జీవితాంతం అతడి సేవలో గడిపి ఆ నది గర్భంలో కలిసి, చరిత్రపుటల్లో ధైర్యం, స్థైర్యం, ఆత్మవిశ్వాసం కల స్త్రీగా శాశ్వత స్థానం సంపాదించుకుంది.

ఇప్పటికీ భీమానది ఒడ్డున ఉన్న ఫిరోజాబాద్ లోని కోటగోడల శిధిలాల మధ్య నుంచి వారిరువురి ఆర్తనాదం వినిపిస్తూనే ఉంటుంది… కేవలం హుస్సేన్, పార్దలలే కాక అనేక మందిని అతి కిరాతకంగా చంపి భీమానదిలో వారి శవాలను కలిపేస్తూ అతి కిరాతకంగా రాజ్యం పాలిస్తున్న అహమ్మద్ షా క్రూరత్వానికి నిదర్శనగా కృష్ణానది ఉపనదిగా గల భీమానదిలో అనేక మంది అమాయకుల రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here