Site icon Sanchika

కృతజ్ఞతాపూర్వకంగా పరిచయ పత్రాలు

[dropcap]ఈ [/dropcap]పుస్తకం నా చేతికి రానంత వరకు ఇవి రచయిత ఇతరుల కోసం రాసిన పరిచయ పత్రాలు అనుకున్నాను. అంటే ఒక రకంగా రికమండేషన్ లెటర్స్ లేదా ముందుమాటలు వగైరా.. కానీ పుస్తకం అందగానే నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. పుస్తక ముఖ చిత్రమే చాలా అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఒక కొమ్మకు కొన్ని పత్రాలు. ఒక్కో పత్రం మీద ఒక్కో ప్రముఖుని ఛాయాచిత్రం.

చూడగానే అనిపించింది డాక్టర్ వోలేటి పార్వతీశం తనకు పరిచయం ఉన్న ప్రముఖుల గురించి రాసిన పత్రాలు ఇవి. ఒక్కో ప్రముఖుని గురించి వారి గొప్పతనము వారితో తనకున్న అనుబంధం కవితాత్మకంగా వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది. వ్యక్తీకరణకు వచనం కంటే కవిత్వం మేలు అంటారు. క్లుప్తంగా అయినా కవితారూపంలో ఎంతో అర్ధాన్ని స్ఫురింప చేయవచ్చు. అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచన అన్నట్లుగా కొద్ది వాక్యాల్లో ఆయా ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కొండంతగా చూపారు పార్వతీశం. తన బంధువర్గం తనతో ప్రయాణించిన ప్రముఖులే కాకుండా ప్రారంభంలో దూరదర్శన్‌లో తనతో కలిసి పని చేసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి వారి పనితనాన్ని గురించి సోదాహరణంగా వ్యక్తీకరించడం చాలా బాగుంది.

ఇంతమందికి పరిచయ పత్రాలు రాసిన ఈ పుస్తకంలో రచయిత ఎవరి పరిచయంతో ప్రారంభిస్తారు అన్న ఉత్సుకత ఏర్పడింది. కన్న తల్లిదండ్రులనా లేక బంధుమిత్రులనా? తాను అభిమానించి తనను అభిమానించిన ప్రముఖ వ్యక్తుల గురించి రాస్తారా లేదా తనతో పనిచేసిన వ్యక్తులతో ప్రారంభిస్తారా అన్న మీమాంసతో ఈ పుస్తకం చదవడం ప్రారంభించాను. వీళ్ళెవరితోనూ కాకుండా సాక్షాత్తు గాంధీ మహాత్మునితో పరిచయ పత్రాలు ప్రారంభిస్తారు డాక్టర్ పార్వతీశం. ‘మహాత్ముని స్మృతిలో’

మాధవుడికి మానవుడికి మధ్య

అంతరాలు చెరిపేసిన

మహాత్ముడతడు

మా దేవుడు అతడు

అందుకే చేతులెత్తి నమస్కరించాలనుంది

అంటూ గాంధీ మహాత్ముని మీద తన గౌరవాన్ని భక్తిని చాటుతున్నారు. అంతేకాదు

మళ్లీ ఒక్కసారి

అతడు ఎదురైతే బావుణ్ణు

అంటూ మనసులోని కోరికను వెలిబుచ్చారు. ఈ విధంగా మహాత్మునితో పరిచయ పత్రం ప్రారంభించడం రచయిత ఉత్తమాభిరుచికి తార్కాణం. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన మరణ వార్త విని కవి హృదయం ఆవేదన చెందింది. ఆ ఆవేదన నుంచి అక్షరాలు జల జల జాలువారాయి. ‘అక్కినేని తరువాత?’ అని ప్రశ్నించుకున్న రచయిత సమాధానం కూడా ఆయనే ఇచ్చుకున్నారు.

ఓ వెర్రి మాలోకం

మరో అక్కినేని కోసం

ఆశగా దిక్కులు చూస్తోంది

ఆ కోరిక తీరేది గనకనా?

అంటూ రచయిత సమాధానం కూడా తనే ఇచ్చుకున్నారు.

ఈ పుస్తకంలో కవితాత్మకంగా సాగిన పరిచయ పత్రాలే కాకుండా ఆయా ప్రముఖులకు పెట్టిన శీర్షికలు కూడా అతికినట్లు అద్భుతంగా కుదిరాయి. ‘కాషాయం కట్టని రుషి’ అంటూ పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి అతికినట్లు సరిపోయింది. ప్రముఖ నర్తకి శోభానాయుడు గురించి రాసిన కవితకు ‘ఆమె ఆహార్యాన్ని తొలగించింది’ అన్న శీర్షిక కూడా అత్యంత కవితాత్మకంగా ఉంది. తండ్రి శశాంక ప్రభావం తనమీద అనంతంగా ఉంది అని చెప్పకుండానే రచయిత ‘వెన్నెల నీడలో’ ఎదిగానని ఆనందంగా చెప్పుకున్నారు. ఇక్కడ శశాంక ఇచ్చేది వెన్నెలే కదా.

నాన్న నాకిచ్చిన జ్ఞాపకాలకి మాత్రం శతమానం

అంటూ తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. వింజమూరి సోదరీమణులు తెలుగు నాట జానపద సంగీతానికి ఎంతో ప్రాశస్త్యాన్ని కలిపించారు. వారితో రచయితకు వున్న అనుబంధాన్ని మార్ఢవంగా వర్ణించారు.

గీర్వాణికి, జానపదుల బాణీ

వినిపించాలని

అప్పుడు చెల్లి, ఇప్పుడు అక్క

సురలోకపు దారి పట్టారు

అంటూ వింజమూరి సీత, అనసూయ గురించి రమణీయంగా వర్ణించారు ఈ పరిచయ పత్రంలో. కరోనా సమయాన్ని డాక్టర్ పార్వతీశం అత్యంత సమర్థవంతంగ ఉపయోగించుకొని మహాభారతం మథించి ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వటం కూడా జరిగింది. అందులో కొన్ని పాత్రల గురించి మనకు పరిచయ పత్రాలను అందించారు. సత్యవతి పాత్రను చదివినప్పుడు ఆయన మదిలో కలిగిన అనుభూతి ఇలా ఉంది.

నిలిచిపోయిన కురు వంశానికి

ఆమె ఆలోచన మళ్లీ పురుడు పోసింది

దేహ పరిమళం కాదు

దేశమూ పరిమళించాలనే,

ఆమె ఊహ.

అజ్ఞాతవాసంలో ద్రౌపది గురించి రాస్తూ

అంతఃపుర నారీజన పక్షంలో

ఆమె నడిచే నిప్పు కణం

అంటారు రచయిత. ఈ పరిచయపత్రంలో ఆయనకు తెలుగు భాష పై ఉన్న సాధికారత, అభిరుచి పదాలపై ఉన్న పట్టు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎంతోమందికి పరిచయ పత్రాలు లిఖించిన రచయిత తన శ్రీమతి గురించి ఏం చెబుతారో అన్న ఆసక్తి కలిగింది. కరుణ లేని కరోనా కాలంలో నా భార్యను గమనించినప్పుడు ఆమె ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు గోడ గడియారంలో కదులుతున్న లోలకంలాగా ఉంది అంటూ సింబాలిక్‌గా వర్ణిస్తారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఆమె ఆ కుటుంబం కోసం చేసిన శ్రమైకజీవనాన్ని ఒకచోట ఆహ్లాదకరంగా మరొకచోట హాస్యస్ఫోరకంగా ఇంకొక చోట మనసులో అంజలి ఘటిస్తూ

కరుణ తెలియని కరోనా

ఈ వాళో, రేపో

ఆమె ముందు మోకరిల్లితుంది

అంటూ ఎంతో హృద్యంగా ముగిస్తారు. కవి అనేవాడికి సమకాలీన అంశాలపై స్పందించే గుణం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అలాగే డాక్టర్ పార్వతీశం ఎవరెస్టును అధిరోహించిన మలావత్ పూర్ణ గురించి ‘పూర్ణమిదం’ అంటూ ఆమె సాధించిన విజయాలను కవిత్వీకరించారు. అంతేకాక నోబెల్ బహుమతి పొందిన పాకిస్తానీ బాలిక మలాల చదువు గురించి చేసిన పోరాటం పత్రికలో వార్తగా చదివినప్పుడు స్పందించిన రచయిత ‘సుమ దళమెంత? సురభిళమే అంతా’ అంటూ స్పందించటం చాలా గొప్పగా ఉంది. ఈ శీర్షికకు సార్థకత చేకూరుస్తుంది.

ఆ విరాణ్మూర్తి ముందు

మేమంతా వామనులం

అంటూ వినయంగా శిరసు వంచి నమస్కరించటం చాలా గొప్పగా ఉంది. పార్వతీశం గారి మీద ఆయన మాతామహులు కందుకూరి రామభద్రరావు గారి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాలాసార్లు చాలా చోట్ల చెప్పుకున్నారు. ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన గురించి గౌరవంగా గొప్పగా ఎలా పోల్చారు అంటే

ఆయన తొక్కే సైకిల్

ముఖ్యమంత్రి కారులా దర్జాగా వుండేది.

అంటారు తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ పరిచయ పత్రంలో మళ్లీ ఈ తాతగారితో అనుబంధాన్ని వర్ణిస్తూ

శివరాత్రి తీర్థంలో

సైకిల్ బుట్ట సవారీ చేస్తుంటే

ఈ కళ్ళకి కలిగిన సంబరం,

నా మనసు పడిన ఆనందం, ఇవన్నీ వర్ణించడానికి

కావ్యాలేం సరిపోతాయి

రచయిత పసిప్రాయంలోనే తండ్రి పోగొట్టుకున్నారు. అందుకే ఆ తండ్రి గురించి ‘వెన్నెల నీడలో’ అంటూ పరిచయ పత్రం రాసిన ఆ నాన్న లేని తనం జ్ఞాపకానికి ఉన్నప్పుడు

నా బాల్యాన్ని నీతో పట్టుకు పోయావు

పెద్దరికాన్ని మాత్రం కానుకగా ఇచ్చి వెళ్లావు

అంటూ ఎంతో ఆర్ద్రంగా తన తండ్రికి ప్రణామాలు అర్పిస్తారు రచయిత.

డాక్టర్ వోలేటి పార్వతీశంకు రామాయణం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నదన్న విషయం నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుసు. వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహా కవిపట్ల తన అభిమానాన్ని ముచ్చటగా మూడు లైన్లలో తీర్చుకున్నారు.

వాల్మీకమంటే

పోగు పోసిన పుట్ట మన్ను కాదు

రామాయణకర్తకు పురిటి గది

ఇలాంటి భావన కేవలం అసామాన్యులకు మాత్రమే వస్తుంది.

ఇంత మంది ప్రముఖుల గురించి పరిచయ పత్రాలు అందించిన రచయిత దూరదర్శన్‌లో తనతో పాటు పనిచేసిన నలుగురు వ్యక్తుల పరిచయాలు కూడా మనకు అందించటం ఆయన తన సహోద్యోగులకు ఇచ్చిన అత్యున్నత గౌరవంగా మనం భావించాలి. అదృష్టం ఏమిటంటే ఈ నలుగురితో నేను కూడా కొద్దికాలం పని చేయడం జరిగింది. ముఖ్యంగా తన సమకాలికుడు శ్యామ్ జి.కే గురించి రచించిన పత్రంలో దాదాపు దూరదర్శన్ కార్యక్రమ నిర్వహణ ఎలా ఉంటుందో వర్ణించారు. దూరదర్శన్ ప్రారంభించిన రోజుల్లో ఈ రచయిత, మిగిలిన సహోద్యోగులు ఒక కార్యక్రమాన్ని తయారు చేయటానికి ఎంత శ్రమ తీసుకున్నారో ఈ పత్రాలు చదివితే మనకి పూర్తిగా అర్థం అవుతుంది. శ్యామ్ గురించి చెబుతూ

దృశ్యప్రవాహంలో

అతడొక ఎగిసిపడ్డ అల

కార్యక్రమం నిర్మాణ పరిపూర్ణత్వానికి

తపనపడే అతడి తల

అప్పటికే ఒక వెండిమల

అంటూ కీర్తిస్తారు. దూరదర్శన్ కార్యక్రమాల చరిత్రలో మహిళల ప్రభావం తక్కువేమీ కాదు. అందులో ఎన్నదగిన వారు శ్రీమతి యార్లగడ్డ శైలజ. ఆమె అంకితభావాన్ని గుర్తుచేసుకుంటూ దూరదర్శన్‌లో ఆమె ఎదిగిన తీరును స్మరిస్తూ

సుగుణాలతో ఒక సుమ గుచ్ఛాన్ని

గుది గుచ్చితే,

వెల్లువెత్తే దృశ్య సౌరభానికి గుర్తు

దూరదర్శన్ శైలజ

అంటూ ఆమె పట్ల ఉన్న ఆదరణీయ భావాన్ని వ్యక్తీకరించారు. ఇలా ఎంతో మంది ప్రముఖులు, మహానుభావుల గురించి ఈ రచయిత అందించిన పరిచయ పత్రాలు కేవలం వారి గురించి సూక్ష్మంగా అయినా తెలుసుకునే అవకాశం కలిగించడమే కాకుండా రచయితకు వారి పట్ల ఉన్న అభిమానం, గౌరవం ఇత్యాదులను ఒక మహత్తరమైనటువంటి భావనతో వ్యక్తీకరించారు. అనుభూతి ప్రధానంగా ఆయన వ్యక్తీకరించిన ఈ పత్రాలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అందుకు రచయిత అభినందనీయులు.

ఈ పుస్తకం చదవటం పూర్తి చేసిన తర్వాత ఒక భావన కలుగుతుంది. తల్లిదండ్రులు, ఈ జీవితంలో తనతో కలిసి ప్రయాణం చేసిన బంధుమిత్రులు సహోద్యోగులు, తనపై ప్రభావం చూపిన ప్రముఖ వ్యక్తులకు రచయిత కృతజ్ఞత తెలియజేసుకున్నారు. సంస్కారవంతమైన మానవుడు నిర్వహించాల్సిన బాధ్యత కూడా. ఇది ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో తెలియజేసుకుంటే డాక్టర్ వోలేటి పార్వతీశం పరిచయ పత్రాలు అనే పేరుతో ఒక నూతన పంధా అవలంబించి తన జన్మ సార్ధకం చేసుకున్నారు.

***

పరిచయ పత్రాలు
రచన: డా.వోలేటి పార్వతీశం
ప్రచురణ: కిన్నెర పబ్లికేషన్స్
వెల: ₹ 150/-
ప్రతులకు: శ్రీమతి వోలేటి లక్ష్మీప్రసూన
ఫ్లాట్ నెం.502, బృందావన్ రెసిడెన్సీ,
స్ట్రీట్ నెం. 16, గగన్ మహల్,
దోమలగూడ, హైదరాబాద్-500209
ఫోన్: 9908575206, 9440031213
~
కిన్నెర పబ్లికేషన్స్,
2-2-647/153. ఫ్లాట్ నెం.101, 102
ముద్దాళి గోల్డెన్ నెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ,
బాగ్ అంబర్ పేట, హైదరాబాద్-13
9866057777
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Exit mobile version