పరిమళించిన మానవత్వం

0
2

[‘అభినందన’ సంస్థ (విజయనగరం) జూలై 2022లో నిర్వహించిన మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ]

[dropcap]లం[/dropcap]చవర్లో కొలీగ్స్‌తో పాటు చెట్టు కిందున్న దిన్నె మీద కూర్చొని లంచ్ చేస్తున్నాడు రవి. లంచ్ చేసే చోటికి కొలీగ్ సౌందర్య వచ్చి రవితో “సార్! మా వూళ్ళో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది” అన్నది.

“ఆ కథా కమామిషేంటో చెప్పు వింటాను” అన్నాడు రవి సౌందర్యతో.

జరిగిన సంఘటనను సౌందర్య పూస గుచ్చినట్లుగా చెప్పసాగిందిలా –

“ఆఫీసు నుండీ ఇంటికెళ్ళాక మా నాన్న పదివేల రూపాయలు నా చేతికిచ్చి ఫ్రిజ్‌కి ఐదు వేల రూపాయలు అడ్వన్స్ కట్టి మిగిలిన ఐదు వేలలో వెదురు దబ్బలతో చేసిన ఊయలని కొనుక్కురా” అని చెప్పి పంపించారు.

నేను ఫ్రిజ్ షాపుకెళ్ళి షాపతడితో “అడ్వాన్స్ కింద ఐదు వేల రూపాయలు తీసుకోండి. రేపు మిగిలిన డబ్బులు కట్టి ఫ్రిజ్ తీసుకెడతాను” అని అన్నాను.

ఫ్రిజ్ షాపతను “మొత్తం డబ్బులు ఒకేసారి కట్టి తీసుకెళ్ళండి” అన్నాడు.

***

ఇక అక్కడ నుండీ వెదురు దెబ్బలతో చేసిన ఊయలని కొనడానికెళ్ళాను. ఆ ఊయల ధర మూడు వేల నాలుగు వందలు. అక్కడ డబ్బులు చెల్లించి ఊయలని తీసుకున్నాను.

ఊయలని ‘ఇంటికెలా తీసుకెళ్ళాలి’ అని ఆలోచిస్తుంటే షాపాయన ఆటో మాట్లాడాడు. “అమ్మా! ఆటో ఆయనకి రెండు వందల రూపాయలిస్తే మీ ఇంటి ముందు దించుతాడు. ఆ ఊయలని మీ ఇంట్లో ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు” అని చెప్పాడు.

హేండ్ బ్యాగ్‌లో అన్నీ వంద నోట్లే. అందులోంచి ఆటో ఆయనకివ్వడానికి రెండు వంద నోట్లు తీసి చేతిలో పెట్టుకున్నాను. ఆటో దిగగానే ఆ రెండు వంద నోట్లు అతడికిచ్చి ఇంట్లో ఊయలని పెట్టాల్సిన చోటుని చూపించడంతో ఆ ఊయలని ఆ చోట్లో పెట్టి వెళ్ళిపోయాడు.

***

మరికొంత సేపైన తర్వాత మా నాన్న “సౌందర్యా! ఫ్రిజ్ వాడికి అడ్వాన్స్‌గా ఇద్దామనుకున్న ఐదు వేల రూపాయల ఇచ్చావా!” అని అడిగారు.

“లేదు నాన్నా! మొత్తం డబ్బులు ఒకేసారి కట్టి ఫ్రిజ్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడు షాపతను” అని హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న డబ్బులు నాన్నకిద్దామని చూస్తే హ్యాండ్ బ్యాగే లేదు. ఇల్లంతా వెదికాను. ఎక్కడా కనపడలా. వెంటనే హ్యాండ్ బ్యాగ్ ఆటోలోనే వదిలేసినట్లుగా జ్ఞాపకం వచ్చింది. హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బులతో పాటూ నా సెల్ ఫోన్ కూడా ఉండిపోయింది.

నాన్న సెల్ తీసుకుని నా నంబరుకు ఫోన్ చేశాను. ఫోన్ మోగుతున్నది గానీ తియ్యడం లేదు.

మరొకసారి ఫోన్ చేశాను. ఆటో అతను ఫోన్ తీశాడు.

“ఏమండి! మీ ఆటోలో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. ఉందాండి!” అని అడిగాను.

“ఆఁ ఉందమ్మా! మీరు బస్ స్టాండ్ దగ్గరికి రండి ఇస్తాను” అన్నాడు ఆటో డ్రైవర్.

“నాన్నా! ఇప్పుడే వస్తాను” అని చెప్పి బస్ స్టాండ్‌కు వెళ్ళాను.

బస్ స్టాండ్‌లో ఆటో రాక కోసం ఎదురుచూస్తున్న నన్ను చూసిన కానిస్టేబుల్ “ఏమ్మా! ఈ టైంలో మీ రిక్కడెందుకున్నారు? అని అడిగాడు.

నేను బస్టాండ్‌లో ఉండటానికి కారణం చెప్పడానికి మొదలు పెట్టే పాటికి నేను ఎదురు చూస్తున్న ఆటో అక్కడికి రానే వచ్చింది. ఆటోలో వచ్చిన ప్యాసెంజరు దిగి పోయాక ఆ ఆటో డ్రైవర్ని పోలీస్ కానిస్టేబుల్ ఆరా తీశాడు విషయం ఏంటని.

“ఈ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్ నా ఆటోలో మర్చిపోయింది సార్! అందులో తన సెల్ ఫోన్, కొంత డబ్బులున్నాయి. ఆ హ్యాండ్ బ్యాగ్‌ను తనకివ్వడానికి నేనే ఈ అమ్మయిని బస్ స్టాండ్‍కు రమ్మన్నాను” అని చెప్పి “ఇదిగోమ్మా! నీ హ్యాండ్ బ్యాగ్. నీ బ్యాగ్‍లో డబ్బులు, సెల్ ఫోన్ వున్నాయి. డబ్బులు అన్నీ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకుని చెప్పండి ఈ కానిస్టేబుల్ ముందే!” అని అన్నాడు ఆటో డ్రైవర్.

నా సెల్ ఫోన్ తీసుకుని, డబ్బులు లెక్కపెట్టి “ఆరు వేల ఆరొందల రూపాయలు వున్నాయండి” అని, “నా హ్యాండ్ బ్యాగ్‌ని మానవత్వంతో తిరిగి నాకిచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రతిఫలంగా నేను నా ఇష్ట పూర్వకంగా, సంతోషంగా మీకు మూడు వందల రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి” అని అన్నాను.

ఆ మాటలు విన్న ఆటో డ్రైవర్ నాతో “మానవత్వానికి వెల కట్టకండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంచండి. నైతిక విలువల్లో మానవత్వమొకటి. ఈ మానవత్వమన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉండాల్సిన లక్షణం” అని చెప్పి అక్కడినుండీ వెళ్ళిపోయాడు.

***

“ఇది సార్ మా వూళ్ళో నిన్న రాత్రి జరిగిన సంఘటన” అని చెప్పింది కొలీగ్ సౌందర్య.

ఆ మాటలు విన్న రవి సౌందర్యతో “సభ్య సమాజంలో నైతిక విలువలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో నైతిక విలువైన మానవత్వంతో ఆటో డ్రైవర్ మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం, మీ సెల్ ఫోన్, మరియు మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు అందజేయడం సంతోషించదగ్గ విషయం. నిన్న రాత్రి జరిగిన సంఘటనలో మానవత్వం పరిమళించిందన్న మాట” అని అన్నాడు.

“అన్నమాట కాదండీ ఉన్నమాటే” అన్నది నవ్వుతూ. ఆ నవ్వుతో శ్రుతి కలిపాడు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here