Site icon Sanchika

పరిష్కారం

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘పరిష్కారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క్రి[/dropcap]స్టీనా గ్రోసరీ స్టోర్ నుంచి ఇంటికి వచ్చి తెచ్చిన సామాను కిచెన్ కేబిన్ మీద పెట్టి అలసటగా కవుచ్‍లో కూలబడింది. కాసేపు రిలాక్స్ అయ్యాక లేచి రిఫ్రిజిలేటర్ నుంచి బీర్ తెచ్చుకుని తాగుతూ టీవీ ఆన్ చేసింది.

‘మెక్సికో బోర్డర్ సెక్యూరిటీ స్టాఫ్ చేతిలో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి కాల్పులకు గురి..’ అంటూ వార్త కనిపించింది.

‘ఇదంతా మామూలే ఎందరో వెధవ పన్లు చేసి ఇలాగే దిక్కులేని మరణం పొందుతారు. అలా అని మిగిలినవారు మానుతారా! లేదు. వాడు తెలివితక్కువగా దొరికిపోయాడు.. అనుకుంటారు. మనకీ దిన దిన గండమే అని మాత్రం అనుకోరు.’  అనుకుంటూ ఛానెల్ మార్చబోతుంటే చనిపోయిన వాడు ‘డేవిడ్ బ్రౌన్’ అని ఫోటో కూడా చూపించారు.

క్రిస్టీనా ఒక్క క్షణం నమ్మలేక బొమ్మలా వుండిపోయింది. తర్వాత ఫోన్ చేతిలోకి తీసుకుని, ఎవరికో ఫోన్ చేసి, “హలో బెంజిమన్ అంకుల్” అంది.

“యా, క్రిస్టీనా డియర్! వాట్ హాపెండ్?” అన్నాడు.

“ఇప్పుడే టీవీలో న్యూస్ చూసాను. డేవిడ్ మీద బోర్డర్ కాపలా పోలీసులు గన్ షూటింగ్ చేశారని” అంది.

“అవును. ఇది మంచివార్త కదా నీకు?” అన్నాడు సంతోషంగా బెంజిమన్.

“ఒక రకంగా! కానీ ఇలా కాకుండా జైల్లో ఉంటే బాగుండేది.”

“అదీ చాలాసార్లు జరిగింది. మళ్లీ బయటికీ వచ్చేసాడు. నాకైతే చాలా రిలీఫ్‍గా ఉంది సుమా!”

“మనం వెడదామా చివరిసారి చూడటానికి?” అడిగింది క్రిస్టీనా.

“నో నో.. అది చాలా ప్రమాదం. నీకు కూడా డ్రగ్స్ అమ్మడంలో హ్యాండ్ ఉందని అనుమానిస్తారు. లేనిపోని గొడవ. నువ్వు వెళ్ళకు. ఐనా ఎన్ని బాధలు పెట్టేడు నిన్ను. ఇంకా అతడి మీద జాలి పడుతున్నావా. సెలబ్రేట్ చేసుకోవాలి మనం. నువ్విక హాపీగా వుండు. ఇప్పుడు శాండియాగోకి తిరిగి వచ్చేయచ్చు.”

“బెంజిమన్! ఇక్కడ చేరి రెండు నెలలే అయినది. కొద్దికాలం పోనీ. ఉంటానూ.. బై బై”.అని ఫోన్ పెట్టేసింది.

క్రిస్టీనా ఏమనుకుందో కానీ బెంజిమన్ మాత్రం చాలా సంతోషపడ్డాడు.

‘ఆమె నాకు స్వంత కూతురు కాకపోవచ్చు. కానీ మూడేళ్లపాటు నేను నడిపిన బస్సులో ప్రయాణీకురాలిగా నాకు ఆత్మీయురాలు. ఆమె సంతోషం కోసం నేను ఎదో ఒకటి చేయాలనుకున్నాను. అది ఫలించినందు వలన ఇక మీద మంచి జీవితం గడుపుతుంది’ అని అనుకున్నాడు.

వారం వారం ఫోను చేసి ఆమె సమాచారం తెలుసుకుంటున్నాడు.

క్రిస్టీనా కూడా అతడి సలహా తీసుకుంటుంటుంది అవసరం ఐనప్పుడు.

ఆ రోజుతో డేవిడ్ గుర్తులను పూర్తిగా చెరిపివేసింది. ఫోటోలు వెడ్డింగ్ సర్టిఫికెట్ చెత్తబుట్టలో వేసింది.

అతను బాగున్నరోజుల్లో ఇచ్చిన గిఫ్ట్స్ డొనేట్ చేసేసింది.

ఇప్పడు ప్రశాంతంగా వుంది. మళ్ళీ వెదుకుతూ వచ్చి వేధిస్తాడనే భయం లేదు.

***

అది యూనివర్సిటీ బస్సు టెర్మినల్ సెంటర్. మిరమార్ కాలేజీకి వెళ్లే బస్సు సిద్ధంగా వుంది. అప్పటికే కొందరు బస్సు ఎక్కి కూర్చున్నారు.

ఆ బస్ డ్రైవర్ బెంజిమన్ ఒకరి కోసం ఎదురు చూస్తున్నాడు. సాధారణంగా ఆమె సరిగ్గా సమయానికి ముందుగానే వస్తుంది. మరి ఈ రోజు ఇంకా రాలేదు.

కొద్ది క్షణాలు ఎదురుచూసి ఇక రాదని తప్పనిసరిగా బయలుదేరాడు.

క్రిస్టీనా మిరమార్ కాలేజీలో ఫిజియోథెరఫీ డిగ్రీ చదువుతోంది.

ఆమె గురించి బెంజిమన్‌కి ఏమి తెలియదు. కానీ ఆరునెలలుగా అదే బస్సులో డ్రైవర్‍గా పనిచేస్తున్న బెంజిమన్‍కి అభిమానం కలిగింది. ఆమె వదనం దీనంగా అమాయకంగా ఉంటుంది. దానికితోడు అంగవైకల్యం.

ఒక కాలు లాగేసి కుచించుకుపోయింది. చేతికర్ర సాయంతో నడుస్తుంది. ఆమెను పదిలంగా బస్సు ఎక్కించడం, జాగ్రత్తగా కిందికి దించడం చేస్తాడు. అదే కారణం, బెంజిమన్‌కి ఆమెపట్ల అభిమానం కల‍గటానికి.

బస్సు ఎక్కేవారు ఉదయం వేళ గుడ్మార్కింగ్ చెప్పడం, బస్సు దిగేటప్పుడు థాంక్స్ చెప్పడం చేస్తారు.

క్రిస్టీనాతో అప్పుడప్పుడు ఖాళీ సమయంలో రాజకీయాలు సమస్యలు సందేహాలు మాట్లాడుతూ ఉంటాడు. అందువల్లనే ఆమె గురించి ఆలోచిస్తున్నాడు.

ఈ రోజు రాకపోతే రేపు వస్తుందిగా అనుకున్నాడు. ఫోను నెంబర్ తీసుకోడం మర్యాద కాదు. ఒకరి మీదనే శ్రద్ధ చూపడం సరికాదు. అది రూల్స్‌కి వ్యతిరేకం కూడాను.

ఆమె వారం రోజులు రాలేదు. కారణం తెలియక బెంజిమన్ దిగులుపడ్డాడు. తెలుసుకునే దారిలేదు.

చివరికి ఆ రోజు సరిగ్గా స్ప్రింగ్ బ్రేక్ వెకేషన్‌కి ముందు కనబడింది.

ఎప్పటిలా గుడ్మార్కింగ్ చెప్పింది.

“ఏమైంది క్రిస్టీనా కనబడలేదు?” అడిగాడు ఆత్రంగా.

“నాకు ఆరోగ్యం బాగాలేదు. సిక్ అయ్యాను.” చెప్పింది .

“ఓ అలాగా ఇప్పుడు ఓకేనా?” అంతకు మించి ఆడవాళ్లను అడగటం సభ్యత కాదనుకున్నాడు.

“పర్వాలేదు. బెటర్!” అంది. యథాప్రకారం రోజులు గడిచిపోతున్నాయి.

క్రిస్టీనా ఎందుకో డల్‌గా వుంది. ఒక రోజు ఆమెతోబాటు ఒకతను బస్సు ఎక్కేడు. అతడు ఎవరో చెబుతుంది అనుకున్నాడు బెంజిమన్.

ఎవరితను బంధువా బాయ్ ఫ్రెండా తెలీదు. ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమెతో గొడవ పడసాగేడు.

అదేమిటో అతడి భాష వేరుగా వుంది.

‘ఇష్, గొడవ చేయకు ప్లీజ్. ఇంటికివెళ్ళి మాటాడుకుందాం..’ అని క్రిస్టీనా చెప్పినట్టు ఆమె హావభావాలు వలన అర్థమైంది.

అతడు బస్సు దిగేవరకూ ఏదో అంటూనేవున్నాడు ఆమెను.

తర్వాత అతను ఇక కనిపించలేదు. ఎవరో అతడు.. ఆమెను ఎందుకు వేధిస్తున్నాడు.. అర్థం కాలేదు.

‘అయినా నాకెందుకు?’ అనుకున్నా ఆమె దిగులుగా ఉంటే భరించలేకపోయాడు బెంజిమన్.

ఆనాటినుంచి క్రిస్టీనా మాటలు తగ్గించింది. ఏదో మిషన్‍లా బస్సు ఎక్కడం కాలేజీ దగ్గిర దిగడం తప్ప మామూలుగా లేదు.

అప్పుడప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ అతడినుంచే అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే అర్థమయ్యేది.

ఇక సహించలేక “వాట్ క్రిస్టీనా, ఎందుకు బాధపడుతున్నావ్? నేను సహాయం చేయగలనా చెప్పు!” అన్నాడు.

“అతడు డేవిడ్ బ్రౌన్ నా ఎక్స్-హజ్బండ్. వ్యసనాల పుట్ట. డ్రగ్ ఎడిక్ట్. మనీ కోసం వేధిస్తాడు. డివోర్స్ అయిపోయినా నన్ను వదలడు. నేను హాండీక్యాప్డ్ కనుక నాకు వచ్చే బెనిఫిట్స్‌ని వాడుకుంటాడు. నీకూ నాకు సంబంధం లేదు. నన్ను కలవద్దు అని చెప్పినా వినడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. కొద్దిరోజులకే వచ్చేసాడు. నాతో వచ్చేయి అంటాడు. నాకు ఇష్టంలేదు, రాను అన్నాను. బస్సులో గొడవ అదే. నా చదువు ఇక పూర్తైపోతుంది. జాబ్ దొరికితే వేరే వూరు వెళ్ళిపోతాను. అంతవరకూ ఓపిక పడుతున్నా.” అంటూ అసలు విషయం చెప్పింది.

“అయ్యో ఇంత మంచి అమ్మాయివి. నీకు ఎన్ని కష్టాలో. పోలీసులకు పట్టించు. జాలిపడకు..” అన్నాడు.

“నేను వాడిని ఏమి చేయలేను.” అంది.

“నేను నీకేమైనా హెల్ప్ చేయగలనా..?”

“ఏమో నాకు తెలియదు. నేను ఈ లోకంనుంచి వెళ్లిపోయేదాకా అతడి హరాస్మెంట్ తప్పదు.” అని దుఃఖించింది.

మూడు నెలల తర్వాత చదువు పూర్తి చేసుకుని ఎల్కహాన్ వెళ్ళిపోతూ బెంజిమన్‌కి చెప్పింది.

“నాకు చాలా ధైర్యం చెబుతూ వచ్చావు. నాకష్టం పంచుకున్నావ్. ధన్యవాదాలు. నేను బాగుంటే మళ్లీ కలుద్దాం.” అంది.

“ఓకే బేబీ, గాడ్ బ్లెస్ యూ..!” అన్నాడు కళ్ళు చెమరించిన బెంజిమన్.

***

ఆ రోజు తర్వాత ఇప్పుడు డేవిడ్ కబురు తెలిసింది.

బెంజిమన్ స్నేహితుడు మెక్సికో బోర్డర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. డేవిడ్ గురించి చెబితే “వాడికి ఇక్కడ ట్రక్ డ్రైవర్ ఒకతను సపోర్ట్ చేస్తూంటాడు. అందుకే పట్టుబడలేదు. వాణ్ని లేపేయడం సెకండ్ల పని. ఈసారి నా కంటబడితే వాడి పని పడతాను. క్రిస్టీనాకి విముక్తి కలుగుతుంది. నువ్వేమి దిగులుపడకు. ఈ మాఫియా బోట్‌లో డ్రగ్స్ తెస్తారు. మాకు తెలుసును, ఏ దారిలో వస్తారో.” అని మాట ఇచ్చాడు.

“మరీ ప్రాణం తీయద్దు. వాడు కదలకుండా ఉండేలా చేయి చాలు. తెలిసి మీరు నేరస్థులను ఎందుకు విడిచిపెడతారు? తప్పుకాదా!” అన్నాడు బెంజిమన్.

“ఒకరా ఇద్దరా.. వాళ్ళు కూడా మా కళ్ళు కప్పి తప్పించుకుంటారు. సులువుగా దొరకరు. ఎవరో డబ్బుకి కక్కుర్తిపడి తప్పిస్తాడు. తెలిసినా ఒకోసారి ఏమి చేయలేము.” అన్నాడు ఆఫీసర్.

దాని ఫలితమే డేవిడ్ పట్టుబడి హాస్పటల్ పాలు అయ్యాడు. రెండు కాళ్ళు ఛిద్రమై బెడ్డుమీద వున్నాడు.. అతడు చనిపోయినట్టు వచ్చిన వార్త నిజం కాదు. కానీ కొద్దికాలం తర్వాత అదే నిజం అవుతుంది.. అని బెంజిమన్‌కి మాత్రమే తెలుసు.

ఏదైతేనేమి ఒక దుష్టుడి బెడద తప్పింది.

Exit mobile version