తెలుగు పరిశోధనకు ఓ దీపదారి ‘ఆచార్య వెలుదండ’ – ‘పరిశోధక ప్రభ’ పుస్తకానికి ముందుమాట

0
2

ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం నాల్గవ సంపుటం ‘పరిశోధక ప్రభ’కు – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన పీఠిక.

***

[dropcap]కొ[/dropcap]త్తగా తెలుగులో పరిశోధనలు చేసేవారు తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన ఒక పేరు ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారు. అప్పుడే పరిశోధనలోకి అడుగుపెడుతున్న పరిశోధకులకు తెలుగులో భాషా, సాహిత్య పరిశోధనల పట్ల ఒక అవగాహన కల్పించడంలో ఆయన చేస్తున్న కృషి సామాన్యమైంది కాదు. ‘విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన’ పేరుతో ఆయన ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ప్రచురిస్తున్న తెలుగు పరిశోధనల సూచి వల్ల ఇంచుమించు తెలుగు పరిశోధన చేస్తున్న వారందరికీ ఆయన పేరు సుపరిచితమయింది. ఆ గ్రంథం వల్ల పరిశోధనల పునరుక్తి చాలా వరకు తగ్గింది. చేయవలసిన పరిశోధన ఏమిటో గుర్తించడానికి సులభమైన మార్గం దొరికింది. ఒకవేళ సంబంధిత రంగంలో పరిశోధన చేయాలనుకునేవాళ్ళకు వెతుకుతున్న తీగ దొరికినంత సంతోషం కలిగిస్తుంది. ఆయన షష్టి పూర్తి సందర్భంగా తన సాహిత్యాన్నంతా సంపుటాలుగా ప్రచురించడం సంతోషించదగిన విషయం. తాను పదవీ విరమణ పొందే సమయం ఆసన్నమైయ్యిందంటే తాను దాచుకున్న డబ్బులంతా ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోనో, మరో విధంగానో డబ్బుకి పిల్లలు పుట్టే ఆలోచన చేయకుండా పుస్తకాలకు పెడుతున్నందుకు ఆయన అమాయకుడనుకొనేవాళ్ళూ ఉంటారు. నేను మాత్రం కొన్ని తరాలకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తున్నారనుకుంటున్నాను. భారతీయ ఋషి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారనుకుంటున్నాను.

ఈ నాలుగవ సంపుటి పేరు ‘పరిశోధక ప్రభ’. ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకెంతో సంతోషమనిపించింది. పరిశోధన విధానం, సిద్ధాంతాలు, వాటి సమన్వయం మొదలైన అంశాల పట్ల నాకు మొదటినుండీ ఒక ప్రత్యేకమైన ఆసక్తి. అందువల్ల ఈ పుస్తకంలో ప్రచురించిన అన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి. మన తెలుగు భాషా సాహిత్యాలలో తెలుగు పరిశోధన విధానంతో రాసే వ్యాసాలు చాలా తక్కువ. ఒక రీసెర్చ్ మెథడాలజీని పాటిస్తూ వ్యాసాలు రాస్తే వాటిని ప్రచురించడానికి తెలుగులో సరైన పత్రికలు ఇంచుమించు లేవనే చెప్పాలి. ఒకవేళ అలా ప్రచురిస్తే ఆ రిఫరెన్స్‌ల వల్ల ఎంతో స్పేస్ వృథా అవుతుందనేవాళ్ళు, చదవడానికి చాలామంది పాఠకులు ఉత్సాహం చూపించరనేవాళ్ళు ఎంతోమంది కనిపించడం మరింత ఆశ్చర్యమనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు పరిశోధన పట్ల కనీసం ఒక అవగాహన కలిగించడానికి ఆచార్య నిత్యానందరావు చేస్తున్న కృషి పరిశోధకులకు ఎంతగానో సహకరించిందనేది కాదనలేని సత్యం. ఆయన పరిశోధన నిబద్ధతకు దర్పణం పడుతున్న ఈ గ్రంథానికి ‘అభిప్రాయం’ రాసే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గత కొంతకాలంగా నేను కూడా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పర్యవేక్షణ వహించడం, వివిధ విశ్వవిద్యాలయాల నుండి వస్తున్న పరిశోధనలకు పరీక్షకునిగా ఉండడం వల్ల, పరిశోధన విధానానికి సంబంధించిన కొన్ని ఆంగ్ల గ్రంథాలను పరిశీలించడం వల్ల సాధారణంగా సాహిత్య సిద్ధాంత గ్రంథాల్లో ఐదు అంశాలు ఉండాలని గుర్తించాను.

  1. పరిశోధకుడు తన పరిశోధన గ్రంథంలో ఉపయోగించే శబ్ద వివరణ లేదా పారిభాషిక పదజాల వివరణ.
  2. పూర్వం ఆ రంగంలో వచ్చిన సిద్ధాంతాలు లేదా లక్షణాలను ప్రస్తావించడం.
  3. మనం పరిశోధన చేసే మూల రచనను లేదా కవిని పరిచయం చేయడం.
  4. లక్షణ సమన్వయం లేదా సిద్ధాంత సమన్వయం చేయడం.
  5. మనం చేసిన సిద్ధాంత సమన్వయం లేదా లక్షణ సమన్వయాన్ని పూర్వం ఎవరైనా ప్రస్తావించినట్లైతే దానిపై చర్చించిన లేదా దానిపై జరిగిన చర్చనీయాంశాలను పేర్కొని, పరిశోధకుని అభిప్రాయంతో తాను సమర్థించే లేదా ప్రతిపాదించే అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించడం లేదా నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వంటివాటిలో ఏదొకటి తప్పకుండా చేయాలి. ఇవన్నీ ఆచార్య నిత్యానందరావు తన ఎం.ఫిల్, పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాల్లో చక్కగా పాటించారు.

తన ఎం.ఫిల్., కూచిమంచి జగ్గకవి గారి చంద్రరేఖా విలాపం తొలివికట ప్రబంధంలో ‘వికట’ శబ్దాన్ని పరిశీలిస్తూ నిఘంటువుల్ని, పూర్వ పరిశోధకులు ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి, పూర్వ లాక్షణిక చర్చ చేసి, వివిధ కావ్యప్రయోగాల్ని పరిశీలించిన తర్వాత ‘వికట’ శబ్దానికి ‘అందమైన’ అనే అర్థం కూడా ఉన్నా ‘వికట ప్రబంధం’ అన్నంత మాత్రాన ‘అందమైన ప్రబంధం’ అని ఎవరికీ తోచదనీ, “ప్రబంధ లక్షణాలను ప్రబంధ వాఙ్మయం విలువలను తారుమారు చేసిన కావ్యం” అని మాత్రమే స్ఫురిస్తుందని, ఈ భావంతోనే ‘వికట’ శబ్దం ఈ సిద్ధాంత వ్యాసంలో ప్రయుక్తమవుతుంది” అని స్పష్టంగా వివరించారు. ఈ స్పష్టత ప్రతి పరిశోధకునికీ ప్రాథమికంగా ఉండాలి. తర్వాత, అవతారికలో, ఇతివృత్తంలో కనిపించే వర్ణనల్లో వివిధ సందర్భాల్లో రసమయంగా వర్ణితమైన వికటత్వాన్ని, అలంకారాలు, ఛందోవైవిధ్యం, భాషను వివరించడంతో పాటు, కావ్యంలో ప్రతిఫలించే సామాజిక జీవనాన్ని కూడా విశ్లేషించారు. ఈ ప్రబంధం గురించి వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానంలో దొర్లిన పొరపాట్లను గుర్తించడం పరిశోధన లోతుల్ని, పరిశోధకుని పాండిత్యాన్ని తెలుపుతుంది. ఇంత శాస్త్రచర్చ చేసినా, సోదాహరణంగా వివరించేటప్పుడు ఎన్నో ఆధారాల్ని, శ్లోకాల్ని, పద్యాల్ని ఇస్తూ విశ్లేషించినా ఈ గ్రంథం ఏకబిగిని చదివించేలా ఉంది. ఒక కావ్యంపై పరిశోధన చేసేవారికి ఒక నమూనా పరిశోధన గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీనిలో ఉటంకించిన పద్యాల్ని రుచిచూసిన పాఠకుడికి మూలగ్రంథాన్ని చదవాలనే ప్రేరణ కలుగుతుంది. అసలు పరిశోధనలోని పరమరహస్యం కూడా అదే. సత్యాన్వేషణాపరుడైన పరిశోధకుడు, పాఠకునిచేత మూల గ్రంథాన్ని చదివించేలా చేసి, ఆ గ్రంథంలోని ఔచిత్యానౌచిత్యాల్ని గుర్తించేలా చేయాలి. అదే నిజమైన సత్యాన్వేషణ. అది ఈ గ్రంథంలో కనిపిస్తుంది.

ఈ గ్రంథంలోని రెండవ భాగం ఆచార్య నిత్యానందరావుగారి పిహెచ్.డి. ‘తెలుగు సాహిత్యంలో పేరడీ’. 1990లో డాక్టరేట్ పొందిన ఈ సిద్ధాంత గ్రంథాన్ని తొలిసారిగా 1994లో ప్రచురించారు. ఈ గ్రంథం పరిశోధకుల, సామాన్య పాఠకుల ఆదరణను ఎంతగానో పొందింది. ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీరామారావుగారు ఒక ప్రామాణిక గ్రంథంగా దీన్ని అభివర్ణిస్తే, ఒక సృజనాత్మక సమన్వయంతో కొనసాగిన థీసిస్‌గా దీన్ని డా. అక్కిరాజు రమాపతిరావుగారు వ్యాఖ్యానించారు. మాచిరాజు దేవీప్రసాద్ దృష్టిలో వికటకవిత్వాన్నే ఆంగ్లంలో పేరడీ అనొచ్చని అన్నారు. ఆయనలాగే చాలామంది నిఘంటువుల్లో కూడా వివరణలిచ్చినా, వికటకవిత్వానికి, పేరడీకి మధ్య కొన్ని భేదాలున్నాయని పరిశోధకుడు నిత్యానందరావుగారు గుర్తించారు. వస్తు, రూపాల్ని బట్టి పేరడీ కూడా రకరకాలుగా ఉంటుంది. హాస్యాన్ని లక్ష్యంగా చేసుకుంటే కామిక్ పేరడీలు, వేదమంత్రాలు చదివినట్లు అనుకరిస్తూ వర్ణిస్తే స్వర సహిత పేరడీలు అంటే టానిక్ పేరడీలు వంటి రకాలుగా విభజించుకునే వీలుందని పరిశోధకుడు వివరించారు. ఇంకా రకరకాలుగా ఈ పేరడీలను వర్గీకరించుకునే అవకాశం ఉందని వాటిని సోదాహరణంగా వివరిస్తూ ఒక సైద్ధాంతిక కోణం వైపు పయనిస్తారు. ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు పేరడీలెలా కొనసాగాయో చదువుతుంటే ఎంతో ఆసక్తి కలుగుతుంది. పేరడీ రచయిత ఏకకాలంలో పాఠకునిగాను; రచయితగాను దర్శనమివ్వడమే కాకుండా, ఏకకాలంలో రెండు గ్రంథాలను చదువుతాడని ఆయన పేర్కొన్నారు. కేవలం రాసే రచయిత మాత్రమే కాకుండా పాఠకుడు కూడా ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. పేరడీలకున్న సాహిత్య ప్రయోజనంలో సమాజసంస్కరణ కూడా ఒక భాగంగా చూపిస్తూ, కందుకూరి వీరేశలింగం ప్రబంధ ప్రక్రియను సంస్కరణోద్యమంలో భాగంగానే చేశారని, సమన్వయించడం చాలా బాగుంది. చాటువులు, దండకాలు, పద్యాలు, నవలలు, కథలు, వాటిలోని పాత్రలు, శుభలేఖలు, ప్రకటనలు, వచనకవితా ఖండికలు… ఇలా కాదేదీ పేరడీకనర్హమన్నట్లు కొనసాగినప్పటికీ అనుకరణ, పేరడీలను సిద్ధాంతీకరించడం చదివి ఆనందించదగినంత సులువు కాదు. నిత్యానందరావు దాన్నిందులో సుసాధ్యం చేశారు. వికటత్వం, అనుకరణ, వ్యంగ్యం, అధిక్షేపం, హాస్యం ఇలా కొన్ని పారిభాషిక పదాలు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటి మధ్య భేదాలు ఒక సన్నని తెర ఉందో లేదో కనుగొనలేనంతగా భ్రమలకు లోనుచేస్తుంది. అలంకారాలు, ఛందస్సులను పరిశీలించేటప్పుడు కూడా ఇలాంటి సునిశితమైన పరిశీలన అవసరమవుతుంది. పరిశోధకుడు అంత సునిశితమైన పరిశీలన చేసి, వాటి మధ్య గల భేద-సాదృశ్యాల్ని చెప్పగలగాలి. అప్పుడే ఆ పరిశోధన ఒక శాస్త్రీయమైన అధ్యయనమవుతుంది. అది ఆచార్య నిత్యానందరావు చాలావరకు సాధించగలిగారు. పేరడీలు, వ్యంగ్యం, అధిక్షేప ధోరణి వంటి వాటిని సమకాలీన కుల, మత, వర్గ, లింగ, భాషా వైషమ్యాలకు తావులేకుండా ప్రయోగించగలిగిన కవుల గొప్పతనాన్ని వేనోళ్లా పొగడవలసిందే. అది మన భాషలో, మన జాతిలో ఉన్న ఔన్నత్యంగా గుర్తించాల్సిందే. అప్పుడప్పుడు వీటిలో కొన్నింటిని వివిధ సమావేశాల్లోను, వ్యక్తిగత సంభాషణల్లోను వాడుకోవడానికి కూడా చాలామంది దాచుకోదగిన గ్రంథంగా కూడా దీన్ని భావించవచ్చు. అంతేకాదు, నిత్యానందరావు వివిధ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు చక్కని చమత్కారంతో మాట్లాడుతుంటారు. ఒకరకమైన ఎత్తిపొడుపు కూడా ఆ ప్రసంగాల్లో ధ్వనిస్తుంది. దీనికి కారణం ఆయన వికటత్వంలోని సౌందర్యాన్ని గుర్తించడమేనేమోనని తాను పరిశోధన చేసిన గ్రంథాలు చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది.

ఈ గ్రంథంలోని మూడవభాగం సమీక్షా భారతిలో తాను భారతి పత్రికను ఆధారంగా చేసుకొని 2001 నుండి 2003 వరకు చేసిన మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లోని ముఖ్యాంశాలను ప్రచురించారు. సమీక్షల అవసరాన్ని చెబుతూనే, భారతి మాసపత్రికలో వచ్చిన వివిధ రచనల సమీక్షలెలా ఉన్నాయో ఎంతో విశ్లేషణాత్మకంగా వివరించారు. “తెలుగుజాతి సాంస్కృతిక చైతన్యానికి, సాహిత్య వైభవానికి, ఆర్థికాభ్యున్నతికి, సామాజిక పురోగమనానికి ‘ఆంధ్రపత్రిక’ ‘భారతి’ పత్రికల ద్వారా అనన్య సామాన్యమైన వేదికను నిర్మించి ఆంధ్రుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి”గా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి గురించి నభూతోనభవిష్యతి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన జీవితరేఖల్ని స్ఫూర్తిమంతంగా వివరించారు. ఈ వ్యాఖ్యను నిరూపిస్తున్నట్లుగా ‘అమృతాంజనం’ కంపెనీ స్థాపన, దానిలో వచ్చిన లాభాలతో దానధర్మాలు, హరిజనోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించినవన్నీ పేర్కొన్నారు. కాశీనాథుని స్వగృహం ‘శ్రీబాగ్’ ఆనాటి రాజకీయనాయకులకు వేదిక కావడమే కాకుండా, అక్కడే రాయలసీమ, ఆంధ్ర నాయకుల ప్రేమానుబంధంతో ఆంధ్రరాష్ట్ర అవతరణకు మార్గం సుగమం చేయడానికి దోహదం చేసిన శ్రీబాగ్ ఒడంబడిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అంశం. దీన్ని నిత్యానందరావు ఎంతో జాగ్రత్తగా పట్టుకొని గుర్తించేలా చేశారు. కాశీనాథుని నాగేశ్వరరావు సమాజానికి, సాహిత్యానికి చేసిన సేవను కొండను అద్దంలో చూపినట్లు నిత్యానందరావు వివరించిన తీరు ఆశ్చర్యమేస్తుంది. ఇది చదివేవారికి కాశీనాథుని పట్ల గౌరవాభిమానాలతో పాటు, ఆయన గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక జీవిత చరిత్ర రాయడమెలాగో కాశీనాథుని గురించి నిత్యానందరావు ఈ రచనావిధానం మనకు తెలియజేస్తుంది. తొంభైశాతం వరకు రచయిత నేటి పత్రికలకు ఏదైనా ఒక రచన పంపితే కనీసం ప్రచురిస్తున్నారో, లేదో కూడా తెలియజేయని పరిస్థితి. కానీ, కాశీనాథుని వారు ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు రచయితలకు తెలియజేసేవారు. రచనలు పంపించే రచయితలకు తగిన సమాధానాల్ని ఇవ్వడమనేది పత్రికలు నిర్వహించే సంపాదకవర్గం పాటించాల్సిన ఒక కనీస నియమం. పాఠకులు ఇలాంటి విషయాలెన్నింటినో ఈ విభాగంలో తెలుసుకుంటారు. ఈ విభాగంలోనే సాహిత్య విమర్శలు, సమీక్షలు ఎలా ఉండేవో నిత్యానందరావు సోదాహరణంగా వివరించారు. గ్రంథ సమీక్షల ప్రధానోద్దేశాన్ని వివరిస్తూ పాఠకుల్లో అవి గ్రంథ పఠనాసక్తిని పెంచాలని చెబుతూనే, గ్రంథ సమీక్షల్లో కనిపించే వివిధ పరిణామాల్ని వివరించారు. ఒకప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా ఉన్న సాహిత్య సమీక్షలు క్రమేపీ ఒక మొక్కుబడి వ్యవహారంగా మారిన తీరు తెన్నుల్ని ఎంతో శాస్త్రీయంగా వివరించారు. ఈ ప్రాజెక్టు సారాంశాన్ని చదివే పాఠకులకు ఒక్కొక్క సాహిత్య పత్రికల్లో వస్తున్న వ్యాసాలు, సమీక్షలు గురించి కూడా పరిశోధకులు దృష్టి కేంద్రీకరించవచ్చుననే ఆలోచన కలుగుతుంది. భావి పరిశోధకులకు ఈ భాగం ఎంతో స్ఫూర్తిదాయకం.

పరిశోధకప్రభలో చివరిభాగం పేరు పరిశోధనాంతరంగం. నిత్యానందరావుగార్ని తెలుగులో పరిశోధన చేసేవారు నిత్యం స్మరించుకునేలా చేసిన తన జీవితకాల పరిశోధనగా గుర్తించాల్సిన గ్రంథం విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. నిజానికి, ప్రతి విశ్వవిద్యాలయంలోను సంబంధిత శాఖల వారు చేయవలసిన పనిని ఒక్కచేత్తో నిత్యానందరావుగారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖ, తెలుగుతో ముడిపడిన ఇతర శాఖలు… హిందీ, ఇంగ్లీష్, తులనాత్మక అధ్యయనం మొదలైన శాఖల వాళ్ళంతా చేస్తున్న పరిశోధనలను ఎప్పటికప్పుడు సేకరించి, ఆ వివరాల్ని తాజాగా అందించడమంటే సామాన్యమైన విషయం కాదు. చెప్పడానికి అతిశయోక్తిగా ఉండొచ్చు,

కానీ, తమ శాఖలో జరిగిన పరిశోధన వివరాలేమిటో తెలుసుకోవడానికి కూడా కొన్ని విశ్వవిద్యాలయాల శాఖలు ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ గ్రంథం మీద ఆధారపడుతున్నారంటే అతిశయోక్తికాదు.

ప్రతి పరిశోధకుడు ముందుగా పాటించవలసింది ‘పూర్వ పరిశోధనల సమీక్ష’ దీన్ని రీసెర్చ్ మెథడాలజీ చెప్పేటప్పుడు ‘రివ్యూ ఆఫ్ ది లిటరేచర్’ అనే విభాగంలో చెప్తారు. అది ప్రతి పరిశోధకుడు పాటించినప్పుడు మాత్రమే నిజమైన పరిశోధన పద్ధతిని పాటించినట్లవుతుంది. పరిశోధన చేసేవారు ఈ ‘రివ్యూ ఆఫ్ ది లిటరేచర్’ లో క్రింది అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. వాటిలో కొన్నింటిని చూద్దాం.

  1. తాను చేయబోయే పరిశోధనాంశాన్ని అంతకు ముందెవరైనా పరిశోధన చేశారేమోనని తెలుసుకోవాలి.
  2. ఒక వేళ తాను పూర్వపరిశోధనలను గమనించకపోతే తాను చేసే పరిశోధన మౌలికమైనదే అయినప్పటికీ, పూర్వపరిశోధనలను గమనించకపోవడం లేదా ఆ ప్రస్తావన చేయకపోవడం వల్ల ఆ పరిశోధన భావచౌర్యానికి గురైందనే అపవాదుని భరించాల్సి వస్తుంది. ఈ రెండింటి నుండీ ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ గ్రంథం పరిశోధకుడిని సులభంగా చాలావరకూ గట్టెక్కించేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ గ్రంథానికి 1987లో 1136 సిద్ధాంతవ్యాసాల విషయానుక్రమణికతో శ్రీకారాన్ని చుట్టారు. పరిశోధనాంశాల విషయానుగుణ సూచిక ఒక గ్రంథంగా రావడంతో దాన్ని ఎంతోమంది స్వాగతించారు. పరిశోధకులకు అలాంటి గ్రంథం ఉండాల్సిన అవసరాన్ని విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధకులు గుర్తించారు. కానీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోను జరుగుతున్న పరిశోధన వివరాలను సేకరించి ప్రచురించడం మాత్రం జరగలేదు. మరలా నిత్యానందరావుగారే 1998లో 2960 సిద్ధాంత వ్యాసాల విషయానుక్రమణికను తీసుకొచ్చారు. ఆ గ్రంథాన్ని ప్రచురించేటప్పుడే ఆయన నాకు తొలిసారిగా ప్రెస్ పనులు చేసుకుంటూ పరిచయమయ్యారు. ఆయన ప్రచురిస్తున్న ప్రెస్ దగ్గరే నేనూ నా ఎం.ఫిల్ గ్రంథాన్ని ప్రచురిస్తుండడంతో నాకు పరిచయమయ్యారు. ఆ రోజు ఆ పుస్తకం చూసి నాకెంతో ఆనందమనిపించింది. జ్ఞానానందకవిగారు రాసిన ఆమ్రపాలిపై నేను ఎం.ఫిల్ చేశాను. ఆ గ్రంథంపై అంతకుముందెవరెవరు పరిశోధన చేశారని తెలుసుకోవడానికే నేను ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావలసి వచ్చింది. అందువల్ల పరిశోధకులకు అలాంటి కష్టాలన్నీ తగ్గించేసిన మహానుభావుడిలా నాకు నిత్యానందరావు కనిపించారు. పరిశోధకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 2013లో ప్రచురించిన పరివర్ధిత ప్రతిలో సుమారు 5225 మంది చేసిన పరిశోధనల వివరాలను అందించారు. అకారాది క్రమంలో నామసూచిని కూడా ప్రచురించారు. ఇవి తయారుచేయడం అంత సులభమేమీకాదు. కానీ, సులభంగా పరిశోధకులు తమకు కావలసిన విషయాన్ని సత్వరమే గ్రహించడానికి ఎంతో అనువైనది. ఇప్పటికీ యూనికోడ్ ఫాంటుని ఉపయోగించి ప్రచురణలు జరగడం లేదు. ఎమెస్కో ఆ ప్రయత్నంలో కొంత ముందంజలో ఉంది. మిగతా ప్రచురణకర్తలంతా సంప్రదాయ పద్ధతుల్లో పేజిమేకర్ వంటివాటినే ఉపయోగిస్తున్నారు. యూనికోడ్ ఫాంటులో మనకు కావలసినట్లు నిమిషాల్లో నామసూచి, కావలసిన అక్షరదోషాల్ని ఒకేసారి వేగవంతంగా చేసుకొనే సౌకర్యాలు ఉన్నాయి. కానీ, పేజిమేకర్‌నీ, డైనమిక్ ఫాంటునే ఉపయోగించడం వల్ల పదసూచికలు, నామసూచికలు తయారు చేయడం ఎంతో కష్టంగా మారుతోంది. అయినప్పటికీ నిత్యానందరావుగారు ఈ గ్రంథానికి నామసూచి తయారు చేశారు. ఇవన్నీ తెలిస్తేనే ఈ పుస్తకానికి ఉన్న విలువ తెలుస్తుంది.

కందుకూరి వీరేశలింగంగారు సృజనాత్మక రచనలను చేసినంతకాలం హాయిగా ఉన్నారు. ఆ పుస్తకాలకు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. కానీ, ఆంధ్రకవులచరిత్రము రాయడం ఆయన జీవితాన్నే తినేసింది. ఆ సమాచారాన్ని సేకరించడానికి ఆయన ఎన్నో వ్యయప్రయాసలకు గురైయ్యారు. ఆరుద్ర కూడా తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం పన్నెండు సంపుటాలను రాయడానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది. తనకు బి.పి., షుగర్ వంటివన్నీ ఈ రచన చేసేటప్పుడే వచ్చాయని తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం పదమూడో సంపుటిలో ఆరుద్ర చెప్పుకున్నారు కూడా. అలాగే, నిత్యానందరావు కూడా పరిశోధకుల సమాచారాన్ని సేకరించడానికి నిత్యం ప్రయత్నిస్తుండేవారు. ఆయనకు ఏదైనా ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఫోను చేసినా, కలిసినా, అలాగే ఆయనే ఫోను చేసినా వారిమధ్య జరిగే సంభాషణల్లో తెలుగు పరిశోధనల వివరాల ప్రస్తావన కచ్చితంగా తెస్తుంటారని నేను చాలామంది దగ్గర విన్నాను. అది ఆయన చేసే జీవితకాల పరిశోధనగా మారిపోయిన పరిశోధకుల, పరిశోధనల వివరాల సేకరణ పట్ల ప్రదర్శించిన వారి నిబద్దతను తెలియజేస్తుంది. పరిశోధనల వివరాల సేకరణ, పరిశీలన అనేది పరిశోధనలో అత్యంత విలువైన అంశం అని తెలిసి కూడా దాన్ని నిర్లక్ష్యం చేసేవారికి దీని విలువ తెలియదు. కేవలం పరిశోధనల వివరాలు మాత్రమే ఈ గ్రంథంలో ఉంటే దీని గురించి బహుశా ఇంత ప్రముఖంగా చెప్పుకోవలసి వచ్చేది కాదేమో! నేటికీ తెలుగు పరిశోధన విధానం, తెలుగు పరిశోధన చరిత్రల గురించి సరైన పుస్తకాలు లేవు. ఈ మధ్య కాలంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెచ్.ఎస్.బ్రహ్మానందగార్లు ‘సాహిత్య పరిశోధన సూత్రాలు’ (1997) పేరుతో ప్రచురించిన గ్రంథం, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ప్రచురించిన ‘సాహిత్య పరిశోధనా కళ: విధానం’ (2017) పుస్తకాలు ఉన్నంతలో మంచి పరిశోధన విధానాలను తెలిపే గ్రంథాలు. కానీ, ఒక దానిలో భావజాలం, మరొకదానిలో పారిభాషిక పదజాల ఇబ్బందులున్నాయి. డా.ఎస్.జయప్రకాశ్ గారి ‘పరిశోధన విధానం’ (1990) పుస్తకంలో పరిశోధనలో పాటించాల్సిన సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటితో పాటు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నా, అవన్నీ పైన పేర్కొన్న మూడు పుస్తకాల కంటే అదనపు సమాచారం ఏమీలేదు. పరిశోధకుడికి తాను పరిశోధనాంశం ఎంచుకున్న దగ్గర నుండి తాను పరిశోధన చేసే పర్యవేక్షకులు, దాన్ని అడ్యుడికేట్ చేసేవారి వరకూ తెలియవలసిన విషయాలున్న పుస్తకం ప్రత్యేకంగా తెలుగులో లేదు. ఆ కొరతను నిత్యానందరావుగారి ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ చాలావరకూ తీరుస్తుంది. ఆ పుస్తకంలోని అన్ని ముందుమాటలను, అన్ని వివరాలను ఈ గ్రంథం నాలుగవ సంపుటిలో చేర్చలేదు. కానీ, ఆ పుస్తకంలోని పరిశోధనల తీరుతెన్నులు, పరిశోధకులు పాటించవలసిన నియమాలు, సిద్ధాంత గ్రంథాన్ని రాసేటప్పుడు పాటించాల్సిన శైలి, పర్యవేక్షకులు, పరిశోధకులు వదుల్చుకోవలసిన అంశాలు, తెలుగు పరిశోధన చరిత్ర, పరిణామ, వికాసాలు మొదలైనవెన్నింటినో దీనిలో చేర్చారు. వీటిలో నిత్యానందరావు చెప్పిన అంశాలు కొంతమందికి బాధను కల్గించవచ్చునేమో గానీ, వ్యవస్థను బాగుచేసే మాటలవి. మౌలికంగా చెప్పిన వాక్యాలవి. వాటిలో కొన్నింటిని చూద్దాం.

  1. “ఈ గ్రంథంలో ఐదువేలమంది పరిశోధకులుగా రికార్డ్ చేయబడితే వారిలో ముప్పావుశాతం మంది కేవలం డిగ్రీ రావడంతో పరిశోధన జీవితానికి, సాహిత్య వ్యాసంగానికి స్వస్తి చెప్పినవారే”
  2. “కొందరు విద్యార్థులకు కేవలం ఒక డిగ్రీ రావడంతో పరిశోధన ముగియవచ్చు. యూనివర్సిటీ లెక్చరర్లకు జీవనోపాధి మార్గంగా, పదోన్నతికి నిచ్చెనగా ఉపయోగపడవచ్చు. కానీ సాహితీవేత్తలకు, ఆలోచనాపరులకు, మేధావులకు వస్తుతత్వ విశేషాలను వెలికితీసే సాధనంగా, నూత్న సిద్ధాంతాలను, సూత్రీకరణలను ప్రతిపాదించే సాధనంగా పరిశోధన గోచరిస్తుంది”.

తమ జీవితకాలంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నవాళ్ళు కూడా నిత్యానందరావు వ్యాఖ్యానించినట్లు, ఆ పరిశోధన మీదే ఆధారపడి బతికేస్తున్నవాళ్ళెంతోమంది ఉన్నారు. అలాగే, కేవలం డాక్టరేట్ డిగ్రీ చేతికొచ్చిన తర్వాత పేరుకు ముందు డాక్టరు పెట్టుకోవడానికి తప్ప, ఒక్క కొత్త వాక్యం కూడా రాయనివాళ్ళెంతోమంది ఉన్నారు.

  1. “తెలిసిన స్వల్ప ఆధారాలతో తెలియని దాని అంతర్బహిస్తత్వాలను అన్వేషిస్తు క్రమపద్ధతిలో సాగడమే పరిశోధన అని స్థూలంగా సూత్రీకరించుకొంటే ఆ చిన్న సూత్రంలో అతి విస్తృతకార్యకలాపాలు అంతర్భూతంగా ఉన్నాయని చెప్పవచ్చు.”
  2. “మనమనుకున్నది మనం తెలుసుకొనేది ఒక స్పష్టమైన రీతిలో దేశకాల సాహిత్య స్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఒక క్రమపద్ధతిలో ఏవి? ఏమి? ఎందుకు? అన్న ప్రశ్నలకు తర్కసహంగా శాస్త్రీయంగా సమాధానం వెతకడమే పరిశోధన పరమార్థం.”

ఈ రెండు వాక్యాల్లోను పరిశోధనను నిర్వచించడంతో పాటు, పరిశోధన లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు.

  1. “పరిశోధన, విమర్శ, సమీక్ష ఒక్కో దశలో విడదీయరానంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తాయి; కలిసిపోతాయి కూడా. ఒక సిద్ధాంత గ్రంథంలోనే పరిశోధకత్వం, విశ్లేషకత్వం, సమీక్షత్వం చోటుచేసుకోవచ్చు… ఒక సిద్ధాంత గ్రంథంలో పరిశోధనాత్మకత, విమర్శనాత్మకత సమపాళ్ళలో ఉంటే విజ్ఞులు ఆదరిస్తారు. విషయాన్ని బట్టి కొన్నింటిలో పరిశోధనాత్మకత ఎక్కువగా ఉంటే, మరికొన్ని విమర్శలకు అధికస్థానం లభిస్తుంది. సాధారణంగా ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించే సిద్ధాంత గ్రంథాల్లో ప్రథమాధ్యాయంలో పరిశోధనాత్మకత అధికంగా గోచరిస్తే, తక్కిన అధ్యాయాల్లో విశ్లేషణరూపంలో విమర్శ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండింటినీ వదిలేసి కేవలం సమీక్షా మాత్రంగానో గ్రంథ సారంశ లేఖనంగానో ఉంటే ఆ సిద్ధాంత గ్రంథం తేలిపోతుంది”

ఈ వాక్యాలు పరిశోధకులకు ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు పరిశోధనలో ముందుకెళ్ళే క్రమంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కూడా హెచ్చరిస్తున్నాయి. ఏ పరిశోధన చూసినా కేవలం పరిశోధనాంశాలు మాత్రమే ఉండవు. విశ్లేషణ కూడా ఉంటుంది. కొన్ని సార్లు కేవలం వ్యాఖ్యానం మాత్రమే ఉండొచ్చు. ఇంకొన్ని సార్లు సమీక్ష చేసుకొంటూ ముందుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటివారికి ఈ వాక్యాలు తాను చేసిన పరిశోధనలకు మరోసారి చూసుకోవడానికి గానీ, తాను కనుగొన్న అంశాలను మాత్రమే చెప్పకుండా విశ్లేషణ చేయాల్సిన అవసరమేమిటో కూడా అవగతమవుతూ గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిశోధనలను విమర్శనాత్మక పరిశోధనలు, సమీక్షాత్మక పరిశోధనలు అని కూడా పిలుస్తుంటారు. ఈ అంశాలన్నీ సాహిత్య పరిశోధనల్లో కనిపించే ప్రత్యేకతలు. వీటిని నిత్యానందరావుగారు లోతైన దృష్టితో సూత్రీకరించే ప్రయత్నం చేశారు.

  1. “తెలుగువారి భాషా సాహిత్యాలకు, భావసంస్కారాలకు, రాజకీయ, ఆర్థిక గమనాలకు 19వ శతాబ్ది నూతన ద్వారాలను తెరిచింది… కూపస్థ మండూకోపనిషత్తులు చదువుకుంటున్న భారతీయులకు తెలుగువారికి ప్రపంచమెంత విశాలమైందదో, వైజ్ఞానిక యాంత్రిక ఆవిష్కరణల ప్రయోజనమేమిటో ఆంగ్ల విద్య వల్ల తెలిసి వచ్చింది.”

ఈ వాక్యాలు చదివిన వారికి నిత్యానందరావుగారి వాస్తవిక సామాజిక దృష్టి ఏమిటో తెలుస్తుంది. తాను రాసేదానిలో వస్తునిష్ఠ ఎలాంటిదో స్పష్టమవుతుంది.

  1. ‘పరిశోధక రత్న ఆకరాలకు అభివందనం’ శీర్షికతో రాసిన వ్యాసంలో తెలుగులో పరిశోధన చేసేవాళ్ళంతా… అది భాష, సాహిత్యం, జానపదం, తులనాత్మకం, ప్రాచీనం, ఆధునికం… ఏదైనా సరే మన పూర్వీకులు చేసిన పరిశోధన పరిణామాల్ని తెలుసుకోవడానికి, సమాచార సేకరణకు అనేకమార్గాలున్న ఈ కాలంలో మనమెంతలోతుగా పరిశోధన చేయాలో ప్రేరణనిచ్చే మహానుభావులను చక్కగా పరిచయం చేశారు. తెలుగువాళ్ళకున్న పరిశోధక నిధులను చూపించారు.
  2. తెలుగులో జరిగిన పరిశోధనలన్నింటినీ సమీక్షిస్తూ ఆ పరిశోధనల వికాసాన్ని ఎనిమిది విభాగాలుగా వింగడించారు. తెలుగు పరిశోధన కూడా ఒక ప్రక్రియగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఎవరైనా ‘తెలుగు పరిశోధన వికాసం’ గ్రంథాన్ని రాస్తే, దాని ప్రణాళికను ఎలా వేసుకోవచ్చో ఒక చక్కని హైపోథీసిస్‌లా ఆ ఆంశాల్ని అందించారు. సాహితీ విలువలను పరిశీలించడం, ఛందోవ్యాకరణాది శాస్త్రాలను అన్వయించి పరిశోధించడం, కేవల శాస్త్రాంశాల మీద, శాస్త్ర గ్రంథాల మీద కృషి చేయడం, ప్రక్రియా వికాసాల్ని పరిశీలించడం, చారిత్రక, సామాజిక అంశాలను పరిశీలించడం, కవుల వ్యక్తిత్వాలను, వారి కృతులను కలిపి పరిశోధించడం, తులనాత్మక పరిశీలన చేయడం, తెలుగులోని వివిధ ప్రక్రియల్లో కనిపించే వివిధాంశాలను గుర్తించి పరిశోధించడం అనే విభాగాలుగా పరిశోధనల్ని వింగడించి సోదాహరణంగా విశ్లేషించారు. ఇలా విశ్లేషించాలంటే మొత్తం తెలుగు పరిశోధనల మీద ఒక అవగాహన లేకపోతే సాధ్యం కాదు. తన జీవితాంతం తెలుగులో జరుగుతున్న పరిశోధనాంశాల్ని సేకరిస్తూ, వాటి గురించి లోతుగా ఆలోచిస్తూ ఉండడం వల్లనే ఇలాంటి విభజన చేయగలిగారు.

పరిశోధనలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయనుకోవడం మనల్ని మనం వంచనకు గురిచేసుకోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధాంత గ్రంథాల్ని విశ్వవిద్యాలయాలకు సమర్పించిన ప్రతివారికి పట్టాలను ఇప్పిస్తున్న స్థితినీ కాదనలేం. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా ప్రస్తావించారు. పరిశోధనలు ఇలా దిగజారిపోవడాన్ని ఆయనే కాదు, అనేకమంది బాధను దిగమింగుకుంటూ కుల, లింగ, ప్రాంతీయ అస్తిత్వాలకు, రాగ ద్వేషాలకు లొంగిపోయి పరిశోధనలను పూర్తిచేయిస్తున్న వాస్తవాలను కాదనలేని పరిస్థితి ప్రతి విశ్వవిద్యాలయంలోను కనిపిస్తుంది. ఇవన్నీ కేవలం వ్యక్తిగతమైన కారణాల వల్లనే జరుగుతున్నాయని అనలేం. మనకున్న వ్యవస్థలు ఆ పనిని చేయిస్తున్నాయి. అయినా, ఎక్కువమంది తమ పరిశోధనలను ఆత్మద్రోహం చేసుకుంటూ చేయించడం లేదు. ఎంతో నిబద్ధతతోను, నిజాయితీతోను చేయిస్తున్నారు. వీటిని కూడా నిత్యానందరావు చక్కగా పేర్కొన్నారు. అందుకనే ఈ పుస్తకం వచ్చిన తర్వాత ఏయే విశ్వవిద్యాలయాల్లో చర్విత చరణంగా ఒకే అంశంపై పరిశోధనలు జరిగాయో తెలుస్తుంది. కొత్తగా తెలుగులో పరిశోధనాంశం తీసుకొనేవాళ్ళని ప్రతి విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు “నిత్యానందరావుగారి విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన చూశావా?” అని అడుగుతుంటారు. ఆ మాటే ఈ పుస్తకం సాధించిన లక్ష్యాన్ని, ఆశయాన్ని, ప్రయోజనాన్ని ముప్పేటలా తెలియజేస్తుంది. ఈ భాగాన్ని పది ఉప విభాగాలుగా అందించడం వల్ల పరిశోధనలో తెలుసుకోవలసిన అంశాల్ని ఒక క్రమపద్ధతిలో వివరిస్తున్నట్లుంది. ‘పరిశోధనాంతరంగం’లో పరిశోధన అర్థ వివరణ, నిర్వచనాలతో పాటు, పరిశోధన స్వరూప, స్వభావాల్ని, పరిశోధన, విమర్శ, సమీక్షల మధ్య తారతమ్యభేదాల్ని పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘పరిశోధన విధానం’ పుస్తకాల్లో ఇంత వివరణాత్మకంగా లేని ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన స్వభావం గల అంశాల్ని ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. ఈ గ్రంథంలో తెలుగు భాషా, సాహిత్య రంగాల్లో విశేషమైన పరిశోధనలు చేసిన వారిని పరిచయం చేస్తూ ‘పరిశోధన రత్న ఆకరాలకు అభివందనం’ అన్నారు. సి.పి.బ్రౌన్ మొదలుకొని కావలి వెంకట బొట్టయ్య, రామస్వామి, కొమట్టాజు వెంకట లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి వీరభద్రరావు ఇలా ఎంతో మంది తెలుగు సాహిత్య, భాషా జానపద సాహిత్య పరిశోధకుల గురించి వివరించారు. వీటిని చదివిన తర్వాత ‘తెలుగు భాషా, సాహిత్య పరిశోధకుల చరిత్ర’ను కొంతమందికి రాయాలనే ప్రేరణ కూడా కలుగుతుందనిపిస్తుంది. అంతేకాదు, పరిశోధనకు ఒకప్పుడు పరిశోధకులు తమ జీవితాలను ఎంతగా త్యాగం చేశారో అనిపిస్తుంది. ‘తెలుగు పరిశోధన వికాసం’ శీర్షికలో దేశవ్యాప్తంగా జరిగిన పరిశోధనలను నిష్పక్షపాతంగా సమీక్షించిన తీరు ప్రశంసనీయం. సమకాలీన సాహిత్యం , సామాజిక అంశాలపై జరిగిన పరిశోధనలను అంచనా వేయడంలో వైయక్తిక దృష్టికంటే, వ్యవస్థీకృత దృష్టిని ప్రసరించడం ఎంతో బాగుంది. ఈ విభాగంలో “మన పరిశోధన కూడా చేరి ఉంటే ఎంత బాగుండే”దనేటట్లుగా వాటిని పేర్కొన్నారు. తెలుగులో జరిగిన పరిశోధనలను వర్గీకరిస్తూ సాహితీ విలువలు, ఛందోవ్యాకరణాది అంశాలు, కేవల శాస్త్రాంశాలు, శాస్త్ర గ్రంథాలు, ప్రక్రియా వికాసాలు, చారిత్రక సామాజికాంశాలు, కవులు వ్యక్తిత్వాలు, తులనాత్మక అంశాలు, వివిధాంశాలు అనే ఎనిమిది రకాలుగా వాటిని వివరించారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన గ్రంథంలో వివిధ పరిశోధన గ్రంథాల్ని ఎలా విభాగం చేయాలని ఎంతో సంఘర్షణపడి ఉంటారు. ఇది సాహిత్య చరిత్రలో యుగవిభజన చేయడానికంటే కష్టతరమైంది. తెలుగులో జరిగిన పరిశోధనలను రచయితల పేరుతో విభజన చేయాలా? ప్రాచీన, ఆధునిక ప్రక్రియలను అనుసరించి చేయాలా? కేవలం ప్రక్రియలను అనుసరించే చేయాలా? ఎలా చేస్తే భావి పరిశోధకులకు అనుకూలంగా, సులభంగా ఉంటుందనే సంఘర్షణ సామాన్యమైంది కాదు.

ఈ గ్రంథం చివరికి వచ్చేసరికి ఆధునిక కాలంలో తగినన్ని వనరులు, అవకాశాలు ఉన్నా, మన పూర్వీకులు చేసినంత పరిశోధన జరగడం లేదని నిత్యానందరావుగారు రాసిన వాక్యాలు ఒక నిరాశ, నిస్పృహల గమ్యంగా భావించకూడదు. పరిశోధనల వేగం, పరిశోధనల్లో ప్రవేశించిన అనవసరమైన జోక్యాలు గురించిన ఆవేదనగా దీన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అన్నట్లు ఇంతకుముందున్నవే పరిశోధనలు, నేడు జరుగుతున్నవి పరిశోధనలు కాదంటున్నారనుకునే అవకాశం ఉంది. ఆ కాలంలో కేవలం కొన్ని కులాలకు, వర్గాలకు మాత్రమే అవకాశం ఉండే పరిశోధన రంగం ఆధునిక కాలంలో అనేకమందికి అవకాశంగా మారింది. తొలితరం వాళ్ళు చేసిన పరిశోధన వ్యక్తులకంటే ఒక ప్రక్రియను తీసుకొని చేయవలసిన అవసరం కూడా అప్పటిదని మనం గమనించాలి. ఆ పరిశోధకులే నేడున్నా, వ్యక్తులమీదా, భావజాలాలమీదా పరిశోధనలు చేసుండేవారేమో. నిత్యానందరావుగారే పేర్కొన్న కొన్ని పరిశోధనల్లో ఆధునిక కాలంలో కూడా ఉత్తమశ్రేణి పరిశోధనలు ఉన్నాయి. ఉత్తమమైన పరిశోధనలు చేయించాలనే పట్టుదల ఉన్న అధ్యాపకులు కూడా ఉన్నారు. పరిశోధనలో బొమ్మా-బొరుసు రెండు కోణాలు ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని కూడా మనం గుర్తుచేసుకోవాలి. ప్రాచీన సాహిత్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయలేకపోవడానికి కారకులెవరు? ఒక పద్యాన్ని ప్రతిపదార్థాన్ని, అన్వయాన్ని, భావాన్ని వివరిస్తూ, భావానుగుణంగా పద్యాన్ని చదవలేకపోయినా, వివరించలేకపోయినా నేటి పరిశోధకులు అధ్యాపకులు మాత్రమే కారణం కాదు; వాళ్ళని అలా తయారుచేసిన మొదటి, రెండవతరం అధ్యాపకులు, పరిశోధకులు కూడా కారణమే. వాళ్ళు వేసిన విత్తనాలే కదా నేడు మొక్కలైనా, వృక్షాలైనా.. ఆనాడు పరిశోధనలు చేసిన వర్ణాన్ని, వర్గాన్ని కూడా లెక్కల్లోకి తీసుకొని విశ్లేషించుకోవాలేమో. ఒకవేళ సరైన సిద్ధాంత గ్రంథాలు, పరిశోధనలు రావడం లేదంటే, అటువంటి సిద్ధాంత గ్రంథాలు వచ్చినప్పుడు వాటిని తిరస్కరించగలగాలి. అంతే, అలా తిరస్కరించడానికి లేదా అవి పరిశోధనకు అనర్దాలని చెప్పడానికి తగిన ఉపపత్తులు చూపించాలి. ఇలా మనం చేయగలినప్పుడు ఉత్తమ పరిశోధనలు రావాలనుకునే నిత్యానందరావుగారు, అటువంటి ఆలోచనాపరుల లక్ష్యాలు చాలా వరకూ నెరవేరుతాయి. జానపదసాహిత్యంలో నిజంగా క్షేత్రపర్యటన చేసి చేస్తున్న పరిశోధనలను నిత్యానందరావు మెచ్చుకుంటూనే, పూర్వ పరిశోధకుల కృషిని విశేషంగా ప్రశంసించారు. చివరిలో సంప్రదించాల్సిన గ్రంథాలంటూ పరిశోధకుల ఆకరాల అన్వేషణను చూపించడం పరిశోధకులకు ఒక చక్కని మార్గదర్శనాన్ని వేశారు. పరిశోధకులు, పర్యవేక్షకులు వదులుకోవాల్సిన జాడ్యాల్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లు ఈ గ్రంథంలో చెప్పారు. ఇవన్నీ పరిశోధకులకు మాత్రమే కాదు, పర్యవేక్షకులకు కూడా సానుకూలతతో స్వీకరించాల్సిన సూత్రాలు.

మొత్తం మీద ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారి రచనల సమగ్ర సాహిత్యంలో నాలుగవ భాగంగా వస్తున్న ‘పరిశోధక ప్రభ’ను పరిశోధకుల చీకటిని పోగొట్టి వాళ్లలో గొప్ప వెలుగులను ప్రసరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పరిశోధనకు ఈ ‘పరిశోధక ప్రభ’ ఒక దారిదీపంగా అభివర్ణించవచ్చు. సాహిత్య విమర్శలో అనువర్తిత విమర్శలాగా, అనువర్తిత పరిశోధన గ్రంథంలా ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. తెలుగులో భాషా, సాహిత్య, జానపద పరిశోధనలు జరుగుతున్న తీరుని చెప్తూనే, గుణదోషాలను చర్చించడంలో ఆయనలో ఒక సహృదయ విమర్శకుడు కనిపిస్తాడు. విశ్వవిద్యాలయంలో సుమారు నాలుగు దశాబ్దాల జీవితానుభవాలనుండి చెప్పిన అనేకాంశాలను వివరించడాన్ని చూస్తే ఆయనలో ఒక క్రమశిక్షణ గల పరిశోధకుడు కనిపిస్తాడు. ఈ అనుభవాలు భావి పరిశోధకులకు, పర్యవేక్షకులకు ఒక దారిదీపాన్ని చూపుతాయని నమ్ముతున్నాను. పరిశోధనలు చేసేవారు జాగ్రత్తగా పరిశోధనలు చేయాలనే జాగృతిని కూడా ఈ గ్రంథం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను. ఒక్కొక్క గ్రంథాన్ని ప్రచురించడానికి సుమారు లక్షరూపాయలు పైనే అవుతున్నా, ఎంతో అందంగా పుస్తకాల్ని తీసుకొస్తున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ ప్రచురించవలసిన పుస్తకాల్ని కూడా తన స్వంత డబ్బుతో ప్రచురిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారనే ఒక గొప్ప పరిశోధకుడు, ఒక ఉత్తమ అధ్యాపకుడు, ఒక ఉత్తమ విమర్శకుడు తెలుగునేలపై జీవించారని చెప్పడానికి సజీవ సాక్ష్యాలుగా ఈ గ్రంథాలు నిలిచి, ఆయనకు శాశ్వత కీర్తిని తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. అంతే కాదు, ఆ కాలంలో కూడా పరిశోధన కోసం తపన పడేమహానుభావులున్నారనుకునేవాళ్ళూ ఉంటారు. ఇటువంటి ఉత్తమ గ్రంథానికి అభిప్రాయాన్ని రాయమనడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తూ, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

అధ్యక్షులు, తెలుగుశాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

హైదరాబాద్-500 046, మొబైల్: 9182685231

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here