పరిష్వంగం

0
2

[dropcap]నీ[/dropcap]దు ఆత్రాల ఆవాహనా మంత్రం
నాదు ఆరాధనా అనుగ్రహ సూత్రం
చేయు ప్రణయ ప్రళయ సంగమ
ప్రారంభమీ గాఢ పరిష్వంగం…….

అలుపెరుగని అధర రణమున వగసి
మెడవంపున శ్వాసల ఊసులలో ఎగసిన
ఆశల కొనలను తడిమిన నీ  అగ్నికణ స్పర్శ
కావాలని తనువంతా  విరహజ్వాలల వేడెక్కుతుంటే…….

నన్నావహించిన నీ మదనపు మైకానికి
కోపించిన చిరుగాలి దూరంగా పోతుంటే……
కరుణించిన తమకపు జల్లుల
జివ్వున ఉబికిన అంతరవాహిని
గుసగుసలేనా ఈ గాఢ పరిష్వంగం……

మనఃతపముల జ్వాలలను భరించలేని
బంధనాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతుంటే….
అతిశయమణిగిన కాంతి  నీ వేగానికి
దారినిచ్చి దాసోహమంటుంటే……
మనలను చేరాలని శక్తులన్ని ఒడ్డిన ప్రకృతి
నా నిజమును కప్పిన నీ నైజము చూసి
నివ్వెరపోతుంటే…….

నింగిని వదిలి నీవు….
నేలను మరచి నేను…..
కనులకానని సన్నని క్షితిజమున
మనమే మనమయి మమేకమవుతుంటే……..
పరమమైన పరమ ప్రేమ పవిత్ర శాంతిని
నిర్వచించిన జీవాత్మ పరమాత్మల
ఐక్యతా రాగమీ గాఢ పరిష్వంగం……..
మన పరిష్వంగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here