Site icon Sanchika

పరివర్తన

[dropcap]”సు[/dropcap]రేష్ ఏం జరుగుతోంది, బయట ఒకటే కుండపోత వాన. మనం వాతావరణం ప్రిడిక్షన్ చూసి కదా ప్లాన్ చేసుకోవాలి” అంటూ రుసరుస లాడుతున్నాడు అజయ్ ఫోన్‌లో.

“లేదు సర్ ఇలాంటి ప్రిడిక్షన్ గత వారం లేదు. పైగా బయట వైరస్ కారణంగా ఆంక్షలు కూడా పెరుగుతున్నాయి. ఒక రెండు రోజుల్లో మనము ప్లాన్ చేసినట్టే షూట్ చేసేద్దాం సర్,కాస్త సద్దుకోండి”.

“సర్లే కానీ ఇంకా ఎవరెవరు వున్నారు ఇక్కడ మన యూనిట్ వాళ్ళు” అన్నాడు అజయ్.

“సర్ మీరు, రైటర్, డైరెక్టర్ గారు వున్నారు సర్. హీరోయిన్ రావాల్సి ఉంది కాని ఫ్లైట్ క్యాన్సల్ అయ్యింది సర్, మేము వేరే దగ్గర ఉన్నాం అండి, దారి మొత్తం నీళ్లతో మునిగిపోయింది, కాస్త వాన తెరిపిస్తే గాని నేను అక్కడికి రాలేను సారీ సర్” అంటూ తన అసహాయతని వ్యక్తం చేశాడు మేనేజర్ సురేష్..

చేసేది ఏమి లేక రిసెప్షన్‌కి ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ చేసి కూర్చుని టీవీ పెట్టాడు అజయ్. నగరంలో వరద ఉదృతి గురించి వార్తలు చూస్తే ఇది ఇప్పట్లో తగ్గేలా లేదు అనుకున్నాడు. ఇంతలో కాఫీ వస్తే తాగుతూ మెల్లిగా బాల్కనీలోకి వచ్చాడు. మెల్లిగా పక్కనే ఇంకో బాల్కనీ లో నుండి “రఘు వంశ సుధా” అనే సంకీర్తన వినిపిస్తోంది, ఆ సంకీర్తన వినిపిస్తున్న దిశ గా చూసాడు అజయ్. మనిషి కనపడలేదు కానీ ఆ గాత్రం మాత్రం ఆత్రం కలిగించింది అజయ్‌కి.ఒక మూడు పాటలు విన్నాక ఇక ఏమైతే అయ్యింది పరిచయం చేసుకోవాలి అని కుతుహులం పెరిగిపోయింది అజయ్‌కి.

అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ అని, తాను ఒక పేరు మోసిన కథానాయకుడు అని మరిచి పక్కింటి పిల్లాడి లాగా ఒక గొంతు విని ఇలా వెంపర్లాడటం తనకే నవ్వొస్తోంది, కానీ పొద్దున్నుంచి గది లోనే ఉన్న తనకి విపరీతంగా చిరాగ్గా ఉంది. అలా అని డైరెక్టర్ లేదా రైటర్‌తో కూర్చుంటే ఏవో కథలు విషయాలు చర్చకి వస్తాయి. సాధారణంగా తాను బయట షూట్ టైంలో ఎక్కువ వాళ్ళ తోనే ఉంటాడు, కానీ ఈ వాతావరణం మార్పుకి డైరెక్టర్‌కి కాస్త జ్వరం అని పడుకుంటున్నా అని మెసేజ్ చేసాడు. రైటర్ రాత్రి తన చెల్లెలి ఇంటికి వెళ్లినవాడు వర్షం కారణంగా ఇరుక్కుపోయాడు. ఇహ మిగిలింది తను ఒక్కడే, తన ఫేమ్ కారణంగా కింద రిసెప్షన్ లోకి వెళ్తే కొన్ని ఇబ్బందులు. అంతలో ఈ గొంతు కమ్మగా పిలుస్తోంది అనిపించింది.

మెల్లిగా వెళ్లి బెల్ కొట్టాడు, అప్పటి దాకా శ్రావ్యంగా వినిపిస్తున్న పాట ఆగి, మెల్లిగా తలుపు తెరుచుకుంది. లోపలి నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది “నేను అజయ్ వర్మ” అని పరిచయం చేసుకునే లోపే “అయ్యో, సర్. మీరు తెలియక పోవడం ఏంటి, లోపలికి రండి. మీరు ఏంటి సర్ ఇక్కడ? మీరు హైదరాబాద్‌లో కదా ఉండేది” అంటూ అడిగింది ఆ అమ్మాయి.

“హ ఒక షూటింగ్ ఉంటే వచ్చాము అనుకోకుండా ఈ వాన వలన ఇక్కడ ఇలా ఉండి పోయాను, ఈ పక్క రూమ్‌లో ఉన్న నాకు మంచి పాట వినిపిస్తే అంత అందమైన స్వరం ఉన్న స్త్రీమూర్తి ఎవరా అని ఇలా వచ్చాను, మీరు సింగరా” అని అడిగాడు.

“అయ్యో లేదండి, నా పేరు కౌముది నేను ఒక కంపెనీలో ఫైనాన్స్ హెడ్‌గా పని చేస్తున్నా. ఒక సెమినార్ కోసం అని బెంగళూర్ నుండి ఇక్కడికి వచ్చాను, అనుకోకుండా ఈ వానలకి ప్రస్తుతం పోస్ట్‌పోన్ అయ్యింది, నేను కూడా మీ లాగే ఈ హోటల్‌లో ఇరుకున్నాను. రేపు సాయంత్రం కానీ ఈ వాతావరణం సరి అవ్వదు అని అంటున్నారు కింద రిసెప్షన్‌లో. ఏదో కాలక్షేపం కోసం పాటలు పాడుకుంటున్నా, పెద్ద ప్రావీణ్యం లేదు లెండి.” అంది కౌముది ఎంతో వినయంగా.

“కాఫీ తగుతారా” అంటూ రిసెప్షన్‌కి ఫోన్ చెయ్యబోయింది, “అయ్యో వద్దండి ఇందాకే అయ్యింది” అన్నాడు అజయ్.

“ఒక పని చేద్దాం అండి, చల్లగా ఏ లెమన్ జ్యూసో చెప్తాను. ఈ ఊరి వాతావరణం ఏంటో గాని బయట వాన పడుతున్నా లోపల మాత్రం వేడిగా ఉంటోంది” అని ఫోన్ చేసి జ్యూస్ చెప్పింది. “సో ఏ మూవీ షూటింగ్ సర్, డైరెక్టర్ ఎవరు, హైదరాబాద్‌లో వున్నప్పుడు చాలా ఇష్టంగా హాల్‌కి వెళ్లి చూసేదాన్ని సినిమాలు. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్, పార్కింగ్ గోల తట్టుకోలేక మరీ బావుంది అంటే తప్ప హాల్ కి వెళ్లట్లేదండి, కానీ ఓటిటిలో మాత్రం చూస్తాను, ఎంతైనా మన తెలుగు వారికి సినిమా కంటే మహా మక్కువ కదండీ” అంటూ నవ్వేసింది కౌముది. ఆ నవ్వు హాయిగా పున్నమి వెన్నెల అంత స్వచ్ఛంగా ఉంది ఎక్కడా బేషజం లేదు.

“హ అవును నేను కూడా విన్నాను బెంగళూర్‌లో చాలా మటుకు హాల్ కి వెళ్లడం తగ్గించేశారు ఈ మధ్య అని, అవును మీరు ఫ్యామిలీతో వుంటున్నారా బెంగళూరులో, మీ వారు ఏమి చేస్తుంటారు” అని అడిగాడు అజయ్. “లేదండి నేను సింగల్ మదర్‌ని, నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి టెన్త్ చదువుతోంది రెండో పాప ఏడో క్లాస్” అంది కౌముది.

“ఓహ్ సారీ మీ వారు ఎలా….” అంటూ ఆగాడు అజయ్. “అయ్యో లేదండి మా ఇద్దరికీ కుదరలేదు బ్రేక్ అప్ అయ్యింది… పెళ్లి పీటలు ఎక్కలేదు, నా వరకు మాతృత్వం అనేది నాకు నేను ఇచ్చుకున్న కానుక, పిల్లలిద్దర్నీ హోమ్ నుండి దత్తత తీసుకున్నా. పెద్ద పాపని నెలల వయసులో నేను తెచ్చి పెంచుకుంటుంటే దానికి ఎనిమిది ఏళ్ళు వచ్చాక అమ్మా నాకు చెల్లి కావాలి అని అడిగింది, మరి చెల్లి వస్తే నాతో సహా అన్నీ షేర్ చేసుకుంటుంది నీకు ఒకే నా అడిగాను, అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా సర్, అమ్మా నీ ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది తెలుసా” అంటూ ఆగింది

అప్పటికే కౌముది వైపు ఎంతో ఆరాధనగా చూస్తున్నాడు అజయ్. “ఏమైంది సర్, ఎదో పొరపాటున తలుపు కొడితే ఇది నా బుర్ర తినేస్తోంది అనుకుంటున్నారా” అని అడిగింది. “అయ్యో అదేం లేదు అండి. మీరు నన్ను సర్ అని పిలవద్దు, పేరు తోనే సంబోధించండి, మీ లాంటి ఆదర్శ భావాలు ఉన్న వారి గురించి న్యూస్‌లో పుస్తకాలలో చడవడమే గాని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అండి, అయినా ఒక్కోసారి సొంత పిల్లలు విసిగిస్తేనే కోపం వస్తుంది, అలాంటిది పెంచుకునే పిల్లలు అది కూడా ఈ చిన్న వయసులో.”

“అయ్యో సహనం లేకపోతే చాలా కష్టం అండీ, అందులో మా ఆడవాళ్ళకి సహనమే ఆభరణం, ఎంత సహనం లేకపోతే మీ అమ్మగారు, మీ ఆవిడ గారు ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు చెప్పండి.”

“అయ్యో మాటల్లో గమనించలేదండి మధ్యాహ్నం కావస్తోంది. లంచ్ వీళ్ళు ఏమి పెడతారో ఏమో కిందకి వెళదామా అండి” ఆన్నాడు అజయ్. “నేను కిందకి వెళ్తాను అండి, మీరు రూమ్ కి తెప్పించేసుకోండి కిందకి వెళ్తే మీకు జనాలతో ఇబ్బందేమో కదా” అంది మోహమాటంగా కౌముది.

“లేదండి పాపం వాన, వాళ్ళకి స్టాఫ్ తక్కువ వుండి వుంటారు, మళ్ళీ రూమ్ సర్వీస్ ఎందుకు, వెళ్దాం పదండి” అని కిందకి వచ్చారు ఇద్దరు. అజయ్‌ని చూసిన వెంటనే కింద అందరూ కొంచెం హడావుడి పడుతున్నారు, హోటల్ మేనేజర్ వచ్చి “సర్ రూమ్‌కి తెచ్చి ఇచ్చే వాళ్ళం కదండీ, పాపం మీకు ఎందుకు శ్రమ” అంటూ నసిగాడు,

“చూడండి సుబ్రహ్మణ్యం గారు, మీకు ఈ హోటల్‌లో నాలాంటి విఐపిలు చాలా మంది ఉండి వుంటారు వాళ్ళని చూసుకోండి, అసలే మీ సమస్యలు మీవి పాపం” అంటూ నవ్వుతూ భుజం తట్టాడు అజయ్. ఇదంతా చూస్తున్న కౌముదికి చాలా ఆశ్చర్యంగా ఉంది. తాను విన్నదాని ప్రకారం ఇతని ప్రవర్తన పబ్లిక్‌లో ఫ్రెండ్లీగా ఉండరని, ఎవరైనా ఫొటోస్ ఆటోగ్రాఫ్ అంటే తిట్టి పంపిస్తారు అని విన్నది. అలాంటిది ఇక్కడేమో పూర్తిగా విరుద్ధంగా ఉంది ఇతని ప్రవర్తన. ఇదే మాట అక్కడ ఉన్న స్టాఫ్ కూడా గుసగుసలాడుతుంటే తాను విన్నది. ఇంతలో డైరెక్టర్ కూడా కిందకు వచ్చాడు “సారీ అండి కొంచెం జ్వరం వచ్చినట్టు అయ్యింది వాతావరణం మార్పుకి అనుకుంటా మీకు ఇబ్బంది కలిగింది, ప్రొడ్యూసర్ గారు పొద్దున్నుంచి ఫోన్ చేసి వాయించేస్తున్నారు, సర్‌కి ఇబ్బంది కలిగింది మన వల్ల అని” అని చాలా ఇబ్బందిగా చేతులు నలుపుతున్నాడు. “చూడండి రావు గారు, ప్రకృతి మన చేతిలో ఉండదు కదా ఇవాళ రేపు చూద్దాం. ఒకవేళ తగ్గక పోతే షెడ్యూల్ క్యాన్సల్ చేసేద్దాం, మీరు ప్రొడ్యూసర్‌కి నచ్చచెప్పుకోవలేమో”.

అజయ్ వర్మ ప్రవర్తనలో ఈ మార్పుకి డైరెక్టర్‌కి ఒక్కసారి మతిపోయింది, పొద్దున నుండి ఇక్కడికి రాలేదని ఈపాటికి ఈయన చిందులు తొక్కుతుంటాడు అని భయపడి పోయాడు, అలాంటిది ఈయన కూల్‌గా మాట్లాడుతుంటే అసలు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. లంచ్ అవ్వగానే అజయ్ కళ్ళు కౌముది కోసం వెతుకుతున్నాయి. ఏమి జరుగుతోందో తనకే అర్థం కాలేదు, తాను ఎంతో మంది టాప్ హీరోయిన్స్‌తో కలిసి నటించాడు. తన భార్య కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్ మాధవి. తనని చూసి వెంటపడలేదు, చాలా మాములుగా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు వెంటనే ఒప్పేసుకుంది. ఈ రోజు ఈ అమ్మాయిని చూస్తే మాత్రం ఏదో తెలియని అనుబంధం కనిస్పిస్తోంది. పరిచయం అయ్యి అరపూట కాలేదు, ఆదర్శాలకి అందం విద్య తెలివి అనే అలంకరణ చేసిన రంగవల్లి లాగ వున్న కౌముదిని చూస్తుంటే ముచ్చటగా వుంది.

ఇంతలో ఏదో ఫోన్ మాట్లాడుతూ కౌముది గది లోకి వెళ్ళిపోయింది. ఆమెనే చూస్తూ వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అజయ్. సరే తాను కాసేపు డైరెక్టర్‌తో మాట్లాడి రూమ్ దగ్గరికి వచ్చేసరికి, కౌముది రూమ్ డోర్ తీసే వుంది. “ఏంటి కౌముది గారు, బిజీనా, ఆఫీస్ ఫోన్ అనుకుంటా” అంటూ అడిగాడు అజయ్. “హహ లేదండి మా పిల్లలు. నేను ఇక్కడ ఇరుక్కుని వున్నాను అని భయపడొద్దు అని నాకు ధైర్యం చెప్తున్నారు” అని నవ్వుతోంది. “మరి మీరు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి తోడు ఎవరు వుంటారు, అసలే బయట పరిస్థితులు బాలేవుగా”.

“హా అవును అండీ, ఇలా నేను బయటకి వచ్చినప్పుడే కాదు ఎప్పుడు నాకు వాళ్ళకి తోడుగా ఉండేది మా అమ్మానాన్న. వాళ్ళని చక్కగా చూసుకుంటారు, అవును అజయ్ గారు మీ పిల్లలు ఏమి చేస్తున్నారు.”

“హ మా వాళ్ళు ఇద్దరు తలో దారి. అమ్మాయి చాలా క్రియేటివ్. సినిమా ఫీల్డ్‌లో కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి అంటుంది. దానికి తగినట్టు ఏవో కోర్సెస్ చేసింది. నా పేరు వాడకుండా సొంతంగా ప్రయత్నాలు చేస్తోంది, పిల్లాడు ఇంకా ఇంటర్‌లో వున్నాడు వాడికి అకాడమిక్ ఇంట్రస్ట్ ఎక్కువ. అందువల్ల వారసత్వాల గోల లేదు, అన్నట్టు కాసేపు బాల్కనీ లో కూర్చుందామా.”

“పిల్లల పట్ల మీ వైఖరి బావుందండి, తప్పకుండా. మీరు గ్రీన్ టీ తాగుతారా లేక మసాలా టీ. మనం బాల్కనీలో కూర్చుని టీ తో కబుర్లు నంచుకుందాం” అంటూ రిసెప్షన్‌కి ఫోన్ చేసింది. ఇద్దరు బాల్కనీలో కూర్చుని కాసేపు వర్షం చూస్తూ కూర్చున్నారు.

“వానలో సముద్రం చూడ్డం నాకు భలే ఇష్టం. ఇంక పౌర్ణమిలో అయితే మరీనూ ఒక విధంగా చెప్పాలంటే సముద్రంతో విడదీయరాని బంధం, కానీ అన్ని చోట్లకి సముద్రం రాదు. కానీ అనుభవాలు జ్ఞాపకాలను మనతో తీసుకు వెళ్లొచ్చు కదా” అంటూ గబ్బుక్కున ఏదో శబ్దం అయితే అటు చూసింది. హోటల్ సిబ్బంది వచ్చి తలుపు కొడుతున్నారు. వెళ్లి చూస్తే “సర్ ఇవాళ తుఫాను, గాలి ప్రమాదకరంగా మారుతోంది అట అద్దాలు ఉన్న భవనాల్లో వుండొద్దు టీవీలో న్యూస్ ఇచ్చారు మన హోటల్‌లో ఉన్న డిజైన్ పరంగా ప్రతి ఆల్టర్నేట్ రూమ్‌కి అద్దాలతో సెట్టింగ్స్ పెట్టాము. డిజైన్‌కి మీరు ఉంటున్న రూమ్ అలాంటిది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని వేరే రూమ్‌కి మారుస్తాము, కానీ అన్ని రూమ్స్ దాదాపుగా నిండిపోయాయి. మిగిలింది స్టాఫ్ తాలూకు రూమ్స్ ఇప్పటికే అద్దాలు ఉన్న రూమ్స్ వాళ్ళని వేరే వాళ్ళతో ఉండేందుకు అడుగుతున్నాం, కానీ మీకు ప్రైవసీ ఇబ్బంది అవుతుందేమో అని” అంటూ ఏమి చెయ్యాలో తెలియక చూస్తున్నాడు. “సర్ మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో ఈ రూమ్‌లో ఉండొచ్చు, మీకు కావాలంటే నేను వేరే రూమ్ కి షిఫ్ట్ అవుతాను” అంది కౌముది.

“కౌముది ఇది డబల్ రూమ్, నాకు ఇక్కడ ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అవును సుబ్రహ్మణ్యం మీరు మిగతా వాళ్ళ సంగతి చూడండి, ఏమైనా సాయం కావాలంటే ఇంకో ఇద్దర్నీ ఈ రూమ్‌కి పంపించండి.” అన్నాడు అజయ్. ఈ మాటకు సుబ్రహ్మణ్యంకి నిజంగానే కొండంత ధైర్యం వచ్చేసింది, సహజంగా ఎప్పుడు అజయ్ వర్మ షూట్‌కి వస్తే వాళ్ళ హోటల్ లోనే ఉంటాడు. ఏ చిన్న అసౌకర్యం వచ్చినా విషయం ఎండి దాకా తీసుకువెళ్లి నానా యాగీ చేస్తాడు. అలాంటిది ఇంత సౌమ్యంగా ఉండడం తన కళ్ళని తానే నమ్మలేకపొతున్నారు.

“నిజమే అండి మీ లేడీస్ స్టాఫ్ వచ్చి నాతో రూమ్‌లో ఉండొచ్చు. పాపం ఈ రాత్రి వర్షం లో ఎక్కడికి వెళ్తారు” అంటూ చెప్పింది కౌముది .

ఇంతలో ఫోన్ వచ్చింది కౌముదికి. “హ నరేష్ నేను ఇక్కడే వున్నాను, హ క్షేమంగానే వున్నాను,రేపు పొద్దున్న నేను కాల్ చేస్తా, ఈ తుఫాన్ వల్ల చాలా నష్టం జరిగేలాగా ఉంది. మన వాలంటీర్స్‌ని అలెర్ట్ చెయ్యి నేను కాస్త వర్షం తగ్గిత్తే వెళ్లి వాళ్ళతో కలుస్తాను. నాకు ఎప్పటికప్పుడు చెప్పమని సుధీర్‌కి చెప్పండి” అని ఫోన్ పెట్టింది. విషయం అర్ధం కాలేదు అజయ్‌కి “ఏమైందండి, మీ ఆఫీస్‌లో ఏమైనా సమస్యా” అని అడిగాడు. “అజయ్ గారు నేను నా ఫ్రెండ్స్ కలిసి ప్రగతిశీల అనే ఎన్.జి.ఓని నడుపుతున్నాము, మాములుగా సేవ కార్యక్రమాలు చూసుకునేందుకు సంస్థకి వాలంటీర్స్, వర్కర్స్ వున్నారు. ఏదైనా ఇలాంటి విప్పత్తు వచ్చినప్పుడు మేము అందరం వాలంటరీగా ఒక టీం గా వెళ్లి మాకు అవకాశం ఉన్నంత సాయం చేస్తాం” అంది కౌముది.

“ఆగండాగండి అసలు ఏంటండి మీకు ఎన్నింట్లో ప్రవేశం వుంది అసలు, ఇలా ఎలా అండి, ఒక పక్క కెరీర్ పిల్లలు, సేవ, ఒక మాట అడగనా ఇంత మెచ్యూరిటీ ఉన్న మీరు ఆ పిల్లలకి నాన్న అనే అనుబంధం ఇవ్వలేకపోతే మీరు లోటు చేసినట్టే కదండీ, అందులోనూ ఆడపిల్లలు కదా”

“అజయ్ గారు మీరు అన్నది నిజమే. నాన్న అనే అనుబంధం, ఎమోషన్ నేను వాళ్ళకి ఇవ్వాలి అంటే నన్ను పిల్లలతో సహా స్వీకరించే వాళ్ళు దొరికితే తప్పకుండా ఆహ్వానిస్తాను, ప్రేమ అనేది బలం అవ్వాలి బలహీనత కాకూడదు అని నా అభిప్రాయం” అంది కౌముది.

ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగా బయట గాలి జోరు పెరిగి కొన్ని అద్దాలు పగిలిపోతున్నాయి, అన్ని ఎగిరి పోతున్నాయి, ఇంతలో కరెంట్ పోయింది. ఎమర్జెన్సీ లాంప్స్, కొవ్వొత్తుల నడుమ భోజనం అయింది, ఒక ప్రక్క ఎక్కడ ఎలాంటి ఉదృతం ఉందో మొబైల్‌లో ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. రాత్రి ఎవరూ బయటకు కదలలేని పరిస్థితి దానికి తోడు విపెరీతమైన గాలులు దానితో ఎవరికి కంటి మీద కునుకు లేదు. అజయ్ కౌముది ప్రపంచ రాజకీయాల నుండి సినిమాలు పిల్లలు లాంటి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఏదో కొన్ని ఏళ్ల నుండి పరిచయం ఉన్నంతగా స్నేహితులు అయిపోయారు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా అజయ్‌కి కౌముది పట్ల ఆకర్షణ కలిగింది. దగ్గరికి జరగబోయాడు,అది గమనించిన కౌముది చటుక్కున వెనక్కి జరిగి “అజయ్ గారు మీరు అంటే నాకు గౌరవం, పొద్దున్నుంచి మనం మంచి స్నేహితులుగా ఉన్నాం, నాకు సంబంధించినంత వరకు అంతే” అనగానే ఒక్కసారి అజయ్ కోపంతో మొహం ఎర్రబడి పోయింది. “నేనేంటో నా లెవెల్ ఏంటో తెలుసా, ఏదో నువ్వు నచ్చి నీతో మాట్లాడుతున్నాను అని అలుసు అయిపోయానా” అంటూ తన సహజ వైఖరి బయటపెట్టాడు. దానికి కౌముది ఒక్కసారి నవ్వేసి “అజయ్ గారు మనిషిని పదవి, హోదా, డబ్బు శాసిస్తాయి. అలాంటప్పుడు ఇలాగే అనిపిస్తుంది, మీ హోదా లెవెల్ పలుకుబడి దేనికి పనికి వస్తాయి, బయట వచ్చే ఆ తుఫాన్‌ని ఆపగలరా, అంత దాకా దేనికి కనీసం మీ దగ్గర ఉన్న రూపాయితో ఏనాడైనా ఎవరికైనా అన్నం పెట్టారా,ఇలా కేవలం ఒక ఆకర్షణకి లోనై మీరు ప్రవర్తిస్తూ ఉంటే మీ పిల్లలకు మీరు ఏ మార్గం చూపుతున్నారు, దేవుడు మీకు చక్కని నటన, మాటతీరు ఇచ్చాడు కానీ మీరు క్రోధం, అహంకారంతో మీ చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెడుతున్నారు. మిమల్ని ఇష్టంగా ఎవరు దరిచేరరు, కారణం మీ కోపం, అహం. అది తగ్గిన రోజు బహుశా నేను మీ తో స్నేహం కొనసాగిస్తా” అని తన బాగ్ తీసుకుని పక్కన గది లోకి వెళ్లిపోయింది. తాను ఎంత పొరపాటు చేసాడో అజయ్‌కి అర్థమవుతుంది.

తెల్లవారాక చూస్తే ప్రాణ నష్టం లేదు గాని ఆస్తి నష్టం మాత్రం గట్టిగా జరిగింది, మెల్లిగా ఒక రెండు రోజుల్లో అన్ని సర్దుకున్నాయి. ఎవరి దారిన వారు బయల్దేరారు, హైదరాబాద్ చేరిన వెంటనే అజయ్ తన తల్లిదండ్రుల పేరున ఒక ఎన్.జి.ఓ మొదలు పెట్టి తన స్నేహితులని ఫాన్స్‌ని అందులో భాగస్వామ్యం చేసాడు. ఒకప్పుడు అజయ్‌తో మాట్లాడాలి అంటే భయపడేవారు ఇప్పుడు ప్రేమగా దగ్గరకు చేరుతున్నారు, తనలో ఈ మార్పుకి కారణం కౌముది అన్న విషయం తనకి తప్ప వేరే ఎవరికి తెలియదు. ఒకరోజు కౌముది ఫోన్‌కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది “ఒకసారి కలవాలి, మీకు కుదురుతుందా” ఇది ఆ మెసేజ్ సారాంశం.

ఇప్పుడు కౌముది అజయ్‌ని కలవాలా వద్దా అని సందేహంలో వుంది. అజయ్ జనాల లోకి ఎలా వెళ్తున్నాడో ఎంత ప్రేమ అభిమానం సంపాదించాడో తాను రోజూ వార్తల్లో చూస్తూనే ఉంది. కానీ అందులో నిజాయితీ ఎంతో తెలియట్లేదు. సరే కలిసినంత మాత్రాన నష్టం లేదు అనుకుంది. “సరే అండి కలుద్దాం, కానీ ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా వుండే ప్రదేశం ఉంటుందా” అని జవాబు పెట్టింది. “మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో మీ ఎన్.జి.ఓ సభ్యులతో భోజనం చేద్దాం అనుకుంటన్నా, నేనే చెప్తాను ఎక్కడ అని, మీ సభ్యులను కన్నుకుని చెప్పండి”.

అజయ్ మాటల్లో నిజాయితీ తెలుస్తోంది, తమ సభ్యులని అడిగి అందరిని అజయ్‌కి పరిచయం చేసింది. వాళ్ళ సంస్థ కార్యక్రమాలలో తాను పాల్గొంటా అని చెప్పడంతో ఆశ్చర్య పోయారు అంతా. ఇంతలో ఆ గుంపులో కొంచెం ఉత్సాహం ఉన్న ఒకరు “సర్ మీరు ఇలా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది, మీకు ప్రేరణ ఎవరు” అని అడిగారు. ఒక చిరునవ్వు నవ్వి “ఒకానొకప్పుడు నేను అహంకారంతో ఉన్న మాట ఎంత నిజమో, ఒక ఏడాది క్రిందట నేను కలిసిన ఒక వ్యక్తి నా అహంకారం మీద కొట్టిన ఒక దెబ్బ, అది నా పాలిట కనువిప్పుగా మారింది” అంటూ నవ్వేసాడు, ఆ వ్యక్తి ఎవరో వారిరువురికే తెలుసు.

Exit mobile version