[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘పరుపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప[/dropcap]రుపెప్పుడూ పరుచుకునే ఉంటుంది
ఒళ్ళంతా ఓ దుప్పటిని కప్పేసుకుని
గలీబు దుస్తుల్లో నిండా మునిగిన
దిళ్ళజంటతో దిలాసా కబుర్లేసుకుంటూ
బరువైన బతుకులకే కాదు
బతుకే బరువైపోయిన జీవులకైనా
బడలిక తీర్చేస్తూ నిద్రపుచ్చుతుంది
తలనుంచి కలతలను దూరంచేస్తూ
కష్టాలకు మరుపుమందు తినిపిస్తూ
దారితప్పిన కలలను
వెతికి వెంటాడి మరీ తెచ్చిస్తుంది
అలసట అంగీని మెరిసేలా ఉతికేసి
ఉత్సాహంలో ముంచి ఆరేసి
ఉదయాన్నే వెచ్చగా తొడుగుతుంది
మెలకువ వేళన ఓ కొత్తరోజును
మెత్త మెత్తగా బహుమతి చేసిస్తుంది
నలిగిపోయిందనో
మరి మాసిపోయిందనో
మాటల్లో పెట్టి, తనను ఏమార్చి
తను కప్పుకున్న దుప్పటిని మారిస్తేచాలు
ఎంత సంతోషమో ఆ పరుపుకు..
రంగులపంట అయి వెలిగిపోతుంది!
పువ్వులతోటగా మారి పరిమళిస్తుంది!!