Site icon Sanchika

పర్యావరణ స్పృహతో స్పందిస్తున్న బాలలు – నేటి కారుచీకటిలో చిరు దీపాలు

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘పర్యావరణ స్పృహతో స్పందిస్తున్న బాలలు – నేటి కారుచీకటిలో చిరు దీపాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]U.S. [/dropcap]అధ్యక్షుడు బైడెన్ 2024 నాటికైనా పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని యువ పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. సన్‌రైజ్ మూమెంట్ – ‘డీకార్బనైజేషన్, ఉద్యోగాలు, న్యాయం, ఉనరుత్పాదక ఇంధనం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’ వంటి అంశాలను డిమాండ్ చేస్తోంది. వీరు తమ ఆకాంక్షలను ‘సరికొత్త హరిత విధానం/ఒప్పందం’ గా వ్యవహరిస్తున్నారు. వీరు కార్బన్ కేప్చర్, అణు విద్యుత్తు వంటి మరికొన్ని సాంకేతికతలకు వ్యతిరేకులు. సెనెటర్ ఎడ్ మార్క్ ఈ ‘గ్రీన్ న్యూ డీల్’ రిజల్యూషన్‌ను అమెరికా సెనెట్‍లో ప్రవేశపెట్టినవారిలో ఒకరు.

2021లో ప్రఖ్యాత రచయిత నోమ్ ఛోమ్‍స్కీ ఈ ఉద్యమం/సంస్థ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలను కురిపించారు కూడా. ఈ ఉద్యమం కార్యకలాపాలతో స్ఫూర్తి పొందిన ఔత్సాహికులు కొందరం 2019లో UK లో దేశ ఆర్థికాన్ని ఒక దశాబ్దం లోపుగా కర్బన రహిత ఆర్థికంగా మార్చాలని, తదనుగుణమైన చర్యలను వెంటనే చేపట్టాలని లేబర్ పార్టీని కోరారు. ఈ ప్రతిపాదనను ‘లేబర్ ఫర్ ఎ గ్రీన్ న్యూ డీల్’గా వారు అభివర్ణించారు. ఏది ఏమైనా పర్యావరణ సమస్య సిద్ధాంతకర్తల, మేధావుల, శాస్త్రజ్ఞుల స్థాయి చర్చల నుండి సామాన్య ప్రజానికం పరిష్కార మార్గాలను సూచిస్తూ, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెచ్చే స్థాయికి చేరిందన్నది కళ్ళకు కడుతున్న నిజం.

అందునా బాలలు పర్యావరణ సంక్షోభాల పట్ల చాలా అవగాహనతో ఉన్నారు. వారు తమ భవిత పట్ల అభద్రతతో కూడిన భయాందోళనలకు గురౌతున్నారు.

2015 లో ఫైల్ చేయబడిన బాలల ట్రస్ట్ – జూలియానా Vs U.S. కేసు పరిష్కారం కాలేదు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆగస్టులో (2023) మోంటానా Vs స్టేట్ కేసులో న్యాయమూర్తి బాలల పక్షాన తీర్పు చెబుతూ స్టేట్‍నే తప్పుపట్టారు.

జూలియానా కేసులో – ప్రభుత్వ అధికారులను, ప్రెసిడెంట్‌ను, అమెరికన్‍లను నిందితులుగా/జవాబుదారులుగా పేర్కొనడం జరిగింది.

ఇటీవలే ఫైల్ చేయబడిన దావాలో జెనెసిస్ B Vs E.P.A. లో ఫెడరల్ గవర్నమెంటుని, పర్యావరణ పరిరక్షణ ఏజన్సీని (E.P.A.), ప్రస్తుతపు E.P.A. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మైఖేల్ రీగన్‍ని మాత్రమే జవాబుదారులుగా చేర్చడం జరిగింది

వారి ఆరోపణలో, E.P.A. కాంగ్రెస్‌తో కూడిన డెలిగేటివ్ అథారిటీ అయినపుడు పర్యావరణ పరిరక్షణను పర్యవేక్షించే బాధ్యతను ఫెడరల్ ప్రభుత్వ స్థాయిలో నిర్వహించకుండా,

కాలుష్యం, దానికి స్థాయిలు నిర్ణయిస్తూ పర్యవేక్షణను వికేంద్రీకరించడం ద్వారా ‘పర్యావరణ పరిరక్షణ సంస్థ’ వ్యవస్థాపక లక్ష్యాలనే అస్థిరపరిచినట్లయిందని స్పష్టంగా వివరించారు.

8-17 సంవత్సరాల నడుమ వయసున్న 18 బాలలు అమెరికా ఎన్విరాన్‍మెంట్ పాలసీకి వ్యతిరేకంగా దావా వేశారు. లా సూ‍ట్‌లో ఫెడరల్ గవర్నమెంట్ బాడీని విమర్శించారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమం ప్రమాదంలో పడుతున్నా లెక్కచేయక భూమండలాన్ని వేడెక్కిస్తున్న ఉద్గారాల స్థాయిని ఉద్దేశపూర్వకంగానే పెరగనిస్తున్నదని విమర్శించారు.

అమెరికా ఫెడరల్ ప్రభుత్వంపై కేసు వేసిన పిల్లలు. ఫోటో సౌజన్యం: ఇంటర్‍నెట్

రాజ్యాంగం ప్రతి అమెరికన్‌కు జీవించే హక్కు, స్వతంత్రంగా, సంతోషంగా బ్రతికే హక్కు  కల్పిస్తున్నది. ప్రత్యేకించి బాలలకు రక్షణ గారంటీ ఉంది. ఇంత రాజ్యాంగపరమైన రక్షణ ఉండీ –

“కార్చిచ్చుల నుండీ పరిగెత్తున్నాం. వరదల కారణంగా నిర్వాసితులం అవుతున్నాం. తరగతి గదుల్లో వేడికి గాభరా పడుతునే మళ్ళీ వడగాలులు వస్తాయేమోనని భయపడుతున్నాం. నిరంతరం ఆందోళనల నడుమ బ్రతుకుతున్నాం. మా చుట్టు ఉన్న వారిలో ఎవరూ తగిన వేగంతో చర్యలు చేపట్టడం లేదు. ఆ కారణంగా భవిష్యత్తును గురించిన ఆలోచనలతో సతమతవుతున్నాం” కొంచెం అటూ ఇటూగా కేసు వేసిన బాలల అందరి ఆవేదన అదే.

కేవలం పర్యావరణ పరిరక్షకులు, బాలలతో కూడిన ‘ఫెడరల్ అడ్వయిజరీ కమిటీ’ ఒకటి నవంబర్ 2023 లో ఏర్పాటు చేయబడింది. “పిల్లలు పర్యావరణం న్యాయం పట్ల చూపిస్తున్న నిబద్ధత, ఫెడరల్ ప్రభుత్వాన్ని సైతం న్యాయస్థానాల ద్వారా నిలదీయడం మంచి పరిణామం” అని కొలంబియా యునివర్శిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ బర్గర్ వ్యాఖ్యానించారు.

ఈ భూమి ఏ ఒక్కరి స్వంతమో కాదు. భూమండలం పై జీవించే ప్రతి జీవికీ తరతరాల వారసత్వ సంపద. అటువంటి భూమాతను అంపశయ్య పైకి చేర్చిన మానవుడు సాధించానని అనుకుంటున్న అభివృద్ధి అభివృద్ధి కానే కాదు.

ఏది ఏమైనా భావి పౌరులుగా ఈ బాలలందరి చైతన్యం హర్షించదగినదే కాదు, స్ఫూర్తిమంతం కూడా. కారణం సమస్య ఏ ఒక్క ప్రాంతానిదో, దేశానిదో కాదు. సమస్త భూమండలానిదీ.

Exit mobile version