పర్యవేక్షణ

0
1

[dropcap]త[/dropcap]రచూ నేను వింటూ ఉంటాను ఈ మాటలు – ‘నేటి రోజుల్లో పిల్లల ప్రవర్తన బాగులేదు. కొంతమంది నైతికంగా దిగజారి పోతున్నారు. దానికి కారణం పెద్దల పర్యవేక్షణ లేకపోడమే. ఇరవై నాలుగు గంటలూ పిల్లలు విషయంలో ఉండాలి’ అని. నా ఉద్దేశ్యం కూడా అదే.

ఎందుకంటే బాల్యం కంటే మనిషి జీవితంలో కౌమారం, యవ్వనం దశలు అతి ముఖ్యమైనవి. ముఖ్యంగా కౌమారం దశ అతి కీలకమైనది కూడా. ఈ సమయంలో ప్రతీ అడుగూ ఆచి తూచి వేయాలి. నాలుగు రోడ్లు కల్సిన కూడలిలో నిల్చుని ఎటు వెళ్ళాలో తోచక ఎవరైనా మార్గ నిర్దేశం చేస్తే బాగుండనని ఎదురు చూసే విలువైన సమయం అది. అలాంటి స్థితిలో తప్పటడుగులు పడితే అంతే సంగతి. అధోగతే…  పెద్దల పర్యవేక్షణ ఆ సమయంలో లేకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి.

ఈ మధ్య మా ప్రక్కింటి నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈ అపార్టుమెంట్ల కల్చరు వల్ల ఒక దగ్గర ఉంటున్నా ఒకరి విషయాలు మరొకరికి తెలియకపోతున్నాయి. ఒక వేళ తెలిసినా పని మనుష్యుల వల్లనే. మా పని పిల్ల చెప్పిన విషయం బట్టి  ప్రక్కింటి వాళ్ళ అమ్మాయి మూడు రోజుల నుండి కనిపించడం లేదట. పోలీసులకి కంప్లైంటు ఇచ్చారు. పోలీసు ఎంక్వైరీలో ఆ అమ్మాయి శవం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఓనిర్జన ప్రదేశంలో దొరికిందట. పోస్టుమార్టమ్ తతంగం పూర్తి చేసి శవాన్ని హాస్పటల్ నుండే శ్మశానానికి తరలించారుట. ఆ ఏడుపులు ఇవే.

అయ్యో! ఎంత పని జరిగిపోయింది. ఒక దగ్గరున్నా ఈ విషయాలు తెలియవు. వాళ్ళకి ఎంత కష్టమొచ్చింది. ఓ పర్యాయం వారిని ఓదార్చి స్వంతన చేకూర్చాలి. సుఖంలో మనకి ఎవ్వరూ అక్కరలేకపోయినా, ఈ కష్టకాలంలో ఓదార్పు మాటలు దుఃఖితుల దుఃఖాన్ని దూరం చేస్తాయి అని అనుకున్నాను.

నా ఆలోచన్లు పరుగులు తీస్తున్నాయి. ఇలాంటి చావులకి కారణం – ఈ అమ్మాయి ఎవర్నో ప్రేమించి ఉంటుంది. ఆ ప్రేమ సుఖాంతం అయి ఉండదు. నేటి ఆధునిక ప్రపంచంలో ఈ టీనేజీ వాళ్ళని పెడత్రోవ పట్టిస్తున్నాయి – ఇప్పుడు వస్తున్న సినిమాలూ, స్మార్ట్ ఫోన్లు, చాటింగ్‌లు, పబ్‌ల సంస్కృతి. దానికి కారణం వాళ్ళ మీద పెద్దల పర్యవేక్షణ లేకపోవడమే. ఈ ప్రేమ మత్తులో పడి ప్రక్కింటి వాళ్ళ అమ్మాయి తన నిండు జీవితాన్ని బలితీసుకుంది అనుకున్నాను.

నిజ జీవితం వేరు. సినీ జీవితం వేరు. నిజ జీవితంలో సినీ జీవితంలా ప్రేమలు సుఖాంతం అవవు. దానికి నిదర్శనమే ప్రక్కింటి వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బయిని పెళ్ళి చేసుకోమని బలవంతం చేసి ఉంటుంది. ప్రేమంచడం అయితే ప్రేమించాడు కాని ఆర్థికంగా నిలదొక్కుకోని ఆ అబ్బాయి పెళ్ళికి నిరాకరించి ఉంటాడు. ఈ అమ్మాయి రచ్చ చేస్తాను అని నిలదీసి ఉంటుంది. అటువంటి స్థితిలో తన వాళ్ళ దృష్టిలో మంచివాడనిపించుకోవాలని ఆ అమ్మాయిని అంతం చేసి గప్ చిప్‌గా ఇంటికి చేరి ఉంటాడు ఆ అబ్బాయి. నా ఊహ అలా పరుగులు తీస్తోంది.

అమ్మాయి కుటుంబ సభ్యుల రోదనకి కలత చెందాను నేను. మనసులో బాధను దాచుకుని నాదైన శైలిలో వాళ్ళని ఓదార్చి వచ్చాను. కాని నా మనస్సు నిలకడగా లేదు. వెంటనే విశ్వం గుర్తుకు వచ్చాడు. విశ్వం ఓ మంచి సైకియాట్రిస్టు. నాకు మంచి స్నేహితుడు కూడా. విశ్వం దగ్గరకి బయలుదేరాను.

నన్ను చూడగానే విశ్వం చాలా సంతోషించాడు. మాటల సందర్భంలో విశ్వానికి మా ప్రక్కింటి వాళ్ళ అమ్మాయి గురించి చెప్పాను. “ఈ విషయం పేపర్లో నేను కూడా చదివాను” గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు విశ్వం.

“మూర్తీ! నేటి నాగరిక సమాజంలో ఇవన్నీ కామన్ అయిపోయాయి. యువతది ఉరకలు, పరుగులు తీసే వయస్సు. ఈ టీనేజ్ వాళ్ళకి సరియైన మానసిక పరిపక్వత లేకపోతే అనేక అనర్థాలు. వాళ్ళలో ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. ఆ ఆవేశమే వాళ్ళలోని విచక్షణని చంపేస్తుంది. అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డు తొలగించుకోవాలన్నంత ఆవేశం కలుగుతుంది. ఆ ఆవేశంలోనే నేరాల బాట పడ్తోంది యువతరం” విశ్వం చెప్పడం ఆపాడు.

అతను చెప్పింది నిజం అని అనిపించింది నాకు. ఎందుకంటే నేటి టీనేజ్ వాళ్ళలో క్షణికావేశం, చెడు సహవాసాలూ, దానికి తోడు ఇంటి దగ్గర మంచి చెడ్డల గురించి మాట్లాడ్డానికి కూడా సమయం కేటాయించలేకపోతున్న తల్లిదండ్రులు, వాళ్ళు పిల్లలకి ఇస్తున్న స్వేచ్ఛ, పాకెట్ మనీ పేరుతో పిల్లలకి విచ్చలవిడిగా  ఖర్చుపెట్టుకోడానికి ఇస్తున్న డబ్బు. ఇవన్నీ కూడా అనర్థానికి కారణం అవుతున్నాయి అని అనుకున్నాను.

అంతే కాదు ఎదిగే వయస్సులో ఈ టీనేజ్ వాళ్ళ మనస్సు శక్తివంతమైన ఎస్కలేటరు. అత్యంత బలహీనమైన బ్రేకులు కలిగిన ఖరీదైన వాహనంలాంటి వాళ్ళు ఈ టీనేజ్ వాళ్ళు. సామర్థ్యం ఉన్న సరియైన నియంత్రణ, పర్యవేక్షణ లేక పోతే వాహనం పాడయిపోయినట్టే యువత జీవితం కూడా చిన్నాభిన్నం అవుతుంది.

“సమాజంలో యువత పాల్పడుతున్న నేరాలు పెరిగిపోతున్నాయి. యువత ఏదైనా ఒత్తిడికి లోనయి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చినప్పుడు. ఆవేశపూరితంగా వ్యవహరిస్తున్నారు, భవిష్యత్తుని కూడా ఆలోచించరు. వీళ్ళు పాల్పడుతున్న ప్రతీ నేరంలో ఇదే కోణం అగుపిస్తోంది. మనస్సులో గూడు కట్టుకున్న నేర స్వభావం అవకాశం దొరికినప్పుడు బయటపడుతోంది” విశ్వం అన్నాడు.

“ఇక చదువు విషయం తీసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టల్‌లో పెట్టి చదివిస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గరే చదువుతున్నారు. ఎక్కడ చదివినా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ స్కూలు, ట్యూషను, స్టడీ పేరుతో పిల్లలకు బాల్యపు మాధుర్యాన్ని మానవతా సంబంధాల్ని తెలియకుండా వాళ్ళని పెంచుతున్నారు నేటి పెద్దలు.”

“ఇలాంటి పిల్లలు తమ చిన్న కోరికల్ని కూడా తీర్చకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్లకి మిగతా వ్యసనాలకి బానిసలవుతున్నారు. వాళ్ళతో అనంతృప్తి కసి పేరుకు పోతోంది. పెద్దయిన తరువాత తమలో అణచి పెట్టుకున్న కోరికలు, కసిని కలగలిపి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు” విశ్వం తనకి ఎదురయిన అనుభవాన్ని కరువు పెడ్తున్నాడు.

నాదైన రీతిలో నేనూ ఆలోచిస్తున్నాను అతని మాటలు విని. కొంతమంది తల్లిదండ్రులు తాము చిన్నప్పుడు అనుభవించలేని సుఖమైన జీవితాన్ని పిల్లలు ఇప్పుడు అనుభవించాలన్న భావంతో ఖరీదైన జీవితాన్ని వాళ్ళకి కల్పిస్తున్నారు. అలాంటి పిల్లలు మాదకద్రవ్యాలకి, చెడు వ్యసనాలకి లోనవుతున్నారు. కొంతమంది తమ పిల్లల ఎదుటే మద్యం త్రాగడం వలన దాని ప్రభావం పిల్లల మీద పడుతోంది. నిజమే చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద తీవ్రంగా ఉంటుంది.

“పిల్లల శారీరిక, మానసిక వికాసానికి నేటి కార్పొరేటు విద్యా విధానంలో అవకాశం లేదు. ఎందుకంటే ఈ స్కూళ్ళలో ఆట మైదానాలుండవు. జైలును తలపించే గదులు. పోనీ ఇంటికి వచ్చిన తరువాత ఆడుకోడానికి ప్రయత్నించలేకపోతున్నారు. ఇంటికి వచ్చిన తరువాత స్కూళ్ళు వాళ్ళు ఇచ్చిన చాంతాడంత హోమ్ వర్కు చేయడానికి యంత్రాలు అయిపోతన్నారు. లేదంటే కంప్యూటర్లు, స్మార్టు ఫోన్లు, లాప్ టాప్‌లు  పట్టుకుని కూర్చుంటున్నారు. వాటిలోని అభ్యంతకతరమైన దృశ్యాల్ని చూసి నేరచరితకి పాల్పడుతున్నారు” అన్నాను విశ్వంతో.

“నిజమే నా కొచ్చిన కేసులే దానికి సాక్ష్యం. ముఖ్యంగా నేడు సమాజం నైతికంగా పతనావస్థకి చేరుకుంటోంది. కామాంధులు ఆడపిల్లల్ని రక్త మాంసాలున్న ఆటబొమ్మలా చూస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం రజస్వల కాని పునరాత్పుత్తి అవయవాల పట్ల కనీసం అవగాహాన లేని బాలికల్ని మాయ మాటల్తో లోబర్చుకుని కొంత మంది దారుణానికి వొడిగడ్తున్నారు” విశ్వం అన్నాడు.

“నేడు అడ, మగ అన్న తేడా లేకుండా అందరి మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేరాలు, అత్యాతారాలూ జరగడానికి కారణం అశ్లీల దృశ్యాలూ, రెచ్చగొట్టే సన్నివేశాలు, ఇవి యువతలో లైంగిక భావోద్వేగాలను కలిగిస్తాయి. వాటిని చల్లార్చుకోడానికి ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్నారు.”

కొంతమందికి సెక్సే జివితం. అలాంటి వాళ్ళు స్త్రీలోలత్వం కలవాళ్ళు. అలాంటి వాళ్ళకి లైంగిక కోరికలు ఎక్కువ. కొన్ని కుటుంబాల్లో పెద్దలు పిల్లల దగ్గర సరసాలు ఆడుతారు. అనుచితంగా ప్రవర్తిస్తారు. ఈ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇలా అలోచిస్తున్నాను.

కొన్ని కుటుంబాల్ని నేను చూస్తున్నాను. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలిచకుండా వాళ్ళని వెనకేసుకొస్తారు. అంతే కాదు నేటి ఆధునిక సమాజంలో వివాహేతర సంబంధాలు, సహజీవనం అనే పేరుతో అనేక వికృతాలు చోటు చేసుకున్నాయి.

“అంతే కాదు ఇలా అత్యాచారాలకి కారణం లైంగిక అజ్ఞానం. పురుషాధిక్య భావజాలం. స్త్రీలను అణచి వేతకి గురిచేయడం. క పిల్ల్లలకి పాఠశాలలో లైంగిక విజ్ఞానం బోదించే అవకాశం లేదు. పోని ఇంటి దగ్గర తల్లిదండ్లులు కూడా చూచాయగా చెప్పరు. చెప్పడానికి సంకోచిస్తారు. అత్యాచారం అంటే వివరించరు. జననాంగాలకు సంబంధించిన ప్రతీ విషయం రహస్యంగా ఉంచుతారు. ప్రకృతి ధర్మాన్ని వివరించరు.

పిల్లలకి సరియైన లైంగిక విజ్ఞానం అందదు. విదేశాల్లో విద్యా విధానంతో లైంగిక విజ్ఞానం ఉన్నట్టు మన విద్యా విధానంలో దానికి తగినంత స్థానం లేదు. శరీర మిగతా అవయవాల గురించి, వాటి ధర్మాన్ని వివరిస్తున్నట్లే లైంగిక అవయవాల పరిజ్ఞానం కూడా పిల్లలకి ఉండాలి” విశ్వం అన్నాడు.

“ఇన్ని అనర్థాలకి కారణం సమాజంలో యువత మీద సరియైన పర్యవేక్షణ లేకపోవడమే” నేను అన్నాను విశ్వంతో.

“అన్ని చోట్లా అన్నవేళలా ఈ పర్యవేక్షణ పదం వాడలేము”  – అలా అంటున్న విశ్వం వేపు ఓ లిప్తకాలం చూశాను.

“మా మనుమరాలి విషయమే తీసుకుంటే నాకే బాధనిపిస్తుంది. నేను పేరుకు సైకియాట్రిస్టునే కాని మా ఇంటి సమస్యనే నేను పరిష్కరించలేకపోతున్నాను. అందుకే అంటారు… మన పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పరినికరాదని.”

“మీ మనుమరాలి విషయమా? ఏంటయింది?” అడిగాను.

“మన సమయంలో విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానానికి ఎంత తేడా? ఇప్పుడు ఈ ఆంగ్ల చదువుల వ్యామెహం వలన ఆంగ్ల భాషకి ఇస్తున్న ప్రాధాన్యాతకి మాతృభాష ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఈ ఇంగ్లీషు మీడీయా స్కూళ్ళు కార్పొరేటు ప్రైవేటు స్కూళ్ళ ప్రాభల్యం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతున్నాయి.”

విశ్వం చెప్తున్నది నిజమే. ప్రతీ తల్లిదండ్రులూ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళకి తమ పిల్లలు చిలకపలుకుల్లా రైమ్స్ చదవాలి. ఇంగ్లీషు ముక్కలు మాట్లాడాలి. అంతే కాని తెలుగులోని శతకాలు, వారాల పేర్లు, నక్షత్రాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు చదివించడానికి, పిల్లలకి తెలియ చేయడానికి నామోషిగా భావిస్తున్నారు. మమ్మి, డాడీ, అంకుల్, అన్న కల్చరు పెరిగిపోయింది – నా అలోచన ఇది.

“మా మనుమరాలు ఓ కార్పొరేటు స్కూల్లో చదువుతోంది. ఉదయం ఏడు గంటలకి స్కూలుకి వెళ్తే తిరిగి సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వస్తుంది ఉసూరుమంటూ. స్టడీ అవరు ఉంటే ఏడు గంటలకే వస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఎక్కువ సమయం ఇయ్యరట. చివరికి బాత్ రూమ్‌లకి వెళ్ళడానికి కూడా నిబంధన లేనట. కనీసం మంచి నీళ్ళు త్రాగడానికి కూడా సమయం ఇవ్వరట. పిల్లలు యంత్రాలు అయిపోవల్సిందే. ఈ విషయలన్నీ మా మనమరాలు చెప్పి చాలా బాధ పడింది.”

“పెద్దవాళ్ళు జోక్యం చేసుకుని స్కూలు యాజమాన్యాన్ని అడిగితే, మీ పిల్లల్ని పర్యవేక్షణ చేయడానికే సాయంత్రం ఆరుగంటల వరకు పిలల్ని స్కూల్లో ఉంచేస్తున్నాం. మీ పిల్లలు బాగుపడ్డం మీకు ఇష్టం లేదా? అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ పిల్లల్ని ఎంత ఇబ్బంది గురిచేస్తోందో?”

“ఇక చదువు విషయానికి వస్తే ఆరో తరగతి నుంచి ఐఐటి కోర్సుట. ఆరో తరగతి పిల్లలకి త్రిభాషా సూత్రం అమలు పర్చాలి. అలా చేయకుండా కేవలం ఇంగ్లీషు భాషకి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఐఐటి కోర్సు పిల్లలకి అర్థం కాక బుర్రలు పట్టుకుంటున్నారు. మా మనుమరాలయితే ‘తాతయ్యా పిచ్చెక్కినట్టు ఉంది’ అని ఒకటే ఏడుపు.”

“అంతే కాదు స్కూల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆంక్షట. ఒక వేళ మాతృభాషలో మాట్లాడితే పనిష్‌మెంట్ ఉంటుందిట. ఈ ఒత్తిడికి తట్టుకోలేక పోతున్నానని ఆ పిచ్చ పిల్ల ఒకటే ఏడుపు. ఒకటే గోల. ఈ మధ్య వాళ్ళ స్కూల్లోనే ఓ అబ్బాయి ఈ ఒత్తిడికి తట్టుకోలేక మొదడులో నరాలు చిట్లిపోయి చచ్చిపోయాడట. తన పరిస్థితి అలాగే అవుతుందని తెగ బాధపడిపోయింది.”

“నేటి పిల్లల ఒత్తిడి చదువుల తీరు తెన్నుల గురించి, తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆలోచించటం లేదు. పిల్లల మానసిక ఒత్తిడి అర్థం చేసుకోలేకపోతున్నారు” విశ్వం ఆవేదనగా అన్నాడు.

నేడు ఈ కార్పొరేటు స్కూళ్ళు డబ్బులు దండుకోడానికే  చూస్తూ పిల్లల జీవితాల్తో ఆటలాడుకుంటున్నారే కాని పిల్లల మానసిక పరిస్థితికి ప్రాధాన్యత ఈయటం లేదు. ఈ విషయంలో ఈ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్య పర్యవేక్షణ పిల్లల మీద సరిగా లేదు అని అనుకున్నాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here