Site icon Sanchika

పశ్చాత్తాపం

[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘పశ్చాత్తాపం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం కాగానే రెక్కలు విప్పుకని మేతకోసం పడమర దిక్కు వెళ్ళాయి పక్షులు. అవి సాయంత్రానికల్లా మళ్ళీ తమ గూడు చేరుకుంటున్నాయి. కానీ పక్షులు గూటికి తిరిగి వచ్చేటప్పుడు తమ పిల్లల కోసం మేత తీసుకొస్తున్నట్లు లేదు కదా! అని బాల్కనిలో కూర్చొని దీర్ఘాలోచనలో పడ్డాడు గంగాధర్.

సాయంత్రం కావటంతో ఇక అమ్మలు, నాన్నలు, రిటైరైన తాతయ్యలు మెల్లగా వీధి చివరకు చేరుకుంటున్నారు. స్కూలు బస్సులో వచ్చిన తమ పిల్లలతో ముద్దుముద్దుగా మాట్లాడుకుంటూ ఇంటికి తీసుకొస్తున్నారు.

అలా చూస్తుండగానే రాత్రి పదకొండైపోయింది. కాలేజీ కెళ్ళిన కొడుకు నందకుమార్ మాత్రం ఇంకా ఇంటికి రాలేదని బాల్కనీలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు తండ్రి గంగాధర్.

ఇంతలో నందకుమార్ రానే వచ్చాడు. “ఒరేయ్ నందా! నీకేమైనా బుద్ధి ఉందా? ఇంకా పదిహేను రోజుల్లో పరీక్షలు పెట్టుకొని ఈ రోజు సినిమా చూసి వస్తావా?” అని కొడుకును క్లాస్ తీసుకున్నాడు తండ్రి.

“పోనీ లెండి పాపం! వాడేదో చెయ్యకూడని పనిచేసినట్లు అలా ఇంటికి రాగానే చివాట్లు పెట్టటం ఏం బాగోలేదు” అంటూ నందాకి భోజనం వడ్డించింది తల్లి అన్నపూర్ణ.

“అసలు నువ్వే కదా వాడిని పాడు చేస్తున్నావు. అదే అమ్మయి సహజను చూడు. కాలేజీ నుండీ రాగానే ఏదో పది నిముషాలు టి.వి. చూసి, బుద్ధిగా చదువుకుంటుంది. కానీ నీ కొడుకేమో వందలు తగలేసి వారానికొక సినిమా చూసి వస్తున్నాడు. అంతటితో అయ్యిందా! మళ్లీ అదే సినిమా ఒటిటిలో రిలీజైయ్యిందని టివిలో చూస్తున్నాడు. అది కూడా చాలదన్నట్లు సీజన్ సీరియళ్లు, అర్థరాత్రి దాటేవరకూ సెల్ ఫోన్‌లో కూడా చూస్తున్నాడు” అన్న తండ్రి ఉపన్యాసానికి నందాకి ఉక్రోషం ముంచుకొచ్చింది.

“నాన్నా! ఇరవై నాలుగుగంటలూ చదివే వాళ్ళే పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్‌లో పాస్ అవుతారా? నేను ఒక్కసారి చదివితే, వెయ్యి సార్లు చదివినట్లు తెలుసా? చెల్లాయి సహజ సహజంగానే మొద్దు కాబట్టి పాఠాలన్నీ బట్టీ పడుతోంది” అని అనగానే ఆయన కోపం ఇంకా తార స్థాయికి చేరుకొని కొడుకుని కొట్టబోతుండగా సమయానికి తల్లి అడ్డుగా వచ్చింది.

“మీరు రోజూ ఇంతే నాన్నా! అమ్మ నాకు అన్నం పెట్టగానే మీరు మాత్రం కడుపునిండా చివాట్లు పెడతారు. నాకు అసలు చదువుమీద ఏ మాత్రమూ ఇంట్రస్ట్ లేనే లేదు” అని చెప్పాడు నంద.

“ఏమిటిరా నీ మొండితనం? నీ కోసం లక్షలు ఖర్చు చేసి హాయిగా చదువుకోమంటే చదువుకోనంటావా! మరేం చేస్తావ్? గాడిదలు కాస్తావా? లేక ఆటో నడుపుకొని బతుకుతావా?” – తండ్రి.

“అంత ఖర్మ నాకేం పట్టలేదు గానీ, నేను సినిమాలలో నటించాలనుకుంటున్నాను. నాకు నటన అంటే చాలా ఇష్టం. అందుకనే చదువుని లైట్ తీసుకున్నాను” అన్నాడు కూల్‍గా నంద.

“ఒరేయ్! నటించటానికి కూడా కనీసం డిగ్రీ వరకైనా చదువుకొని ఉండాలిరా. అలాగే లెక్కలు, ఎకౌంట్సు కూడా నేర్చుకొని ఉంటే మంచిది. ముఖ్యంగా మన మాతృభాష మీద కూడా మంచి పట్టు ఉండాలి. అయినా నువ్వు ఇప్పటివరకు ఒక్క నాటకంలోనైనా నటించావా? మరి సినిమాల్లోకి డైరెక్టుగా ఎలా వెళ్లిపోతావు? అందుకే నా మాట విని బుద్ధిగా డిగ్రీ పూర్తి చేయి. లేదంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది” అని తేల్చి కొడుకుకి హితవు చెప్పాడు.

“ఆ విషయాలన్నీ నాకు బాగా తెలుసు నాన్నా! ఇప్పటికీ మీరు పాతకాలంలోనే వున్నారు. మీకూ నాకూ జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది” అని నంద అనేసరికి ఎగసిన ఆవేశం ఆయనని ఆవహించింది. “ఇంకా నయం మమ్మల్ని పాత సామాన్లతో జమకట్టలేదు” అన్నాడు తండ్రి.

“నాన్నా! నేను జనరేషన్ గ్యాప్ గురించి చెప్పాను అంతే! నాకు ఏమీ తెలియదు, అన్నీ మీకే తెలుసునని అనుకోవడం మీ పాత కాలం వాళ్ల చాదస్తం! ఔను నాన్నా! నేను సినిమాలకు పనికి రానని తిడుతున్నారుగానీ మీరు మటుకు ఆర్ ఆర్ ఆర్ సినిమాను రిలీజ్ రోజే చూసి వచ్చారుగా!” అని కొడుకు నిలదీసేసరికి నిర్ఘాంతపోయాడు తండ్రి.

“ఒరేయ్ అజ్ఞానీ! కనీసం తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో సభ్యత సంస్కారాలు నేర్చుకోరా!” అని అనగానే తింటున్న అన్నంలో చెయ్యి కడుక్కొని కోపంతో వేగంగా అక్కడ నుండీ వెళ్ళిపోయాడు నందకుమార్.

స్థాణువై నిలబడిపోయిన భర్తను ఓదార్పుగా చూస్తుండిపోయింది భార్య. “ఎందుకో ఈ మధ్య మీరు చీటికీ మాటికీ అనవసరంగా కోప్పడుతున్నారు. అయినా నా వంతు నేను మీకు చెపుతూనే ఉన్నాను. మీ ఆఫీసులోని సమస్యల సంచులను మన ఇంటికి మోసుకురావద్దనీ, అలాగే మన ఇంట్లోని గొడవలను కూడా ఆఫీసుకు తీసుకెళ్లవద్దని, నా మాటలను ఆలకిస్తే మీకే మనశ్శాంతి దొరుకుతుంది” అని ముక్తాయించి, డైనింగ్ టేబుల్ అంతా శుభ్రంచేసి బెడ్ రూమ్‍కి వెళ్ళిపోయింది భార్య.

ఔను! గంగాధర్ జీవితంలోనికి నిత్యం అనేక సమస్యలు, కష్టాలు ఎదురౌతూనే ఉన్నాయి. ‘యథార్థవాది లోక విరోధి’ అనే నానుడికి గంగాధర్ వ్యక్తిత్వమే సరైన నిర్వచనం. అతను చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. అందులోనూ, ఈ రోజుల్లో కూడా నిజాయతీగా అసలు లంచాలు తీసుకోకుండా పనిచేసే ఏకైక వ్యక్తి గంగాధర్ ఒక్కడే అని చెప్పవచ్చు. అందుకేనేమో అతనంటే ఆఫీసులో ఏ ఒక్కరికీ నచ్చదు. దానికి కారణం తాను ససేమిరా లంచం తీసుకోడు, తీసుకునేవాళ్లను ‘చీడపురుగుల’ని వాళ్ల మొఖాలపైనే విమర్శిస్తాడు కాబట్టి.

గంగాధర్ నీతి, నిజాయతీ, పనితీరును మెచ్చని అధికారులు చాలాసార్లు అతని మనస్తత్వాన్ని మార్చుకోమని సలహాలిచ్చారు. కాని గంగాధర్ మాత్రం “నేను నెల నెలా జీతం తీసుకుంటన్నాను సార్, లంచం డబ్బులు నేనేందుకు తీసుకోవాలి? అంతేకాదు ఈ అవినీతి, లంచగొండి వ్యవహారాలను పై అధికారులకు కూడా తెలియజేస్తాను” అని ఎన్నోసార్లు నిర్భయంగా చెప్పేశాడు. ఆఫీసులోని గంగాధర్ వ్యవహారశైలితో అటు అధికారులకూ, ఇటు తోటి సిబ్బందికీ ఇబ్బందులు ఎక్కువైయ్యాయి. వాళ్లకు పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లుగా తయారయ్యాడు గంగాధర్.

ఇక ఇలాంటి వాడితో తాము ఎంతగానో నష్టపోతున్నామని అధికారులతో మొరపెట్టుకున్నారు. దాని పర్యవసానమే, గంగాధర్‌కి వేరే కార్యాలయానికి బదిలీ అయ్యింది. దాంతో జిల్లా కూడా మారటంతో, రోజూ వారీ డ్యూటీ చేయటం కూడా గంగాధర్‌కి పెద్ద సమస్యగా తయారయ్యింది.

నందకుమార్ పరీక్షలు కూడా వ్రాయకుండా సినిమాలలో నటించటానికి వెళ్ళిపోయాడు. వాడు డిగ్రీ పూర్తి చేసి, ఏదైనా ఉద్యోగం చేస్తే తమకు వేడినీళ్లకు చన్నీళ్లలా సహాయంగా ఉంటాడని భావించారు. ఇంకా కూతురు సహజకు పెళ్లి చేయాలి. మధ్యలో ఈ ట్రాన్స్‌ఫర్, అద్దె ఇల్లు మారటం, సామాన్లు సర్దుకోవటం లాంటి పనుల వలన బాగా అలసిపోయిన ఆలుమగలూ ఆదమరచి నిద్రలోకి జారుకున్నారు.

కొత్త ఆఫీసులో పాత ఉద్యోగం. సిబ్బంది అంతా చాలా కలుపుగోరుతనంగా గంగాధర్‌కు స్వాగతం పలికారు. ఆఫీసరు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. “చూడు మిష్టర్ గంగాధరం నీ గురించీ, నీ పనితనం గురించీ, ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు మనమంతా కలిసి పనిచేయబోతున్నాం.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను కూడా మీకు లాగానే నిబద్ధత, నిజాయితీతో పనిచేసేవాడిని. ఒకవేళ మీరు తప్పుచేస్తే , నిర్భయంగా చెప్పేస్తాను. అలాగే మీరు క్రమశిక్షణతో ఎక్కువ ఉత్పాదకతతో కూడిన పనిచేస్తే తప్పనిసరిగా అభినందించేవారిలో నేను మొదటివాడిని. అంతేకాదు దానికి తగిన ప్రతిఫలంగా ప్రత్యేక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌కు కూడా రికమెండ్ చేయటం నా ప్రత్యేకత, అర్థమయ్యిందా!” అని ఆఫీసరు చెప్పటంతో ‘దేవుడా! మొత్తానికి నా కష్టాలను కనికరించావు. అందుకనే దేవుడులాంటి ఆఫీసర్ని కూడా నాకు బాస్ రూపంలో ఇచ్చావు’ అనుకుంటూ బ్రహ్మానందంగా ఆఫీసులో ఇచ్చిన స్వీటు బాక్సుతో ఇంటికి చేరుకున్నాడు గంగాధర్.

చాలాకాలం తరువాత మళ్ళీ ఇంట్లో అందరూ సంతోషంగా డిన్నర్ చేశారు. కానీ ఇలాంటి శుభతరుణంలో కొడుకు నంద ఇంట్లో లేకపోవటం చాలా వెలితిగా ఉంది వారికి.

“అన్నట్టు చెప్పటం మర్చిపోయానండీ, వాడికేదో సినిమాలో ఛాన్స్ దొరికిందట! మధ్నాహ్నమే ఫోను చేసి మరీ చెప్పాడు” అని జ్యోతుల్లా వెలిగిపోతున్న కళ్లతో ఆమె చెపుతూ ఉంటే.. “ఔనే! వాడు నా కొడుకు, కొంచెం మొండితనం, పట్టుదల వున్నా, వాడు అనుకున్నది తప్పకుండా సాధిస్తాడు” అన్న ఆయన కళ్లల్లో ఆనంద భాష్పాలు వర్షించాయి.

***

ఆఫీసు పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు గంగాధర్. దాదాపు రెండు బీరువాలలో ఫైళ్లు పేరుకుపోయి ఉన్నాయి. ఎందుకు అని అడిగితే అని తోటి స్టాఫ్‌ని అడిగితే వాళ్లు నీళ్లు నమిలారు. ఆ తరువాత ఎప్పుడో ఒకసారి శ్రీరామ్‌తో టీ తాగుతూ ఉంటే అతని చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు గంగాధర్.

“ఇంతకుముందు రాజారామ్ అనే అతను మీరు ప్రస్తుతం ఉన్న సీటులోని పని చేసేవాడు. అతను పనిచేసింది తక్కువే. ఫైళ్లు చూస్తూ ఉండేవాడు. నోటింగ్ రాసి, ఫైలును పైఅధికారికి పంపేవాడు కాదు. ఒకవేళ ఏదైనా పైలు బాస్‌కి వెళ్లిందంటే.. పార్టీ తగిన సొమ్ము ముట్టజెప్పుకున్నాడని అర్థం. అలా అని అందరూ ముడుపులు చెల్లించలేరుగా! అందుకనే టన్నుల కొద్ది ఫైళ్లు పేరుకుపోయాయి” అని శ్రీరామ్ గతాన్ని పూసగుచ్చినట్లు గంగాధర్‍కి చెప్పాడు.

దాదాపు రెండు నెలల కాలంలో ఆఫీసులోని పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేశాడు గంగాధర్. అతని పట్టుదల, నిబద్ధతను మెచ్చుకున్న ఆఫీసరు అతని ప్రమోషన్‌కి రికమెండ్ చేశాడు. కానీ గంగాధర్‍కు ప్రమోషన్ ఇవ్వటం ఆఫీసులోని తోటి సిబ్బందికి ఏ మాత్రమూ ఇష్టం లేదు. అందుకనే అతనిమీద కక్షతో కొంత డబ్బు పెట్టిన కవరును గంగాధర్ టేబుల్ డ్రాయర్‌లో అతను చూడకుండా పెట్టారు. ఆపై అవినీతి నీరోధక అధికారులు వచ్చి గంగాధర్‌ని లంచం తీసుకున్నట్లు రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్నారు.

మొత్తానికి గంగాధర్‌ను ఉద్యోగం నుండీ సస్పెండ్ చేయించగలిగారు తోటి సిబ్బంది. అంతేకాదు గంగాధర్ లాగానే నిజాయతీగా పనిచేస్తున్న పై అధికారిని కూడా తమ పలుకుబడితో వేరే ఆఫీసుకు బదిలీ చేయించారు.

అసలు ఈ లంచం ఎలా మొదలయ్యింది? ఎందుకని ఉద్యోగులు ఇలా చేస్తున్నారు? మరి నెల జీతం కూడా తీసుకుంటూ ఇంకా లంచం ఎందుకు తీసుకోవాలి? లంచం ఇవ్వనిదే కనీసం రబ్బరు స్టాంపు కూడా వేయటం లేదు.  ఆఫీసులోని అన్ని లావాదేవీలకూ లంచం రేట్లు నిర్ణయించబడ్డాయి. అందుకేనేమో బ్రిటీష్ కాలంలో సిబ్బందికి తక్కువ జీతాలు ఇచ్చేవాళ్లట, ఎందుకంటే లంచం సంపాదన, జీతం కన్నా ఎక్కువే కదా! అని అతిగా ఆలోచిస్తున్న గంగాధర్‌కు మతిభ్రమించింది. అతను పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు.

భర్త అనారోగ్యం చూసి చాలా బెంగపెట్టుకొంది భార్య. ఇంతలో సహజ డిగ్రీ పూర్తి కావడంతో ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. గంగాధర్ తమ్ముడు రామకృష్ణ తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచాడు.

ఆ రోజు సహజ పెళ్లి చూపుల కోసం పెళ్లివారు వచ్చారు. పెళ్లికి ఇచ్చే కట్నకానుకల విషయాలు ఉభయులు మాట్లాడుకుంటున్నారు. అందరు కాఫీలు తాగుతున్నారు, కానీ టిఫిన్లు మాత్రం తినటం లేదు. ఎందుకంటే కతికితే అతకదట! అని సంతోషంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు పెళ్లివారందరూ.

ఇంతలో రెండు ప్లేట్లు పట్టుకొని లోపలికొచ్చాడు గంగాధర్. “ఇవిగో స్వీట్లు, హాట్లూ, గారెలు, పొంగల్, మీరు ఆనందంగా తినండి. కతికితే అతకదట పాత మాట, కానీ ఈ రోజుల్లో మనం కతికితేనే మన బంధం తుమ్మచిగురుల్లా అతుక్కుపోతుంది.

ఇవి తినండి! సరాసరి స్మశానాల్లో ప్రేతలకు నైవేద్యం పెట్టినవి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా తిండి కోసమే కదా! నేను తినే మీకు తీసుకొచ్చాను. మనం తింటం కోసమే పుట్టాము. అందుకే కదా! మనం లంచాలు తీసుకునేది! ఇదిగో వినండి! ఒకవేళ పెళ్లి కొడుకు గవర్నమెంటు ఉద్యోగం చేస్తే నాకు అల్లుడిగా అసలు పనికిరాడు. అర్థమయిందా. నేను పిచ్చోడిని కాదు. కానీ అందరూ నన్నూ పిచ్చివాడంటారు.” అని చెప్పి

‘మహాప్రయాణమే మన జీవితం’ అని పాట పాడుకుంటూ రోడ్డుమీదకు పరిగెత్తుకుంటూ వెళుతున్న గంగాధర్ వికృత పిచ్చి చేష్టలకు వీధికుక్కలు మొరుగుతూ అతన్ని వెంబడించాయి. ఆ క్రమంలో ఒక రాయి తట్టుకొని అకస్మాత్తుగా భయంకరంగా అరుస్తూ కిందపడిపోయాడు.

ఈ అనూహ్య సంఘటన చూసిన పెళ్లివారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుసుకున్నాడు పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అభిరామ్.

రామకృష్ణ సహాయంతో హుటాహుటిన గంగాధర్‌ను హాస్పటల్ కు తీసుకెళ్ళారు.

గంగాధర్ పరిస్థితి సీరియస్ గానే ఉంది. అతను స్పృహలో లేడు. ఐ.సి.యూ లోనికి ఎవ్వరినీ వెళ్లనీయటం లేదు. చకచకా అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేశారు డాక్టర్లు. ఇంకా 12 గంటలవరకూ ఏ విషయాన్నీ చెప్పలేమన్నారు డాక్టర్లు. భార్య అన్నపూర్ణ దైవప్రార్థనతో తన కంగారును ఉపశమన పర్చుకుంటోంది.

మెడికల్ రిపోర్టులన్నీ చూశారు డాక్టర్లు. ప్రస్తుతానికి గంగాధర్‌కి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. “మీకొక శుభవార్త, ఇంతకముందున్నమతి భ్రమించటం కూడా సమస్య కూడా పోయింది. ఈ యాక్సిడెంట్‌తో జ్ఞాపకశక్తి వచ్చేసింది. ఇప్పుడు గంగాధర్ గారు మన అందరినీ గుర్తుపడతారు” అని డాక్టర్లు చెప్పిన మాటలు విన్న ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు.

తండ్రి రాజారామ్ అవినీతి సంపాదనతో కుములిపోయిన అభిరామ్ దానికి పశ్చాత్తాపంగా గంగాధర్ కుటుంబానికి తగిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. లేదంటే, మన జీవితానికి నిష్కృతి లేదని తండ్రికి నచ్చ చెప్పాడు. ఔను! మనం చేసిన ఘోర పాపాలకు ఇదియే సరియైన ప్రాయశ్చిత్తమని తండ్రి రాజారామ్ కూడా అంగీకరించాడు.

సహజను కూడా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న ‘పెద్ద మనసు’న్న అభిరామ్‌ను అటు చుట్టాలు, ఇటు స్నేహితులు అభినందించారు. అదే సమయానికి సినిమా హీరోగా మారిన నందకుమార్ పెళ్లికి వచ్చి అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించాడు.

గంగాధర్ మానసిక స్థితి బాగుందని మెడికల్ సర్టిఫిట్ తీసుకొని ఆఫీసులో అధికారులకిచ్చాడు. మళ్లీ గంగాధర్ తన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. గంగాధర్ పై పెట్టిన కేసు నకిలీదని, కృత్రిమమైనదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాంతో గంగాధర్ కు ప్రమోషన్ కూడా వచ్చింది. సన్నాయి మేళతాళాలతో సహజ, అభిరామ్ పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది.

శుభం.

Exit mobile version