Site icon Sanchika

పశ్చాత్తాపం

“తినడానికి మాత్రం ఠంచన్‌గా టైంకు వస్తారు, ఏ సిగ్గూ ఎగ్గూ లేకుండా” అంటూ రుసరుసలాడుతూ భర్తకు భోజనం వడ్డించింది హారతి.

“ఏమేవ్! ఎందుకంత కోపం? ఈ రోజు ఏం స్పెషల్ చేసావేంటి? నాకోసం!” అంటూ ప్రేమగా అడిగాడు ఆంజనేయులు.

“ఆ…చాల్లే సంబడం, గదొక్కటే తక్కువ. ఏం సంపాదిస్తున్నావని నీకు పంచభక్షపరమాన్నాలు చేసిపెట్టనూ” అని దీర్ఘాలు తీస్తూ….

“ఆ…ఏముంది జారుడు పప్పు, నీళ్ల చారు గివేగా మనకు దిక్కు. ‘దమ్మిడి పొదుపు లేదు’. బతకలేని బడిపంతులు అన్నట్టు వచ్చిన నాలుగు రూకలు దానధర్మాలంటూ ఊడ్చేస్తావ్. అయినా నిన్నని ఏం లాభం లే. నీకు కట్టబెట్టాడు సూడు మా అయ్యను అనాలే.” అని అన్నది హారతి.

“హారతి! ఈ రోజెందుకో భోజనం చాలా రుచిగా అనిపిస్తుందే” అన్న భర్తతో

“అనిపిస్తది.. అనిపిస్తది! ఎందుకనిపించదు చెట్టంత ఎదిగిన ఆడపిల్లలను ఇంట్ల వెట్డుకొని దాన్ని ఓ అయ్య చేతిల పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సమాజసేవని తిరుగుతున్నావు సూడు. ఏనాడన్న ఇంటి గురించి ఆలోచించావా? ఆ చిన్నది చూడు పెద్దదానికన్నా ఓ అంగుళం ఎక్కువే పెరిగింది. గుండెల మీద కుంపటిలా తయారయ్యారు ఇద్దరు పిల్లలు.” అంటూ చీదరించుకున్నది.

“బాధపడకు హారతి. పైన దేవుడికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో తెలుసులేవోయ్!” అంటూ పళ్లెంలో చేతులు కడుక్కొని వాలు కుర్చీలో అలా వాలాడు ఆంజనేయులు.

కంటికి చిన్నగా కునుకు పట్టిందో లేదో హఠాత్తుగా తలుపు చప్పుడవడంతో పెద్ద దర్వాజ కేసి చూసాడు ఆంజనేయులు.

“దండాలయ్యా! నా బిడ్డకు పెళ్లి కుదిరింది. అబ్బాయి సాఫ్ట్‌వేర్. మంచి సంబంధం. పెళ్లి చేసేద్దామనుకుంటాను” అన్నాడు” రామయ్య.

“చేసేయ్..!ఇంకా అనుమానమెందుకు మంచి సంబంధం అంటున్నావుగా. నీ బిడ్డ కూడా డిగ్రీ చదివింది కదా! పెళ్లైనంక పట్నంలో ఉద్యోగంలో చేరుతుందిలే. ఇద్దరు సంపాదిస్తూ చిలకాగోరింకల్లా బతుకుతారు.”

“అది కాదు అయ్యా! అంతా మంచిగనే ఉంది కానీ ఆ అబ్బాయి వాళ్లమ్మ కొంచెం గడుసు, కట్నం కావాలంటుంది. ఈ ఏడు వర్షాల్లేక పంట పండక చేతిల చిల్లిగవ్వ కూడా లేదు.”

“ఓహో…అట్టనా!” అని…

“ఏమేవ్! హారతి… ఆ సందుగల పదివేలున్నయ్ పట్టుకురా” అని కేక వేయగానే లోపల కోపాన్నంతా అణుచుకొని పెదాలమీద చిరునవ్వును పులుముకొని డబ్బు తెచ్చి రామయ్య చేతికి ఇచ్చి బిడ్డ పెళ్లి ఏ లోటు లేకుండా చేయమని చెప్పింది హారతి.

రామయ్య వెళ్లగానే…

గిన్నెలన్నీ ఎత్తేస్తూ.. బిడ్డలను శాపనార్థాలు పెడ్తూ…

“ఇక మీ పెళ్లిళ్లు అయినట్టే.. మీరిద్దరూ పెళ్లి పెటాకులు లేకుండా మీ అయ్య చేసే దానాలను చూస్తూ ఒంటరి పక్షుల్లా మా చూరు పట్టుకు వేలాడాల్సిందే.” అని లబోదిబోమంటూ నెత్తినోరు కొట్టుకున్నది హారతి.

“ఎంత చెప్పినా దీనికి అర్థం కాదు. నా ప్రారబ్ధం ఇంతే” అని పేపరు చదువుతూ ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు ఆంజనేయులు. హారతి అన్నమాట నిజమే కదా ఎదిగిన పిల్లలను చూస్తే తనకు బాధగానే ఉంది.

వెంటనే తన చిన్ననాటి స్నేహితునికి ఫోన్ చేసి “ఏరా గడుగ్గాయి. ఎంత ఎత్తుకు ఎదిగావురా! బిల్డింగుల మీద బిల్డింగులు కట్టావు. ఇంతకీ నీ కొడుకు ఏం చేస్తున్నాడేంటి?” అని మాటమాట కలుపుతూ కొడుకు గూర్చి ఆరా తీసాడు. మనోహర్ వాళ్లబ్బాయి తనలాగే తెలుపు రంగులో ఆరడుగుల ఎత్తు. అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. తన బిడ్డ కూడా రింగుల జుట్టుతో నాజూకుగా ఉంటది. ఇద్దరి ఈడుజోడు బాగుంటది. మూడు ముళ్లు వేపిద్దామని అడిగాడు.

వెంటనే..మనోహర్ “ఆ..వేపిద్దాం కానీ మావాడికి కట్నం పిచ్చి ఉందిరా. ఏమాత్రం ఇవ్వగలవు కట్నం” అని అడగ్గానే గుండెల్లో బండ పడ్డట్టయ్యింది ఆంజనేయులుకి.

“ఇస్తాగాని పిల్లలు చిన్నవాళ్లేగా, కొన్ని రోజులు ఆగుదాం” అంటూ చప్పున ఫోన్ పెట్టేస్తాడు ఆంజనేయులు ఉబికి వస్తున్న బాధతో.

ఇదంతా తలుపుచాటు నుండి వింటున్న భార్య ఆక్రోశం పట్టలేక విరుచుకుపడ్డది భర్తపై. మాట మాట పెరిగి మౌనం ఆశ్రయించింది వాళ్లిద్దరినీ.

ఇలా కొన్ని నెలలు గడిచాక అనుకోకుండా ఒక రోజు మనోహర్ పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. పెళ్లి ఖాయం అయ్యింది.

మనోహర్ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడో అంతుపట్టలేదు హారతికి.

ఒక రోజు హారతి మనోహర్‌కు ఫోన్ చేసి విషయమంతా అడిగింది. అప్పుడు మనోహర్…

“మీ ఊరిలో రామయ్య అల్లుడు, భీమయ్య కొడుకు వచ్చి కట్నం డబ్బుల కింద రెండు లక్షలు ఇచ్చారు. ఇంకా ఏమైనా కానుకలు కావాలంటే ఊర్లో వాళ్లందరం చందాలు వేసుకొని ఇస్తామన్నారు. వాళ్ల మాటలు విన్నాక నా తప్పేంటో నాకు తెలిసింది. డబ్బే జీవితం కాదు, మనల్ని కాపాడేది మంచితనం అని తెలుసుకొని మీ యింటికి వచ్చానమ్మ” అని చెప్పాడు.

ఆ… మాటలు వింటున్నంతసేపు హారతికి కళ్లనుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు తన భర్తను రాచిరంపాన పెట్టిన క్షణాలన్నీ గుర్తొకొచ్చాయి. భర్త మంచితనం తెలుసుకొని పశ్చాత్తాపంతో….

“అయ్యో…ఈ విషయం తెలియక ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి. నన్ను మన్నించండి.” అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయిది. ఇన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి తెరపడింది.

Exit mobile version