Site icon Sanchika

పసి ఆర్తనాదం

[box type=’note’ fontsize=’16’] ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు చిన్నపాపను తల్లి నుంచి లాక్కెళ్ళే దృశ్యం చూసి వ్రాసిన కవిత ఇది. [/box]
[dropcap]ఆ[/dropcap] ఆర్తనాదానికి మతం లేదు
ప్రాంతంలేదు.. కులం లేదు
ఆ నిస్సహాయ రోదనను వ్యక్తీకరించే శక్తి
ప్రపంచంలో ఏ భాషకూ లేదు
కన్నబిడ్డను కాపాడుకోలేని తల్లి కన్నీళ్ళు
అణుబాంబులకన్నా విస్ఫోటనమై
వికృత మగ మదాన్ని భస్మంచేస్తే తప్ప
అరాచక తాలిబన్లను మట్టుబెడితే తప్ప
ఆ పసి ఆర్తనాదాలు ఆగిపోవు

ఆ భయంకర దృశ్యం చూస్తూ
ఆకాశం భూమి గడడలాడాయి
నక్షత్రాలు మెరవటం మర్చిపోయినై
వెన్నెల మూగవోయి మబ్బుల్లో దాగింది
కర్మసాక్షి తలదించుకుని తప్పుకున్నాడు
మానవత్వం బురఖాల్లో బందీఅయి కుములుతోంది
విద్య.. అన్నం.. రక్షణ.. ఏదీ ఇవ్వలేకపోయినవాళ్ళు

పసి ఆడతనానికి ఎగబడటం చూస్తుంటే..
ప్రపంచం ఎడారిగా మారిపోయిందా?
ఉపన్యాస నాయకులు ఏమరిఉన్నారా?
మతపెద్దలంతా నిద్ర నటిస్తున్నారా ?
గర్భస్థ ఆడపిండం నుంచి అమాయక అమ్మాయిల దాకా
కామబానిసల్ని చేసుకునే రాక్షసరాజ్యంలో
పాపాయిలే కాదు.. అమ్మలూ.. అమ్మమ్మలూ
కార్చేది కన్నీళ్ళని కాదు.. రక్తాన్నే
మార్చేది శాసకులనే కాదు.. ప్రేక్షకదోషులను కూడా!

 

Exit mobile version