[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘పసిడి పూల జల్లులే.. వాన చినుకులు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]దు[/dropcap]క్కి దున్నింది మొదలు
వరుణదేవుడి కరుణకై
రైతన్నల ఎదురు చూపులు
ఆకాశాన కదులుతున్న మబ్బుల వైపు ఆశగా చూస్తూ
నయనాల నిండా ఆనందబాష్పాలు!
ప్రియమార నేలతల్లిని
ముద్దాడాలని మేఘమాలికలు
వాన చినుకులుగా మారి
నేలతల్లి ఒడికి చేరుతాయి!
కురుస్తున్న వర్షం
పసిడి పూల జల్లులే..
వాన చినుకులు అన్నట్లుగా
ఇల చేరుతూ
వాగులు, వంకలు,సెలయేళ్ళు, నదులుగా మారుతూ
ఉత్సాహంగా పరవళ్ళు తొక్కుతూ
సంబరంగా పుడమితల్లి పై నర్తిస్తాయి!
నిండు కుండల్లా
జలకళను సంతరించుకున్న ప్రాజెక్ట్‌లు
పసిడి పంటలు పండటానికి
అవసరమైన నీటిని కాలువల ద్వారా
సమయానుకూలంగా అందిస్తుంటే..
సేద్యం ప్రజల ఆకలిని తీర్చే
అమృతమయమై అలరారుతుంది!
ధాన్యరాశులు ఇళ్ళకు చేరుతుంటే..
పల్లెటూరులు దేశ ఆర్థిక ప్రగతికి సోపానాలు!
ఆరుగాలం శ్రమించిన
రైతన్నల ఇళ్ళలో
శ్రీలక్ష్మి కొలువుదీరు తుండగా..
రైతే రాజు అని కీర్తిస్తుంది లోకం!