Site icon Sanchika

పట చిత్ర కళ

[dropcap]ప[/dropcap]ట చిత్ర లేదా పట్టచిత్ర అనే కళ చాలా పురాతనమైన కళ. ముఖ్యంగా వస్త్రాలపై వేసే కళను పట చిత్ర అని అంటారు. తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, వెస్ట్ బెంగాల్ లలో సంప్రదాయంగా తర తరాలనుండి వస్తున్న కళ ఇది. బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ కళ ప్రాచుర్యంలో ఉన్నది.

ప్రధానంగా పురాణ గాథలను లేదా జానపద గాథలను వస్త్రాలపై రంగులతో చిత్రిస్తారు. దేవాలయాలలో జరిగే పూజా కార్యక్రమాలలోనూ, ఆచార వ్యవహారాల లోనూ ఈ వస్త్రాలను ఉపయోగిస్తారు. వీటి కోసం చెట్ల నుండి ఉత్పత్తి చేసిన సహజ రంగులను ఉపయోగిస్తారు. ఒడిశా లోని దేవాలయాల్లో యాత్రికులకు సావరిన్స్ లాగా అమ్ముతూ ఉంటారు. పూరీ దేవాలయంలో జగన్నాథ చిత్రాలలో మనకు కనిపిస్తుంటాయి.

వెస్ట్ బెంగాల్ లోని బీర్‌భమ్, పశ్చిమ మిడ్నాపూర్ మరియు వర్ధమాన్, ముర్షిదాబాద్ జిల్లాలలో పాటు కాళీఘాట్ ప్రాంతం ఈ కళకు ప్రాణం పోస్తుంది. అలాగే ఒడిశా రాష్ట్రం లోని రఘురాజ్ పూర్, పూరి, దండ సాహి, సోనేపూర్, దార్ కోటే, పర్లా కిమిడి, దిగప హండి, చికిటి వంటి ప్రాంతాలు పట చిత్రకళకు నెలవులుగా ప్రసిద్ధి చెందాయి. వస్త్రాలు, తాటి ఆకులూ, రాగి ఆకులు సహజ రంగులు ఈ చిత్రకళలో ప్రధాన వస్తువులు.

దీనికి పేరు సంస్కృత భాష నుంచి వచ్చింది. సంస్కృతంలో పట అంటే వస్త్రమని, ‘చిత్ర’ అంటే దృశ్యమని అర్థం కదా! అందుకే వస్త్రాలపై వేసే చిత్రాలని ఈ విధంగా పేరు పెట్టారు. హిందూ పురాణాలను, దేవతలను గురించి తెలిపే సంఘటనలను పట చిత్రాలుగా రూపొందిస్తారు.

ఎక్కువగా రాధాకృష్ణుల లీలలు, దుర్గా మాత రూపాలను కూడా చిత్రిస్తారు. ఈ పట చిత్రాలు ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో వ్యాప్తి చెందాయి అనుకున్నాం కదా. అయితే రెండు రాష్ట్రాలలోనూ ఆధునీకరణలో రెండు శైలులుగా మారిపోయాయి. అందుకే ఏ రాష్ట్ర శైలి ఆ రాష్ట్రం పేరుతో ప్రసిద్ధి చెందింది. కానీ ఒకే మూలాంశం తోనే చిత్రాలు ఉంటాయి.

‘ఒడిశా పట్ట చిత్ర’ పాత కుడ్య చిత్రాల్లా కనిపిస్తాయి. చాలా పురాతన కోటల్ని దర్శించినపుడు గోడలకు, పై కప్పులకు ఉండే పెయింటింగులు అద్భుతంగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద మట్టి కుండలు, వాటిపై మూతలు కూడా పట చిత్రాలకు కాన్వాసుగా మారాయి. ఒడియా మ్యూజియంలో ఇప్పటికి మట్టి కుండ దాని మూతను చూడవచ్చు. పూరిలోని దైవం జగన్నాథుని యొక్క పట చిత్రాలు చాలా ఉన్నాయి. తాటి ఆకులపై వేసిన పట చిత్రాలు సైతం ఒడిషా మ్యూజియంలో ఉన్నాయి. 1550 సంవత్సరంలో ఉన్న పట చిత్రాలలో గోపికలు, శ్రీకృష్ణుని లీలలు, శ్రీ కృష్ణుని మురళిరవానికి మైమరిచి పోయిన గోపికమ్మలు యమునా నది ఒడ్డున ఉన్నట్లుగా చిత్రించబడ్డాయి.

పూరిలో జగన్నాథుని, సుభద్ర, బలభద్రుల చిత్రలతో పాటుగా వైష్ణవ భక్తితో ముడిపడి ఉంటుంది. విష్ణుమూర్తి దశావతారాలతో పాటుగా రామాయణ మహాభారతాల దేవతలు, దేవతల వ్యక్తిగత చిత్రాలు చిత్రించబడ్డాయి. పౌరాణిక, మతపరమైన కథలు, జానపద కథల ఇతివృత్తాలను చిత్రాలుగా రూపొందించడమే ప్రధాన లక్ష్యం. ఈ చిత్రాల లోని దుస్తుల శైలి మొఘుల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ పట చిత్ర శైలిలో జానపద, శాస్త్రీయ అంశాలు రెండింటిని మిళితం చేస్తూ కనిపిస్తాయి.

ఈ చిత్రాలలో ప్రకృతి దృశ్యాలు, దృక్కోణాలు, సుదూర వీక్షణాలు కనిపించవు. ఇందులో అన్ని చిత్రాలు దగ్గరగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి. ఇవన్ని ఎక్కువగా ఎరుపు రంగులో పెయింట్ చేయబడతాయి. ఈ బొమ్మల నేపథ్యం, పువ్వులు ఆకులతో అలంకరించబడి నవ గుంజర చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

కుటుంబమంతా కలసి పట చిత్రాలను రూపొందించసాగాయి. ఇంట్లోని మహిళలు జిగురును వస్త్రాన్ని సిద్ధం చేస్తారు. పురుషుల చుట్టూ గీతల్ని గీసేస్తే మధ్యలో నింపాల్సిన రంగుల్ని నింపుతారు. ఇంకా చివరకు పూసే లక్క పూతను మహిళలే పూస్తారు. కాటన్ వస్త్రాలకై చింతపండు గింజల మిశ్రమం మరియు గమ్‍ల మిశ్రమాన్ని పూస్తారు. వస్త్రాలపై పూసిన పూత వలన కాన్వాస్ తయారవుతుంది. లక్క పూత వలననే వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడుతుంది. ఈ పట్ట చిత్రాలు హింగుల, హరితల, కాల, శంఖ, గేరు అనే ఐదు సహజ రంగులలో వేయబడతాయి. కృష్ణుడ్ని నీలం రంగులోనూ, గోపికలను లేత గులాబీ రంగులోనూ లేదా లేత గోధుమ రంగులోనూ చిత్రిస్తారు. కొబ్బరి చిప్పల్ని కాల్చి తయారు చేసిన నలుపు రంగునూ, శంఖం పెంకుల నుండి తెలుపు రంగునూ తయారు చేస్తారు.

తాటి ఆకులపై వేసే పట్ట చిత్రాలని తాళా పట్టచి అని పిలుస్తారు. తాటి ఆకులను విడదీసి కాన్వాస్ లాగా కుడతారు. ఒడిషా క్రాప్ట్స్ మ్యూజియంలో పట్ట చిత్ర శైలిలో చెక్కతో చేసిన రామలీలా ముసుగులు, కాళీ మాత యొక్క పెపియర్ మాషే ముసుగులు ఉన్నాయి. బెంగాల్ పట్ట చిత్రాలు చిత్రకారుడు జెమిని రామ్ చేత ఆధునీకరింప బడ్డాయి. మా ఇంట్లో జెమిని రాయ్ ప్రసిద్ధ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో తల్లి బిడ్డల చిత్రాలు ప్రముఖమైనవి.

బెంగాల్ పట్ట చిత్రలో పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశాల యొక్క చిత్రలేఖనాన్ని నిర్మింపజేస్తుంది. లిస్బన్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎత్నాలజీలో అనేక చిత్రాలు ఉంచబడ్డాయి. దుర్గా పట్, చల్చిత్ర, గిరిజన పట చిత్ర, కాళీ ఘాట్ పట చిత్రాలుగా విభజించబడ్డాయి. అజిత్ కుమార్ ముఖర్జీ అనే రచయిత తను రాసిన ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ బెంగాల్ లో బంకురా జిల్లాలోని దేవాలయాల్లోని కొన్ని చిత్రాలు కుడ్య చిత్రాల శైలిలో ఉన్నాయని తెలియ జేశాడు. జానపద చారిత్రక కళా రూపాలతో మేళవించబడి ఉంటాయి. మిడ్నాపూర్, బంకురా, పురూలియా, హౌరా, హుగ్లీ వంటి గ్రామాలలో పటువా సంగీతం వంటి పాటలతో ఈ చిత్రాలు ఉంటాయి. బెంగాల్ పట్ట చిత్రలో చల్చిత్ర కూడా ఒక భాగం. చల్చిత్ర కళాకారులు పట్ట చిత్ర అని పిలుస్తారు. 300-400 సంవత్సరాల క్రితపు పురాతన విగ్రహాలు తయారీలో చల్చిత్రాన్నీ ఉపయోగించారు. మధ్యలో చల్చిత్ర వాడకాలు తగ్గాయి. నబద్విప్ శక్త రాష్ ప్రసిద్ధ చల్చిత్ర చిత్రకారుడు.

కానీ ఇప్పుడు మరల ఈ చిత్రాలకు ప్రజాదరణ ఎక్కువ అయింది. రామాయణం, మహాభారతం వంటి హిందూ దేవతలు మరియు రాధాకృష్ణ చైతన్య, కాళీ వంటి దేవతల కథలను పట్ట చిత్రాలు వివరిస్తాయి.

ఒడిశా పట్ట చిత్ర, బెంగాల్ పట్ట చిత్రాలతో పట్ట చిత్రాలు సహజ రంగులతో అలరారాతున్నాయి.

Exit mobile version