[మార్చ్14 కె.వి. మహాదేవన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]
[dropcap]తె[/dropcap]లుగు పాటను అంతర్జాతీయం చేసిన సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్. ఆయన సంగీతం చేసిన శంకరాభరణం తెలుగు సినిమా పాటలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా కూడా వినుతికెక్కాయి; విశ్వవ్యాప్తం అయ్యాయి. మనదేశంలో కె.వి. మహాదేవన్ సంగీతం చేసిన శంకరాభరణం సినిమా పాటలు మఱే ఇతర భాషల సినిమా పాటలకన్నా ఎక్కువగా రాణించాయి, రాజిల్లాయి అనడం అతిశయోక్తి కాదు సరైన ఉక్తి. కె.వి. మహాదేవన్ ఒక ఉన్నత స్థాయి సినిమా సంగీత దర్శకుడు. తెలుగు సినిమా పాటను అంతర్జాతీయం చేసినందుకు ఆయన్ను స్మరించుకుంటూనే ఉండాలి. ఆయన్ను మఱోసారి స్మరించుకుందాం రండి…
కె.(కృష్ణన్ కోవిల్) వి.(వెంకటాచల బాగవతార్) మహాదేవన్ 1918లో పుట్టారు. మార్చ్ 20న పుట్టారు అని ఒక మాట ఉంది. మార్చ్ 4 ఆయన జన్మ దినం అని ఆయన కుటుంబం తెలియజేసింది.
కె.వి. మహాదేవన్‌పై విశేషమైన పరిశోధన చేసి తమిళ్ష్‌లో 800 పుటలకు పైగా రెండు పుస్తకాల్ని రాసిన రచయిత వామనన్ మార్చ్14 ఆయన జన్మదినం అని ధ్రువీకరించారు. కె.వి.మహాదేవన్‌పై ఇప్పటికే తెలుగులో ఒక్క పుస్తకమైనా వచ్చి ఉండాల్సింది, రాలేదు. రాకపోవడం లోటు.
1942లో వచ్చిన మనోన్మణి తమిళ్ష్ సినిమాలోని “మోహనాంగ వదన…” పాట మహాదేవన్ చేసినా మఱొకరి పేరుతో ఆ పాట చలామణిలోకి వచ్చింది. 1942లో తమిళ్ష్ సినిమా ఆనందన్ సంగీత దర్శకుడుగా మహాదేవన్ తొలి సినిమా. ఆ తరువాత ఆయన 2, 3 తమిళ్ష్ సినిమాలు చేసినా అవి విజయవంతం కాకపోవడంతో ఆయన హెచ్.ఎం.వి.లో ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగ కాలంలో ఆయన రికార్డ్‌లపై కొన్ని తమిళ్ష్ పాటలు పాడారు. అంతకు ముందు అంగరై విశ్వనాద బాగవతార్ అన్న శాస్త్రీయ సంగీత గాయకుడికి కచేరీలలో పక్కపాట పాడుతూండే వారు. అంతకు ముందు బూదపాండి అరుణాచల కవిరాయర్ అనే గురువు వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు.
కె.వి. మహాదేవన్ నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు నాటకాల్లో నటించే వారు. నాటకాల్లో కొన్ని స్త్రీ పాత్రలు కూడా వేశారు.
1942లోనే సినిమా సంగీత దర్శకుడయినా కూడా 1952లో కుమారి అన్న తమిళ్ష్ సినిమాతో ఆయనకు సంగీత దర్శకుడిగా ఒక గుర్తింపు వచ్చింది. ఈ కుమారి సినిమా తెలుగులో రాజేశ్వరి పేరుతో వచ్చింది. రాజేశ్వరి సినిమాకు సంగీతం ఓగిరాల. రాజేశ్వరి సినిమాలో ఐదు పాటల వరుసలు లేదా బాణిలు మహాదేవన్ తమిళ్ష్‌లో చేసినవే. 1955లో తమిళ్ష్‌లో వచ్చిన టౌన్‌బస్ సినిమా తెలుగులో ఆ పేరుతోనే డబ్ ఐంది. టౌన్‌బస్ సినిమాలో “చిన్ని పిచ్చుకా…”, “లేతవలపురా…” పాటలు జనరంజకమయ్యాయి. తెలుగులో ఆయనకు తొలి చిత్రం 1958లో వచ్చిన దొంగలున్నారు జాగ్రత్త. 1958లోనే వచ్చిన బొమ్మల పెళ్లి సినిమాకూ ఆయన సంగీతం చేశారు. ఈ రెండు సినిమాలూ తమిళ్ష్- తెలుగు సినిమాలుగా వచ్చాయి. ముందడుగు (1958) సినిమాతో కె.వి. మహాదేవన్ తెలుగులో సంగీత దర్శకుడిగా ఊపునందుకున్నారు. ఈ ముండడుగు సినిమా కూడా ముందు (1957) ముదలాళి పేరుతో తమిళ్ష్‌లో వచ్చింది. అటు తరువాత 1962లో వచ్చిన మంచిమనసులు సినిమాతో ఆయన సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్నారు.
మూగమనసులు, దాగుడుమూతలు (1964) ఆయన్ను తెలుగులో ఒక ఉన్నతమైన సంగీత దర్శకుడిగా నిలిపాయి. దాగుడుమూతలు సినిమాలోని “గోరొంక గూటికే చేరావు చిలక…” పాట ఒక విశేషమైన పాట. అప్పటికి ఒక కొత్త రుచి (new flavour)తో ఉంటుంది ఆ పాట. మూగమనసులు సినిమాలో “ఈనాటి ఈ బంధమేనాటిదో…”, “పాడుతా తీయగా చల్లగా…” లాంటి గొప్ప పాటలున్నాయి వాటి మధ్యలో “గోదారి గట్టుంది…” పాట ఒక ప్రత్యేకమైన పాట. ఆత్మబలం (1964) సినిమాతో ఆత్రేయ, కె.వి.మహాదేవన్‌ల కలయిక మెఱవడం మొదలయింది. తెలుగు, తమిళ్ష్ భాషల్లో వచ్చిన వీరాభిమన్యు సినిమా పాటలు మహోన్నతమైనవి. ఆ సినిమాలో శహన రాగంలో ఆయన చేసిన “చూచి, వలచి, చెంతకు పిలిచి …” పాట ఉన్నతమైంది. శహన రాగంలో వచ్చిన ఒక గొప్ప పాట ఇది. సుమంగళి(1965)సినిమాలోని “కనులు కనులతో కలబడితే…” పాట ఎంతో గొప్ప పాట. ఈ పాట మొదటగా 1962లో తమిళ్ సారదా సినిమాలో వచ్చింది. గాయకుడు కె.జె. ఏసుదాస్ ఈ పాటను ప్రశస్తంగా ప్రశంసించారు. ఒక పాటను ఇలా ఆలోచించి స్వరపఱచడం చాల గొప్ప విషయం. కె.వి. మహాదేవన్ ఒక గొప్ప సంగీత దర్శకుడు కాబట్టే ఇలాంటి పాటను చెయ్యగలిగారు. కన్నెమనసులు సినిమాలో “ఈ ఉదయం నా హృదయం…” పాట ఒక గొప్ప ఆలోచనకు ఆకృతి. తేనె మనసులు సినిమాలో “ఏం ఎందుకని సిగ్గెందుకని ఆలు మగల మధ్య జరిగేది తెలియందెవరికని…” పాటను మహాదేవన్ స్వరపఱిచిన విధానం చాల గొప్పది. కె.విశ్వనాథ్, బాపు, వంటి దర్శకులకు ఎన్నో గొప్ప పాటలు చేశారు కె.వి.మహాదేవన్.
కె.విశ్వనాథ్ ఉండమ్మా బొట్టుపెడతా సినిమాలో “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా…” అన్న తెలుగుతనపు హరిదాసు పాటను చేశారు మహాదేవన్. బాపుకు ముత్యాలముగ్గు సినిమాలో “ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ…”, “గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మాడి…” వంటి తెలుగుతనం తొణికసలాడే పాటల్ని గొప్పగా చేశారు. సీతామలక్ష్మి సినిమాలోని “మావి చిగురు తినగానే కోవిల పలికేనా…” పాట ఎంతో ఉన్నతమైన పాట. కె.విశ్వనాథ్‌కు మహాదేవన్ సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, శుభోదయం, సిరివెన్నెల వంటి సినిమాల్లో మహోన్నతమైన సంగీతాన్ని సృష్టించి సమర్పిచారు. సిరివెన్నెల పాటలు ఎంతో విశేషమైనవి. ప్రేమనగర్ సినిమాలో “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా…” ఒక విశేషమైన పాట. ఏకవీర సినిమాలోని “ప్రతిరాత్రి వసంత రాత్రి…” పాట ఎంతో మధురమైన పాట.
బిగి, పొంకం, విలంబం, సాంద్రతలతో ఉర్దూ గజల్ వంటి పాటను దక్షిణాదిలో తొలిసారి కె.వి. మహాదేవన్ చేశారు. 1960లో వచ్చిన పొన్నిత్తిరునాళ్ అనే తమిళ్ష్ సినిమాలో “ఏన్ సిరిత్తాయ్ ఎన్నైప్ పార్తు…” పాటను పహాడీ రాగంలో గజల్ పంథాలో చేశారు. కవి రాసిన పాటను తీసుకుని దాన్ని చదవడానికే పట్టే సమయంలోనే ఈ గొప్ప పాటను చేసేశారు మహాదేవన్. బడే గులామ్ అలీ ఖాన్ పాడిన ఒక ఠుమ్రీ గురించి పి.బి. శ్రీనివాస్ చేసిన చర్చ మహాదేవన్ చేత ఈ పాటను చేయించింది. గజలియత్-గానం దక్షిణాదికి మహాదేవన్ ద్వారా వచ్చింది. ముత్యాల ముగ్గు సినిమాలో “ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు…” పాట కూడా ఉర్దూ గజల్ స్థాయి పాటే. “బాత్ కర్ నీ ముఝే ముశికిల్…” అన్న మెహ్‌దీహసన్ గజల్‌ను మనసులో పెట్టుకుని ఈ పాటను చేసినట్టుగా అనిపిస్తుంది.
అడవిరాముడు సినిమాలో మహాదేవన్ చేసిన “ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి…” పాట తెలుగునాట విపరీతమైన జనాదరణ పొంది అప్పట్లోనే కోటిరూపాయల పాట అయింది. మహాదేవన్ ధక్కారితమ్‌ను విస్తృతంగా వాడారు. ఈ ధక్కారితమ్‌ను ఉత్తరాది సంగీత దర్శకులు కూడా పెద్దగా వాడలేదు. ధక్కారితమ్‌వల్ల పాటకు ఒక ఊపు (swing) వచ్చి జనరంజకం అవుతుంది. త్రిశ్రం తాళాన్ని విరివిగా వాడేవారు మహాదేవన్. ఈ త్రిశ్రాన్ని ఇళయరాజా కూడా ఎక్కువగా వాడేవారు. ఈ విషయంలో తనకు మహాదేవన్ ఆదర్శమని ఇళయరాజా చెప్పేవారు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సంగీత దర్శకుడు ఎ. ఆర్. రహ్మాన్ మహాదేవన్‌ను అనుసరించిన సందర్భాలున్నాయి. మహాదేవన్ పెళ్లిచూపులు (1983) సినిమాలో చేసిన “దాసోహం దాసోహం” పాటలోని కొంత భాగాన్ని ఎ.ఆర్.రహ్మాన్ ఇందిరా తమిళ్ష్ సినిమాలో “ఓడకార మారిముత్తు,..” పాటలో వాడుకున్నారు.
తెలుగులో సినిమా పాట జనరంజకం అవడానికి మహాదేవన్ ఒక ప్రధానమైన మూలకం. తెలుగులో సినిమా పాట గొప్పగా పండడానికి మహాదేవన్ ఒక ప్రధానమైన ఇంధనం. మహాదేవన్‌వల్ల సినిమా పాట తెలుగులో విస్తృతమయింది. మహాదేవన్ పాట బలంగా, ప్రబలంగా తెలుగు జనం నోట పలికింది. తెలుగు సినిమా పాటల్లో కె.వి.మహాదేవన్ ముద్ర చాల ముఖ్యమైంది ఆపై విలువైంది. తెలుగుతనం జాలువారే ఎన్నో గొప్ప పాటలు చేసిన కె.వి. మహాదేవన్ తమిళ్ష్ వ్యక్తి.
మహాదేవన్ తమిళ్ష్‌లోనూ గొప్ప సంగీతం చేశారు. తెలుగు, తమిళ్ష్ సినిమా సంగీతానికి వేఱు వేఱు పంథాలను ఎన్నుకున్నారు ఆయన. ఇది ఆయనకు ముందు మఱే సంగీత దర్శకుడూ చెయ్యంది. తమిళ్ష్‌లో ప్రధాన గాయకులైన టి.ఎం.సౌందరరాజన్ గాత్ర ధర్మానికి, పి.బి. శ్రీనివాస్ గాత్ర ధర్మానికి ఎలాంటి పాటలు రూపొందగలవో అలాంటి పాటల్ని రూపొందించారు మహాదేవన్. టి.ఎం. సౌందరరాజన్‌కు సరళ రేఖలుగా ఉండే పాటల్ని చేసేవారు. పి.బి.శ్రీనివాస్ చేత అందుకు భిన్నమైన పాటలు పాడించే వారు. మహాదేవన్ తమిళ్ష్‌లో పి.బి. శ్రీనివాస్‌తో పాశ్చాత్య పోకడలో “తోళ్ కణ్డేన్ తోళే కణ్డేన్…” (సినిమా: ఇదయక్ కమలమ్) పాటను పాడించారు. “ఎన్నైప్ పార్తా పరిహాసమ్…” (సినిమా: సింగమలై తీవు), “నినైప్పదర్కు నేరమిల్లై…” (సినిమా: నినైప్పదర్కు నేరమిల్లై) వంటి విలక్షణమైన పాటల్ని పి.బి. శ్రీనివాస్ చేత పాడించారు. టి.ఎం. సౌందరరాజన్ చేత “కణ్ణెదిరే తోన్ఱినాళ్ కని ముగత్తై కాట్టినాళ్…”( సినిమా: ఇరువర్ ఉళ్ళమ్) అన్న మెత్తటి గొప్ప పాటను పాడించారు. తిరువిళైయాడల్ సినిమాలో “పాట్టుం నానే బావముమ్ నానే…” అంటూ పాడిన కె.వి. మహాదేవన్ పాట తన జీవితంలోనే తాను పాడిన గొప్ప పాట అని టి.ఎం. సౌందరరాజన్ ఈ వ్యాస రచయితతో చెప్పారు. పి.సుశీల చేత తమిళ్ష్‌లో
అద్భుతాల్ని పాడించారు మహాదేవన్. “గఙై కరైక్ తోట్టమ్ కన్ని పెణ్గళ్ కూట్టమ్…” (సినిమా: వానమ్‌పాడి), “మలర్గళ్ ననైన్దన…” (సినిమా: ఇదయక్ కమలమ్), “మన్నవన్ వన్దానడి తోళ్షి…” (సినిమా: తిరువరుట్‌చెల్వర్), వంటి పాటలు వాటిల్లో కొన్ని. పి. సుశీల తాను పాడిన పాటల్లోనే గొప్పగా పాడిన పాటగానూ, కష్టపడి పాడిన పాటగానూ “మన్నవన్ వన్దానడి తోళ్షి…” పాటను చెబుతారు. మహాదేవన్ తమిళ్ష్‌లో కొన్ని ఉన్నతమైన రాగమాలికలు చేశారు. కొన్ని తమిళ్ష్ పాటల్లో మహాదేవన్ కర్ణాటక సంగీతాన్ని మేలుగా వాడారు. తెలుగులో ఘంటసాల సంగీతం చేసిన లవకుశ సినిమా తమిళ్ష్‌లోనూ వచ్చింది. తమిళ్ష్ లవకుశ సినిమాలో మహాదేవన్ కొన్ని పాటలు గొప్పగా చేశారు. ముఖ్యంగా “జగమ్ పుగళ్షుమ్ పుణ్ణియ కదై రామనిన్ కదైయే…” పాటను 10కి పైగా రాగాలలో ఎంతో ఉన్నతంగా చేశారు. తెలుగు, తమిళ్ష్ పాటలకు వేర్వేఱు పంథాల్ని ఎన్నిక చేసుకునే విధానంలో, విషయంలో ఇళయరాజాకు మహాదేవన్ మార్గదర్శకుడు.
తెలుగులో 280కు పైగా, తమిళ్‌లో 200 సినిమాలకు పైగా సినిమాలకు సంగీతం చేశారు మహాదేవన్. కొందఱు ఇతర సంగీత దర్శకుల్లాగా ఒక భాషలో చేసిన స్వీయ సంగీతాన్ని మఱో భాషలో ఎక్కువగా వాడలేదు మహాదేవన్. మహాదేవన్ మంచి తాళ జ్ఞానం కలవారు. అందువల్ల ఆయన ముందుగా సాహిత్యాన్ని తీసుకుని ఆపై బాణి కడతారు. ఆ తాళ జ్ఞానంతో ఎటువంటి రచననైనా మంచి పాటగా మలచగలిగే వారు ఆయన. ముఖ్యంగా ఆత్రేయ వచనంలా రాసిన వాటిని కూడా గొప్ప పాటలుగా మలిచారు కె.వి.మహాదేవన్. మహాదేవన్‌వల్లే గేయత్వం (lyricism) లేని కొన్ని ఆత్రేయ రచనలు పాటలుగా ప్రజల్లో నిలబడ్డాయి. ముందుగా సాహిత్యాన్ని తీసుకుని స్వరపఱచడంవల్ల ఆయన పెద్దగా అనుకరణ కానీ వేఱే పాటలకు నకలు (copy) చెయ్యడం కానీ చెయ్యలేదు. ఆయనపై ఇంగ్లిష్ , హిందీ సంగీతాల ప్రభావం పెద్దగా లేదు. సాహిత్యానికి మాత్రమే సంగీతం చేశారు. భాషకు, పదాలకు తగిన స్వరకూర్పు చేశారు. సాహిత్యాన్ని అర్థం చేసుకున్నాకే ఆయన బాణిలు కట్టేవారు. భావాన్ని పొదువుకున్న సంగీతం ఆయంది. మహాదేవన్ భారీగా వాద్య సంగీతాన్ని వాడలేదు. వాద్య సంగీతాన్ని తగినట్టుగా మాత్రమే వాడారు. ప్రయోగాల జోలికి పోలేదు. పాట పొలుపుగా ఉండడం కోసం నిలబడ్డారు. నైపుణ్యం (finesse) కన్నా చక్కదనం (fineness)తోనూ, వైభవం (grandeur) కన్నా ఇంపు, సొంపులకు ప్రాధాన్యతతోనూ పాటల్ని చేశారు మహాదేవన్. ఈ లక్షణాలు సి.రామచంద్ర, రోషన్ వంటి హిందీ సినిమా సంగీత దర్శకుల్లో ఉన్నాయి.
మన దేశంలో జాతీయ ఉత్తమ సినిమా సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి కె.వి. మహాదేవన్. కన్దన్ కరుణై (1967) అనే తమిళ్ సినిమాకు ఆయనకు ఈ పురస్కారం వచ్చింది. ఇంకా ఎన్నో పురస్కారాల్ని అందుకున్నారు కె.వి.మహాదేవన్. తెలుగు సినిమా పాటకు మామ అయిన మహాదేవన్ గుఱించి ఎంతో, ఎంతో చెప్పుకోవచ్చు. 1918లో పుట్టిన మహాదేవన్ 2001లో వెళ్లిపోయారు. కానీ తెలుగు, తమిళ్ష్ పాటల్లో ఆయన స్థానం సుస్థిరమైంది. మహాదేవన్ తెలుగు పాటల్లో మోగుతూనే ఉంటారు. తెలుగు సినిమా పాటల ఆకాశంలో పున్నమి చందమామ మహాదేవన్. ‘తిరై ఇసై తిలగం’ అని మహాదేవన్‌కు తమిళ్ష్‌లో ఒక బిరుదు ఉంది. అంటే ‘సినిమా సంగీత తిలకం’ అని అర్థం. ఔను, మహాదేవన్ ఎల్లప్పుడూ మెఱుస్తూండే తమిళ్ష్, తెలుగు సినిమా పాటల తిలకం.