Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-22: పతిభక్తి

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

ఇది నిజంగా జరిగింది. దానిని ఒక కథలా రాస్తున్నాను.

సరోజగారబ్బాయి వినయ్‌కి కొత్తగా పెళ్ళైంది. కొత్త కోడలు విద్య రెండు వారాలపాటు భర్త వినయ్‌తో హనీమూన్ వెళ్ళొచ్చేక, అతను వెనక్కి అమెరికా వెళ్ళిపోయేడు. ఆ తర్వాత పదిరోజులకి విద్య వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి, అదెప్పుడు వస్తుందా, ఎప్పుడు రెక్కలు కట్టుకుని వెళ్ళి వినయ్ చేతుల్లో వాలిపోదామా అని యెదురుచూస్తూ, హైద్రాబాదులో అత్తారింట్లో వుంటూ, అత్తగారు సరోజ దగ్గర వినయ్‌కి యేమేమి ఇష్టమో కనుక్కుని, అన్నీ నేర్చుకుంటోంది. విద్య తండ్రి గత పాతికేళ్ళనుంచీ ఒరిస్సాలోనే ఉద్యోగంలో వున్నాడు. ఎప్పుడో పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ, నాల్రోజుల శెలవులకీ తప్పితే ఆంధ్రా వైపు రాలేదు. ఇప్పుడు విద్య అత్తగారు వాళ్ళూ హైద్రాబాదులో వుంటున్నారు కనుక, ఇక్కడికే వచ్చి, పెళ్ళి చేసి, కూతుర్ని అత్తారింట్లో దింపి, అమెరికా వెళ్ళే టైమ్‌కి వస్తామని విద్య అమ్మా, నాన్న ఒరిస్సా వెళ్ళిపోయేరు.

విద్య తనకి తెలియనివన్నీఅత్తగారినడిగి నేర్చుకుంటోంది. ఇన్నాళ్ళూ చదువూ, ఉద్యోగాలే తప్పితే ఇంట్లో పనులేమీ విద్యకి తెలీవు. అంతేకాక పెళ్లయాక ముత్తయిదువులు శ్రావణమాసంలోనూ, ఇంకా పర్వదినాల్లోనూ నోములు గట్రా నోస్తారని తెలుసు తప్పితే అవి యేమిటో, యెలా చెయ్యాలో తెలీదామెకి. అందుకే హైద్రాబాదులోనే వుంటున్న మేనత్త వర్ధనమ్మను వాటి గురించి అడిగింది. విద్య మేనత్త వర్ధనమ్మ నోచని నోము లేదని ప్రతీతి. నోములు, వ్రతాల విషయాలన్నీ ఆవిడ నాలిక చివర్న వుంటాయి. ఆవిడ తమ ఇంట్లో విద్యని అట్టిపెట్టుకుని, అవన్నీ యెలా చెయ్యాలో చెపుతానని రెండురోజులపాటు విద్యని తమ ఇంటికి పంపించడానికి విద్య అత్తగారు సరోజ దగ్గర పర్మిషన్ తీసుకుంది. ఆ ట్రైనింగ్‌లో భాగంగానే ఆరోజు విద్య నల్లకుంటలో వుంటున్న మేనత్త వర్ధనమ్మ ఇంటికివెళ్ళింది.

విద్య నల్లకుంట వెళ్ళేసరికి సాయంత్రం అవుతోంది. కార్తీకమాసం అవడం వల్ల వర్ధనమ్మ సాయంత్రం దేవుడి దగ్గర, తులసికోట దగ్గర, ఇంటి ముందు దీపాలు పెడుతూ కార్తీకమాస ప్రాశస్త్యాన్ని వివరించింది. ఆరోజు క్షీరాబ్ధిద్వాదశి కూడా అవడంవల్ల ప్రదోషవేళ తులసికోటలో తులసి పక్కనే యెక్కడినుంచో తెప్పించిన ఉసిరికొమ్మని వుంచి వాటి గురించి ఇలా చెప్పింది. చాతుర్మాస్యం నాలుగునెలలూ శ్రీమహావిష్ణువు ఉసిరిచెట్టు నాశ్రయించి శయనించి వుంటాడనీ, ఆ ద్వాదశిరోజునే లేచి, లక్ష్మీదేవి రూపమైన తులసి వద్దకు వస్తాడనీ, అందుకు తులసికోట చుట్టూ దీపాలు వెలిగించాలనీ, అలా చేస్తే లక్ష్మీదేవి కరుణించి ఇల్లంతా సిరులు కురిపిస్తుందని చెప్పింది.

పెళ్ళయ్యాక ముత్తయిదువులు యేమేమి నోములు, వ్రతాలు యెప్పుడెప్పుడు చెయ్యాలో, వాటి విశేషాలు, చేసే పధ్ధతులూ వివరంగా విద్యకి చెప్పి, అమెరికా వెళ్ళాక అవన్నీ చేసుకుందుకు వీలుగా వాటికి సంబంధించిన సీడీలు కూడా బహుమతిగా అందించింది. పెళ్ళయాక ఆడదానికి పతియే ప్రత్యక్ష్యదైవమనీ, ఇల్లే కైలాసమని అందుకు తనే ఉదాహరణ అనీ కూడా చెప్పింది. యే నోమైనా, వ్రతమైనా పట్టినప్పుడు అది భక్తి ప్రపత్తులతో చెయ్యకపోతే మహాపాపాలు చుట్టుకుంటాయనీ, రౌరవాది నరకాల పడిపోతారనీ కూడా వర్ధనమ్మ చెప్పింది. భయంగా వింది విద్య.

ఆ కథలన్నీ వింటుంటే విద్యకి భగవంతుడితో పాటు వర్ధనమ్మ మీద కూడా ఆరాధనాభావం మొదలయ్యింది.

ఆ మర్నాడు కార్తీక సోమవారం. విద్య లేచేసరికి వర్ధనమ్మ అప్పటికే స్నానం చేసేసి, దేవుడి ముందు పూజ చేసుకుంటోంది. కాఫీకి ఫిల్టర్ వేసి, స్టౌ మీద పాలు పెట్టి, డికాషన్ దిగి, పాలు కాగే లోపల పూజ చేసేసుకుని, పూజ పూర్తవగానే కాఫీ తాగొచ్చని పూజలో కూర్చుంది వర్ధనమ్మ. అప్పుడే లేచిన వర్ధనమ్మ భర్త పతంజలి, భార్యని పూజ మధ్యలో పిలవడం ఇష్టం లేక, ఫిల్టర్‌లో అప్పటికి దిగిన డికాషన్‌లో కాగుతున్న పాలు పోసుకుని, అక్కడే వున్న పంచదార కలుపుకుని ఆ గ్లాసు తీసుకుని హాల్లోకి వెళ్ళి పోయాడు. అప్పుడే అటు వచ్చి అది చూసిన విద్య “అయ్యో.. కాస్త ముందు లేచుంటే మామయ్యకి కాఫీ కలిపిచ్చేదాన్నే..” అని తొందరగా లేవలేకపోయినందుకు తనని తను తిట్టుకుంటూ, వంటింట్లోకి వెళ్ళింది. వంటింట్లో ఒకవైపు వంట చేసుకునే గట్టూ, మరోవైపు పూజ చేసుకుందుకు చిన్న మందిరం లాగా వున్నాయి.

వర్ధనమ్మ అప్పుడే అష్టోత్తరం మొదలుపెట్టినట్టుంది. ఆవిడ యే దేవుడి అష్టోత్తరం చదువుతోందో తెలుసుకుందుకు ఆవిడకి మరింత దగ్గరగా వెళ్ళింది విద్య.

“ఏం మనిషో.. ముందు దిగిన డికాషనంతా కలిపేసుకున్నాడు. తర్వాత యేం మిగుల్తాయీ నీళ్ళు తప్ప..” వర్ధనమ్మ నోటమ్మట వినిపిస్తున్న స్తోత్రాలు కాస్త తేడాగా అనిపించాయి విద్యకి. ఇంకాస్త శ్రధ్ధగా వింది.

“యేం ముంచుకు పోయిందనో అలా కాఫీ కలిపేసుకుందుకు. నేనొచ్చేవరకూ ఆగొచ్చుగా. చిక్కటి డికాషనంతా కలిపేసుకున్నాడు. ఇంక అందులో నీళ్ళు తప్పితే యేం దిగుతాయీ..” దేవుడి మీద ఒక్కొక్క పువ్వూ వేస్తూ స్తోత్రాలతో మామయ్యని యేకేస్తున్న వర్ధనమ్మత్తయ్యని చూస్తే ఒక్కసారి భయం లాంటిది వేసింది విద్యకి. నిన్నటినుంచీ వర్ధనమ్మత్తయ్య చెప్పిన పతిభక్తి అంటే ఏమిటో తెలీక పాపం విద్య అయోమయంలో పడిపోయింది.

Exit mobile version