Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-57: పతికి మారాడక..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]భయాంబక్కయ్య గుర్తుంది కదా! ఆమెని తల్చుకుంటే నాకింకో విషయం గుర్తొచ్చింది.

అప్పటికి నేను హైస్కూల్లో హయ్యర్ క్లాసులో ఉన్నాను. మా చెల్లెలింకా చిన్నక్లాసుల్లోనే ఉంది.

ఒకరోజు పొద్దున్నే నేను స్కూల్‌కి వెళ్ళడానికి తయారవుతుంటే మా చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి, “చిన్నక్కా, చిన్నక్కా.. అభయాంబక్కయ్యా, వాళ్ళాయనా దెబ్బలాడుకుంటున్నారు” అంది రొప్పుతూ.

“ఇదో వెయ్యిళ్ళ పూజారి. ఇల్లిల్లూ తిరగడం తప్ప నీకింకో పని లేదా.. స్కూలి కెళ్ళండి. టైమైపోతోంది” అంటూ మా అమ్మగారు మమ్మల్ని స్కూల్‌కి తరిమేరు. మేం మేడమెట్లు దిగుతుంటే అభయాంబక్కయ్య మొగుడుగారి కేకలు గట్టిగా వినపడ్డాయి. మేవిద్దరం మెట్లమీదుండగానే ఆయన విసురుగా ఇంట్లోంచి బైటకొచ్చి, అంతకంటే విసురుగా సైకిలెక్కేసి, హడావిడిగా తొక్కుకుంటూ వెళ్ళిపోయేరు. నేనూ, మా చెల్లెలు ఒకళ్లమొహాలొకళ్ళం చూసుకుంటూ నెమ్మదిగా అభయాంబక్కయ్య ఇంట్లోకి దూరేం.

పాపం అభయాంబక్కయ్య.. ఆయన తిట్టినందుకు ఎంత ఏడుస్తుంటుందో.. అనుకుంటూ లోపలికి వెళ్ళిన మాకు ఆవిడ రోటి ముందు కూర్చుని, సక్కుబాయిలాగా పాటలు పాడుకుంటూ పచ్చడి రుబ్బుకుంటూ కనిపించింది. నేనూ, మా చెల్లెలూ తెల్లబోయేం. ఆయనగారిచేత అన్ని తిట్లూ తినికూడా ఈవిడ ఇలా హాయిగా పచ్చడి రుబ్బుకుంటోందంటే ఎంతటి పతివ్రతాశిరోమణో అనుకున్నాను నేను.

మర్నాడూ, మూడోనాడూ కూడా అదే వరస. ఆయనగారు వేసే గట్టి గట్టి కేకలు మాకు పైకి వినిపిస్తుండేవి. పాపం, అభయాంబక్కయ్య ఎంత మంచిదో.. ఆయనన్ని మాటలన్నా కూడా అస్సలు ఎదురు సమాధానం చెప్పటంలేదు అనుకున్నాను నేను అప్పటికి నాకున్న జ్ఞానంతో.

ఆ సాయంత్రం మా అమ్మగారు, అభయాంబక్కయ్యను ఓదారుస్తున్నట్టు “కొంతమంది అంతేనమ్మా. అలా నోరెట్టుకుని అరుస్తుంటారు. నువ్వు మనసు కష్టపెట్టుకోకు. బాబాయిగారిచేత అబ్బాయికేమైనా చెప్పించమంటావా?” అనడిగేరు.

“అయ్యో, పరవాలేదండీ పిన్నిగారూ.. ఆయన అనావచ్చు, నేను పడావచ్చు. తప్పేముందీ ఇందులో! బాబాయిగారిదాకా ఎందుకులెండీ!” అంది.

“ఇంతకీ అతగాడు అంతంత కేకలు ఎందుకు వేస్తున్నట్టూ!” అడిగేరు మా అమ్మగారు.

“ఏం లేదండీ. ఆఫీసులో ఇనస్పెక్షన్ అవుతోందిట. తొందరగా వెళ్ళాలన్నారు. ఆయన వెళ్ళే టైముకి నా వంట సగం సగంలో వుందాయె. అలా వేడి వేడి అన్నం చెయ్యీ, మూతీ కాలుతుంటే గబగబా తిని వెళ్ళడం ఎవరికైనా కష్టవే కదండీ. అందుకని అలా కేకలెడుతున్నారంతే.”

వింటున్న మా అమ్మగారూ, మేమూ కూడా తెల్లబోయేం.

“అలాంటప్పుడు కాస్త తొందరగా వండి పెట్టొచ్చు కదమ్మాయ్..” అన్నారు మా అమ్మగారు.

“తొందరగానే మొదలెడతానండీ.. కానీ వంటవాలి, పూజవాలి, మహా నైవేద్యం పెట్టాలి.. మధ్య మధ్యలో పట్టిన నోములకి కథలు చెప్పుకుని, అక్షింతలు వేసుకోవాలి… అప్పుడు కదా ఆయనకి పెట్టాలీ..” అంది సాగదీసుకుంటూ..

ఓర్నాయనో అనుకున్న నేను కాస్త కల్పించుకుని, “అలాంటప్పుడు ఆ మాటే ఆయనతో గట్టిగా చెప్పొచ్చుకదా! అలా మాట్లాడకుండా వుంటే ఆయనకి ఎలా తెలుస్తుందీ.. అలా తిట్లు తినే బదులు ఇదీ సంగతని చెపితే ఆఫీసునుంచి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తింటారు కదా!” అన్నాను.

అభయాంబక్కయ్య నావేపు చూసి, క్షమించినట్టు ఓ నవ్వు నవ్వేసి,

“మధ్యాహ్నం రావడానికి ఆఫీసు దూరం కదమ్మా.. కుదరదు..” అంటూ మా అమ్మగారివైపు తిరిగి, “మీకు తెలీందేవుంది పిన్నిగారూ.. మాటకి మాట చెప్పడం ఎంతసేపూ! కానీ దానివల్ల ఊరంతా వినిపించి నలుగురిలో పలచనవుతాం తప్పితే లాభం ఏముంటుంది చెప్పండి.. ” అంది.

మేమేవీ మాట్లాడలేకపోయేం.. ఆ సాయంత్రం మా నాన్నగారొచ్చేక మా అమ్మగారు విషయమంతా వివరంగా చెప్పి “చూడండి పాపం.. ఎంత అమాయకురాలో. అతనిచేత అన్ని మాటలూ పడుతుందిట కానీ ఎదురు సమాధానం మటుకు చెప్పదుట. ఇంత మంచి అమ్మాయిని అన్ని మాట్లనడానికి అతనికి ఎంత ధైర్యం. ఎవరూ అడగరనుకుంటున్నాడేమో.. మీరోసారి గట్టిగా అతనితో పెళ్ళాం మీద అలా గట్టిగా అరవకూడదని చెప్పండి..” అన్నారు.

అంతా విన్న మా నాన్నగారు పకపకా నవ్వుతూ.. “అమాయకురాలు ఆ పిల్ల కాదు.. మీరూ..” అన్నారు.

ఆశ్చర్యంగా చూసిన మమ్మల్ని చూసి, “నిజంగా అతను అరవకూడదూ అనుకుంటే మిగిలిన పనులు పక్కన పెట్టుకుని అతను వెళ్ళేలోపల ముందు అతనికి అన్నం పెట్టి పంపించాలి. అలా చెయ్యకుండా తన టైము తను తీసుకుని, తీరుబడిగా వ్రతాలూ, నోములూ, పూజలూ పూర్తి చేసుకుంటూ అతనికి ఆలస్యం చేస్తే ఎంత శాంతంగా ఉండే మనిషికైనా కోపం రాకుండా ఉంటుందా! భోజనం మానేస్తాడా… ఆఫీసు మానేస్తాడా!” అనడిగేరు.

మా అమ్మగారు ఊరుకోలేదు. ఇంకా అభయాంబక్కయ్యని వెనకేసుకొచ్చేరు.

“మీరెన్ని చెప్పండి. అన్నన్ని మాటలంటుంటే ఎవరికైనా ఎంత కోపం వస్తుందీ! అలాంటిది నోరు మెదపకుండా ఆ మాటలన్నీ పడుతోందంటే ఎంత అమాయకురాలో పాపం అనిపించదూ!”

“అదిగో మళ్ళీ.. ఆ అమ్మాయేవీ అమాయకురాలు కాదు. మహా చతురురాలు” అన్న మా నాన్నగారి మాటలకి “చతురురాలంటే..” అనడిగేను నేను.

“అంటే.. చాలా తెలివితేటలుండి, ఆ తెలివితేటల్ని తనకి అనుకూలంగా తిప్పుకొనేదన్న మాట.. ఇక్కడీ విషయవే చూడు.. నిజంగా ఆలోచిస్తే అతనికి టైముకి భోజనం పెట్టవలసిన బాధ్యత ఆ అమ్మాయిదే కదా! ఆ పని చెయ్యకుండా, ఆ మొగుడిక్కావల్సినవి ఓ పక్కకి పెట్టేసి, ప్రాధాన్యత అంతా తనకి కావల్సిన పూజలూ, నోముల కిచ్చేసింది. దానివల్ల అతనికి కోపమొచ్చి అరిస్తే జవాబుగా తను కూడా ఎదురు సమాధానం చెపితే ఆ గొడవ మూడూళ్ళు వినిపిస్తుంది. అందరిలో అల్లరవుతుంది. అందుకే అస్సలు సమాధానం చెప్పకుండా కూర్చుంటే చుట్టుపక్కలవాళ్లకి అతని అరుపులే వినిపించి, అతన్నే దుర్మార్గుడనుకుంటారు తప్పితే ఈ పిల్లని, అమాయకురాలు, నోట్లో నాలుకలేని పిల్ల అనే అనుకుంటారు. బోలెడు సానుభూతి ఆ అమ్మాయి కొచేస్తుంది. తన పని అవడమే కాకుండా మొగుడు పరమ దుర్మార్గుడు, ఆ మహాతల్లి కనక అలాంటి కోపిష్టితో పడుతోంది అనే మంచిపేరు ఆ అమ్మాయికి వచ్చేస్తుంది ఇప్పుడు అమ్మన్నట్టు.. చుట్టూ వున్నవాళ్ల మధ్య మంచిమనిషనే పేరు కూడా వస్తుంది” అన్నారు.

అంతలా చెప్పినా అర్ధం కానట్టున్న నా మొహాన్ని చూసి మా నాన్నగారు నవ్వుతూ,

“నువ్వు తెనాలి రామకృష్ణ సినిమా చూసేవు కదా!” చూసేనన్నట్టు బుర్రాడించేను.

“అందులో ఒక పండితుడు ఆదర్శంగా ఉండే ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో ఒక పద్యం చెపితే దానికి తెనాలి రామకృష్ణ విపరీతార్థం తీస్తాడు చూడూ.. అదే.. ‘పతికి మారాడక..’ అన్న మాటకి మొగుడు అరిచి గీపెట్టినా నోరిప్పని ఇల్లాలా అంటూ…”

“ఆ.ఆ..అవునవును” సినిమాలో ఆ పద్యం వచ్చినప్పుడల్లా తెగ నవ్వుకుంటాం మేమందరం..

“అలాంటి అమ్మాయన్న మాట.” అన్నారు.

అదేమిటో అప్పుడు నాన్నగారు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇన్నేళ్ళయి యింతమందిని చూసేక అలాంటి అభయాంబక్కయ్యలాంటివాళ్ళని కొందరిని చూసానండోయ్.. వాళ్ళెవరంటారా! అమ్మా.. చెప్పేస్తారు పాపం!

Exit mobile version