[dropcap]ఇ[/dropcap]టీవల పరమపదించిన పాత్రికేయ దిగ్గజం “డా. జి.యస్. వరదాచారి” గారికి శ్రద్ధాంజలి కవిత అందిస్తున్నారు “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర.
~
శ్రీ “గోవర్ధన” వంశ రత్నమయి, సచ్ఛీలంబె తత్త్వంబు గాన్ –
సాగించెన్ తన జీవితమ్ము శుచిగా, సత్పాత్రికేయుండునై!
భూగోళంబున ఎక్కడేమయిన తా నుద్బోధకంబౌ గతిన్
యాగంబట్టుల నిర్వహించె రచనా వ్యాసంగమున్ సర్వదా!
నాటి నిజాము కాలమున, నవ్య పథంబున తెల్గు పత్రికా
వాటిని ఉద్భవించె – మన భాష మహోన్నతి, సత్య సంధతన్
దీటుగ గుండె నిల్పుకొని దీక్షను బూనుచు పాత్రికేయుడై –
మేటిగ అంచెలంచెలుగ మించుచు శ్రీ “వరదాహ్వయుం” డహో!
“ఆంధ్ర జనత”, పిదప “ఆంధ్ర భూమి” యనెడు
పత్రికల ఘనముగ ప్రతిభ తోడ
తీర్చిదిద్దినట్టి ధీశాలి! “ఈనాడు”
పత్రిక “సహ బాధ్య వరుడు” నయ్యె!
“సుందర వరదాచారి”యె
ఎందరికో స్ఫూర్తి నిచ్చె – ఈ భువి వార్తల్
తొందరగా, అందముగా
పందిరి అల్లినటు వ్రాయ పత్రికలందున్!
ప్రేమగ పాత్రికేయులను బిల్చుచు, ధైర్యము గూర్చు! వారి సం
క్షేమము కోసమై సతము చింతన జేయు! విశిష్ట నాయక
త్వామల దీక్షతో నిలిచి హక్కుల సాధన లక్ష్య సిద్ధికై
ధీమతియౌచు సల్పు కృషి! ధీరుడు, దక్షుడు నాయకుండుగాన్!
తెలుగు విశ్వవిద్యాలయ దీప్తి పెంచ,
“పత్రికా రచన”ను పట్టభద్ర విద్య –
మొదటి గురువయి ఏర్పర్చి, ముప్పదేండ్లు
పాఠములను బోధించిన పండితుండు!
పాత్రికేయ సంఘాలకు పరమ గురుడు;
పెక్కు “సర్కారు కమిటీల” వెలయు వేత్త;
బహుళ సత్కార, బిరుదాల ప్రాప్త ఘనుడు
అమర పురి కేగె నిపుడు! శ్రద్ధాంజ లిదియె! #
Photo Courtesy: Internet