[dropcap]ఎం[/dropcap]డ కాలం బడి సుట్టీలల్ల, పొద్దుగాల, మసుకులనే లేసుడు – ఐదుగొట్టంగనే. లేసి, సీన్మా టాకీసు కాడికి పోకట. ‘పాత సీన్మ టాకీసు’ – గిదీంట్లకు ఎక్కోమట్టుకు హింది సిన్మలు అస్తుంటయి. ఇగ, ఆదివారం ఆదివారం మార్నింగ్ షో లల్ల యింగ్లీషు సీన్మలు, ఏరే ఏరే బాసల సీన్మలు అస్తుంటాయి. ‘కొత్త సీన్మ టాకీసు’లనేమో అన్ని గూడ తెలుసు సీన్మలే. ‘పాత సీన్మ టాకీసు’ మా యింటికి దగ్గరంటే దగ్గర్నే. వురుక్కుంటపోతె, గూతవట్టెటంతటి దూరమే. ఎండ కాలంనైతే రెండో ఆట సీన్మ అంతగూడ ఆట షురూ అయిన కాడి సంది, ఆట అయ్యిపోయేదనుక మాటలన్ని యినచ్చు రేడియల వారం. ఒక్క బొమ్మలు మట్టుకు కనిపించై. సీన్మను సూడలేం గని, యినచ్చు. పైసలు గిట్ట ఏం పెట్టకుంటనే సీన్మ అంతగూడ, రోజు గూడ యినాల్నంటే యినవచ్చు.
పొద్దుగాల ముసుగుల్నే లేసి ముందుగాల యింటి దగ్గెరున్న పాత సీన్మ టాకీసుకు పోకట. పొయ్యి సీన్మ టాకీసుకు ఎనుక దిక్కు కంపోండు గోడ మీదికెల్లి లోపటికి తొంగిజూసుడు. సీన్మ టాకీసుల గూర్ఖ కావలి గాస్తుంటాడు. గా గూర్ఖ మునుపు మిలిట్రిల పని జేసిండంట. యుద్దమప్పుడు గాయిన పై పెదువు నడిమికి తెగిపొయ్యింది. నడుముకు ఎలుపాటి బెల్టు, గా బెల్టుకు ఏల్లాడుకుంట ఒగ కత్తి. గట్ల కావలి గాస్తుంటడు సీన్మ టాకీసును.
గూర్ఖ గటుమొకాన లేనపుడు, గూర్ఖ కనిపియ్యనప్పుడు, ఆయన కంట్లె పడకుంట మెల్లెగ, పిల్లి వారం సప్పుడు గాకుంట కంపోండు గోడ దునికి సడి జెయ్యకుంట బిరబిర సిన్మా హాలుల జొచ్చుడు, సాటు జూసుకుంట… రెండో ఆట సీన్మ అయిపొయ్యినంక గూర్ఖ టాకీసు తలుపులు – నేల, బేంచి, కుర్సీ హాలుల తలుపులన్ని, లోపటికెల్లి గడెలు పెట్టుకుంట, పెట్టుకుంట, ఆకిరి తలుపును మట్టుకు బైటికెళ్ళే గడెను పెడ్తడు. తాళం గిట్ట ఏం ఎయ్యడు గా తలుపు రెక్కలకు. గని, ఏ తలుపు బైటికెళ్ళి గడె పెట్టి వుంటదో, గది రోజు కొక తీరుగ మారుతుంటది. ఒక్కోపారి గా కొన తలుపు, ఒక్కోపారి గీ కొన తలుపు, ఒక్కోపారి నడిమి తలుపు. గందుకని ఒక్కొక్క తలుపు దగ్గెరికి పొయ్యి మెల్లెగ తలుపు రెక్కని గుంజి సూడాలె. ఇనప తలుపులాయె. సిలుం పట్టిన నర్మానల మూలంగా తలుపు రెక్కను గింతంత గుంజుతె కీసుమని గిట్ట సప్పుడాయెనా, ఇత సచ్చినట్టె. గా సప్పుడుకు గూర్ఖ రాడా? గందుకని, ఏ తలుపు రెక్క బయటికెల్లి గడె పెట్టి వున్నదో ఒక్కొక్క తలుపు దగ్గెరికి పొయ్యి మెల్లెగ గుంజి సూసుడు. బైటికెల్లి గడెపెట్టి వున్న తలుపు రెక్కైతే తెర్సుకుంటది. గది తెల్సినంత, గా రెక్కను మనిసి పక్క పట్టేటంతటి సంది, మనిసి పక్క మీద సొచ్చెటంతటి ఎలుము దనుక మట్టుకు గుంజి, గా సందులకెల్లి లోపలికి సొచ్చి, లోపలికి సొచ్చినంక మళ్ళా గా రెక్కని ఎప్పటి వారం దగ్గెరికి మూసుకోవాలె. లేకుంటె, గట్లనే తెర్సిపెడ్తే రౌండు జేసుకుంట గూర్ఖ గిట్ట జూసిండనుకో, పట్టువడ్డట్టే… తన్నులు తిన్నట్టే! లోపలికి జొచ్చి, తలుపు ఎప్పటి వారం మూసి, గప్పుడు యిగ ఒక్కొక్క హాలును ఎతుకుడు – సిగిరేటు డబ్బల కోసం! దొంగరీతిగాక దొరుకున మోక్షంబు అన్నట్లుగ – సిగిరేటు డబ్బల కోసం.
ఎరుకయుండు వాని కెరుకయె యుండును, ఎరుకలేని వాని కెరుక లేదు! అట్టి, ఖాళి సిగిరేటు డబ్బల గురించి… ముందుగాల కుర్సీల హాలుల అన్ని లైన్లు అయినంక, బెంచీల హాలు అన్ని లైన్లు జూసుకునుడు. ఆకర్న నేల హాలును జూసుకునుడు. సిగిరేటు డబ్బలు ఏరుకునుదు. నేల హాలు గూడ అయిపొయ్యినంక గప్పుడు తలుపుకాడికచ్చి సప్పుడు గాకుంట, పక్క వట్టెటంతగ సందు జేసుక బయిటికచ్చి – తలుపు రెక్కను మళ్ళ మూసి – గప్పుడు బిర బిర సప్పుడు జెయ్యకుండ వురికి, కంపోండు గోడ ఎక్కి, అవుతలికి దబేలున దునికి యిగ ఒకటే వురుకుడు. గప్పుడు గూర్ఖ జూసినా గూడ యిగ ఏం జేస్తడు! తప్పిచ్చుక పాయెరా తాంబేలు బుర్ర!
సీన్మ హాలు సూసుకునుడైనంక యిగ హాలు గేటు బైట – పాన్ ఠేలలని జూసుకొని సిగిరేటు డబ్బలని ఏరుకునుడు… గీ పాత టాకీసు, దాని సుట్టూత వున్న పాన్ ఠేలలు అన్ని అయ్యినంక యిగ కొత్త సీన్మ టాకీసుకు… సీన్మాటాకీసు లోపట సొచ్చి ఎతుకుతన్నింత సేపు – ఎక్కువెట్టి మదిని ఏకాంతమున జేర్చి అన్నట్టుగ గుండెకాయ దడలు… లోకమందు నిల్చి లో జూపు జూడరా అన్నట్టుగ జూసుకునుదు… గా తరువాత టాకీసు హాలు కంపోండు బైటి పాను ఠేలలు, ఓటళ్ళు… మొదలు చూసి చూసి తుద జూడకుండెనా, చూపు దప్పి వాని సుఖము జెడున్ అన్నట్టుగ టాకీసులనే గాదు, పాను ఠేలలని గూడ యిడ్సుడు లేదు. ఎనుము తిరుగుచుండదే ఎద్దు వెంబడి అన్నట్టుగ.
గతికి హితవు గనడు కామాతురంబున అన్నట్టుగ సిగిరేటు పాకిట్ల మీది ఖ్యాలే తప్పిడిస్తె, గూర్ఖకు పట్టువడ్తె ఏమైతదో అన్న సింత వుండేటిదే గాదు. తా తెగెంచువాడె దండియౌ భువిలోన అన్నట్టుగ. భయము జూపిన వెనుక బావి త్రోవే బోడు అన్నడు తత్త్వం జెప్పినోడు, గని, గా గూర్ఖ బయం మా వున్నా గూడా నేను సిన్మా టాకీసు లోపలికి జొచ్చి సిగిరేటు డబ్బలను ఏరుకునుడే… వెర్రి నక్కను కుక్క వెరిపించినట్టుగ గా గూర్ఖ నన్ను బయపెడ్తనే వుండే… నిలువదగని చోట నిలువ నిందెలు వచ్చు అన్నట్టుగ గా సీన్మా టాకీసు లోపల జొచ్చి సిగిరేటు డబ్బలను ఏరుకునుడు… కంటకమున దిన్న వడి గండమై వచ్చు అన్నట్టుగ బయంగగే సిగిరేటు పాకెట్లను ఏరుకునుడు. కడుపు నిండే కొరకు గాదు, మనసు నిండె కొఱకు… కలిగెనేని యతడు కనిపించబోడయా అన్నట్టుగ సీన్మా హాల్ల జొచ్చి సిగిరేటు పాకిట్లు ఏరుకుంట గూడ నేను గూర్ఖ కంట్లె పడలేదు, పట్టువడలేదు, తన్నులు దినలేదు – నిలువ నేర్చిన బిడ్డ నేలబడడు అన్నట్టుగ, ఎప్పటికి దొంగతనం జేసుకుంటనే, ఒక్కోపారి గూడా పోలీసోనికి సిక్కువడలేదు… నెరిగాసి వున్న పాము కాటుని ఒక్కసారి గూడ తినలేదు.
సీన్మా టాకీసుల కంపోండు గోడల బయిట వున్న పాన్ ఠేలలు తిరుగుడు అయినంక, బజాట్లె దుకాండ్ల దిరుగుడు… గా తరువాత రైలు టేషన్ దిక్కు పోకట… ఏడున్నర దాటేదనుక తిరిగి, గప్పుడు యింటికి మలుగుడు. ఏడున్నర దాటక మునుపే మా ‘నాన’ ‘దివిటి’కి ఎల్లిపోతడు, అడిగెటోళ్ళు వుండరు యిగ మనలని! యింటికి పొయ్యి మొకం గిట్ట కటుక్కోని, సల్ది తిని, చాయ్ తాగి – ఇగ, గప్పుడు ‘సిలక్ కంపిని’ ఏరియాకు బయిలెల్లుడు… సగం ‘కోసెడు’ దూరం వుంటది గీ ఏరియ మా యిండ్లకు… గిప్పుడు నేను ఒక్కణ్ణి గాదు, ముగ్గురు నలుగురం కల్సి బయిలెల్లెటోళ్ళం.. సిలక్ కంపిని గేటు ముందటి పాన్ ఠేలలు సుట్టుడు… గా తరువాత సిలక్ కంపిన కోటర్లు, బజారు తిరుగుడు… గివన్ని సెక్కర్లు గొట్టితెనే గా పూటకు మా దివిటి అయినట్టు. ఊర చచ్చు కంటే వూరూర దిరుగురా అన్నట్టుగ తిరుగుడు.
గా రోజుకు సగం పూట దివిటి అయినట్టు… ఎవని దగ్గెరెనన్ని యింట్ల దొంగతనం జేసి ఎత్తుక తెచ్చిన పైసలు జేయిలల్ల వుంటే, ఓటలల్ల పకోడి తెప్పిచ్చుకోని, ఒక్క ప్లేటుల అందురం మనిసికి రెండు మూడు తుకడలు తినెటోళ్ళం. యింక గూడ పైసలు వుంటే ‘సింగిల్’ చాయ్ తెప్పిచ్చుకోని తాగుడు.
గిప్పుడు జమ చేసుకున్న సిగిరేటు డబ్బలను సింపి పత్తాలు జేసి, ఏరే ఏరే సిగిరేటు పత్తాలని ఏరే ఏరే బిండలు జేసుకునుడు… గోల్డ్ ఫ్లాక్, బర్కిలి, పీలాహాథీ, పాసింగ్ షో, రాయల్, కూల్, చార్మినార్… అన్నీటి కన్న ఎక్కో దరది, యిలువది గోల్డ్ ఫ్లాక్ అయితే అన్నీటికన్న తక్కో యిలువది చార్మినార్ పత్తాలు. గీ బిండలు కట్టుకునేటప్పటికి ఒంటిగంట అయ్యేది. ఒంటిగంట దాటినంకనే యింటి మొకం పట్టుడు. గప్పటికి మా నాన ‘కంపిని’ దివిటి నుంచి పగటి భోజనానికి అచ్చి, తిని మళ్ళ దివిటికి పొయ్యెటోడు… మా నాన దివిటికి పొయ్యినంకనే యింటికి పొయ్యి, బువ్వ దిని, గప్పుడు జమ చేసి, బండలు గట్టుకున్న పత్తాలని చిత్తు, బొత్తుల పెట్టుకుంట ఆడుడు. ఓడుడు, గెల్సుడు – అన్ని గూడ. పైసలు వెట్తి నువద్ది పత్తులట ఆడెటోళ్ళు ఏరే వుండెటోళ్ళు. మేం మట్టుకు గీ సిగిరేటు డబ్బల పత్తాలాటనే. పైసలు పెట్టుకుంట ఆడేటోళ్ళు పెద్దోళ్ళు. మేమేమో పోరగాండ్లం…
మళ్ళ యింటికి మలిగి సూసుడు మసుక సీకట్లు ముదిరినంకనే, సీకటి పడ్డంకనే. రాత్తిరి బువ్వలు తినే ఏళకే యింటి మొకం జూసుడు. గంత దనుక వెర్రికుక్క యట్లు వేసరి తిరుగును అన్నట్టుగనే…
పొద్దుగాల మా నాన మంచాలకెల్లి లేసుటానికి ముందుగానే నేను యింట్ల కెల్లి, మా నాన కంట్లె వడకుంట ఎల్లినోన్నిళ్ళ, మళ్ళ మా నాన మంచాలకు ఒరిగే ఏళకే మా నానకు కనపడుడు రోజు గూడ. నేను మా నాన కంట్లె గీ రోజు రాత్తిరి పడుతె, యిగ మళ్ళ రేపు రాత్తిరికే. యిరువై నాలుగ్గంటలల్ల రాత్తిరి పండుకునే ఏళకు మట్టుకే మా నానకు కనపడుడు! ఇగ గప్పుడు గూడ కంట్లె పడక తప్పది గద! సంతసించు నంతలో గలుగు సంతాపము!
మా నాన కంట్లె వడంగనే “పొద్దళ్ళ ఏం ఆట, ఏం తిరుగుడు! వై వట్టు! (కితాబు పట్టు!)” అనేటోడు. మా నాన అనే గీ ‘వై వట్టు’ మాట నాకు పాత ముచ్చటనే! వైపు తెలిసి పలుక వలయు అన్నట్టుగ –
“పడుత, నీ యవ్వ! జెర్రాగు! బువ్వ దిన్నంక వై వడుత!” అని, బువ్వ దిని యిగ మంచాల వడుడు! వై వట్టుడన్నది మా నాన నోట్లోనే, నేను వట్టేది మట్టుకు మంచాన్నే! బగ్గ మొసచ్చి వుంటినాయె, మబ్బుల్నే లేస్తి – గప్పటి నుంచి సీకటి సిక్కవడె! కాలుకు, సెయ్యికి రికాం లేకుంట పని జేస్తినాయె. మంచాల వడుడే ఆల్సెం లేదు, నిదురచ్చె! మళ్ళ మబ్బులనే లేసేదుండేనాయె, రేపటి పత్తాల సంపాదనకు! తిట్లు గాలికి పాయె, తిండి దక్కిపాయె అన్నట్టుగ మా నాన అనే ‘వై వట్టు’ మాటలు ఒళ్ళక్కపుయే, గని, మా ఆటలు, తిరుగుళ్ళు మట్టుకు నువ్వద్దియి… పోరగండ్లు సదువుకుంట లేరు అని మా అయ్యవ్వలకు పికిరేమో గని, మాకేం పికిరి!