Site icon Sanchika

పవిత్ర బంధం

[dropcap]రా[/dropcap]ఘవయ్య గారి ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడి వున్నాడు వంశీధర్.

ఆయన పడక కుర్చీలో కూర్చుని వున్నారు. కాస్త దూరంగా నేలపై కూర్చుని వుంది తులసి. వాళ్ళకి కాస్త దూరంగా నిలబడి బొమ్మలతో ఆడుకుంటుంది చిట్టి. అప్పుడప్పుడూ తల్లిదగ్గరకి వచ్చి వెళుతూ.. బొమ్మలని అందంగా సర్దుకుని.. ఆనందంగా ఆడుకుంటుంది.

వంశీధర్ రాకను గమనించిన చిట్టి బిడియంగా తల్లి చాటున దాక్కుంది.

రాఘవయ్య గారు కుర్చీలో హుందాగా కుర్చుని.. ఎటో చూస్తూ.. సుధీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా వున్నారు.

“తాతయ్యా..” వంశీధర్ తనని పిలవడంతో.. అతడి వైపు తీక్షణంగా చూశారు. ఆయక కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి.

వంశీధర్ మౌనంగా ఆయన ముందు నిలబడి.. ఆయన చెప్పబోయే మాటలు వినడానికి ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాడు.

వంశీధర్‌కి గతం గుర్తొచ్చింది.

* * *

ఆ రోజు సాయంత్రం.. సరిగ్గా ఏడు గంటల సమయంలో.. ఇంట్లోకి అడుగుపెట్టాడు వంశీ. వరండాలో ఆడుకుంటుంది చిట్టి ఒక్కతే.

ఇంట్లోకి నడిచాడు.

రెండు రోజుల క్రితం వరకైతే…

ఆటలు అక్కడే వదిలేసి.. పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకుని ఎన్నో విషయాలు నవ్వుతూ.. హావభావాలతో కళ్ళు పెద్దవి చేసి ఉత్సాహంగా చెబుతూ తండ్రి కళ్ళలోకి చూస్తూ చెప్పేది చిట్టి.

అలాంటిది రెండు రోజులుగా.. తల్లితండ్రులు గొడవపడడం.. ఇద్దరూ ఒకరిపైఒకరు విసురుగా మాట్లాడుకోవడం.. ఐదేళ్ళ చిట్టికి చిరాగ్గా అనిపిస్తుంది.

అందుకే తండ్రి వచ్చినా పట్టించుకోకుండా.. ఆటల్లో లీనమయింది.

ఇల్లంతా ఆగంగా, చిందరవందరగా వుంది.

తను మిషన్ కుడుతున్నట్లు వుంది.

ఇంట్లో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ క్లాత్ పీసెస్.

పేపర్ కటింగ్స్‌తో కటింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో.. పేపర్ పీసెస్ అక్కడక్కడా ..

తులసి కోసం లోపలికి తొంగి చూశాడు. ఏకాగ్రతగా కుట్టుమిషన్ కుడుతుంది.

ఈ ఏడు సంవత్సరాలుగా తమ వివాహజీవితంలో.. తను ఎప్పుడు వచ్చినా..

తన బైక్ శబ్దం విని.. లేదా తను మెట్లు ఎక్కుతున్నప్పుడు.. తన షూ శబ్దం విని.. గబగబా ఎదురువచ్చి క్యారేజ్ అందుకునేది.

అలాంటిది తన రాకను పట్టిచ్చుకోకుండా.. పనిలో లీనం అయివుంది.

అదే తనకి చిరాగ్గా అనిపిస్తుంది.

తనకేమో ఇల్లంతా.. ఇల్లెప్పుడూ నీట్‌గా వుండాలని అనిపిస్తుంది.

“ఎప్పుడూ నేనొక్కదాన్నే ఇల్లంతా సర్ధాలా.. మీరు కూడా నా పనిలో సాయం చేయొచ్చు కదా!” అంటుంది ఈమధ్య.

వంశీ ఆలోచిస్తున్నాడు ..

ఉద్యోగంలో తనకెన్ని రిస్క్‌లు..

పైవాళ్ళ నుండి పని ఒత్తిడి. తన కిందవాళ్ళనుండి ఎన్నో అభ్యర్దనలు..

అటు పైవాళ్ళని సమర్థిస్తూ.. ఇటు కిందవాళ్ళకి నచ్చచెబుతూ.. తనకి ఎన్నో వర్క్ టెన్షన్స్!

అలాంటి పని వత్తిళ్ళ మధ్య.. తను ఇంటికి వస్తే..

ఇలానా తనని ఆదరించే విధానం.. చిరాకేస్తుంది వంశీకి!

తని ఇంట్లోకి వచ్చిన తరువాత.. అలసటగా సోఫాలో కూర్చున్న పదినిమిషాల తరువాత తన దగ్గరకి వచ్చింది తులసి.

కాస్త చిరునవ్వుతో చూసినా.. తను సంతోషపడేవాడే. కాని రెండు రోజులుగా తమ ఇద్దరి మధ్య కోల్డ్ వార్!

తనంతే మారదు..!

అంటే ప్రతిసారిలా.. తనే సర్దుకు పోవాలా? కుదర్దు ..ఈసారి ఎలాగైనా తన మాటనెగ్గాలి.

ఆలోచిస్తూ.. రిలాక్స్ కోసం మంచినీళ్ళు తాగి సోఫాలో వెనక్కి వాలి కళ్ళుమూసుకున్నాడు.

తండ్రి సీరియస్‌నెస్ గుర్తించిన చిట్టి.. వేగంగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.

తండ్రి వైపు చూసింది.

అతనలాగే వెనక్కి వాలిపోయి వున్నాడు.

సమయం ఎనిమిది గంటలను సూచిస్తూ.. వాల్ క్లాక్ ఎనిమిది సార్లు మ్రోగింది.

తను ఆడుకుంటున్న ఆట వస్తువులన్నీ.. గబగబా ఓ బ్యాగ్‌లో సర్దుకుని.. ఓ మూలగా పెట్టి.. తన స్కూల్ బ్యాగ్ తెరిచింది.

ఐదు సంవత్సరాల చిట్టి యు.కె.జి. చదువుతుంది. తన బ్యాగ్ లోనుంచి పుస్తకాలు తీసి ఏదో వ్రాస్తుంది.

తనేమి వ్రాస్తుందో పట్టించుకునే స్థితిలో లేరు ఆ భార్యాభర్తలు..

అప్పటికే కుట్టుమిషన్ సర్దుకుని.. ఇల్లంతా శుభ్రం చేసి.. వంటింట్లోకి నడిచింది తులసి.

ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది.!

మరుసటి రోజు..

కాస్త త్వరగా.. ఏడుగంటల కంటే ముందుగా ఇంటికి వచ్చాడు. సేం సీన్ రిపీట్ అయ్యింది.

“నీకు ఎన్నిసార్లు చెప్పాలి.. నేను ఇంటికి వచ్చే సరికి ఇల్లంతా నీట్‌గా వుంచాలని?”

“ఇల్లు శుభ్రంగానే వుంది. ఈ మద్య మీకలా అనిపిస్తే.. నేనేం చేయాలి?”

ఈ మధ్య తన మాటకి ఎదురు చెబుతుంది తులసి. అదే అతడికి నచ్చడం లేదు. ఇంతకు ముందెప్పుడూ.. తనతో అలా మాట్లాడలేదు.

తన మాటకి భార్య ఎదురు చెప్పడం.. ఎదిరించడం అతడికి నచ్చడం లేదు.

“అయినా.. నేను ఇల్లు ఎంత శుభ్రంగా సర్దినా ఉపయోగం లేదు. మీరూ అలాగే మైంటైన్ అయ్యేలా చూడాలి. ఇక.. చిట్టి ఈ మధ్య పెద్దది అవుతుంది. చిట్టి అల్లరి కూడా పెరిగింది. తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం లేదు.”

“ఇంట్లో రోజంతా వుంటావు కదా? నువ్వు చేసే అంత ఘనమైన పనేం వుందంటావు”

“మీరు ఆఫీస్‌లో పెద్ద మేనేజర్ కదా.. వర్క్ అంతా కింద వాళ్ళే చేస్తారని చెబుతారు కదా.. అంటే మీకు ఆఫీస్‌లో లీజర్ టైం చాలా వుంటుంది కదా? ఇంటికి వచ్చాక నాకు కాస్త పనిలో సాయం చేయవచ్చుకదా? చిట్టిని తీసుకుని అలా బయటకు వెళ్ళిరావచ్చుకదా!”

“ప్రమోషన్ వచ్చాక.. పని భారం ఎక్కువగా వుంటుంది. ఈ మధ్యే ఈ విషయం నీకు చెప్పాను కదా? అయినా నువ్వు నా మాటలకు ఎదురు చెప్పడం నాకేమీ నచ్చడం లేదు.”

“నా మాటలు మీకు అంత కోపం తెప్పించి వుండవచ్చుకాని.. నేను ఇంటి దగ్గర ఖాళీగా వుంటున్నా అని మాట్లాడితే నాకూ కోపం రాదా? నేనూ మనిషినే కదా.. నాకూ ఇంటిదగ్గర చాలా పనులువుంటాయి” అంది తులసి.

తల్లితండ్రులు ఇలా మాట్లాడుకుంటుండగా వింటూ.. అక్కడే పుస్తకాల ప్రక్కనే పడుకుండిపోయింది చిట్టి.

కొద్దిసేపటి తరువాత.. ముందు గదిలో నిద్రపోతున్న చిట్టిని మెల్లగా లేపి.. నిలబెట్టి నడిపిస్తూ బెడ్ రూంలోకి తెచ్చి బెడ్ పై పడుకోబెట్టింది తులసి.

“చిట్టిని నిద్ర లేపి.. అన్నం పెట్టు..” అన్నాడు వంశీ.

“రాత్రి త్వరగా నిద్రపోతే ఇక చిట్టి నిద్ర లేవదు. ఉదయం లేస్తూనే ఆకలి అంటుందిలే!”తులసి సమాధానం ఇచ్చింది.

“అదేంటి?..”

భర్త మాట పూర్తి కాకుండా ..

“రాగానే టిఫిన్ తినిపించాను లే. మీరు సోఫా లోంచి లేచి .. ఫ్రష్ అప్ అవ్వండి. కలసి భోజనం చేద్దాము.”

“నాకు ఆకలి గా లేదు.”

ఆ రోజు రాత్రి ఇద్దరూ భోజనం చేయకుండా పడుకున్నారు.

ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచింది చిట్టి. చిట్టి రడీ అయ్యే సరికి స్కూల్ బస్ వెళ్ళిపోయింది.

ఉసూరుమంటూ తిరిగొచ్చిన తల్లీ కూతుళ్ళవైపు సీరియస్‌గా చూస్తూ..

“బస్ మిస్ అయ్యిందా?” వంశీ గొంతులో వెటకారం మిక్స్ అయినట్లుగా నిర్లక్ష్యంగా అడిగాడు.

“అవును డాడి” అంది చిట్టి.

“మీరు ఆఫీస్‌కి వెళ్ళేది అటునుండే కదా. కాస్త చిట్టిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి… ప్లీజ్”

“నాకు కుదరదు.”

“అలాగంటే ఎలా?”

“నాకు కుదరదంటే కుదరదు. తన స్కూల్ వైపు నుండి వెళితే నేను ఆఫీస్‌కు చేరుకునే సరికి, నాకు ఆఫీస్‌లో ఆలస్యం అవుతుంది. నేను కరెక్ట్ టైం కి వెళ్ళాలి. చిట్టి స్కూల్‌కి కాస్త ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు లే! నువ్వే చిట్టిని స్కూల్ దగ్గర వదులు. ఎప్పుడైనా వదిలేవాడిని కదా. కానీ ఈ రోజు కుదరదు. Try to understand me” అంటూ భార్య రెస్పాన్స్ వినకుండా.. బైక్ పై రయ్ మంటూ ముందుకు కదిలాడు.

స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని.. చిట్టిని తీసుకుని కిలోమీటర్ దూరంలో వున్న స్కూల్ వైపు దారి తీసింది తులసి.

రాత్రి.. చిట్టికి అన్నం పెడుతుంది తులసి…

టేబుల్ ముందు కూర్చున్నాడు వంశీ. అన్యమనస్కంగా వున్నాడు. అన్నం వడ్డించుకున్నాడు. డిషస్ ఓపెన్ చేశాడు.

“నేనేం చేయమన్నాను?”

“ఏంటది?”

 “నేను సాంబార్ చేయమన్నాను కదా?”

“ఈ వేళ కుదరలేదు. రేపు చేస్తాను లే.”

“నేను ఆలు కర్రీ తినను…”

“రేపు చేస్తానని చెప్పాను కదా, ఈ రోజుకి ఆలూ కర్రీ తో తినండి.”

నచ్చనప్పుడు.. మనస్సులో మనిషి మీద ఇష్టం లేనప్పుడు.. తను వ్యతిరేకంగా చేసే చిన్న చర్య కూడా.. చాలా పెద్దనేరంగా అనిపిస్తుంది. అసహనం తెప్పిస్తుంది.

విసుగ్గా టేబుల్ ముందునుండి లేచాడు వంశీ.

“రేపు మీకు ఇష్టమైన సాంబార్ చేస్తాను. ఈ రోజుకి తినండి” అంది వేడుకోలుగా చూస్తూ..

వడివడిగా బెడ్రూం వైపు నడుస్తుంటే..

“నా మీద కోపం అన్నంపై చూపిస్తే ఎలా?”

“…”

“ప్లీస్ రండి..”

చిట్టి అన్నం తినడం పూర్తి అవడంతో.. తనని తీసుకుని బెడ్రూం వైపు కదిలింది.

కొద్దిసేపటి తరువాత..

“అమ్మ.. నాకు నిద్రొస్తుంది! నువ్వు నాకు తోడుగా పక్కనే పడుకోవా?” అడిగింది.

“డాడీ.. నేను, అన్నం తిన్న తరువాత నీ దగ్గర పడుకుంటాను లే!” అంది తులసి.

“అలాగే అమ్మా” అంటూ బుద్దిగా కళ్ళుమూసుకుని నిద్రపోయింది.

“ప్లీస్ రండి..” భార్య బ్రతిమిలాడుతున్నా పట్టించుకోకుండా.. కనీసం తన వైపు చూడకుండా.. “నాకు ఆకలిగా లేదు..” అంటూ పడుకున్నాడు వంశీ.

ఉదయం నిద్ర లేస్తూనే.. తాను ఊరు వెళతానని భర్తని అడిగింది.

వంశీ, తులసి ఇద్దరిదీ ఒకే ఊరు. వంశీ వాళ్ళ ఇల్లు.. సిటీలో మెయిన్ రోడ్‌లో వుంటే.. తులసి వాళ్ళ ఇల్లు సిటీకి అవుట్స్కట్స్‌లో వుంటుంది.

పెద్దలు కుదిర్చిన వివాహం. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యంలో.. చిన్న చిన్న ఘర్షణలు.. చిలికి చిలికి.. గాలివానైనట్లుగా.. ఇద్దరూ చెరోదారి అయ్యేలా చేసాయి.

భార్య, కూతురుని దగ్గర వుండి అదే రోజు బస్ ఎక్కించి.. తనతో మాటమాత్రంగా నైనా ఓ చిన్నమాటైనా మాట్లాడకుండా.. కనీసం వీడ్కోలైనా చెప్పకుండా.. ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు వంశీ.

* * *

“ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి అంటూ.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, పచ్చని కళ్యాణ మండపం, అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి.. తులసిని వివాహం చేసుకున్నావు. ప్రతి చిన్న విషయాన్ని పట్టి పట్టి చూస్తూ.. లేని సమస్యలను అతిగా ఉహించుకుని, దాంపత్య జీవితాన్ని ఆనందంగా, హాయిగా గడుపుకోకుండా.. అదో సమస్యగా భావించి తనతో గొడవ పెట్టుకుంటున్నావు! డ్యూటీ చేసే ప్రతి మగవాడికి ఏదో సమస్య వర్క్ ఏరియాలో వుంటుంది! అలాగని ఆ టెన్షన్, కోపాన్ని.. ఇంట్లోని శ్రీమతి పై చూపిస్తే ఎలారా? పగలంతా ఇంటిపని చేసి అలసిపోయిన ఆమె.. మిగిలిన రోజంతా నీపై ఆలోచనతో గడిపేస్తుంది రా! నీ రాక కోసం ఎదురు చూస్తుంటుంది” అంటున్న రాఘవరావు తాత గారి మాటలు శ్రద్దగా వింటున్నాడు వంశీ.

“నీవు తనతో స్నేహంగా, ప్రేమగా వుంటే.. తనేంటో అర్థమవుతుంది. ముందు నిన్ను నువ్వు మార్చుకోడానికి ప్రయత్నించు. ఎదుటి మనిషిని గౌరవించే విధానం.. మన లోని సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఎదుటివారికి.. తను భార్యైనా, స్నేహితుడైనా, మరెవరైనా.. మనం ప్రేమని, స్నేహాన్ని అందిస్తే.. అది రెట్టింపై మనని చేరుతుంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన ఓ గొప్ప వరం.. ఈ అందమైన జీవితం! మునుపటిలా నువ్వెప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా వుంటావని ఆశిస్తున్నాను. So be happy. Life is beautiful” అంటూ మనవడిని ఉద్దేశించి చెప్పాడు రాఘవరావు.

తాతయ్య.. ఈ ప్రపంచంలో తను మొట్టమొదట ఇష్టపడే వ్యక్తి ఆయనే..

తాతయ్య మాటల్లోని వాస్తవాలని గ్రహించాడు. అలాగే అన్నట్లుగా తలూపాడు.

కొద్దిక్షణాలు మౌనంగా వుండిపోయాడు వంశీ .

రాఘవయ్య గారి ముందు నిలబడి ఆయన చెప్పే మాటలు శ్రద్దగా వింటుంది.. రాఘవయ్యగారి భార్య లక్ష్మి.

“ప్రియమైన వంశీ,తులసి .. ఒకరిని ఒకరు అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ఇంతకాలంగా అన్యోన్యంగా వున్న ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడానికి కారణం.. ఈ మధ్య మీలో ఒకరిపై ఒకరికి ప్రేమ సన్నగిల్లడమే! మీ నాయనమ్మ నేను ఎలా జీవించామో ఎప్పుడైనా గమనించారా? మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా బాటలో నడవండి… అదే పవిత్ర బంధమంటే!” రాఘవరావు చెప్పడం ముగించారు.

తల్లి దగ్గరే వున్న చిట్టి “అమ్మా ..” అంటూ పిలుస్తుంది.

వంశీ భార్య దగ్గరకి వచ్చాడు.

తులసి చెబుతోంది “సారీ… “తన కళ్ళనిండా కన్నీళ్ళు నిలిచివున్నాయి. అవి ఏ క్షణానైనా వర్షించడానికి సిద్దంగా వున్నాయి.

అదే ఆ క్షణంలో తను భార్య తో అనాలన్న ‘మాట’ తను చెప్పాలనుకున్న మాట భార్య నోటినుండి… వింటున్న అతడికి ఆశ్చర్యం కలిగింది. వంశీ కళ్ళనిండా అపరాధ భావన!

తులసి చూస్తుంది అతడి వైపు ‘మన్నించవా నేస్తం!’ అన్నట్లుగా ..

తండ్రిని చూసి భయంతో దూరంగా వెళ్ళింది చిట్టి.

మోకాళ్ళపై కూర్చున్నాడు .

“చిట్టీ” ప్రేమగా పిలిచాడు.

దగ్గరకి రాలేదు. ఆగిపోయి వుంది దూరంగా.. రెండు చేతులు చాచాడు వంశీ.. పరిగెత్తుకుంటూ వచ్చింది చిట్టి. చిట్టిని గుండెలకేసి హత్తుకుంటూ.. మురిపెంగా ముద్దిచ్చాడు. నవ్వుకుంది తులసి. ఆమె కళ్ళనిండా వెన్నెల! వెన్నెల వెలుగులని.. నింపుకున్న ఆమె నయనాలు.. అందంగా మెరుస్తున్నాయి!

వంశీ భార్య వైపు చూస్తూ తృప్తిగా నవ్వాడు.

పడక కుర్చీలో కుర్చున్న భర్త ప్రక్కనే కుర్చీ వేసుకుని.. వంశీ వాళ్ళ నాయనమ్మ భర్తతో కబుర్లలో పడింది.

Exit mobile version