పవిత్ర (తో) స్నేహం….

5
2

గౌరి మొదలుపెట్టిన కథ:

మీకు ఈ రోజు ఒక కథ చెప్పబోతున్నా! అది కథ అనడం కన్నా… కథ లాంటి ఒక జీవితం అనొచ్చేమో!

“ఏయ్ గౌరీ! నీకు మా కిట్టి మెంబరు పవిత్ర తెలుసట కదా!….ఎలా తెలుసు?”… ప్రపంచంలోని క్యూరియాసిటీ అంతా తన కళ్ళల్లో నింపుకుని శ్రీలక్ష్మి నన్ను అడిగినప్పుడు.. నేను చాలా నిదానంగా జవాబిచ్చా… “తను మావారి గర్ల్‌ఫ్రెండ్.. అంటూ! తన కళ్ళలో అపనమ్మకం… తత్తరపాటు!

“అవునా! ఏం లేదోయ్! ఏదైనా తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి! సొసైటీలో తనకు అంత మంచి పేరయితే లేదు!”….

“ఏ పారామీటర్స్ బట్టి ఒక మనిషి మంచితనాన్ని నిర్ణయిస్తావో… చెప్పగలవా శ్రీలక్ష్మి?”..అన్నా సూటిగా తన కళ్ళలోకిచూస్తూ!

నన్ను పిచ్చిదానిలా చూసింది తను!

“తిరుగుతుందే తను! ఊరంతా బాయ్ ఫ్రెండ్సే!”… అంటూ ‘బాయ్ ఫ్రెండ్స్’ పదం మీద నొక్కిపెట్టి మరీ చెప్తూ! నేనేమీ మాట్లాడలేదు! ఎవరి సంస్కారానికి వారిని వదిలేయడమే మంచిది!

పవిత్రతో పరిచయమే నాకు చాలా విచిత్రంగా జరిగింది! ఒకరోజు షాపింగ్ పని పూర్తి చేసుకుని, కారు తిరిగి ఆయనకు అప్పచెబుదామని.. మా వారి ఆఫీసుకు వెళ్లాను! ఎండలో పడి వచ్చానేమో… కాసేపు ఏసీ గదిలో కూర్చుందామని.. ఆయన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి పేపర్ చదువుతున్నాను! ఆయన పని చేసుకుంటున్నారు!

హఠాత్తుగా ఆఫీస్ గది తలుపు తెరుచుకుంది! గుమ్మంలో ఈ అమ్మాయి పవిత్ర! రెండు చేతులతో ఇద్దరు పిల్లలనూ ఈడ్చుకుంటూ తెచ్చి… మా వారి వైపు దాదాపు విసిరి వేసింది! నేను ఉన్నట్టు గమనించినట్లైతే లేదు!

“శ్రీనూ ఇంక నా వల్ల కాదు! ఈ పిశాచపు పిల్లలను.. నేను భరించలేక పోతున్నాను! నేను ఆత్మహత్య చేసేసుకుంటా! నాకు జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తోంది!”…. వగరుస్తూ అరిచినట్టు చెప్తోంది! మరి వాళ్ళతో ఏం పరుగులు పెట్టిందో ఏమో…. ఒళ్ళంతా చమట్లు కారిపోతున్నాయి!

ఆ పిల్లల్లో 10 ఏళ్ళు ఉంటాయేమో… ఆడపిల్ల… “అంకుల్” అంటూ శ్రీనివాస్‌ను పట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది! మగపిల్లవాడు.. లావుగా, బండగా.. ఉన్నాడు! టేబుల్ మీంచి పేపర్ వెయిట్ తీసి వాళ్ళమ్మ కేసి… విసురుతానంటూ… బెదిరిస్తున్నాడు! ఆ అమ్మాయి అసహాయంగా ఏడుస్తూ… పక్కనున్న సోఫాలో కూలబడిపోయింది!

తేరిపారి చూశా తనకేసి! చెప్పుకోదగ్గ అందగత్తెల కోవలోకి వస్తుంది! మప్పై.. ముప్ఫై ఐదేళ్ళ మధ్య ఉండొచ్చు వయసు! వర్చస్సు చూస్తుంటే …బాగా ఉన్న ఇంటి అమ్మాయిలా ఉంది! మామూలు కాటన్ చీర కట్టుకున్నా మారువేషంలో ఉన్న మహారాణిలా ఉంది ఆమె విగ్రహం!

తల్లి దుఃఖ తీవ్రతని చూసి పిల్లలిద్దరూ బెదిరిపోయారు! “సారీ అమ్మ! ఎప్పుడు విసిగించం”…అంటూ బుజ్జగించసాగారు వాళ్ళమ్మను! అప్పుడు తలెత్తింది ఆమె! అక్కడ నన్ను చూసి ఒక్కసారి బిత్తరపోయింది!

‘ఎవరు?’ అన్నట్టు శ్రీనివాస్ కేసి చూసింది!

అప్పటికే ఈ గందరగోళానికి.. చాలా కంగారు పడుతున్న ఆయన… నన్ను చూపిస్తూ “గౌరీ.. మై వైఫ్” అంటూ పరిచయం చేశారు. నా కేసి తిరిగి “గౌరీ! ఈమె పవిత్ర! ఇక్కడే మన కాంప్లెక్స్ లోనే ఉంటున్నారు! సినీ పారడైజ్ థియేటర్ వారి కోడలు!”

పరస్పర పరిచయాలు పూర్తి అయ్యాక, మా వారు ఆ పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుని…. మార్దవంగా అమ్మను క్షోభపెట్టకుండా, అల్లరి చేయకుండా, బుద్ధిగా చదువుకుంటూ ఉండాలని బోధ చేశారు! “మళ్లీ కలుద్దాం”.. అని చెప్పి ఆ పిల్లలను పట్టుకుని ఆమె గబగబా వెళ్ళిపోయింది!

నేను ఏమీ ప్రశ్నించకుండానే మా వారు పవిత్ర గురించి చెప్పసాగారు!

“గౌరీ! పవిత్ర చాలా మంచి అమ్మాయి! పెద్ద చదువులు చదివింది! మంచి సంస్కారవంతురాలు! ఆమె భర్త రెండేళ్లక్రితం యాక్సిడెంట్‌లో చనిపోయాడు! అత్తింటివారు సంపన్నులే అయినప్పటికీ… తమకొడుకు లేకపోవడం వలన… ఈమె మీద అనాదరణ చూపసాగారు! అందుకే పిల్లలతో బయటకు వచ్చేసి.. ఈ ఫ్లాట్ కొనుక్కుని.. ఇక్కడే ఉంటోంది!”

“అది సరే ముందు మీకెలా పరిచయం? సాధారణంగా మీరు కొత్తవారు ఎవరితో అంత తొందరగా కలవరు కదా! అందునా ఆడవాళ్ళతో….” అన్నాను.

మా ఇద్దరి మధ్య ఉన్న సయోధ్య బట్టి… నాలో ఏమాత్రం… ఇసుమంత కూడా.. అనుమానపు పొడలు ఉండనే ఉండవు! స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రతి స్నేహము ఆకర్షణే… అని ఎందుకు అనుకోవాలి?…. నా మౌనాన్ని భంగం చేస్తూ ఆయన చెప్పడం మొదలు పెట్టారు! ..

“ఆ పిల్లల వలన! పాపం వాళ్లకు ఆటస్థలం, స్నేహితులు లేరు ఇక్కడ! ఒక రోజు నా ఆఫీస్ లోకి వచ్చి కంప్యూటర్‌లో ఏదోప్రాజెక్టు చేసుకోవాలన్నారు! సరే చేసుకోండి అన్నా! అక్కడ నుండి రోజు రావడం మొదలు పెట్టారు. మంచి పిల్లలు! ఇక్కడే… ఏదో ఆడుకుంటూ ఉంటారు… వాళ్ళ అమ్మ ఆఫీస్ నుండి వచ్చే వరకు! పవిత్ర కూడా మధ్య మధ్యలో వచ్చి తన సమస్యలను నాతో చెప్పుకుంటూ ఉంటుంది! నాకేమో ఈ చుట్టుపక్కల ఉన్న ఆఫీసుల వాళ్ళు మా గురించి…ఏమనుకుంటారో అని చాలా టెన్షన్‌గా ఉంటుంది గౌరీ!”… ఆయన గొంతులో నిజాయితీ!

“శ్రీనివాస్! నీలో ట్రాన్స్పరెన్సీ ఉండి…నీ మనసులో ఎలాంటి వక్రత, అపరాధభావం లేనన్నాళ్ళు ….నువ్వు ఎవరికీ జవాబుదారీ కాదు.. ఈవెన్ నాకు కూడా!”

రోజులు గడుస్తున్న కొద్దీ…. పిల్లలు లేని మాకు పవిత్ర పిల్లలతో ఏర్పడుతున్న అనుబంధం ఆనందంగానే ఉండేది. ఆమె ఎక్కువగా క్యాంపులు అనే తిరుగుతూ ఉండేది! ఆ సమయంలో రెండు మూడు సార్లు… మొహమాటపడుతూనే… పిల్లలను మా ఇంట్లో ఉంచేసింది!

అప్పుడప్పుడూ పవిత్ర గురించి చాలా ఆలోచించేదాన్ని! నా తులనాత్మక అంచనాల ప్రకారం… పవిత్ర చాలా సున్నితమనస్కురాలు! ఒకప్పుడు గొప్ప సంపన్న జీవితం చూసి…ఇప్పుడు పరిస్థితుల ప్రాబల్యం వలన సాధారణంగా బ్రతకడం….ఆమెలో ఒక లాంటి అసంతృప్తి.. ఆత్మన్యూనత కలగజేసాయి అనుకుంటా!

మాలాంటి కొందరిని మినహాయించి… తను ఎక్కువగా సంపన్నవర్గాల స్నేహితులతోనే తిరగడానికి ఇష్టపడేది! మగవారితోనే తను కంఫర్టబుల్‌గా మాట్లాడగలను అని, తోటి స్త్రీల సూటిపోటి మాటలు, ఎగతాళి తను భరించలేకపోతున్నాను…అని నాతో తరచు చెప్తూ ఉండేది!

భర్త లేని స్త్రీ గా… తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి తనకు డబ్బున్న మగవారి స్నేహాలు చాలా అవసరమని భావిస్తూ ఉండేది! అలాగని ఏ మాత్రం హద్దుమీరడాన్ని సహించేది కాదు! ….వారితో అన్నాళ్ళూ… స్వేచ్ఛగా, స్నేహంగా తిరిగిన మనిషి… వారు ఆమెతో.. కాస్త అడ్వాన్స్ అయ్యి.. ఒక్క అవకాశం తీసుకుందామని ప్రయత్నించే సరికి… వారిని కాలదన్ని… పారిపోయే పవిత్ర… మగవారికి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయేది! అందుకే కాబోసు ఏ ఉద్యోగంలోనూ కుదురుగా నిలదొక్కుకోలేకపోయేది!

మాతో తన వ్యవహారాలన్నీ నిర్భయంగా నిస్సంకోచంగా చర్చించే పవిత్రను… నేను, శ్రీనివాస్… ఎన్నోసార్లు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాం! ఎవరో ఒక సరైన వ్యక్తితో జీవితాన్ని స్థిరపరచుకుని… పిల్లల భవిష్యత్తును… భద్రం చేసుకోమని.. ఎన్నోసార్లు చెప్పి చూసాం!

“తప్పకుండా చేస్తాను!” అంటూ నవ్వేసి ఊరుకునేది… కానీ ఆచరణలో అయితే పెట్టింది లేదు! అలా.. చూస్తుండగానే పదేళ్ళు గడిచిపోయాయి!

ఆ రోజు నాకు బాగా గుర్తుంది పవిత్రా వాళ్ల అక్క సుచిత్ర, ఆమె భర్త… మా ఇంటికి వచ్చారు! ఎవరో అపరిచితులు మమ్మల్నివెతుక్కుంటూ రావడం ఏమిటా… అని మేము చాలా ఆశ్చర్యపోయాం!

వాళ్ళ బావగారు చాలా కోపంగా ఉన్నారు పవిత్ర మీద! పవిత్ర ఎవరో సుధాకర్ అనే ఒక కొత్త వ్యక్తితో తిరుగుతోందని…. కుటుంబం యొక్క పరువు ప్రతిష్ఠలు గురించి పట్టించుకోకుండా… తాము ఎంత ఆపినా ఆగకుండా సుధాకర్ తో ఊటీ, కొడైకెనాల్ వెళ్లిపోయిందని… పిల్లలిద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారని… ఆయన చాలా కోపంగా శ్రీనివాస్‌తో చెప్పారు

పవిత్రకు… మేమంటే గౌరవం అని, మా మాట అయితే వింటుందని…. మమ్మల్నిద్దరిని… పవిత్రను కూర్చోబెట్టి.. ఆ సుధాకర్‌ని వదిలేయడానికి…. ఎలాగైనా ఒప్పించాలని… అభ్యర్థించారు! మా యిద్దరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు!

మాకు ఆ అవకాశం ఇవ్వకుండానే పవిత్ర.. సుధాకర్‌ని తిరుపతిలో పెళ్లి చేసుకుని వచ్చింది. అదేమీ పెద్ద అపరాధం అయితే కాదు… కానీ సుధాకర్ ఎంతవరకూ నిజాయితీగా పవిత్రకు సపోర్ట్‌గా నిలబడతాడో… మా అందరికీ అనుమానమే! ఎందుకంటే సుధాకర్ పవిత్ర కన్నా చాలా పెద్దవాడు! అప్పటికే అతనికి… భార్య, కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు! భార్య నుండి విడిపోయాను… అని చెప్పుకుంటాడు.. కానీ నిజానికి అతను ఆమె నుండి విడాకులు తీసుకో లేదు! పైగా ఈ వ్యాపారం.. ఆ వ్యాపారం అంటూ…. రకరకాల ప్రయోగాలు చేస్తూ… ఉన్నది కాస్త పోగొట్టుకుని… పెద్ద కబుర్లు చెప్తూ, అప్పులు చేస్తూ… తిరుగుతూ ఉంటాడని పవిత్ర బావగారు మాతో చెప్పడం గుర్తుంది నాకు!

తన వెంట పడ్డ సంపన్నులు అందరిని కాదనుకుని …పవిత్ర ఇలా ఓ అనామకుడినీ… స్థిరం లేనివాడి మాటలు నమ్మిమోస పోతుందేమోనని మేము చాలా ఆందోళన పడ్డాం!

మొదట్లో తమ అన్యోన్య దాంపత్యం గురించి చాలా ఆనందంగా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది పవిత్ర! అయితే సుధాకర్… శ్రీనివాస్ సమక్షంలో చాలా అస్థిమితంగా ఉండటం గమనించి.. మెల్లగా మాతో తన అనుబంధాన్ని పలుచన చేసుకుంటూ వచ్చింది !

ఆ తరువాత కొన్నాళ్ళకు… మేము కూడా ఇద్దరు పిల్లలను దత్తత చేసుకుని …వారితో బాగా బిజీ అయిపోయాం! పవిత్రమెల్లగా…మా జ్ఞాపకాల పుస్తకంలో …వెనక పేజీలలో నిక్షిప్తమైపోయింది!

***

పవిత్ర చెప్పిన కథ:

మా నాన్న ఒకప్పుడు పెద్ద సినీ ఫైనాన్సర్! కొందరు మిత్రులతో కలిసి.. అక్కర్లేని కొన్ని సినిమాలు తీసి… చెయ్యి కాల్చుకొని, పూర్తిగా దివాలా తీసే సమయానికి… నాకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది! మేము ముగ్గురు ఆడపిల్లలం! నేనుమధ్య దాన్ని! ఆస్తులు పోయినా… ఆడంబరాలు, అహంకారాలు వదలడానికి వీలులేని కుటుంబంలో పుట్టాము మేము!

మా పూర్వ వైభవానికి తులతూగ గలిగే… పెద్ద సంబంధం నాకు వచ్చింది! వాళ్లకు పది సినిమాహాళ్ళు, పొలాలు, తోటలు ఉన్నాయి! నాలాగే… మధ్యవాడు మా ఆయన!

శోభనం రోజున ఖాళీ మంచం నన్ను వెక్కిరించింది! తెల్లవారుజామున..తప్పతాగి… మురికి కాలువ పక్కన పడున్నాడని…ఎవరో పుణ్యాత్ములు… రిక్షాలో తెచ్చి… ఇంటిముందు పడేసారు మా ఆయన్ని! ఆ క్షణాన్నే మొత్తం భవిష్యత్తు నాకు అవగతమైపోయింది!

ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న ఆ కొడుక్కి భార్యగా ఆ ఇంట్లో నాకు మిగిలింది అసహనం, అవమానం మాత్రమే! పాతిక ఏళ్లుగా తాగుడుకు అలవాటు పడిన కొడుకు.. కేవలం మూడు ముళ్ళతో బాగుపడి పోతాడని ఆశించడం.. మా అత్తమామల దురాశ కాకపోతే మరేమిటి! మత్తులో మునిగిన మనిషికి.. చచ్చిపోయిన మనసుతో అప్పగించిన శరీరం..ఇద్దరు పిల్లల్ని ప్రసాదించింది!

ఉమ్మడి కుటుంబంలో… పిల్లల ముద్దుముచ్చట్లు.. వారి తండ్రి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది! మత్తులో లేని ఏ గంట సేపో …పిల్లల మీద విపరీతమైన ప్రేమను కురిపించే వాడు… అతను! మా పెళ్లయిన ఎనిమిదేళ్లకే … నన్ను వైధవ్యానికి ప్రమోట్ చేస్తూ… అతను వెళ్ళిపోయాడు! నా జీవితం ఆశలసుడిగుండం నుంచి పాతాళానికి చేరిపోయింది అతిత్వరలోనే!

అతని అన్నదమ్ములకు.. చివరకు… తండ్రికి ..నేనొక అందుబాటులో ఉన్న అందాల బొమ్మను! వారి నీచపు చేష్టల నుండి తప్పించుకునే క్రమంలో… కక్షతో వారు పెట్టే ముప్పతిప్పలు ఆ భగవంతునికే ఎరుక! తమ భర్తలను అదుపులో పెట్టుకోవడం చేతకాక …నేనేదో వారికి ఎర వేస్తున్నానని.. నా మీదే అపవాదులు వేసి హింసించేవారు ఆ ఇంటి ఆడవాళ్ళు!

ఏం చేసినా… ఓ పెద్దింటి ఆడపిల్ల,..పరువు కోసమే ప్రాకులాడుతుందని… ఎవరికీ ఏమీ చెప్పుకోలేదని వారి ధైర్యం! పైగా నా తండ్రికి ఎలాంటి ఆర్థికమైన దన్నూ లేదిప్పుడు! ఇంక వారికి ఆడింది ఆట పాడింది పాట!

ఒక దుర్ఘటన అనంతరం…ఆ నరక కూపం నుంచి …నేను, నా పిల్లలు …బయట పడగలిగాము!

ఒక రోజు రాత్రి ఎవరో సినిమా డైరెక్టర్ వచ్చాడని, అతనికి మందులోకి…. వేయించిన జీడిపప్పు, రొయ్యలు కావాలని … మా మరిది నా గదిలోకి వచ్చి నన్ను నిద్ర లేపాడు! అప్పటికే పూర్తి స్థాయి వంటలక్కగా మారిపోయిన నాకు లేవక తప్పలేదు! ఆ రాత్రి నాపై జరగబోయే అత్యాచారాన్ని… నా పిల్లలే ఆపగలిగారు!

ఇంక ఆ వాతావరణంలో… నాకు ,నా పిల్లలకు రక్షణ లేదని… పూర్తిగా అర్థమైపోయింది! మర్నాటి ఉదయం ఇంటిల్లిపాదిని పిలిచి నేను చాలా రభస చేశాను! ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను బంధువులకు,చుట్టుపక్కల వాళ్లకు… చెప్తానని బెదిరించాను! నిజంగా భయపడ్డారో… లేక నన్ను వదిలించుకుందామని అనుకున్నారో…. నా చేతిలో ఓ పాతిక లక్షలు పెట్టి బయటకుపొమ్మన్నారు! అది నా భర్త తాగి తగలబెట్టిన తరువాత… మాకు మిగిలిన ఆస్తి వాటా… అని చెప్పడం వారి దుర్మార్గానికి పరాకాష్ట!

ఇద్దరు పిల్లలతో … ఒక అయినింటి ఆడపిల్లకు మొదటి గమ్యం పుట్టిల్లే కదా! మా పుట్టింటికి చేరాను! ఖాళీ చేతులతో రాని నన్ను చూసి మా నాన్నగారు కొంతలో కొంత సంతోషించారు! ఆయనకున్న ఆర్థిక సమస్యలకు నాలో ఒక పరిష్కారం చూడడం మొదలుపెట్టారు! నిస్సిగ్గుగా మొదటి నెలలోనే పదిలక్షలుతీసుకున్నారు!

దానికి తోడు… అనారోగ్యంతో ఉన్న అమ్మకు ఉచితంగా పరిచర్యలు చేసే… నర్సును కూడా అవ్వవలసి వచ్చింది! కన్నతల్లిగా.. అమ్మ నా నుండి సేవలు ఆశించడం తప్పుకాదు! కానీ… నేను ఒక కన్న తల్లినే! నా బిడ్డల భవిష్యత్తు చూసుకోవలసిన అవసరం కూడా నా మీద ఉంది! అతి కష్టం మీద… ఎన్నో నిష్ఠూరాల మధ్య.. నేను నా పుట్టింటి నుండి విడివడ్డా!

అప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం… నేను జీవితంలో స్థిరపడడం! ఉద్యోగాల వేట ఎండమావుల బాటలా మారింది! ఆ బాటలో కొందరు నా ఒకప్పటి ఉన్నత వర్గం తాలూకు మనుషులు పరిచయం అవ్వసాగారు! ఆరోగ్యకరమైన కుటుంబజీవనంలో ఉన్న వారికి కూడా…. అదనంగా… ఒక అందమైన అమ్మాయి తమ పక్కన ఉంటే …అది ఒక ఆకర్షణలా మారడం మొదలు పెట్టింది!

నేను మర్చిపోయిన నా విలాసవంతమైన జీవితం నా ముందు పరవబడిండి! క్లబ్బుల్లో మెంబర్షిప్, ఎక్సోటిక్ టూరిస్ట్ ప్లేసెస్‌కు విమాన ప్రయాణాలు, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో స్టేలు…ఖరీదయిన బహుమతులు…! నాకొక ఫ్లాట్ అమరింది! కారొచ్చి చేరింది! జీవితంలో నిశ్చింత వచ్చింది! అయితే వాటితో పాటు పోగొట్టుకున్నవి వెల కట్టలేనివి!

పిల్లలలో నేనంటే నిరసన, వాళ్లకు అందుబాటులో ఉండలేక పోతున్న నా అసమర్థత, నన్ను చూడగానే ఎందరో స్త్రీలలో పొడసూపే అభద్రత, నాకు కావలసినది ఎంచుకోలేని పరాధీనత., నా మగస్నేహీతులలో… నన్ను మరింత పెద్ద స్థాయిలో పతనావస్థకు లాగాలన్న దుగ్ద! … ఇవన్నీ నన్ను వెంటాడుతున్న అపజయాలు!

ఈ లోపున ఒకసారి మా అత్తగారు వచ్చారు!

“పవిత్ర నీ గురించి బయట చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు! పిల్లల్ని ఇలాంటి వాతావరణంలో నువ్వు పెంచడం మాకు ఇష్టం లేదు! బాబును మేము తీసుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నాం!”… అంటూ రచ్చ చేసారు. మనవరాలి ఊసే ఎత్తని ఆమె మీద అసహ్యం వేసింది!

“ఏం అత్తయ్యగారు! స్వీటీ ఏం తప్పు చేసిందని… బాబు నొక్కడినే తీసుకెళ్తానని చెప్తున్నారు! పెంచి పెద్ద చేస్తే… రేప్పొద్దున్న కట్నాల మార్కెట్లో మంచి రేట్ పెరుగుతాడనా మీ ఆశ!”….. ఒళ్ళు మండి చాలా కటువుగా అడిగాను!

“ఇచ్చేస్తే ఇద్దర్ని తీసుకుపోతా! చూడమ్మాయి! నువ్వు ఈ తిరుగుళ్ళు మాని స్థిరపడిపోతే మంచిది! లేదంటే లీగల్ యాక్షన్ తీసుకునేనా… ఈ పిల్లల్ని మేము మా దగ్గరకు తెప్పించుకోగలం!” ….వార్నింగ్ లాంటిది ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది!

నాలో మళ్ళీ ఎడతెగని ఆలోచనా స్రవంతి! నేను ఊహించినట్టే… నా సాన్నిహిత్యం కోరుకున్న వారెవరూ… నన్ను జీవితభాగస్వామిగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు! వారికి వారి కుటుంబం, కుటుంబ బాధ్యతలు, సంఘంలో పరువుమర్యాదలే మొట్టమొదటి ప్రయారిటీ!

నాతో వ్యవహారం వారి మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న భయం మొదలయ్యింది వారిలో! మెల్లగా నన్ను ఏదో వంకన దూరం పెట్టడం మొదలుపెట్టారు! నా మీద ఆ హై సొసైటీలో దుష్ప్రచారం ముమ్మరం కాసాగింది!

ఈ దుస్సాహసయాత్ర ఎక్కడ మొదలు పెట్టానో… మళ్లీ అక్కడికే వచ్చి చేరాను! పోగొట్టుకుంటున్న నా పిల్లల ప్రేమ, నమ్మకం… ముప్పిరిగొంటున్న సమస్యలు… నన్ను సతమతం చేయసాగాయి! అప్పుడు ప్రవేశించాడు నా జీవితంలోకి సుధాకర్!

జీవితాన్ని కెలిడియోస్కోప్‌లో చూపించాడు! పిల్లల బాధ్యత పూర్తిగా తనదేనని అన్నాడు! తనకున్న ఆస్తుల పత్రాలు… తను చేస్తున్న వ్యాపారాలు నా ముందు పరిచాడు! అతని వివరాలు భోగట్టా చేసుకోవడానికి కూడా నాకు సమయం లేదు! అతని సమక్షంలో ….ఎందుకో మొట్టమొదటిసారిగా… జీవితంలో ‘నిశ్చింత’ అనే పదానికి అర్థం కనిపించసాగింది! అతన్నిఎంత పూర్తిగా నమ్మాను అంటే… అతనికి పెళ్ళయి, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా… అతనితో నేను వివాహానికి ఒప్పేసుకునేంత!

అతనితో కలసి జీవించిన మొదటి పది సంవత్సరాలు… నా జీవితంలోనే అత్యంత ఉత్తమమైన కాలమని నేనుచెప్పగలను! నాకు.. పిల్లలకు.. అన్ని సౌకర్యాలు అమర్చి, చాలా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు సుధాకర్!

ఐదేళ్ల తరువాత నా కొడుకు బబ్లు…. తన వంశ మూలాలను వెతుక్కుంటూ వాళ్ళ నాయనమ్మ దగ్గరకు వెళ్లి పోయాడు! సామాజికంగా, చట్టపరంగా.. ఎలాంటి గుర్తింపు లేని నా పెళ్లి… వాడిలో ఆ నిర్ణయం తీసుకోవడానికి… ఉసిగొల్పిందేమో!

నేను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని… ఎలాంటి ఫిర్యాదులు లేకుండా అన్ కండిషనల్‌గా ఆమోదించే… నా కూతురు స్వీటీ మాత్రం… నన్ను అంటి పెట్టుకునే ఉంది!

స్వీటీకి…సుధాకర్‌కు.. మంచి అన్యోన్యత కుదిరింది! తనకు తండ్రి‌లేని లోటు పూడ్చిన అతనంటే… దానికి పంచప్రాణాలు! స్వీటీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు అతని ఆనందం వర్ణనాతీతం! పార్క్ హయత్‌లో ఘనంగా పార్టీ అరేంజ్ చేస్తే…. మావాళ్ళంతా….ఆశ్చర్యంతో… ముక్కున వేలేసుకున్నారు!

మేము అంత ఆనందంగా ఉండడాన్ని చూడలేని ఆ భగవంతుడు …మళ్లీ నా తలరాతను ….కాస్త చెరపడానికి ప్రయత్నించాడు!

ఆస్తుల కోసం… అతని భార్య వేసిన దావాలో సుధాకర్ ఓడిపోయాడు! ఇంచుమించు సర్వం కోల్పోయాడు! డిప్రెషన్ లోకివెళ్లి పోయాడు! అర్థం పర్థం లేని వ్యాపారాలు చెయ్యడం మొదలు పెట్టాడు! నా ఫ్లాటు, నా నగలు… ఆ వ్యాపారాలకు పెట్టుబడిగా హరించుకుపోయాయి! కేవలం స్వీటీ జీతం ఒక్కటే ఇంటికి ఆధారం!

ఎవర్నో పట్టుకుని చిన్న చిన్న కేటరింగ్ ఆర్డర్స్ తేవడం మొదలుపెట్టాడు! మళ్ళీ నా చేతికి గరిట వచ్చి చేరింది! ఇదివరకటి ఆరోగ్యం, సంపాదించే ఆరాటం నాలో లేవిప్పుడు! ఇంతలో స్వైన్ ఫ్లూ ఎటాక్…. పూర్తిగా కుంగదీసింది నన్ను! సుధాకర్ స్వీటీ నన్ను కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసుకుంటున్నారు! బలహీనమై పోయిన నా ఊపిరితిత్తులు… క్యాటరింగ్ బిజినెస్‌కి ఇక స్వస్తి చెప్పేలా చేసింది! ప్రస్తుతం… ఖాళీగా… భవిష్యత్తు ఇవ్వబోయే తీర్పు గురించి ఆశాజనకంగా… వేచి ఉన్నాను!

గౌరి చెప్పిన ముగింపు:

ఆ రోజు కార్తీక పౌర్ణమి! పెరట్లో సన్నజాజి పందిరికి దగ్గర్లో కూర్చుని మనసంతా ముప్పిరిగొన్న.. ఆధ్యాత్మికతతో… ఒకలాంటి తాదాత్మ్యత పొంది ఉన్నాను! లోకాన్నంతా వెలిగిస్తూ పున్నమి చంద్రుడు.. నా ఇంటిని వెలిగిస్తూ నేను పెట్టిన కార్తీక దీపాలు! ఉదయం నుంచి పక్కనపెట్టేసిన నా సెల్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకున్నాను! స్క్రీన్ మీద మెయిల్ నోటిఫికేషన్!

ఒక్కసారి ఉలిక్కిపడ్డాను … ఎందుకంటే అది పంపింది పవిత్ర! ఇన్నేళ్ళ తరువాత! ఆతృతతో మెయిల్ ఓపెన్ చేసాను!

“ప్రియాతి ప్రియమైన గౌరీ – శ్రీనివాస్!

నాకున్న ఇన్ని వేల పరిచయాల్లో… కేవలం మీ ఇద్దరికే ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో… నాకే తెలియదు! ప్రకృతికి విరుద్ధంగా నా జీవితం ఎప్పుడూ అపసవ్య దిశలోనే తిరుగుతూ వచ్చింది! మా నాన్న కన్న… ముగ్గురు పిల్లల్లో… నా జీవితమే ఎందుకింత వక్రరేఖలోనడవాలి? ‘నువ్వు సక్రమంగా నడిచావా’…అని నువ్వు అనచ్చు… నా జీవితంలో ఇన్ని మలుపులు…విధి లిఖితం అనాలా.. లేక స్వయం కృతాపరాధం అనాలా?

నా చెయ్యి పట్టుకున్న ఎవరూ.. ఎందుకు నాతో చివరి వరకు… నడవలేక పోతున్నారు? ఎంత అసహజమైన పేరు నాది ! పవిత్ర అంట పవిత్ర! మహా పవిత్రురాలిని కదా! ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు! ఈ పవిత్రకు సుధాకర్‌తో కూడా చెడిపోయి ఉంటుంది… అని! అవును కదా! నిజమే గౌరీ! జనం ఎంత సేపు నన్ను జడ్జ్ చేస్తారు కానీ అవతలి వారి లోపాలు ఎందుకు మాట్లాడారు?

నాకెందుకో గత రెండేళ్లగా బ్రతకాలంటే భయం పట్టుకుంది! బబ్లూ దూరం అయ్యాడు! స్వీటీకి సుధాకర్ ఉంటే చాలు! నేను నామ మాత్రమే! తండ్రి కోసం తపించే ఆ పిల్లకు సుధాకర్‌లో పెద్ద పెన్నిధి దొరికింది! ‘డాడీ’ అంటూ తన సంపాదన మొత్తం… క్రెడిట్ కార్డ్స్ తో… సహా అతని చేతిలో పెడుతుంది! ఇద్దరి మధ్యా ఏవేవో మంతనాలు! నా నుండి రహస్యాలు! నేను పిచ్చిదాన్నేఅయిపోయా! వారి మధ్య అసహజమైన బంధం ఏదో పెరుగుతోందేమోనని భయంకరమైన అనుమానం! అది ద్వేషంగా మారి అందరినీ మాటలతో హింసించడం నా దినచర్య అయిపోయింది!

తన చిన్ననాటి నుండి… నా వలన స్వీటీ మానసికంగా చాలా ఒడిదుడుకులకు లోనయ్యింది! నాలాగే మానసిక దుర్బలురాలై… జీవితంలో తప్పటడుగు వేస్తే.. నేను తట్టుకోగలనా? పాతికేళ్ల పిల్ల ఒక వ్యక్తి మత్తులో అంతలా ఉండగలదా…. నా అనుమానం నెల రోజుల క్రితమే నివృత్తి అయ్యింది!

తన చివరి దశలో… నా పిల్లలకు ఏదైనా న్యాయం చేద్దామని అనుకున్నారో ఏమిటో… మా అత్తగారు… స్వీటీ పేరిట.. తనస్థలం.. రెండు కోట్లు విలువ చేసేది రాసి.. చనిపోయారు! నా ప్రమేయమే లేకుండా స్వీటీ …సుధాకర్ సాయంతో ఆ స్థలాన్ని అమ్మేసి… ఆ డబ్బంతా… అతని చేతిలో పెట్టింది!

డబ్బుంటేనే మనుషులకు విలువ ఇచ్చే కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం! తన భవిష్యత్తుకు ఆ డబ్బు చాలా అవసరం! మరిఅంత డబ్బును… ఒక ఆడపిల్ల కాదనుకుని …అలా ఎలా వదులు కుంటుంది! “ఎందుకు చేశావు స్వీటీ?”… అని గగ్గోలుపెట్టాను! మాట్లాడదు !మౌనమే జవాబు!

ఎంత అసహాయురాలను అయిపోయానో శ్రీను! నువ్వుంటే పరిస్థితిని చక్కదిద్ది పెట్టేవాడివి కదా… అని నిన్ను ఎంత గుర్తుచేసుకున్నానో!

సుధాకర్‌ను సరిదిద్దే ఓపిక, సమయం నాకు లేవు ఇప్పుడు! స్వీటీని ఎలాగైనా మా నుండి తప్పించి… ఎక్కడికైనా పంపేయాలి… అని గట్టిగా నిర్ణయించుకున్నాను! సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాను! చివరకు నేనే చచ్చిపోతానని బెదిరించాను! లొంగింది!

సుధాకర్ ఏ మాత్రం అడ్డు పెట్టలేదు! ఎందుకు అడ్డు పెడతాడు?!… అతను ఆశించిన డబ్బు… చేతిలో పడనే పడిందికదా!

నిన్న అర్ధరాత్రి స్వీటీ అమెరికాకు బయలుదేరి వెళ్ళింది! బహుశా మరి ఎప్పటికీ తను తిరిగి రాకపోవచ్చు! మాటిచ్చిందిగా! తన బాధ్యత చెల్లి చరిత్ర తీసుకుంటానని ధైర్యం చెప్పింది! ఇక ఈ జీవితం మరిక చాలు! ఎవరి కోసం ఇంకా జీవించాలి? ఇంకెంత నయవంచనలు తట్టుకోవాలి? పూర్తిగా ఆసక్తిపోయింది!

ఈరోజు తెల్లవారు జామునే లేచి… స్నానం చేసి… మెత్తని… నువ్వు ఇచ్చిన చీర కట్టుకుని… తులసమ్మకు పువ్వులు పెట్టీ… తృప్తిగా దీపాలు పెట్టుకున్నా గౌరీ!

మనసంతా విచిత్రమైన ప్రశాంతత, నెమ్మది! రాగి చెంబులో తీర్థం పోసుకుని… ఒక తులసి దళం వేసుకున్నా! ప్రతిరోజూ… “నీకు నేనున్నాను”… అంటూ ఓదార్చే ఈ పరిష్కారాన్ని ఒంపుకున్నా! నా కళ్ళ ముందు నన్ను ప్రశ్నిస్తూ…. నువ్వే గౌరీ! ఎంత మంది స్త్రీలు నీలా.. ‘మా వారి గర్ల్ ఫ్రెండ్’ అంటూ ధైర్యంగా చెప్పగలరు? ఆ గర్ల్ ఫ్రెండ్ కు ప్రేమను, ఆత్మీయతను పంచగలరు?.

అందుకే గౌరమ్మా! దొరికిన ఈ గంట వ్యవధిలో…నీకు ఈ ఉత్తరం రాస్తున్నా! అల్విదా మిత్రోమ్! మళ్లీ మరో జన్మంటూ‌ఉంటే… మీ కూతురిగా! … మీ పవిత్ర!

ఆ ఉత్తరాన్ని చూసి నిశ్చేష్టను అయిపోయా! దిక్కుతోచని దానిలా….అలా పున్నమి చంద్రుడు కేసే పిచ్చిదానిలా… చూస్తూఉండిపోయా!

“గౌరీ”… అని పిలుస్తూ శ్రీనివాస్ పెరట్లోకి గాభరాగా రావడం తెలుస్తోంది! వార్తేదో తెలిసినట్టుంది!

“గౌరీ! పవిత్ర హాస్పిటల్‌లో వుంది. తన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందట. మనని చూడాలని డెలీరియస్‌గా అడుగుతోందట. బయలుదేరు. ఇంకో రెండుగంటల్లో లాస్ట్ ఫ్లయిట్ ఉంది. మురళీ టికెట్స్ ట్రై చేస్తున్నాడు. నాలుగు బట్టలు పడేసుకుని వెళ్ళిపోవడమే. లే! లే”…. అంటూ ఎలా వచ్చాడో అలాగే లోపలికి పరుగెత్తాడు శ్రీనివాస్!

నాకు పవిత్ర ఉత్తరం గురించి అతనికి చెప్పాలనే ధ్యాసే లేదు! వెర్రిదానిలా లోపలికి పరుగెట్టాను. “భగవంతుడా! నా పవిత్రను కాపాడు!”….అదే నా ధ్యానంగా….మరో అరగంటలో పిల్లలను ఆఫీస్‌లో పనిచేసే మురళీ, అతని భార్యకు అప్పగించి…. బేగ్ పట్టుకుని శ్రీనూ వెంటే… పరుగెత్తి కారులో కూర్చున్నా. విమానంలో కాస్త స్థిమితపడి కూర్చున్నాకా…. మెల్లగా పవిత్ర ఉత్తరాన్ని శ్రీనివాస్ చేతికిచ్చా. ఉత్తరం పూర్తయ్యేటప్పటికి….. అతని కళ్ళలోంచి జలజలా కన్నీరు కారిపోసాగింది. అతని చేతిమీద చెయ్యేసి…. నేనే…నిబ్బరం చేయాల్సి వచ్చింది!

హోటల్‌లో సామాను పడేసి…. మర్నాడు ఆరింటికే ఆసుపత్రికి పరిగెట్టాం ఇద్దరం! సుధాకర్ గేట్ దగ్గరే ఎదురుచూస్తున్నాడు. వంద యుద్ధాలు చేసినవాడిలా ఉన్నాడు పాపం! అతికష్టం మీద ఐసీయులోకి అనుమతించారు. పవిత్రను ఆ స్థితిలో చూసి… తట్టుకోలేకపోయాము! శ్రీనివాస్ పిచ్చివాడిలా పవిత్ర బెడ్ దగ్గరకు పరుగెట్టి… “పవిత్రా! తల్లిగాడూ! అమ్మలూ! కళ్ళుతెరవరా! శ్రీనూని వచ్చా! కళ్ళు తెరమ్మా! గౌరీ, నేనూ ఉన్నాము కదా నీకు. మనింటికి వెళ్ళిపోదాం. లే నాన్నా!” …… పిచ్చాడిలా చెప్పిందే చెప్తూ ఏడిచేస్తున్నాడు శ్రీను! అతనిలో అంత విచలత నేనెప్పుడూ చూడనేలేదు. సుధాకర్ మొహం మామాటలకు వివర్ణమవ్వడం నేను గమనించా!

ఏ దేవుడు కరుణించాడో…. పవిత్ర గండం గడిచి బయటపడింది. ఆ వారంరోజులూ నా చెయ్యి వదిలేది కాదు. పవిత్ర కొడుకు బబ్లూ పరిగెత్తుకొచ్చాడు. తల్లిని విడిచిపెట్టినందుకు సారీ చెప్తూ… వెక్కివెక్కి ఏడ్చాడు. సుధాకర్ ఎంత బతిమాలినా శ్రీనివాస్ వినలేదు. పవిత్రను మాతో మా ఇంటికి తెచ్చేసుకున్నాం. తనను మా కనుసన్నలలోనే ఉంచుకుని…. బోధనలేమీ చెయ్యకుండానే…. ప్రేమతో మార్పు తేవాలని నిర్ణయించుకున్నాం. మంచి మానసిక నిపుణునితో…. కౌన్సిలింగ్ మొదలుపెట్టించాము. నెల్లాళ్ళలోనే తనలో గణనీయంగా మార్పు వచ్చింది. మా పిల్లలతో ఇంటరాక్షన్, తన పిల్లలతో రెగ్యులర్‌గా మాట్లాడడం… చేస్తోంది. తను చేసిన పనికి సిగ్గుపడడం మొదలుపెట్టింది. సుధాకర్‌తో దాదాపు తన బంధాన్ని తెగతెంపులు చేసుకుంది.

మనిషిలో ఆధ్యాత్మికతా, అంతర్వీక్షణం ఎక్కువయ్యాయి. నా సంరక్షణలో పూర్తిగా తేరుకుంది పవిత్ర! తప్పిపోయిన లేగదూడ ఇంటికి తిరిగొచ్చిన ఆనందం శ్రీనులో! ఎప్పుడో చాన్నాళ్ళకు చెప్పాడు…. అమ్మ బొజ్జలోనే చనిపోయిన తన చిట్టిచెల్లెలు పవిత్రలో కనబడుతుందని! అతని మనసులోని ఆర్ద్రత నాకెరుకే!

ఒక ఏడాది గడిచాకా…. పవిత్ర ముందు కొన్ని ఆప్షన్స్ పెట్టాడు శ్రీనివాస్! దుబాయ్‌లో ఉద్యోగం లేదా ఇక్కడే తన కిష్టమైన వ్యాపకాన్ని డెవలప్ చేసుకోవడం. పవిత్ర రెండోదే ఎంచుకుంది. నేనూ-పవిత్ర మా చిరకాలస్వప్నమైన మోడల్ స్కూల్‌ను మొదలుపెట్టాం! హై వే పక్కనున్న రెండకరాల మా తోటలో… మా కలలను సాకారం చేసుకుంటూ!

పవిత్ర ఇచ్చిన ఆఖరి ముగింపు:

తప్పులు, తప్పటడుగులూ మానవజీవితంలో సహజం! కానీ తప్పులను మానసికంగా ఒప్పుకోవాలి. దారి మళ్ళించుకోవాలి! ఏ దారికీ డెడ్ ఎండ్ అనేది గమ్యం కానే కాదు! అందరికీ శ్రీనులూ-గౌరీలూ దొరకరు. ఏ భాగ్యవశానో నాకు దొరికారు. అమ్మానాన్నల్లా ఆసరా ఇచ్చారు. ఆ ఆసరా, భరోసాతో…..నా మరుగున పడిపోయిన తెలివితేటలూ… వ్యాపారదక్షతా బయటకు తీసాను. స్కూలే నా ప్రపంచం చేసుకున్నాను!

కులమనే పదాన్ని స్కూల్ అప్లికేషన్ లోంచి తీసిపడేసాం! వ్యాపారధోరణితోనే చేసినా…. వేల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. పిల్లలకు తాము పెరుగుతున్న వాతావరణం ఎలా ఉన్నా…. విద్యాలయంలో పూర్తి పరిపోషణ, పరితోషణ దొరికి, మౌలిక విలువలు, సామాజిక బాధ్యతలూ తెలియాలి!

క్లాసుకు పదిమంది పిల్లలు…. ప్రతిభ, అర్హతలు వుండి… మంచి చదువులు అందని ఫలమైన మధ్యతరగతి వారు పూర్తిగా ఉచితమైన విద్యాబోధనను అందుకుంటున్నారు! మాకు కావలసిన విద్యాబోధన చెయ్యడానికి మా కరిక్యులమ్‌లో టీచర్లకు స్పెషన్ ట్రైనింగ్ సెంటర్స్ నడుపుతున్నాము!

ఈరోజు ఉభయరాష్ట్రాలలో పది స్కూల్స్ రన్ చేస్తూ…..త్వరలో భువనేశ్వర్, రాయపూర్ లో ప్రారంభించబోతున్నాము! ఇది నా విజయవంతమైన రెండో ఇన్నింగ్స్! ఈ రోజు కార్తీకపౌర్ణమి. నేను పునర్జీవించిన రోజు! గతజలసేతుబంధనాలన్నీ వదిలించుకుని….నా కొత్తజీవితాన్ని నా ప్రాణమిత్రుల సహాయంతో మొదలుపెట్టిన రోజు. వచ్చే నెల స్వీటీ పెళ్ళి…..తనకు అన్నివిధాలా తగిన అబ్బాయితో! బబ్లూ శ్రీను క్రిందే ఆడిటర్‌గా ట్రైనింగ్ అవుతున్నాడు. ఒక విధంగా పిల్లలు సెటిల్ అయినట్టే! సుధాకర్ మీద కోపమూ లేదు. …..అనుబంధమూ లేదిప్పుడు! విధి నాతో ఎన్ని ఆటలు ఆడినా…. నేను నమ్మిన దైవం…. నాకు గౌరీ-శ్రీనూ రూపంలో నాతోనే ఉండి…. నన్ను నడిపించాడు! ఈరోజు నా కథను నేను నలుగురికీ వినిపించడానికి సిగ్గుపడను. ఎన్నో పాఠాలు… ఎందరో నేర్చుకోవలసినవి నా జీవితంలో ఉన్నాయి! ధైర్యంగా జీవించడం…. గెలుపు సూత్రం! పారిపోవడం ….అధీరత్వం! బ్రతుకుదాం! బ్రతికిద్దాం….బ్రతుకు లోని తీపిని అనుభవిద్దాం!……మీ పవిత్ర!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here