[dropcap]రా[/dropcap]త్రి కలల బజారుకెళ్ళా
ఒకటో రెండో కొనుక్కొచ్చుకుందామని
బ్యాడ్ లక్..! కొట్లు కట్టేశారు అప్పటికే
నేవెళ్ళటం కాస్త ఆలస్యం అయినట్లుంది
కలల కమ్మదనం లేని ఈరాత్రి
కలత నిద్రయ్యేట్టుందనిపించింది
ఊహల అంగడి ఎందుకో తెరిచే ఉంది
కస్టమర్లు లేక ఖాళీగా, తిరిగొచ్చేదారిలో..
ఉత్సాహంగా.. వెతికి తెచ్చేసుకున్నా
నాకు నచ్చిన నాలుగింటిని కొనేసి
పడకపై హాయిగా నడుం వాల్చి
దిండు పక్కన వాటిని పడేసుకుని
ఒక్కొక్కటిగా వాటిలోకి తొంగిచూస్తూ
ఊహలలోకంలో ఉద్విగ్నంగా విహరిస్తూంటే
కాలం తనపని తాను చూసేసుకుంది
గుడ్ నైట్ చెప్పిన నోటితోనే
నే కప్పుకున్న దుప్పటిని తొలగిస్తూ
చల్లగా గుడ్ మార్నింగ్ కూడా చెప్పేసింది
అరెరే..!
కలలులేని కలతనిద్ర అవుతుందనుకుంటే
ఊహలు జతగూడిన ఈ రాత్రంతా
నిద్రే బరువైంది.. కంటికి కునుకే కరువైంది
ప్చ్..! బ్యాడ్ లక్!!
వెరీ బ్యా..డ్ లక్!!!