[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘పేదరికమే దిష్టిచుక్క..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వా[/dropcap]డి ముఖం రోజుకో
ప్రశ్నను ఇస్తూనే ఉంది
నవ్వుతూ మనసును మెలబట్టి
మౌనంలోకి మనిషిని తొక్కిపట్టి
పొద్దస్తమానం నోటిలో ఏదో తిండితో
ఆకలిని గర్వంగా చూపి
కడుపును సంతోషపెట్టుకుని
వీధిపై చేతులేసుకుని తిరుగుతాడు
ఎండ, గాలి, వాన చేత
సేవలందుకున్నట్లు స్వేచ్ఛగా
అంతా తనదేన్నటుగా ఏది పట్టించుకోడు..
ఏ ఆలోచన వలలో పడడు..
ఎటుపడితే అటు నడుస్తాడు.. పరిగెత్తుతూ
వంగుతాడు..లేస్తాడు
ఏది పోగొట్టుకోడు
పైగా ఏదో పొందినట్లుగా మూరేత్తి చూస్తాడు.
అనిపించినట్లుగానే కనిపిస్తాడు
కనిపించేదానిలో ఏదీ దాచుకోలేడు
అబద్దంతో రక్తం కలుషితం చేసుకోడు
నిజాయితీయే సొంత అందంగా అగుపిస్తాడు.
మాసిన బట్టల్లో పేదరికం
మంచితనానికి దిష్టి చుక్క కాగా
పాదరసంలాంటి ఆ మనసు
మనో భాగ్యాలకి మచ్చుతునక..
అందుకే. వాడెప్పుడు కనిపించినా
నాకు నాపై జాలి
నాలో ఏదో అసూయ, ఈర్ష్య
వాడిని గౌరవిస్తూనే ఉంటుంది..