పేదవాడి సాయం

    0
    2

    [box type=’note’ fontsize=’16’] “ఫరవాలేదయ్యా ఆ సమయంలో నువ్వేకాదు ఎవరైనా అట్టాగే సేస్తారు. ఏదో పేదోడిని నీ కష్టం సూడలేక నాకు తోచిన సాయం నే సేసానంతే” అన్నాడు బిచ్చగాడు. ఓ పాప ప్రాణాలని నిలపడానికి దోహదపడ్డ ఆ బిచ్చగాడి సాయం ఏమిటో వివరిస్తున్నారు దినవహి సత్యవతిపేదవాడి సాయం” కథలో. [/box]

    [dropcap style=”circle”]అ[/dropcap]ది ఒక ప్రైవేటు ఆస్పత్రి. దాని ఎదుట కొంతమంది గుంపుగా నిలబడి ఆందోళన చేస్తున్నారు. ఆ గుంపులో ఎనిమిది సంవత్సరాల పాపని చేతులలో ఎత్తుకున్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ పాప అతని కూతురు.

    పాపకి ఉదయంనుండి వాంతులు అవుతుండటంతో కంగారుపడి వెంటనే పాపని తీసుకుని పదుగురు సాయం రాగా ఆస్పత్రికి వచ్చాడు. తీరా వచ్చాక పాపని ఆస్పత్రి వాళ్ళు చేర్చుకోమన్నారు. కారణం ముందురోజు రాత్రి నుండి పెద్దనోట్లు రద్దు చేయబడినందు వలన చికిత్సకు తగినంత పైకం చిల్లర రూపంలో జమ కడితేగాని పాపని చేర్చుకోరట!

    అప్పటికీ ఆస్పత్రులు, మందుల దుకాణాలు ……ఇలా కొన్నిచోట్ల కొంతకాలం వరకు పెద్దనోట్లు చెల్లుబడి అవుతాయని చెప్పబడినప్పటికీ అది అమలుపరిచే ప్రక్రియలో ఇటువంటి కొంతమంది వారిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తున్నారు!!

    పాపతో వచ్చిన అందరి వద్దా కావలసినంత పైకం ఉంది కానీ ఎవ్వరి వద్దా కూడా చికిత్సకోసం జమ చేయడానికి తగినంత చిల్లర పైకం లేదు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే అక్కడున్న అందరిదీ అదే పరిస్థితి. ఇటు చూస్తే సమయం గడుస్తున్న కొద్దీ పాప పరిస్థితి విషమిస్తోంది. ఏం చేయాలో ఎవరికి పాలుపోవటం లేదు.

    ఈ గొడవంతా అక్కడికి కొంచం దూరంలో కూర్చుని ఉన్న ఒక ముసలి వ్యక్తి గమనిస్తున్నాడు. ఎంతకూ పాపను చేర్చుకోవడానికి ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోక మొండికేస్తుంటే ఇంక చూస్తూ ఊరుకోలేక అతడు కూర్చున్న చోటినుండి నెమ్మదిగా కదిలి ఆ గుంపు దగ్గరికి వచ్చి పాప తండ్రి చేతిపై పిలుస్తున్నట్లుగా తట్టాడు.

    కానీ బిడ్డ పరిస్థితి ఏమవుతుందో అని కంగారుపడుతున్న పాప తండ్రి అడుక్కునేవాడేమో అనుకుని “ఏహే! మధ్యలో నీగోలేంటీ? అసలే మేమంతా మతి లేక ఏడుస్తావుంటే” అంటూ ఎవరో కూడా చూడకుండా విసుక్కున్నాడు.

    అయినా సరే మళ్ళీ చెయ్యి తట్టినట్లనిపించడంతో ఇంక తల తిప్పి ఆ వ్యక్తి వైపు చూడక తప్పలేదు పాప తండ్రికి.

    “సరే ఏంది చెప్పు?” అన్నాడు విసుగ్గా అరుస్తూ .

    దాంతో అక్కడున్న అందరూ అటుగా దృష్టి మళ్ళించి చూడగా వారికి చేతిలో పాత సంచీ పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతడు వెంటనే తన చేతులలో ఉన్న సంచిని పాప తండ్రి చేతిలో పెట్టి “ఈ సంచిలో చాలా చిల్లర పైకం ఉంది. ఇందులోంచి నీకు కావలసినంత తీసుకుని ఆస్పత్రిలో జమ కట్టి బిడ్డని కాపాడుకో” అన్నాడు. అనుకోని ఈ సంఘటనతో పాప తండ్రితో సహా అక్కడున్న వాళ్ళందరూ కూడా విస్మయంగా చూస్తుండిపోయారు.

    పాప తండ్రికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్లై క్షణంపాటు మాటలు పెగలలేదు. కొంతసేపటికి తేరుకుని ఏదో అనబోయాడు.

    వెంటనే ఆ వ్యక్తి చేయెత్తి అతడిని వారిస్తూ “ముందు బిడ్డ సంగతి సూడు” అని అక్కడినుండి నెమ్మదిగా కదిలి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోయాడు.

    చిల్లర పైకం ఇచ్చిన ఆ వ్యక్తి ముసలి వయసులో ఉన్న రెండు కాళ్ళు లేని ఒక బిచ్చగాడు. అతడు ఆ ఆస్పత్రి వెలుపలే గేటు దగ్గర నాలుగుచక్రాల చెక్కబల్లపై కూర్చుని బిచ్చమెత్తుకుని బ్రతుకుతుంటాడు. ధర్మదాతలు వేసిన చిల్లర, కడుపుకి తినగా మిగిలినది, ఇన్నేళ్ళుగా కూడబెట్టాడు. ఇప్పుడు పాపని ఆస్పత్రిలో చేర్చడానికి ఇచ్చినది అలా కూడబెట్టిన చిల్లర పైకమే.

    పాప తండ్రి వెంటనే ఆ పైకం జమ చేసి పాపని ఆస్పత్రిలో చేర్పించాడు. పాపకేమీ ప్రమాదంలేదని తెలిసి అందరూ తేలికగా ఊపిరిపీల్చుకున్నారు.

    “నేను నిన్ను కసురుకున్నా కోపగించుకోకుండా సమయానికి నువ్వు సాయంచేయబట్టే నా బిడ్డ నాకు దక్కింది” అన్నాడు పాప తండ్రి బిచ్చగాడి వద్దకు వచ్చి.

    “ఫరవాలేదయ్యా ఆ సమయంలో నువ్వేకాదు ఎవరైనా అట్టాగే సేస్తారు. ఏదో పేదోడిని నీ కష్టం సూడలేక నాకు తోచిన సాయం నే సేసానంతే” అన్నాడు బిచ్చగాడు

    “పేదోడివైనా నువ్వు చేసిన సాయం మాత్రం మహా గొప్పది అన్నా” అంటూ ఆ బిచ్చగాడికి చేతులెత్తి నమస్కారం చేసాడు పాప తండ్రి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here