పెద్ద మనసు

0
2

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన పి.ఎల్.ఎన్. మంగారత్నం. [/box]

[dropcap]అ[/dropcap]ప్పటి వరకూ తన మెయిల్ లాగిన్‌కు వచ్చిన బిల్స్ పాస్ చేసే పనిలో ఉన్న అసిస్టెంటు ట్రెజరీ ఆఫీసరు మునేశ్వర్.. ఫోన్ మ్రోగడంతో… కొత్త నెంబరుతో వచ్చిన ఆ కాల్‌ని రిసీవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఇప్పుడు బిల్స్ ఫిజికల్‌గా – ట్రెజరీకి తేవాల్సిన పని లేదు. ఆఫీసు నుంచే స్కాన్ చేసి పంపిస్తే, ట్రెజరీకి వచ్చేస్తాయి. అంతా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైనులోనే చెల్లింపులు.

అవతల ఉన్న ఆమె ముందుగా విష్ చేసి, తన పేరు చెప్పి “మీకు గుర్తే ఉండి ఉంటుంది. నా పేరు” అంటూ ప్రారంభించింది. ఆ కొత్త నెంబరు ఎవరిదో తెలియకపోయినా.. ఆ పేరు గుర్తుండాల్సిన అవసరం ఏమీ లేకపోయినా, ‘గుర్తే’ ఉంది.

అయినా అన్నాడు “చెప్పండి” అని.

“నేను మొన్న డిసెంబర్ లోనే రిటైరు అయ్యాను సార్! నావి రెండు ఎరండ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బిల్స్.. ఉన్నాయి. ప్రస్తుతం కాలు నొప్పి వలన నడవలేక, వచ్చి కలవలేకపోతున్నాను. మా ఆఫీసు అమ్మాయి జ్యోతి మీ లాగిన్‌కి వచ్చి ఉన్నాయని చెప్పడంతో మీకు కాల్ చేస్తున్నాను. కొద్దిగా చూడండి సార్” అడిగింది రిక్వెస్ట్‌గా.

అవి అప్పటికే అతని లాగిన్‌కి వచ్చి నాలుగురోజులు అయ్యింది. తనకి వచ్చిన అన్ని బిల్లులు కొట్టేసినా – ఇవి మాత్రం అలానే ఉంచాడు.

“టోకెన్ నంబర్లు ఏమైనా తెలుసా?”

తెలీదు అంటే.. ‘అటువంటప్పుడు ఎందుకు కాల్ చేసి మా టైము పాడు చెయ్యడం అనొచ్చు’. వర్క్ అవుట్ కాని కేసులు అలానే ట్రీట్ చెయ్యాలి. దండం దశగుణం భవేత్ అన్నట్లు.

“అలాగేనండి. చెబుతాను” అంటూ వ్రాసుకున్న పేపరు ముందు పెట్టుకున్నట్టుంది…. చకచకా చెప్పేసింది. అంత ఎలర్టుగా ఉంటుందని అనుకోలేదు.

అయినా కంప్యూటర్ చెక్ చేస్తున్నట్లు చేసి ఓ రెండు నిముషాల టైము తీసుకుని “ఆ మొన్న నాలుగవ తారీకునే వచ్చాయి. చూస్తాను” చెప్పాడు. ఆ రోజు ఎనిమిదవ తారీకు… బిజీలో ఉండడం వలన ఇప్పటికీ చూడడం కుదరలేదు అన్నట్లు.

“రిక్వెస్టు సార్! రాలేకే అడుగుతున్నాను” మళ్ళీ చెప్పింది.

“అలాగే, అలాగే – ఈ రోజు చూస్తాను” ఫోన్ పెట్టేసాడు.

ఆమె చెప్పిన ఆ రెండు బిల్లుల మొత్తం – ‘ఎనిమిది లక్షల పై మాటే’. అలాంటివి అసలు వాళ్ళు కనిపించకుండానే – ఫోనుల్లో రిక్వెస్టు చేసేస్తే పనైపోతుందనుకుందా. ట్రెజరీ వాళ్ళు అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా ఈమెకి?

ఇలా ప్రతివాళ్ళూ ఫోనుల్లో పని జరిపించేసుకుంటే… ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎన్ని డబ్బులు వేసుకోచ్చారో… వెళ్ళేటప్పుడు అన్నే ఉంటాయి. అవి పెరగకపోతే, ఉద్యోగం చేసిన గొప్పతనం ఏముంది? చిన్నగా నవ్వుకున్నాడు.

అక్కడికి రెండురోజులు చూసి…

బిల్స్ తెచ్చిన అమ్మాయికి ఫోన్ చేసి మరీ అడిగాడు “మనోరమా అని, ఆమె బిల్స్ చెయ్యలా? విషయమూ చెప్పలేదమిటి?” అంటూ. అప్పుడైనా విషయం కదులుతుందమోనని.

“చెయ్యండి. సారీ! ఆ మేడం నన్ను ప్రెజర్ చేస్తున్నారు. ఆవిడని అడిగి ఏ విషయమూ చెబుతాను” అని, అన్నదే గాని మళ్ళీ మాటలేదు.

ఇవి కదల్లేదు.

బిల్స్ తన దగ్గర ఆగిపోయాయి అన్న విషయం తెలిసిన.. ఆమెకి ఎందుకు ఆగిపోయాయో తెలీలేదా?

పైగా ‘నా పేరు.. గుర్తు ఉండి ఉంటుంది’ అంటూ వి.ఐ.పి.లా కబుర్లు. ఆమె పేరు నేను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? పైగా రిక్వెస్టట. ఓ సారి టచ్ చేసి వదిలేస్తే.. మనసు కరిగి ఎప్పుడో అప్పుడు అతనే చెయ్యకపోతాడా! అన్నట్లు.

రిటైరుమెంటు తరువాత రావాల్సిన డబ్బులకి… ట్రెజరీ వేసే క్వర్రీలకు ఆన్సర్లు రాయలేక.. అవి పడుకుండానే.. వెంటపడి మరీ చేయించుకుంటారు జనాలు. అలాంటిది. ఒక్కసారి వచ్చి కలవకపోతే… బిల్లు కదిలేస్తుందా?

కాకపోతే, ఆన్‌లైను వచ్చిన తరువాత ఎవరి లాగిన్ లోనూ బిల్స్ ఎక్కువ రోజులు ఉండకూడదు. చేస్తే చెయ్యాలి లేదా ఏదో కుంటి సాకు చెప్పి రిటన్ చేసియ్యాలి. తప్పు తమ మీద ఉండకూడదు.

అదే లాభసాటి వ్యవహారం ప్రస్తుతం.

***

ఏ.టి.ఓ. అభయానికి సంతోషపడిన మనోరమ అయిదారు రోజులు ఎదురు చూసి, ఎంతకీ బ్యాంకు ఎకౌంటులో డబ్బులు రాకపోవడంతో ‘తప్పదు… ఓ సారి ట్రెజరీ మెట్లెక్కాలి’ అనుకుంటూ.. భర్త సహాయంతో బయలుదేరింది మొట్టమొదటగా.

సెక్షన్‌లో తెలుసుకుంటే-

అవి ఇంకా ఏ.టి.ఓ. లాగిన్‍లోనే ఉన్నాయనీ, పైగా అతను ఆ రోజు నుండి వారం రోజులు సెలవు అని తెలిసింది.

బిల్స్ అన్నీ పర్ఫెక్టుగా ఉండడంతో… తిప్పెయ్యడానికి వీలుకాక… పర్పన్ వచ్చి కలవలేదన్న కారణంగా అలాగే… ఉంచేసి సెలవు మీద వెళ్ళిపోయాడు మునేశ్వర్.

ఇంఛార్జ్‌ని గురించి అడిగితే, సెక్షన్ క్లర్కు చెప్పలేక పోయింది. అసలేమీ తెలియనట్టు మళ్ళీ మునేశ్వర్‌కి ఫోన్ చేసింది – “సార్! నా బిల్స్ పాస్ చేసారా? ఇంకా డబ్బులు రాలేదు” అంటూ.

“నేను సెలవులో ఉన్నానండి. మళ్ళీ సోమవారం వస్తాను” చెప్పాడు చాలా నిజాయితీగా. అప్పటి వరకు ఆగక తప్పదు అన్నట్లు.

“అంది. వారం రోజులా? నేను ఇప్పుడు మీ ఆఫీసుకే వచ్చి ఉన్నాను. ఇంఛార్జ్ ఎవరూ లేరా మీ తరపున?”

వారం రోజుల సెలవు కాబట్టి, తప్పనిసరిగా ఉండి తీరతాడు. ‘అతని పేరు’ చెప్పక తప్పలేదు మునేశ్వర్‌కి. ఆ వచ్చేది ఏదో తను ఉన్నప్పుడు అన్ని బాగుండేది కదా అనుకుంటూ.

ఇంఛార్జ్.. జానీపాషా పూర్వపు పరిచయస్తుడే కావడంతో, పావు గంటలో పని తెమిలింది.

“మీ, ఏ.టీ.ఓ కి … నాకన్నా తక్కువే బిల్స్ ఉంటాయి. వారం రోజులు లీవ్ మీద వెళుతున్నప్పుడు అన్నీ క్లియర్ చేసి వెళ్ళాలి కదా! నేను ఈరోజు నుంచి వచ్చిన బిల్స్ మాత్రమే ఎటెండు అవ్వాలి. ‘పర్సన్ వచ్చి కలిస్తే’ తప్ప పని చెయ్యకూడదని అనుకుని ఉంటాడు కాబోలు”

“అంతే కావచ్చు. వారంరోజుల సెలవు మీద వెళుతూ కూడా చెయ్యాల్సిన బిల్స్ వదిలేసి వెళ్లారు. నడవలేకపోతున్నాను. రెండు నెలల నుంచి ఎడమకాలి మడమ నొప్పి అని కూడా చెప్పాను” అంటూ పర్సు తెరిచింది.

“నో ఫార్మాలిటీస్” చెప్పాడు. ఒకప్పుడు మనోరమ జీతాల గుమస్తాగా ఉండి, బిల్స్ పట్టుకెళ్ళినపుడు అతను కూడా క్లార్కే. ఇప్పుడు ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

సంతోషంగా “థాంక్స్” చెప్పిన మనోరమకి ఎదురుగా మునేశ్వర్ నిలబడి ‘అయ్యో! వచ్చేది.. పోవడమే కాదు… అనవసరంగా పరువు కూడా పోయిందే’ అని తల కొట్టుకున్నట్లు అనిపించింది.

***

మరో పది రోజులకు… ప్రావిడెంట్ ఫండు బిల్లు తెరకు ఎక్కింది.

“నేను అస్తమానం తిరగలేను.. నువ్వే చేయించు” అంటూ జ్యోతికి పురమాయించింది మనోరమ. అదీ అంతే, అకౌంటెంటు జనరల్, హైదరాబాదు వాళ్ళు, పైనల్ ఎమౌంట్ లెక్కగట్టి, ప్రొసీడింగ్స్ ఇచ్చినా ఇంకా దానిలోనూ .. నాన్ డ్రాయల్ సర్టిఫికేటు వ్రాయలేదని తిప్పివేసాడు.

ఆ సర్టిఫికేటు కూడా వ్రాయించి మళ్ళీ సబ్మిట్ చేసి వారం రోజులు గడుస్తున్నా.. పని స్తబ్దుగానే ఉందని.. మళ్ళీ ట్రెజరీ ఆశ్రయించింది.

మనోరమకి… ఈసారి ‘నాన్ డ్రాయల్ సర్టిఫికేటు నాట్ ఇన్ ఆర్డర్’ అన్న రిమార్కుతో… మళ్ళీ సబ్ ట్రెజరీ ఆఫీసరు లాగిన్ లోకి వచ్చి కనిపించింది.

అంటే, రెండోసారీ త్రిప్పి వేయబడింది. దానికి, అతను ఆన్సర్ వ్రాయాలంటే, మళ్ళీ.. వారం రోజుల కాలయాపన. తాడో! పేడో! తేల్చుకోవాలనుకుంది.

కోపంతో మునేశ్వర్ రూములోకి వెళ్ళినామేకు.. రూములో తనకు తెలిసిన… అటెండరు సత్యనారాయణ ఉండడంతో నెమ్మదించింది. ఇప్పుడు గనుక, ఆవేశం తెచ్చుకుంటే, పని జరగడం మాట ఎలా ఉన్నా.. అనవసరపు మాటలు ఆఫీసుకి వెళ్ళిపోతాయిని.

సత్యనారాయణ సర్వీసులో ఉండగా అలా ఆఫీసర్ల ముందు కూర్చుని ఎరగడు. ఇప్పుడు రిటైరు అయిన సీనియర్ సిటిజన్.

తన్ను తాను పరిచయం చేసుకుని కూర్చుంది… ఎలాగైనా పని పూర్తి చేసుకుని వెళ్ళాలన్న దృఢ సంకల్పంతో.

“మీరు కాకపోతే, మా బిల్స్ ఎవరు చేస్తారు సార్! ‘నాన్ డ్రాయల్ సర్టిఫికేటు నాట్ ఇన్ ఆర్డర్’ అన్నారు. అకౌంటెంటు జనరల్ వాళ్ళు పైనల్ ఆర్డరే కదా! ఇచ్చింది. వచ్చిన వెంటనే బిల్ పెట్టాం. ఇంతలో నాన్ డ్రాయల్ మాట ఎలా వచ్చింది?” అడిగింది శాంతంగా.

తను అంత నెమ్మదిగా మాట్లాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అయితే, మాటల్లో ‘పదును’ శాతం ఎప్పటిదే.

“జీ.పీ.ఎఫ్ క్లెయిమ్ పంపుకునే నాటికి, మీ దగ్గర ఏమైనా ‘లోన్’ ఎమౌంటు మిగిలి ఉందేమో! మాకు ఎలా తెలుస్తుంది?” లాజిక్‌గా మాట్లాడానని అనుకున్నాడు ముకేశ్వర్.

“అలాంటి పెండింగ్స్ ఏమీ లేవు సార్! అయినా మీ అబ్జక్షనుకి ఆన్సర్.. మా ఆఫీసు అమ్మాయి ఏమైనా స్వంతంగా వ్రాసిందా! వివరాలు అన్నీ చెప్పి… మీ సబ్ ట్రెజరీ ఆఫీసరిగారిని అడిగే కదా… వ్రాసింది. మీ ఆఫీసు రిమార్క్ మీకే నచ్చకపోతే ఎలా? సబ్మిట్ చేసిన బిల్ పాస్ అవ్వాలి కదా! ఇలా వెనక్కీ ముందుకీ ఎన్నాళ్ళు తిరుగుతుంది?”

“అయినా, ఒక బిల్లుని ఎన్నిసార్లు ఆడిట్ చేసి, రిటన్ చేస్తారు?” ఆమె మాటలు గొంతు పట్టుకున్నట్లున్నాయి.

ఆ మాటల్లో మెచ్యూరిటీ… ఇబ్బంది పెడుతుంది.

ఇలా చేస్తేనే.. ఎంతో మంది వచ్చి ‘అంత ఇస్తాం! ఇంత ఇస్తాం! ఏదో విధంగా చూసేయ్యండి’ అన్న వాళ్ళే గానీ, ఎవరూ ఇలా ప్రశ్నలు వేయలేదు.

ఎంతైనా రెవిన్యూ డిపార్టుమెంటు కదా! అధారిటీగా మాట్లాడుతుంది. కంప్యూటర్ పైనే దృష్టి పెట్టాడు అవునూ, కాదూ అనలేక.

అప్పటివరకూ చేస్తున్న తన పని ఆగిపోవడమే కాకుండా… జరుగుతున్న ఆలస్యాన్ని భరించలేనట్లు అసహనంగా కదిలాడు సత్యనారాయణ.

ఆమె వైపు తిరిగి, ‘అనవసరంగా మాటలెందుకు… ఏమైనా ఇచ్చారా’? అన్నట్లు బొటనవేలుని… మధ్యవేలు మీద పెట్టి, నోట్లు లెక్కపెట్టినట్లు సౌజ్ఞ చేసి చూపించాడు.

‘లేదు’ అన్నట్లు తల అడ్డంగా ఆడించింది మనోరమ. ఆమెకు ‘పుచ్చుకునే’ అలవాటు లేనట్లే… ‘ఇచ్చే అలవాటు’ కూడా లేదు.

ఏమీ లేకుండా పని జరుగుతుందా? ప్రశ్నార్ధకంగా నవ్వి.. ‘ఒక వెయ్యి ఇవ్వాలి’ అంటూ చూపుడువేలు ముందుకు పెట్టి… చూపించాడు.

కంప్యుటర్ చెక్ చేస్తున్నట్లు చేస్తూనే, అన్నీ గమనిస్తున్నాడు మునేశ్వర్.

వెంటనే ఆమె పర్స్ తెరిచింది. “ఉంచండి సార్!” చేతిలోని నోట్లు అందించబోయింది.

ఎందుకో.. వాటిని అందుకోవాలని అనిపించలేదు.

ఆ సత్యనారాయణ తను ఇచ్చేదేదో… ఇచ్చి, వీర లెవెల్లో ఫోజు కొడుతూ, ఆమెకి… తనెంత డబ్బు కక్కుర్తి గాడో.. వివరించి చెబుతున్నట్లు అనిపించింది.

ఓ క్లాస్ ఫోర్ దగ్గర డబ్బు తీసుకుని తన స్థాయి తనే తగ్గించుకున్నట్లు అనిపించింది. తను నోరు తెరవాల్సిన ‘కష్టం’ లేకుండా, పని జరుగుతుందిలే అనుకున్నా, ఇప్పుడది అవమానంగా అనిపించింది.

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు తను డబ్బుకోసం ఆలోచించిన మాట నిజమే. ఆమె ఇంతకుముందు పెట్టుకున్న ఎరండు లీవు బిల్లులకు ఏమీ అందలేదనే… వదిలేసి మరీ శెలవులో వెళ్ళిపోయాడు.

అదే తనను వ్రేలెత్తి చూపించింది. ఈమె మాట ఎలా ఉన్నా.. కొలీగ్ ముందు తల ఎత్తుకోలేనట్లు అయ్యింది.

ఎన్నిసార్లు తిరగదిప్పినా చివరికి పాస్ చెయ్యవలసింది తనే. ఎవ్వరూ గవర్నమెంటు నుంచి వచ్చే రూపాయిని వదులుకోరు.

“వద్దండి” చెప్పాడు.

వెనక్కు తీసుకుంది, అంత బాహాటంగా… మరో మనిషి చూస్తుండగా… ఇవ్వడం సరిఅయిన పని కాదేమోనని.

సబ్ ట్రెజరీ ఆఫీసర్ ‘నాజర్’ని పిలిచి “ఈవిడ బిల్లుని నాకు ఫార్వార్డ్ చెయ్యండి” చెప్పాడు ఇంకా నాన్చడం మంచిపని కాదన్నట్లు.

ఆ ఆఫీసరు గారు వ్రాసిన రిమార్కులు ఆ కాగితం మీద ఎక్కడో ఒక చోట ఉన్నాయి కదా! ఆర్డరు ఏమిటిలే అనుకుంటూ.. ఆమె బిల్లు ఓపెన్ చేసి, పాస్ చేసాడు ‘పద్నాలుగు లక్షల’ బిల్.

ఓ పది నిముషాల తరువాత “సరే! మీ పని పూర్తి అయ్యింది” చెప్పాడు.

సంతోషపడింది మనోరము తన ఆవేశం అర్ధరహితం కాదన్నట్లు.

ఈసారి … సత్యనారాయణ బయటకు వెళ్ళడంతో… మళ్ళీ ఆఫర్ చెయ్యబోయింది. ఇక అభ్యంతరం ఏం ఉంటుంది అన్నట్లు.

“వద్దండి… వద్దు” ఖచ్చితంగానే చెప్పాడు.

వస్తే, పుచ్చుకోవడమే గాని ఇక ఎవ్వరినీ… ఇలా ఇబ్బంది పెట్టకూడదు. బిల్స్‌ని అలా బంతి ఆడినట్లు తగిన కారణం లేకుండా తిప్పేయ్యడం సరిఅయిన పని కాదని, అది తమ ఆఫీసు స్టాఫ్ దృష్టిలో కూడా మంచి పని కాదని అనుకున్నాడు మనసులో.

స్టాప్ దగ్గర బిల్స్ ఏవీ పెండింగు ఉండవు. ఉంటే, తన దగ్గరే.. ఉండిపోతున్నాయి. బియాండ్ ఎస్.ఎల్.ఏ. కి కారణాలు చెప్పుకునేలా.

“సరే! సార్! ఇంకా చెప్పాలంటే, నా లైఫ్ లోనే, ఎప్పుడూ జీ.పీ.ఎఫ్ ‘లోను’ తీసుకోలేదు” చెప్పిందామె వెళుతూ వెళుతూ.

ఈ కారణంగానే ఇంత బంతాట కదా! అన్నట్లు.

పోనీలే, ఏది ఏమైతేనేం ఆమె దగ్గర నుంచి ఏమీ’ తీసుకోలేదు. వచ్చేది పోయిందే అన్న బాధలేకుండా. మనసు హాయిగా ఉంది. అప్పుడే అనిపించింది తనూ తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు అని. చేసే పనికి డబ్బులందినప్పటి కన్నా సంతోషంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here