పెద్ద మనసు

0
2

[కొల్లా పుష్ప గారు రచించిన ‘పెద్ద మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]ఫీ కప్పు పట్టుకుని బాల్కనీలోకి వచ్చాడు రవిచంద్ర. వాతావరణం చాలా బాగుంది. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వాన నుంచి విముక్తిని ఇస్తున్నట్లుగా బాలభానుడు ఉదయిస్తున్నాడు.

తన్మయత్వంగా చూస్తున్నాడు రవిచంద్ర.

“ఏమండీ లాంగ్ డ్రైవ్‌కి వెళ్దాం అండి” అన్నది స్వప్న అక్కడున్న కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ. “ఇప్పుడెందుకు?” అన్నాడు విసుగ్గా, తన ప్రశాంతతకు అంతరాయం కలిగినందుకు.

“మీరెంత బిజీ పర్సన్ అయినా భార్య, పిల్లలకు కూసింత చోటు ఇవ్వాలి గందా?” అన్నది నాటక పక్కీలో.

ఆమె అభినయానికి పక్కున నవ్వాడు రవిచంద్ర. “మార్చిలో ఇయర్ ఎండింగ్ వర్క్ అన్నారు. తర్వాత ఎండలు అన్నారు, తర్వాత వానలు అన్నారు. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కదా! వాతావరణం బాగుంది. అలా వెళ్లి కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకుందాం” అన్నది గోముగా.

ఇంతలో “డాడీ, డాడీ” అంటూ పిల్లలు వచ్చి “కారులో వెళ్దాం డాడీ” అన్నారు. ‘సరే’ అనక తప్పలేదు రవిచంద్రకు.

***

రవిచంద్ర తండ్రి చిన్నకారు రైతు. అయినా కొడుకుని బాగా చదివించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు. రవిచంద్ర కూడా బాగా చదువుకొని బ్యాంకులో ఆఫీసరుగా జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదిగి బ్యాంకు జనరల్ మేనేజర్ అయ్యాడు.

***

స్వప్న కూడా మంచిదే కాని డబ్బు ఉన్నదన్న అహం ఉంది. తన స్థాయి వాళ్ళతోనే కానీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడదు.

“అందరితో మాట్లాడు” అని ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఇక కొడుకు వరప్రసాద్ తన వరాల మూట. తన తండ్రి పేరు వరాహలరావు. అందుకని అతని పేరు కలిసి వచ్చేలా వరప్రసాద్ అని పేరు పెట్టాడు.

వాడి వయసు తక్కువైనా ఎంతో దయా గుణం కలవాడు తన తండ్రిలాగే.

తండ్రి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా తన చేతనైనంతలో సాయం చేసేవాడు. వీడు కూడా ఎవరైనా కష్టంలో ఉంటే తనతో చెప్తాడు “వాళ్లకు సాయం చెయ్యి డాడీ” అని. అలాగే చేస్తుంటాడు కూడా.

వాళ్ళ అమ్మతో మటుకు చెప్పడు, తిడుతుందని భయం. పాపకు ఆరేళ్లు బొద్దుగా, ముద్దుగా ఉంటుంది.

***

అప్పటికప్పుడు అనుకుని కారులో కావలసినవి అన్నీ పెట్టుకుని బయలుదేరారు వైజాగ్ నుంచి. అనకాపల్లి, తుని దాటిపోయాయి. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. అన్నవరం వచ్చింది. “ఆ దేవుడి దర్శనం చేసుకుందామండి” అన్నది స్వప్న .

“సరే దేవి గారి ఆజ్ఞ” అన్నాడు సరదాగా కారు దిగుతూ రవిచంద్ర. ఆ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ఆ కొండమీద నుంచి చుట్టూ చూశాడు రవిచంద్ర. ‘అంతా నీటిమయం, ఎక్కడ చూసినా నీరే. కానీ తాగడానికి మాత్రం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే’ అనుకున్నాడు మనసులో.

***

రోడ్డుమీద కారు వెళుతున్నప్పుడు గోతులలో నీరు ఉవ్వెత్తున కెరటంలా లేస్తున్నాయి. అద్దంలో నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు.

స్పీడుగా పోతున్న కారు సడన్‌గా స్లో అయింది. “ఎందుకు స్లో చేశారు డాడీ” అంటూ విండో తీసి చూశాడు బాబు. అప్పుడప్పుడే ఎండ కాయడం మొదలవుతోంది.

అక్కడ చాలామంది బస్తాలు మోసుకుంటూ వెళ్తున్నారు. కొందరు వాటిని ఆ రోడ్డుమీద వంపుతున్నారు.

అది చూసిన బాబు “అవి ఏమిటి ఎందుకలా రోడ్డు మీద వంపేస్తున్నారు” అని అడిగాడు. “అవి ధాన్యం నాన్నా, మొన్న వర్షాలకు తడిచిపోయాయి కదా! వాటిని ఎండబెడుతున్నారు” అన్నాడు కారు స్లోగా పోనిస్తూ.

కొంత దూరం వెళ్లేసరికి చాలామంది జనం గుంపుగా ఉన్నారు. గోల, గోలగా ఉంది రవిచంద్ర కారు దిగాడు ఏమిటో చూద్దామనీ. రవిచంద్రతో పాటు బాబు కూడా దిగాడు.

“ఎందుకండీ మనకి అక్కర్లేని విషయం” అంది స్వప్న కూతుర్ని ఒళ్ళు సరిగ్గా కూర్చోబెట్టుకుంటూ.

***

ఆ జనం మధ్య నుంచి తోవ చేసుకుంటూ వెళ్లారు రవిచంద్ర, బాబు. ఆ దృశ్యం చూడగానే మనసు పిండినట్లు అయింది రవిచంద్రకు. అక్కడ ఒక వ్యక్తి నురగలు కక్కుతున్నాడు. అతని కుటుంబం వాళ్లు నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తున్నారు.

“ఏమైంది” అన్నాడు రవిచంద్ర అక్కడున్న ఒక వ్యక్తిని.

“ఏం సెప్పమంటారు బాబు మా బాధలు. అప్పు, సప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొని ఎండనక, వాననక కష్టపడి పండించిన పొలం మాయదారి వానకు తడిసిపోనాది. ఈ దళారీ బాబులు వచ్చి లక్ష రూపాయలు ఇలువ చేసే ధాన్యాన్ని పదేలుకి కొంటామని అంటున్నారు. అసలే బక్క పెనాలు మాయి. పండించే వరకే గానీ కడుపునిండా తినలేక పోతున్నాం. దళారీల మాటలు విన్న మావోడికి భయంతోమూర్చ వచ్చేసినాది బాబు. దగ్గరలో ఆసుపత్రి కూడా నేదు” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.

“సరే నా కారులో పడుకోబెట్టండి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం ముందు” అన్నాడు రవిచంద్ర.

సాయం పట్టి కార్లో పడుకోబెట్టారు వెనక సీట్లో. అతని భార్య భర్తని తన ఒడిలో పడుకోబెట్టుకుని నురగలు తుడుస్తుంది ఏడుస్తూ.

మరో ఇద్దరిని కారు డిక్కీ తీసి అందులో కూర్చోమన్నాడు రవిచంద్ర.

స్వప్నకు ఇవన్నీ ఇష్టం లేక, వస్తున్న కంపుని భరించలేక ముక్కు మూసుకొని కూర్చుంది. ‘నేరకపోయి ఈ టైంలో బయలుదేరామా?’ అనుకుంది.

బాబుకి ఇదంతా అయోమయంగా ఉంది ‘మనుషులు ఇలా కూడా ఉంటారా?’ అనుకున్నాడు. ఒంటిమీద సరియైన బట్టలు లేవు. ఆ మనుషులు అందరూ చాలా బక్కగా ఉన్నారు. అతని వైపే చూస్తున్నాడు ఆశ్చర్యంగా.

***

కారు రాజమండ్రి వైపు సాగింది. ఇంతలో మబ్బులు కమ్ముకున్నాయి పగలే చిమ్మచీకటి అయిపోయింది. మళ్లీ వర్షం మొదలైంది.

అటు, ఇటు వాగులు, వంకలు పొంగిపోయి ఉన్నాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు.

వాళ్లని అక్కడ దింపి కొంత డబ్బు ఇచ్చాడు. అందులో ఒకడు “ఈరోజు మీరు ఆడిని కాపాడేరు బాబు. మీ రుణం తీర్చుకోలేము, కానీ ఇంకా ఎంతమంది సావులు సూడాలో” అని నమస్కారం చేస్తూ ముందుకి సాగిపోయాడు.

***

రాజమండ్రిలో హోటల్ రూమ్ తీసుకొని స్నానాలు చేసి కారు కడగడానికి ఇచ్చి హోటల్‌కు వెళ్లారు. సర్వ్ చేసిన ప్లేట్లు వంక చూసాడు బాబు.

“నాన్న ఇదంతా వాళ్ళు పండిస్తేనే కదా, మన ప్లేట్లోకి వచ్చింది” అన్నాడు సడన్‌గా. ఆ చిన్ని బుర్రలో ఏ ఆలోచన ఉందో మరి. బాగా ఆకలి అవుతున్న తినాలని అనిపించలేదు ఎవరికీ. ఏదో కాస్త తిన్నామనిపించారు. బాబు ప్లేట్లో అయితే అసలు తరగలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. అలా ఉన్న బాబుని చూసి “వేలెడంత లేవు నీకెందుకురా ఆలోచనలు, తిను” అని కసిరింది స్వప్న. తల్లి వైపు ఓ చూపు చూసి చేయి కడుక్కోవడానికి వెళ్లిపోయాడు.

***

అందరూ మౌనంగా ఉన్నారు ఆ సంఘటనతో ఎవరిలో ఉత్సాహం లేదు. “డాడీ మీరు బ్యాంకులో పెద్ద ఆఫీసర్ కదా! వాళ్ళ అప్పుని కొంతకాలం అడగడం మానేయొచ్చు కదా! నేను మొన్న ఒక ఇంగ్లీషు సినిమా చూశాను. అందులో రెయిన్ షెల్టర్ టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. అలా కాకపోయినా పండించిన పంట తడిచిపోకుండా గదులు కట్టవచ్చు కదా! డాడీ?”  అన్నాడు బాబు పెద్ద ఆరిందలా.

రవిచంద్ర వాడి మాటలకు ఆశ్చర్యపోయాడు ‘నిజమే ఇలా తడిచిపోయి నానా కష్టాలు పడి రైతులు పడరాని పాట్లు పడుతుంటే తన లాంటి పెద్దవాళ్లు ఏం చేస్తున్నారు?’ ఆలోచనలో పడ్డాడు.

‘ఆ చిన్న బుర్రలో ఎంత మంచి ఆలోచన వచ్చింది కానీ దాని ఆచరణలో పెట్టాలంటే డబ్బు కావాలి, వాళ్ళందరి సహకారం కూడా కావాలి. తన పై వాళ్ళ సహకారం కావాలి. నిజమే. వాళ్ళ దగ్గర లేకపోతేనేం ప్రభుత్వమే అలాంటివి కట్టి వాటిని తక్కువ అద్దెకు ఇవ్వచ్చు.’

కొడుకు మాటలకు ఎంతో ఆశ్చర్యం కలిగింది స్వప్నకు రవిచంద్రకు. వాడు చూసిన సంఘటనలో కష్టం తెలుసుకొని పరిష్కారం కూడా చూపించాడు చిన్నవాడైన వరప్రసాద్. ఏదో ఆలోచనతో ముందుకి సాగిపోయాడు రవిచంద్ర.

***

తనకున్న ఉద్యోగ హోదాతో, పలుకుబడితో అందరితో మాట్లాడి ఆ రైతులకు మళ్ళీ పంట చేతికి వచ్చేదాకా అప్పు అడగకూడదని తీర్మానం వచ్చేలా చేసాడు. పంట తడిచిపోకుండా ఉండడానికి వారికి ఉన్న పొలాన్ని బట్టి రూరల్ గోడౌన్స్ కట్టడానికి వాళ్ళకి సపోర్టింగ్‌గా బ్యాంకు రుణాలు మంజూరు చేయించారు.

అలాగే హై సొసైటీలో ఉన్న కుటుంబాల దగ్గర ఫండ్స్ వసూలు చేసి ఆ రైతులకు సహాయం చేశారు.

అలా రైతులు వాళ్ల, వాళ్ల పొలాల్లోనే చిన్న చిన్న స్టోరేజీలు కట్టుకున్నారు. వాళ్ల పంట తడవకుండా లోన పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు వేసుకుని వాటిమీద నిలవ ఉంచుకునే విధంగా కట్టుకున్నారు. ఇకనుంచి ఏ రైతు ఇకనుంచి ఏ రైతు కష్టాలు పడకుండా ఉండేలా ప్రభుత్వం తగినన్ని ఏర్పాట్లు చేసింది.

తన కొడుకు చిన్న వయసైనా పెద్ద మనసుతో ఆలోచించడం స్వప్నలో మార్పుకు కారణమైంది.

తన కన్నవారితో ఆలోచించి రైతులకి తన భర్తతో పాటు, తను కూడా వాళ్లకి సహాయ సహకారాలు అందజేసింది. ఆడవాళ్ళ చేత కుటీర పరిశ్రమలు పెట్టించింది. అందుకే నెహ్రూ గారు అన్నారు ‘నేటి బాలలే రేపటి భావి భారత పౌరుల’ని. కొడుకుని చూసి మురిసిపోతుంది స్వప్న.

శుభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here