Site icon Sanchika

పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ

[box type=’note’ fontsize=’16’] “ఇరువైపుల నుండి ముందుతరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎవరికీ హాని కలగకుండా/చేయకుండా వివాహాలు చేయాలి. మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి” అంటున్నారు శారదా తనయ “పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ” అనే ఈ వ్యాసంలో. [/box]

[dropcap]అ[/dropcap]సలు ఇప్పుడు వాడుకలోఉన్న ప్రేమ అనే పదం సినిమాలలో వాడే అర్థం నుండి పుట్టుకొచ్చింది అనవచ్చు. కాకపోతే ఆ పదానికి నిఘంటువు అర్థాన్ని తీసుకుంటే “స్నేహము, మక్కువ, అనురాగము, మమత” అనే అర్థాలు కనపడతాయి. “తండ్రి ప్రేమతో తన కూతురిని దగ్గరకు తీసుకున్నాడు” అనే వాక్యంలో శీర్షికలో ప్రస్తావించిన ప్రేమ యొక్క అర్థం కనపడదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానునుబంధాలు ఉంటాయి. అక్కడ వాడబడే ప్రేమకూ ఇప్పుడు మనం చర్చించే ప్రేమకూ పదం ఒకటే అయినా అర్థాలు వేరుగా కనిపిస్తాయి. అంటే యువతీ యువకుల నడుమ అదీ వారు వేర్వేరు జాతి,  మతాల వారైతే మాత్రమే ఈ పదానికి అర్థం కనిపించేలా అయిపోయింది. ఒకే జాతిలోని వాళ్ళు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే అది ప్రేమ వివాహం క్రిందికి వస్తుందా? అప్పుడు ఈ శీర్షికను మనం చర్చిస్తామా అనేది వాదనకు గురికావలసిన విషయమే. ఇప్పుడు మనం చర్చించే పరిధిలోకి అలాంటి వివాహాలు కూడా వస్తాయా? అనేది కూడా మనం ఆలోచించుకోవాలి.

సరే. ఇప్పుడు ‘ప్రేమ’ వివాహాల చర్చకు వద్దాం. ఇలా ప్రేమలలో పడిన యువతీ యువకులు, అలాగే ప్రేమల్లో పడి పెళ్ళిచేసుకున్న జంటల వాదనలేమిటంటే “పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ ఎలా ఉంటుంది” అని. ఎందుకు ఉండకూడదు అని వారికి అనిపించదు. ఆ వయసు అలాంటిది. దుడుకు వయసు. తాము తీసుకున్న నిర్ణయాలకు ఒక వాదన కల్పించుకుని, దాన్నే నమ్ముకుంటూ ఇతరులను ప్రశ్నిస్తుంది.  కానీ, వాస్తవం అది కాదు.

పెద్దల అనుభవానికి పెద్ద పీటవేస్తూ, వారు తమ మంచినే ఆలోచిస్తారని నమ్మిన వాళ్ళు పెద్దలు కుదిర్చిన పెళ్ళిని అంగీకరిస్తారు. అంటే అలా పీటల పైన కూర్చున్న వారి మనస్సులో ఇంకో స్త్రీ/పురుషుల పట్ల ప్రేమ అన్నది అసలు కలగలేదా అన్నది ఆ మనిషికి తప్ప ఎవ్వరికీ తెలియనిదిగానే ఉండిపోతుంది. కొంతమంది తమ స్కూలు/కాలేజీ జీవితాల్లో తాము చవిచూసిన మొదటి ప్రేమ మధుర క్షణాలని అదో చిన్న పిల్లల ఆకర్షణ అనుకుని తమ పెద్దల పట్ల అభిమానం/గౌరవం వల్ల మరచిపోతారు. అది వారికి ప్రేమ పట్ల ఉన్న దృక్పథాన్ని చాటుతుంది. మరికొందరు దాన్నికొనసాగించి మజిలీ చేరుస్తారు. అంటే మన సమాజంలో ఈ మజిలీని పెళ్ళి అనుకుందాం. మరికొందరు దురదృష్టవంతులు భగ్నప్రేమికులుగా మారి ప్ర్రపంచాన్ని ద్వేషిస్తూ బ్రతుకుతారు, లేదా చచ్చిపోతారు.

పైన చెప్పిన రెండో తెగ వాళ్ళు, అంటే పెళ్ళి చేసుకునేవాళ్ళు, ప్రేమ తరుఫున వాదించే లాయర్లు. వీరి వాదనను నేను ముందే వినిపించాను. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ ఎలా ఉంటుంది అని. అంతకంటే పెడసరంగా “ఉండదు” అని కూడా డిక్లేర్ చేసేస్తారు వీళ్ళు. దీని గురించిన ఒక చిన్న జోక్. ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో “ఏమీ తెలియకుండా ఎలా పెళ్ళి చేసుకుంటారే ఇలా పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో?” ఇంకో అమ్మాయి “ప్రేమించేటప్పుడు అతని గురించి అన్నీ తెలిసాక ఎలా పెళ్ళి చేసుకుంటారే ఈ ప్రేమ వివాహాలు?” రెండు విధానాలలోనూ లొసుగులున్నాయి. ఒక వ్యవస్థ అన్నాక మంచీ చెడూ ఉంటాయి. దేనినీ సారా సగటుగా మనం తీసివేయలేం.

ప్రేమ వివాహాలు ఎప్పుడూ తలిదండ్రుల గుండెల్లో చిచ్చు పెట్టేవే. కాకపోతే సర్దుకుని పోయే మనస్తత్వం ఉన్న తలిదండ్రులు ప్రేమను అంగీకరించి పెళ్ళి జరిసిస్తారు. ఇందులో తమ పిల్లల భవిష్యత్తు గురించిన దూరదృష్టి మనకు కనిపిస్తుంది. వైరాగ్యం కనిపిస్తుంది. కానీ ఇక్కడ తేటతెల్లంగా కనిపించే విషయం ఏమిటంటే చాలా మటుకు ఇలాంటి వాళ్ళంతా మధ్య తరగతి కుటుంబీకులే. వీళ్ళకు సమాజంలో అంత పెద్ద స్థానమానాలు ఉండవు.  వీరికంటే ఒక్క మెట్టు పైనున్న తరగతి వారు అంత తొందరగా ఒప్పుకోరు. తమకున్న అన్నిరకాల వనరులతోనూ పిల్లలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. తమ చుట్టూ ఉన్న సమాజంలో తమకున్న పరువు, మర్యాద మంట కలిసిపోతాయని వీరి బాధ. ఇలాంటి కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఒకోసారి ఎంతకైనా తెగించి హింసకు పూనుకుంటారు. సినిమాలలో కనిపించేంత హింస కాకపోయినా మనస్సులు బాధించేంత మాత్రం ఉంటుందని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అలా ఒప్పుకోకుండా ఉన్నప్పుడు పిల్లలు బయటికి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇళ్ళకు తాము వెళ్ళక పోవడం, వారిని తమ ఇంటికి రానివ్వక పోవడం అన్నవి ఒక రకమైన సాత్విక హింస. మొన్న మొన్న జరిగిన రెండు సంఘటనల్లాంటివి పగ తీర్చుకునే ధోరణి అని చెప్పుకోవచ్చు.

ఇలాంటి ప్రేమలలో ఇరువైపుల వాదనలను పరిశీలిద్దాం.

ప్రేమికుల వాదన: మేము పెద్దవాళ్ళమయ్యాం. మాకు ఏది కావాలో మాకు తెలుసు. మా జీవితాలు ఎవరితో గడపాలో, ఎవరితో అయితే బాగుంటుందో మాకు తెలుసు. మీరేదో త్యాగం చేసి మమ్మల్ని పెంచామని చెప్పక్కర్లేదు. దానికి తగిన మా బాల్యపు మధుర క్షణాలు మీకు ఇచ్చాము మేము.  ఫలానా అమ్మాయి/అబ్బాయి నాకు తెలుసు. నన్న బాగా చూసుకుంటాడు/నన్ను చాలా ఇష్ట పడుతుంది, (ఎవరో మీరు తెచ్చిన గొట్టం గాడి ముందు కూర్చుని తాళి కట్టించుకోవడానికి నేనేం పలుపుతాడు కట్టుకున్న పశువునా – ఇది అమ్మాయిలకు మాత్రం వర్తిస్తుంది). సొసైటీ ఛేంజ్ అవుతోంది, మీరు కూడా మారాలి. ఎన్ని రోజులు మీరు మీ ఇష్టాలను మా నెత్తి మీద రుద్దుతారు. అమెరికా, ఐరోపా దేశాల వాళ్ళని చూడండి వాళ్ళు తమకు కావలసిన వాళ్ళని తామే డేటింగుల తర్వాత ఎన్నుకుంటారు ఇవన్నీ.

పెద్దవారి వాదన: మీరెంత పెద్దవారైనా మీకేం కావాలో మీకు ఇంకా తెలీదు. మేమంతా ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళమే కదా మాలో ఏం తక్కువయ్యింది ?  మన కుటుంబం పరువు, మర్యాద ఏం కావాలి?

నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగగలం? బంధువులకు ఏం చెప్పుకోవాలి? నీ చెల్లెలికి ఎలా పెళ్ళవుతుంది? మీ బాగోగులు మాకు తెలియవా? మేము మీకు శతృవులా? మేము మా సౌఖ్యాలు త్యాగం చేసి పెంచామో తెలుసా?

రెండు తరఫుల వాదనలలోనూ నిజాంశాలు లేక పోలేదు.

20 వ శతాబ్దపు చివరి రోజుల్లో ప్రపంచంలోని అన్నిదేశాల మాదిరిగానే మన దేశంలోనూ క్రమంగా పెరిగి పెనుభూతమైన సాఫ్ట్‌వేర్ బూమ్ మన సమాజ పద్ధతులను తారుమారు చేసింది. ఆడపిల్లలకు మంచి ఉద్యోగాలు రాసాగాయి. చేతినిండా జీతాలు రాసాగాయి. ఉద్యోగాలకోసం సిటీలకు వెళ్ళడం జరిగింది. అంత వరకూ ఎవరో బంధువుల ఇళ్ళల్లో ఉంటున్న ఆడపిల్లలు పేయింగ్ గెస్ట్‌లుగా స్వతంత్రంగా ఉండడం జరిగింది. దాంతో ఇతర రాష్ట్రాల అబ్బాయిలతో కలవడం ప్రారంభమయ్యింది. దాంతో పాటు ఇంటర్నెట్ ఒకటి బాగా చేరువయ్యి, ఇతర దేశాలలోని ఆచారాలు, వ్యవహారాలు ఇక్కడి వారికి కూడా తెలిసి వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే సమాజ వ్యవస్థ, ఏళ్ళ తరబడి వచ్చిన సమాజ విలువలు అన్నీ ఛాలెంజ్ చేయబడ్డాయి. అప్పట్నుంచీ ప్రారంభమైన ఈ ప్రేమ వెల్లువ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహ వ్యవస్థను, అందులోని ప్రేమను ప్రశ్నించే దాకా వచ్చింది.

ఇక్కడ మనం అబ్బాయిల సామాజిక స్థానం గురించి కూడా ఆలోచిద్దాం. అమ్మాయిల గురించి పైన చెప్పిన మార్పులు అబ్బాయిలకు కూడా  వర్తించినా మన పితృస్వామ్య వ్యవస్థలో మగవాడి మాట చెల్లడం వలన వారి పరిస్థితులు ఎక్కువగా మారలేదు.

ఇలా మారిన దృక్పథానికి తోడుగా మన సినిమాలు కూడా టీనేజ్ లవ్‌ని ప్రోత్సహిస్తూ సందేశాలిచ్చాయి. దాంతో యువత అంతా ఒక రకమైన రెబెల్ మనస్తత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. తలిదండ్రుల మాటలను వినడం మానేసింది. అమ్మ వండిపెట్టడానికి, నాన్న ఏటిఎమ్ మాత్రం అనే ధోరణి ప్రబలిపోయింది.  ఫేస్‌బుక్, వాట్సప్‌లు వాడుక లోనికి వచ్చాక అయితే యువత తమ తమ లోకాల్లోకి వెళ్ళడం నేర్చుకున్నారు. ఆ మాధ్యమాల్లో ఉన్న తమ స్నేహితులు, ప్రేమికులే వాళ్ళకి లోకం. అలా ఉన్న యువతకు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ ఉండదు అని అనిపించడంలో ఆశ్చర్యమేమీ కాదు.

అసలు ప్రేమ అనేది అనిపించేది ఒక గుర్తింపులో మాత్రమే. ఒక అమ్మాయి ఏ అబ్బాయి అయినా తన పట్ల శ్రద్ధ చూపిస్తే దాన్నే ప్రేమ అని అనువదించుకుంటుంది. ఆ అబ్బాయి తన ప్రేమించిన వాడు కావచ్చు లేదా తన తండ్రి తీసుకువచ్చిన అబ్బాయి కావచ్చు. అలాగే తన పెద్దలు కుదిర్చిన అమ్మాయి కనబరిచే అనురాగం అబ్బాయిని ఆమె పట్ల ప్రేమలో పడేస్తుంది. పెళ్ళయ్యాక కూడ మొదటి రోజునుండి ఆ అబ్బాయి తన పట్ల శ్రద్ధ కనబరిస్తే అదే అతడి మీది ప్రేమకు దారితీస్తుంది. ఈ భావన ప్రేమించిన జంటల్లోనూ ఇలాగే ఉంటుంది. మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ప్రేమ ఉండదని ఎలా అంటారు చెప్పండి.

ఇక మన దేశంలో ప్రేమ వివాహల శాతం చూస్తే 18 మాత్రమే ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకునే ఆడపిల్లల శాతం 82 శాతం. అంటే దీనర్థం ఇప్పటికీ మన దేశపు ఆడపిల్లలు తమ తలిదండ్రులు తమ పట్ల చూపించే భద్రతా భావానికే ఓటేస్తున్నారని అర్థమవుతుంది. పెళ్ళయ్యాక తనకు దొరికిన మనిషి పట్ల ప్రేమ పెంచుకోవచ్చు అనే దృక్కోణాన్ని చాలా మంది నమ్ముతున్నారు. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో అబ్బాయిలు తమ ఇంటి గౌరవానికి, పరువుకు, హోదాకు ప్రాముఖ్యతనిస్తే అమ్మాయిలు తమ భవిష్యత్తు, భద్రతను చూస్తారు. ఇరువర్గాలూ తమ తమ తలిదండ్రులు ఈ విషయాలను గమనించే తమకు కాబోయే జీవిత భాగస్వామిని నిర్ణయిస్తారు అనే భరోసా కలిగి ఉన్నారు.

విడాకుల శాతం కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చాల తక్కువ కనిపిస్తుంది. విడాకులకు వెళ్ళే ముందు తమ ఇంటివారికి సమాజంలో కలిగే తలవంపులు గుర్తుకు తెచ్చుకుని మానుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు కుదిర్చిన వివాహాలలో ప్రేమతో పాటే ఈ కారణాలు కూడ ఒక వివాహ వ్యవస్థకు స్తంభాల్లా నిలబడతాయి.

ప్రేమ వివాహాలు చాలా కాలం నిలబడవు అనేది తలిదండ్రుల వైపు నుండి తరుచుగా వినిపించే మాట. చాలా వరకు అది వారు సమాజంలో చూసిన ప్రేమ వివాహాల జంటలలో కనిపించిన భ్రమలను చూసి అనుకోవచ్చు. ఇలా అవుతోంది అని వారి పిల్లలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు వారా ప్రేమ మత్తులో మునిగి ఉండి, అలా మాదెందుకు అవుతుంది అనే వాదనను వినిపిస్తారు. అది అలా అవుతుందా లేదా అన్నది వారు వివాహం చేసుకున్నాకే అర్థం అవుతుంది.

ఏది ఏమైనా ప్రేమించే పిల్లలు కానీ, వారి తలిదండ్రులు కానీ తెలుసుకుని అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

౧. పిల్లలు తలిదండ్రులపై భరోసా కలిగి ఉండాలి. వారు తమ కోసం మంచి జీవిత భాగస్వామిని వెతుకుతారు అని నమ్మాలి. తమ స్నేహితులను చూసి ప్రేమించడం తప్పు.

౨. తలిదండ్రులు కూడ ఒకవేళ తమ పిల్లలు ప్రేమించాము అని చెబితే, కుల గౌరవం, పరువు,మర్యాద లాంటి మాటలు చెప్పకుండా వారు ఎన్నుకున్న వారిని పరిశీలించి అంతా సరే ననిపిస్తే ఒప్పుకోవాలి. వారిద్దరే కలిసి నడవాల్సినవారు కదా !

౩. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఒక నియంతృత్వ ధోరణి. అందులో ప్రేమ ఉండదు అనే సిద్దాంతాలను పిల్లలు వదిలేయాలి.

౪. ప్రేమ వివాహాలు ఒక పెద్ద ఫెయిల్యూర్. అలా చేసుకున్నవాళ్ళు మూర్ఖులు అనే వాదనను పెద్దలు మరచిపోవాలి.

ఇరువైపుల నుండి ముందుతరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎవరికీ హాని కలగకుండా/చేయకుండా వివాహాలు చేయాలి. మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. పట్టుబట్టకూడదు. పట్టు విడుపులు పాటించాలి. భారతీయ సంస్కృతిలో విచ్ఛేదన, విడాకులు అన్నవి సాధ్యమైనంత వరకూ తగ్గించాలి.

Exit mobile version