పెద్దలుసురుమన్న….

0
3

[dropcap]క[/dropcap]లిసి వచ్చువేళ ఘనులౌదురల్పులు అన్నాడు తత్త్వవేత్త! కానీ, కల్సి రావడానికి ముందుగా కొంత కృషి గూడా వుండాలిగదా!  ఎంతో కొంత ప్రజ్ఞాపాటవాలు లేందే మిగిలిన వాళ్ళకన్నాముందు పరుగెత్తలేడుగదా! తపము చేత ద్విజుడు, తర్కింపకులమెట్లు అని కూడా అన్నాడు తత్త్వవేత్త. మన దేశంలో అన్ని రంగాల కన్నా మిన్న అయినది రాజకీయ రంగమే కదా! అన్ని అంగాలకన్నా మిన్నయైన శిరస్సులాంటిది రాజకీయరంగం. ఆ రంగంలో తలకాయ వుంటే చాలు, మహర్లింగాలు తేలుతాయి. జీనోం – ప్రతిసృష్టి చేయగల తలకాయలు, విశ్వాంతరాలకు రాకెట్లు నెగుర వేయగల తలకాయలు అన్నీ కూడా బోడిలింగాల కిందే లెఖ్ఖ. రాజకీయాల్లో వుంటే గల్లీ దాదా కూడా నడినెత్తి మీద సూర్యుడే. మిగిలిన సర్వరంగాల నిష్ణాతులు కూడా నిండు పౌర్ణమినాటి నక్షత్రాలే – పరీక్షగా చూస్తే గానీ కన్పించరు. అక్కడక్కడా మినుకు మినుకు మంటూ కన్పిస్తాయి.

మన ‘రావుగారు’ సూర్యులల్లో ఒక సూర్యుడు. మన సౌరమండలపు సూర్యునంతటి పెద్దవాడు కాకపోవచ్చు గానీ, అతడూ ఓ సూర్యుడే. విశ్వంలో ప్రత్యక్షమౌతున్న వెలుగు నిండిన పదార్థాల వెనుక ఎన్ని థియరీలు వుంటాయి గదా ‘బిగ్‍బ్యాంగ్’ థియరీల లాంటివి. మర్రి వృక్షానికి దాని విత్తన పరిమాణామెంత? రావుగారు ఊడలు దిగిన మర్రికి ముందు విత్తిన ఆ చిన్న విత్తనమే ఆ ప్రాంతపు భూమిలో.

అదో నగరం. ఆ నగరం మొదట్లో ఒక పేట. చుట్టూ సహజ వనరులు నిండా వున్నందున అక్కడ పెద్ద పెద్ద కర్మాగారాలు నెలకొల్పబడ్డాయి. ఆ కర్మాగారాలు మన ఉపఖండానికే గాదు, ఆసియా ఖండానికే పెద్దవిగా పేరుగాంచాయి – అప్పట్లో. దాంతో ఆ వూరిపేరు ఓ కర్మాగారం పేరుమీది నగరంగా చెలామణిలోకి వచ్చింది. ఆ వూరి పేరు అబ్రివియేషన్ చెప్పితే చాలు, ఆలిండియాకు అర్థమౌతుంది!

రావుగారి తండ్రి పొట్ట చేత పట్టుకుని, పిల్లల్ని గంపనెత్తుకుని, భార్యతో చుట్టుపట్ల పల్లెల్నుంచి ఆ నగరానికి వచ్చాడు. ఆ కంపెనీలోని వేలమంది కార్మికుల్లో రావుగారి తండ్రి ఓ కార్మికుడు. ఎలాంటి నైపుణ్యాలు లేని కార్మికుడు. రావుగారే మొదటి సంతానం. అందుబాటులో వున్న ప్రాథమిక విధ్యనభ్యసించాడు రావుగారు. ఇంకా పై చదువులు అందుబాటులో వుండి వుంటే, ఏవో గుమస్తా గిరుల్ని అధిరోహించి వుండేవాడేమోగానీ, అవి అందుబాటులో లేని కారణంగానే హిమగిరుల్ని అధిరోహించగలిగాడు అన్పిస్తుంది.

అప్పటి కర్మాగార, కార్మిక చట్టాల ప్రకారం, వయసు వచ్చీరాగానే రావుగారు ఎలాంటి నైపుణ్యంలేని కార్మికుడుగా ఆ కంపెనీలో చేరాడు. నైట్ షిఫ్టులో నిద్ర వచ్చినప్పుడు, తన పనుల్ని, భయంతో నిద్రపట్టని తోటి పిరికి కార్మికులకో, పనిలో నిజాయితీ గలిగిన కార్మికులకో తలాయింత పంచి, అతడు కన్పించకుండా కాగితాల గుట్టల్ని కప్పుకుని నిద్రపోయేవాడు! కంపెనీలు పెద్దవి కాబట్టి కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. రావుగారు కూడా పురుళ్ళు పోస్తున్న అమ్మలక్కల్లో తనూ ఓ పేరున్న వాడయ్యాడు మొదట్లో. తర్వాత తర్వాత కార్మిక సంఘాలకు అంతా తానే అయ్యాడు. కార్మిక సంఘాల ముసలి ‘ఎనగర్ర’లకు చెదలు పట్టగానే రావుగారే తలమానికం అయ్యాడు. పత్తికాయ చిత్రపుటములు పుట్టదా! అప్పుడు రెండు పార్టీలకే కార్మిక అనుబంధ సంఘాలుండేవి – కాంగ్రేస్ పార్టీకి, కమ్యూనిస్టుపార్టీకి. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ, దాని అనుబంధ కార్మిక సంఘాలు మహా అపాయకరమైనవిగా ప్రచారంలో వుండేవి. అప్పట్లో అవి దుష్ర్పచారంలో వుంటే ఆ తర్వాత కాలాల్లో అవి నిజంగానే దిగజారి పోయాయి. అంచేత యింక మిగిలివున్న ఒక్క కాంగ్రేసు అనుబంధ కార్మిక సంఘానిదే ఏకచ్ఛత్రాధిపత్యం.

కార్మిక సంఘ నాయకులు డేగల్లా, గద్దల్లా చాలా దూరపు చూపు చూశారు. కార్మిక సంఘానికి రావుగారు కార్యదర్శి. రాష్ట్రస్థాయి నాయకుడు, రాష్ట్రమంత్రి స్థాయి నాయక అధ్యక్షుడు. రాష్ట్రస్థాయిలో ఆ అధ్యక్షుడికి రావుగారు కుడిభుజం, కానీ, కార్మిక సంఘాలకు మాత్రం అంతా తానే. ముందుచూపుగా, కార్మికుల పిల్లలకు చదువుల్లాంటివేవీ అందుబాటులో వుండడానికి వీల్లేకుండా చూశారు. కార్మిక నాయకులు, యాజమాన్యాలు కలిసి నడిచాయి. ఒక్కటై నడిచాయి.

అంతవరకూ యిస్తున్న యూనిఫారం బట్టల్ని గూడా వద్దన్నారు – ఎవడి గోచీ వాడు పెట్టుకుంటాడు – చిరుగు పాతల్ని కుట్లమీద కుట్లు వేసి తొడుక్కుంటారు అన్నారు. కంపెనీ పనులు చేసేంతటి శక్తి మాత్రం – కేలరీలు పుడితే చాలు కార్మికుల శరీరాల్లో. మెదడు – శరీరాలు అంతకుమించి ఎదుగకుండా కంట్రోలు చేస్తూండాలి! అపోజిషన్ కార్మిక సంఘం నాయకులు అడ్డు తగిలితే, అన్యాయం, అన్యాయం అంటే వాళ్ళ పక్కటెముకల్ని విరగదన్నడానికి మెరికల్లాంటి ‘ఆక్షన్ కాడర్’ తయారుచేసుకున్నారు అధికార సంఘం వాళ్ళు. రావుగారు దాదా కాకపోయినా, మెదడులో దాదాలకు దాదాలాంటి వాడు!

అపోజిషన్ వాడు మనం అనుకునే తంతేనో, లేక తంతే అనుకోకుండానే చస్తేనో భయపడాల్సిందేమీ లేదు. వెనుక మేమున్నాం, కంపెనీ వుంది, పోలీసులున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేయాల్సిన ఆగత్యం ఏమీలేదు! నేరం మీరు చేశారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో శిక్షను అనుభవించాల్సిందే! చేయించిన మా పేర్లు మట్టుకు పొక్కగూడదు – కోర్టుల్లో! నేరాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోండి. జైలు కెడితే పెళ్ళాం, పిల్లల గతేంటని బెంగపడాల్సిందేమీ లేదు! మీ కుటుంబాల బరువు బాధ్యతల్ని మా భుజస్కందాలకెత్తుకుంటాం! మీ భార్యలకు మీరు లేని లోటు వుండదు! మీ శిక్ష యావజ్జీవమైనా ఏంగాక, మీ భార్యలకు మీరు లేని ఏ లోటూ లేనప్పుడు మీరు జైల్లో వుంటే ఏమిటి, యింట్లో వుంటే ఏమిటి! పనికిరాని మగడు మంచెమీద వుంటే ఏమిటి, మంచం మీద వుంటే ఏమిటి! యూనియన్ కొఱకు త్యాగాలు చేయాల్సిందే. స్వాతంత్ర్యం కొఱకు ఎంతెంతటి త్యాగాలు చేశారు! వాటితో పోల్చినప్పుడు మీరు చేసే త్యాగాలు ఏ పాటివి! ప్రాణాలేంపోవు, జైల్లో వయసు వుడిగిపోతుంది తప్పితే! మీ వెనుక మా ప్రయత్నాలు ప్రతీక్షణం వుంటాయి. ‘ఫికరు’ చేయవద్దు. ‘బేఫికరు’గా వుండడి! మీ ధర్మం మీరు నిర్వర్తించండి, మిగిలిన విషయాల్ని కృష్ణ పరమాత్మ మెడలమీద మోపండి. మేం తప్పనా అతడు మిమ్మల్ని కాపాడక తప్పు చేస్తాడా?” రావుగారి హితబోధ తన ఆక్టివ్ క్యాడర్‍కు!

ఆక్టివ్ క్యాడరు జైల్లో మగ్గుతూంటే, దిక్కులేని వాళ్ళ భార్యలను రావుగారు, అతని అనుచరులు అనుభవించిన సందర్భాలు లేకపోలేదు! పగలు సుఖము కొరకు బహు ధనార్జన చింత, రాత్రి రమణితోడ రతుల చింత అన్నట్టుగా సాగేది వాళ్ళ కాలం. భర్త జైలు నుండి విడివడి వచ్చాక ఆ భార్య నిప్పంటించుకుని అసువులు తీసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు.

రావుగారు తన కార్యపరిధిని  పెంచుకున్నాడు. కార్మిక సంఘం ఆధారంగా ప్రజాజీవన రంగంలోని అడుగిడినాడు. మినిస్టరు అండతో పంచాయితి సమితి ప్రెసిడెంటు అయ్యాడు. ఆ తర్వాత తర్వాత జిల్లాపరిషత్తు ఛైర్మన్ అయ్యాడు! రావుగారు జిల్లా స్థాయిలో పార్టీలో ఒకడుగాదు, పార్టీయే అతడు. మంత్రికి అతడే అండ – మంత్రి అతనికి ఆధారం ఏమీకాదు. రావుగారి ఆధారంతోనే మంత్రి ఆ స్థాయికి ఎదిగాడు తప్ప, రావుగారు మాత్రం తన స్వయం ప్రతిభతోనే ఆ స్థాయికి ఎదుగ గలిగాడు.

విశ్వం మారుతూంటుంది. కాలం మారుతూంటుంది.

రావుగారు రాజనీతి శాస్త్రంలో, ‘లోకం పోకడ’ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పుచ్చుకున్నాడు. పోస్టు డాక్టరేట్ అయ్యాడు. తన ప్రత్యర్థి ఓ పెద్ద అండజూసుకుని తనకు వ్యతిరేకంగా, ఓ వివాదంలో వున్న స్థలంలో భవంతి లేపుతూ వుంటే అతన్ని పల్లెత్తుమాట అనడు, చూసి కూడా వూరుకుంటాడు. అతడి భవంతి పునాది రాళ్ళను పెకిలించి వేయడు. గృపప్రవేశం రోజునాడు మాత్రం ఆ భవనాన్ని బుల్ డోజర్లతో, ప్రోక్లెయిన్‍లతో కూలగొట్టిస్తాడు! మొదట్లోనే, పునాది రాళ్ళను పెకిలింపజేస్తే, ప్రత్యర్థికి జరిగే నష్టం ఏపాటిది? ఆ రాళ్ళను నిక్షేపంగా మరో దగ్గర వాడుకుంటాడు. రంగురంగుల అంతస్తుల భవనాన్ని చూసుకోవాలి గానీ! ఓ చెంప వాయించి వదిలేస్తే ఏమొస్తుంది? నీళ్ళడక్కుండా కొట్టాలిగానీ! ఆది నిష్ఠూరంలో ఏమంత ఏడుపు దాక్కుని వుంటుంది? రావుగారు అతడి బలం మీద దాడి చేయడు, బలహీనతల మీద సూటి పెడతాడు!

కాలం మారుతుంటూంది. అణుయుగం, అంతరిక్షయుగం, జీనోయుగం, అంతర్జాలయుగం….

తాడిని తన్నేవాడుంటే, తలదన్నే వాడుంటాడు. ఎదురేలేదనిపించుకున్న నాయకుల్ని కూడా తెరవెనక్కు సాగనంపే శక్తులు బలం పుంజుకుంటుంటాయి, ఎదుగుతూంటాయి. జిల్లాలో ఎదురులేని నాయకుడిగా సాగుతూన్న రావుగారు ఎదురు దెబ్బల్తో తిరిగి లేవకుండా పడిపోయాడు. రాజకీయ సమీకరణాలు తారుమారైనాయి. ఎలక్షన్లలో గెల్చి, మంత్రినౌతాననుకున్న వాడల్లా, ఎలక్షను ఓడిపోయాడు. పడిపోయిన వాడికి వెన్నుపోట్లు. తన కాండం ఆధారంతో పాక్కుపోయిన తీగలు వృక్షాన్నే కమ్ముకుపోయి వృక్షాన్నే ఎండగొట్టాయి. పుట్టిన గడ్డలోని బలమైన రాజుని, ఆవలినుండి దండెత్తి వచ్చిన రాజులు దెబ్బకొట్టినట్లు జరిగింది. జిల్లా పరిషత్తు భవనం మీద జండాలు ఎగురవేసినవాడు – మారిన రాజకీయాల మూలంగా పోలీసుల లాఠీదెబ్బలు స్వీకరించాడు. బేడీలు వేయబడ్డ చేతుల్తో వూరేగింప బడ్డాడు. అవమానం ఆవేదన… అణిగి వున్న జబ్బులు వుబికి వచ్చాయి. తిరిగి కోలుకోలేదు. ఊడలు దిగిన మర్రి ప్రత్యర్ధుల విషపు టెరువుల్తో నిండా ఎండిపోయింది.

రావుగారు రాజకీయ పునాదుల మీదనే లేచాడు గానీ, సామాజిక ఆధారాల వేపు చూపు సారింపలేదు. ఆప్తుల్ని దూరంగా నెట్టాడు. తాను కావిలించుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. ‘ఓపెన్ టు ఆల్’ ఫంక్షన్లలో అప్తులు, బంధువులు ఆరుబయట, బయటి వాళ్ళంతా నట్టింట. కొలనులింకెనేని కొంగలందుండునా అన్నట్లైంది. అతడు అక్కరకు రానిచుట్టం. అతడి అవసరానికి వచ్చే బంధుమిత్రులు లేకుండా పోయారు. అతడు కావాలనే ఆప్తులను, బంధువులను ఎదుగనీయలేదు. అతనిచేత ఎదుగబడిన వాళ్ళు గోడమీది పిల్లులు. ఆటమైతే అటు, జోపుడైతే యిటు… బంజరు భూముల్లో ఎక్కడోగానీ వెలిసే మహావృక్షం పిడుగుపాటుతో కూలిపోయింది. అతని ఆస్తుల్ని అందిన వాళ్ళంతా చిక్కించుకున్నారు. అతని అద్దెవాళ్లు తామే స్వంతదార్లమని కేసులు వేశారు. కేసులు, కోర్టులు… ఖర్చులు…

జిల్లా ప్రథమ పౌరుడి కూతుళ్ళు తమ భర్తలకు విడాకులిచ్చి తమకు నచ్చిన వాళ్ళతో, అతి సామాన్యులతో వెళ్ళిపోయారు. నడిమింటి సూర్యుడు క్రమంగా అస్తమిస్తాడు గానీ, రావుగారు మాత్రం అకస్మాత్తుగా, నక్షత్రంలా రాలిపోయాడు – అకాలంలోనే అస్తమించాడు – రాజకీయ చతురతలు నిండిన తల, పరభామాకామ కలపాలు సల్పిన తనువు ఆవేదనా భరితంతోనే అంతమైంది… పెద్దలుసురుమన్న పెనుమంటలెగయవా? సజ్జనుండు తిట్ట శాపంబదేనయా అన్నట్లు – కార్మికలోకం వుసూరుమంటోంది రావుగారు వేసిన కార్మిక సంఘపు పునాదుల కారణంగా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here