Site icon Sanchika

శివతత్త్వమూ సమాజ హితమూ వెరసి గండ్ర వారి ‘పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా!’

[డా. గండ్ర లక్ష్మణరావు గారి ‘పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా!’ అనే పద్య శతకాన్ని సమీక్షిస్తున్నారు దామెర రాజేశ్.]

శ్రీరాజరాజేశ్వరా! అనే ఈ  శతకం తమ స్వగ్రామంలోని శివుని గురించి తన  అభిమానాన్ని చూపుతూ ‘పెగడపల్లి, రాజరాజేశ్వర స్వామి రక్ష మనకు!’  అని మకుటాన్ని పెట్టి రాశారు డా. గండ్ర లక్ష్మణ రావు ప్రముఖ పద్యకవి.  డా. గండ్ర లక్ష్మణరావు వేయేండ్ల శతక సాహిత్యంలో మొదటి సారి ఆద్యమకుటంతో ‘నీవు’ శతకం ద్వారా పండితలోకాన్ని మెప్పించారు.

తమ స్వగ్రామం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాతిక సంవత్సరాల క్రితం నాగటికి తాకి వెలువడిన శివలింగాన్ని అక్కడి ప్రజలు ప్రతిష్ఠించుకొని ఆలయాన్ని నిర్మించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ఊరితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల వారు ఆరాధిస్తున్నారు. తమ ఊరి శివునికి రాజరాజేశ్వరా అని భక్తులే పేరు పెట్టుకున్నారు. తన ఊరిలో వెలసిన దేవునిపై ఒక శతకం రాయాలని ఈ శతకం రాశారు.

శివుడుకావలెనను కోర్కె చెప్పలేదు/ శివుడురావలెనని మ్రొక్కు చేయలేదు

ప్రేమ తానుగా విచ్చిన పెగడపల్లి/ రాజరాజేశ్వరస్వామి రక్షమనకు..

అని స్వయంగా తానుగా అమాయకులైన పల్లె ప్రజలను కాపాడడం కోసం వెలసినాడని చరిత్రను శివుని కటాక్షాన్ని తెలిపారు.

కట్టుకొనగోర వెప్పుడు పట్టు బట్ట/పెట్టుకొన గోర వెప్పుడు పెద్ద నగలు

పేద దేవుడుగా నిల్చు, పెగడపల్లి/ రాజరాజేశ్వరస్వామి రక్ష మనకు..

అని శివుడు కూడా పేదరికాన్ని అనుభవించే పేదల పక్షపాతి అని శివుని నిరాడంబర తత్వాన్ని తెలిపారు. ఇట్లా ఈ శతకంలో శివుని రూపము, ఇల్లు, మొదలైన శివుని వర్ణన సాధారణంగాను తాత్వికంగాను ఉండే విధంగా రాశారు.

సగము పార్వతి మాతయు సగము తాను/సాంబశివుడను పిలుపుకు సాక్ష్యమిదియె

ప్రేమ రూపమ్ము నిత్యమ్ము, పెగడపల్లి..

అనే పద్యంలో అర్ధనారీశ్వర తత్వాన్ని అతని ప్రేమాంతరంగాన్ని సులభమైన పదాలలో వ్యక్తం చేశారు.

శివుడు ధరించిన గజచర్మము, సర్పభూషలు, వర్ణిస్తూ వాటి తత్వాన్ని సామాన్యులకు కూడా అర్థమయే పదాలలో పద్యాలుండడం విశేషం. గరళాన్ని మ్రింగటం,రాక్షసులకు వరాలిచ్చి చిక్కులలో పడటం, తిన్నని భక్తి, శ్రీకాళహస్తి పూజలు మొదలైనటు వంటి పురాణకథా విశేషాలెన్నో పద్యాలలో ఒదిగించారు.

ఎంత యైశ్వర్య వంతుడో యీశ్వరుండు/ఎంత శక్తి సంపన్నుడో ఎన్నలేము

భిక్షగాడుగ గడిపెడు;..

అని శివుడు సర్వేశ్వరుడే అయినా తాను తన భిక్షాటననే చేపట్టాడు. భార్యాబిడ్డలు సంపాదించే వారయినా, అధికారులయినా ఎంతటి వారయినా తాను తన ధర్మాన్నే పాటిస్తాడు శివుడు. అది మనందరికీ ఆదర్శ వ్యక్తిత్వాన్ని చూపడమేని కొన్ని పద్యాలలో స్పష్టం చేసి ఈనాటి పాఠకులకు కేవలం భక్తిని మాత్రమే కాదు ధర్మాన్ని నిలబెట్టే ఒక సందేశాన్నికూడా కవి అందించారు.

వెల్గులందున నీవొక పెద్ద వెల్గు, సత్య సుందర రూపమ్ము సద్గుణుండు, బ్రహ్మయును పల్కజాలడు భర్గు మహిమ వంటి శివతత్వ సారాన్ని చిన్న పాదాలలో పెద్దగా చెప్పారు.

భక్తుల పక్షాన శివుని గురించి ఏమనుకుంటున్నారనే భావాలను కూడా కవి ఆవిష్కరించారు.

కొడుకు పుట్టిన నీకొక్క కోడె గట్టి, మ్రొక్కు చెల్లించుకొందుము ముదము తోడ.. అని కోడెనఉరి కట్టి వేసే ఆచారం వేములవాడలో ఉన్నది, ఈ ఆలయంలో కూడా పాటిస్తున్నారు. నీవులేని చోటు లేదు అయినా నీవెక్కడా కనిపించవు మా మీద దయతో నీ అంతట నీవే వచ్చినావు.. అని చక్కదిద్దని వెంట్రుకల్‌జడలుకట్టటం ఎందుకంటే జగతి దిద్దెడు సామికి సమయమేది? అని భక్తులు ఆలోచిస్తున్నట్లుగా తమ భక్తిని చాటుకోవడం ప్రత్యేకం. తనవారా, పగవారా అనే భేదం లేక ఎవరికైనా వరమిచ్చే స్వామి అని స్వపరభేదాలు పాటించని శివుని గుణాన్ని గురించి అనుకోవడం ఒక చింతన.

కాశిలో వలె, కాళహస్తి వలె శ్రీశైలం వలె నీకు మేము గుడికట్టకపోయినా మా భక్తి శక్తి కొలది మేము నిన్ను కాపాడుకుంటామని వేడుకోవడం భక్తి పారవశ్యం.

ఈనాడు పల్లెటూళ్ళలో కూడా ఆధునిక నాగరికత అడుగుపెట్టింది. అయినా శివుని గుడి వలన పిల్లలు పెద్దలు కొన్ని నియమాలు పాటించడానికి అలవాటుపడ్డారు. ప్రతి దినము గుడికి వెళ్ళడం దర్శించుకోవడంతో పాటు విభూతి ధరించడం అదొక ఆనందంగా గర్వంగా ఆత్మవిశ్వాస సూచకంగా భావించడం క్రమ క్రమంగా పెరిగింది. ఊరి ప్రజలను దేశాన్ని సమాజాన్ని చక్కగా చూడాలనే ఆకాంక్ష వారిలో పెరిగి శివుని వేడుకోవడం ప్రజలలో సామాజిక చింతన కలగడం ఒక ధార్మిక వికాసానికి ప్రేరణఅయింది. అత్యంత ఆర్తి, హృదయార్ద్రత శతక పద్యాలు చదువరులను కదిలిస్తాయి.

నిజము పలికెడు వారలు నిందపడిరి/కల్లలాడెడు వారికే ఖ్యాతి వచ్చె.. వంటి నేటి సమాజంలోని తీరుతెన్నులను భక్తులు ప్రజలు శివునికి నివేదించుకున్నట్లుగా తెలుపడం కవి తాను చెప్పడం కాక ప్రజలు భక్తుల ద్వారానే కోరడం ప్రజలలో ఆలోచన కలిగించడము, ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి కనిపిస్తాయి.

అట్లే శివరాత్రి మొదలైన ఉత్సవాలు ఎంత వైభవంగా ప్రజలు పాల్గొని జరుపుకుంటారు. శివదీక్షలు ఊరిలో వందలాది శివదీక్షలు పాటించడం, మద్యమాంసాలు తగ్గించడం నీతిగా నిజాయితీ ఉండడానికి ప్రయత్నించడం శివుడు చూస్తున్నాడనే భయం, భక్తి పెరగడం గుడి కారణంగా ఊరు తీరు మారడం కూడా ఈ శతక పద్యాలలో చిత్రించారు.

శివతత్వము, పల్లె ప్రజల భక్తి, వర్ధమాన సామాజిక చిత్రణ, ఆలయ ఉత్సవాలు అని పలు అంశాలుగా ఈ శతకాన్ని విశ్లేషించవచ్చును.

తేటగీతిలో రెండు పాదాల తరువాత మూడవ పాదం చివరి రెండు గణాలు ‘పెగడపల్లి’ అని తరువాతి పాదం రాజరాజేశ్వరస్వామి రక్ష మనకు అని ఉండడం వలన కవి చెప్పదలచుకున్న భావానికి రెండున్నర పాదాలు మాత్రమే మిగిలాయి. వేమన మూడు పాదాలలో చెప్పాడు. ఈ కవి రెండున్నర పాదాలలో కూడా చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పారు. ముక్తకాలుగా ముక్తసరిగా నడిచాయి. పద్యాల పాదాలు కూడా వేటికవి విరిగి పోయి మంచి నడక లయ ఏర్పడింది. శతకంలోని భాష సామాన్యుల భాష. విషయం బరువైనదైనా తేలికైన మాటలలో చెప్పడం లక్ష్మణరావుగారి ప్రత్యేకత. పెదవి దాటని అధికారి, విగత కాముని బ్రతికించె, వేడి చలువలు తానైన, వెండి కైలాసమేమాయె, సుగతి విద్యల పంచిన.. వంటి అరపాదాల ముగింపులు పద్య భావాన్ని పూల పొట్లం విప్పిన వాసనలాగా భావపరీమళం గుప్పుమంటుంది.

అర్ధనారీశ్వరుడైన శివుని గురించి రాసిన శతకం కనుక కవి గండ్ర లక్ష్మణ రావు అర్థాంగి విజయను గురించి పాడుకునే పాటను కూడా ఈ శతకం చివర పొందపరచడం వారి నిండు హృదయానికి నిదర్శనం. శివుని గురించి మేలుకొలుపు, తాండవం, తపస్సు, కల్యాణం పేరుతో చివరన ఐదు లయబద్ధమైన పాటలు రాశారు. ఇవి గాయనీ గాయకుల చేత పాడించి ఆలయంలో ఉత్సవాల సందర్భంలో వినిపిస్తున్నారని చెప్పారు.

ఈ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ముందుమాట రాశారు. “శివుడువచ్చి లక్ష్మణరావు గుండెలో వచ్చి కూర్చున్నాడు, ఇదిగో ఈ శతకం రెండు రోజుల్లో రాయించుకున్నాడు” అని ప్రశంసించారు.

రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్‌గారి నియోజక వర్గం పరిధిలో ఉన్న శివాలయం కనుక వారు కూడా లక్ష్మణరావుగారిని అభినందిస్తూ సందేశం అందించారు. ఆ శివుడు అందరకీ మేలు చేయాలని కోరారు.

ఈ శతకంలో లక్ష్మణరావుగారు శివుడు భూమిలోనుండి వెలువడిన నాటినుండి ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠ, నిత్యపూజాదికాలు చేయించిన సాధు ప్రవర్తనగల తన చిన్ననాటి స్నేహితుడైన ఆ ఊరి రైతు కాటం పోతిరెడ్డిని గురించి స్మృతి వాక్యాలు, గ్రామ పురోహితులైన గుండి కిష్టయ్యగారిని ఆలయం కట్టిన స్థలదాతలు కాసుగంటి వారిని అందులో పేర్కొనడం లక్ష్మణరావుగారికి వారి ఊరిపైనా ఊరిప్రజలపైనా తన చిన్ననాటి స్నేహితులపైనా ఉన్న ప్రేమ గౌరవం అభిమానం స్పష్టమవుతుంది.

అచ్చమైన పల్లె జనుల దైవంగా శ్రీరాజరాజేశ్వరుడు ఈ శతకంలో వ్యక్తమవుతున్న పరమేశ్వరుడు.

ఈ శతకాన్ని తెలుగు చదువవచ్చిన వారికందరికీ అర్థమవుతుందనడానికి వారి ఊరి ప్రక్క రంగధాముల పల్లె లోని పాఠశాల విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయుడు చెపితే చదివి అందులో వారికి నచ్చిన పద్యాల గురించి కవికి ఉత్తరాల ద్వారా తమ ఆనందాన్ని తెలియజేయడమే సాక్ష్యం.

అసామాన్య తాత్విక చింతన సామాజిక నిర్మాణం ప్రాతిపదికలుగా సాగిన సామాన్య పాఠకుల కోసం ఈ శతకం అయినా, పండితులకూ ఆదరణీయమే అవుతుంది.

***

పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా! (శతకం)
రచన: డా. గండ్ర లక్ష్మణరావు
ప్రచురణ: సంవేద్య ప్రచురణలు
పేజీలు: xi+39
వెల: ₹ 20/-
ప్రతులకు:
శ్రీమతి గండ్ర విజయ
10-3-537,
వివేకానందపురి,
కరీంనగర్ 505001
ఫోన్: 9849328036

Exit mobile version