Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-110: పెళ్ళంటే ఇదా!..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య మాకు బాగా కావల్సిన వాళ్ళింట్లో పెళ్ళైతే వెళ్ళేను. వెళ్ళినదాన్ని నా కళ్ళని నేనే నమ్మలేకపోయేను. ఎందుకంటే స్టేజి మీద పెళ్ళికొడుకు వీల్ చైర్‌లో ఉన్నాడు. ఇదేంటి! ఇంత అందమైన చదువూ, ఉద్యోగం, తెలివితేటలూ, చురుకుతనం అన్నీ ఉన్న అమ్మాయిని ఇలాంటి అవిటివాడి కిచ్చి చేస్తున్నారేవిటని హాశ్చర్యపడిపోయేను.

“పెళ్ళికొడుకు మీ కజినే కదా! ఓ వారంలో లేచి నడవగలుగుతాడాండీ!”

నా పక్కన కూర్చున్న వారెవరో అటు పక్కవారి నడిగేరు.

అంటే ఇది మధ్యలో వచ్చిందేనన్నమాట. అవిటివాడు కాదన్న మాట. నేను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.

“లేచి నిలబడ్డానికే ఓ రెణ్ణెల్లు పడుతుందన్నార్ట డాక్టర్లు..” తనకు తెలిసిన సమాచారం చెప్పేడు ఆ పక్కాయన.

“అసలేమైందండీ!” పక్కాయన ప్రశ్నకి వచ్చే సమాధానం కోసం నేనూ చెవులు రిక్కించేను.

పక్కాయన పెద్దగా నిట్టూర్చి “అదో పెద్ద కథ..” అన్నాడు.

“పరవాలేదు చెప్పండి. భోజనానికి ఇంకా టైముంది..” అంటూ నేనూ వాళ్ళ మాటల్లో కలిపించుకుని వినడానికి ఆసక్తి చూపించేను.

“అయితే వినండి. నా పేరు ప్రవీణ్. ఆ పెళ్ళికొడుకు మా మేనమావ కొడుకే.. ఉదయ్.. జరిగిందంతా కథలా చెప్తాను.. ఫాలో అయిపొండి..” అంటూ మొదలెట్టేడు.

ఆ ప్రవీణ్ కథ వింటున్నంతసేపూ నా కళ్ళముందు ఆ దృశ్యాలు సినిమారీళ్ళలా తిరగడం మొదలెట్టేయి.

***

“ఇదేంట్రా బావా నీ పెళ్ళికి నువ్వే ఇంత లేట్‌గా వచ్చేవ్!” గుమ్మంలోనే నిలదీసేడు ప్రవీణ్ ఉదయ్‌ని.

“లేటేంటీ! పెళ్ళికింకా వారం టైముంది కదా.. ఆ తర్వాత ఇంకో వారం ఉంటాను. మొత్తం టూ వీక్స్ లీవ్ తీసుకున్నాను.”

“శృతి నీకేం చెప్పలేదా! అదే పెళ్ళికి ముందే కొన్ని ప్రోగ్రాములూ గట్రా ఉంటాయని..”

“ఆ మాత్రం శృతి చెప్పడం ఎందుకూ! నాకే తెల్సు.. ఏదో షాపింగ్ లవీ ఉంటాయని. అందుకే కదా వారం ముందొచ్చింది.”

ఉదయ్ మాటలకి ప్రవీణ్ నవ్వేస్తూ, “ఐతే నువ్వింకా ఆప్డేట్ కాలేదన్నమాట” అన్నాడు.

ఇంతలో ఉదయ్ మొబైల్‌లో శృతి నుంచి కాల్ వచ్చింది. వెంటనే తీసేడు ఉదయ్..

“నిన్న మీ కజిన్ ప్రవీణ్‌కి పెన్ డ్రైవ్ ఇచ్చేను. అది చూసి వాటిలో నీకు ఏవి బాగున్నాయో చెప్పు ఉదయ్. నాకు నచ్చినవి మార్క్ చేసి పెట్టేను. నీకూ అవే నచ్చితే అలాగే తీసుకుందాం..” సన్నగా వీణ మీటుతున్నట్లున్న శృతిమాటలకి పరవశించిపోయేడు ఉదయ్. “అలాగే.. ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు. నేను చూసి చెప్తాను..” అంటూ ఫోన్ కట్ చేసేడు ఉదయ్.

“ఏంటి నీకేదో పెన్ డ్రైవ్ ఇచ్చేనంటోంది శృతి.. ఎందుకూ..” అడిగేడు ప్రవీణ్ ని.

“అదేకదా బావా నేనూ చెప్పేదీ అప్డేట్ అవమనీ.. పెళ్ళికి ముందు నువ్వూ, శృతీ సినిమాల్లో హీరో, హీరోయిన్లలాగా డ్యూయట్లు పాడుకుంటూ చెట్ల వెనకా పుట్ల వెనకా పరిగెట్టాలి.. దానిని వీడియో తీస్తారన్న మాట. ఈమధ్య గొప్ప గొప్పాళ్ళిళ్ళల్లో ఇలా పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ పెళ్ళవకుండానే డేన్సులు చేసుకోవడం గట్రా వీడియోలు తీసుకుంటున్నారులే.. ఇప్పుడు వాళ్లల్లో నువ్వూ చేరావన్న మాట..”

ఉదయ్ మొహం వికారంగా మారిపోయింది.. చిన్నప్పట్నించీ బుధ్ధిగా చదువుకుని పోటీపరీక్షల్లో నెగ్గి మంచి కాలేజీలో చేరి రోజుకి పధ్ధెనిమిది గంటలు చదువుకుంటూ, మొదటి ర్యాంకు తెచ్చుకుని, మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరి, ఆరంకెలజీతంతో ఎంతో పని ఒత్తిడితో గడిపే అతనికి ఈ వీడియోలేవిటో, డేన్సులేవిటో అర్ధం కాలేదు.

“ఛీ..ఛీ.. నేను డేన్సు చెయ్యడవేంటీ..” అన్నాడు.

“మరి.. నీ పెళ్ళికి నువ్వు కాపోతే నేను చేస్తానా..” వెటకారంగా అన్నాడు ప్రవీణ్..

“అంటే శృతి ఇప్పుడు చూడమన్నవి ఆ డేన్సుల వీడియోలా..” అనుమానంగా అడిగేడు.

“అనుమానవా.. రేప్పొద్దున్నే కొరియోగ్రాఫర్ వస్తాడు..” ప్రవీణ్ మాటల్ని మధ్యలోనే ఆపుతూ.. “అతనెందుకూ..” అనడిగేడు ఉదయ్.

“అప్డేట్ అవరా బావా.. నీకూ, శృతికీ ఆ పాటలకి స్టెప్స్ నేర్పించొద్దూ..”

నిలదీసేడు ప్రవీణ్. అయోమయంగా నిలబడ్ద ఉదయ్ చేతిలో శృతి ఇచ్చిన పెన్ డ్రైవ్ పెట్టి “ఇవన్నీ చూసి నీకు నచ్చినవి సెలెక్ట్ చెయ్యి. నేను రేప్పొద్దున్న వస్తాను.” అంటూ వెళ్ళిపోయేడు.

రాత్రి భోజనం అయ్యేక శృతిఇచ్చిన పెన్ డ్రైవ్‌లో ఏముందా అని చూడడం మొదలెట్టేడు ఉదయ్.

పెళ్ళికి ముందే పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ కలిసి తీయించుకున్న వీడియోలవి.

ఒకదాంట్లో అందంగా తయారయిన పెళ్ళికూతురు ఒయ్యారంగా నడిచి వస్తుంటే నవాబుడ్రెస్సులో ఉన్న పెళ్ళికొడుకు ఆమెని అమాంతం ఎత్తుకుని గిర్రున తిప్పేస్తూ, ఆ పూలతోటంతా తిరిగేస్తుంటాడు.

ఇంకోదాంట్లో పెళ్ళి కావల్సిన జంట మహా సంబరపడిపోతూ ఓ బురదగుంటలో పడి దొర్లుతుంటారు.

మరోదాంట్లో పెళ్ళికూతురు ఓ పెద్ద పట్టుచీర కట్టుకుని, ఒంటినిండా నగలు పెట్టుకుని, మోచేతుల పైదాకా గోరింటాకు పెట్టుకుని, మోచేతులవరకూ మెరిసిపోయే గాజులేసుకుని, అద్దాలూ చెమ్కీలూ నిండుగా కుట్టేసిన డిజైనర్ బ్లౌజ్‌ని వేసుకుని, మొహం ఆనమాలు తెలీకుండా మేకప్ దట్టించుకుని, మొహం మీద నవ్వు చెరిగిపోకుండా చూసుకుంటూ బుల్లెట్ బండిమీద కూర్చునుంది. సూట్ వేసుకున్న పెళ్ళికొడుకు ఆ బుల్లెట్ బండి వెనకున్న హాండిల్ గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ఆ చేతులు బాలన్స్ చేసుకుంటూ పైకెగురుతున్నాడు. అలా పైకెగిరి కింద కొస్తున్నప్పుడు సరిగ్గా పెళ్ళికూతురు మొహం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకి ముద్దు ఇస్తున్నట్టు పెదాలు ముందుకి పెట్టేడు. సరిగ్గా ఆ ఫోజ్‌ని పట్టుకున్నారు ఫొటోగ్రాఫర్లు. అంటే బండిమీద అమ్మాయి కూర్చుంటే అబ్బాయి గాల్లో ఎగురుతూ వచ్చి ముద్దిస్తున్నట్టు వస్తుందన్నమాట ఆ ఫొటో.

అవన్నీ చూసి హడిలిపోయేడు ఉదయ్. అంటే తనిప్పుడు అలా బురదలో పడి దొర్లాలా! హైజంపులు చేస్తూ బాలన్సు చూసుకోవాలా! పరిగెడుతున్న ట్రైన్ లోంచి దూకాలా! అతనికేమీ అర్థం కాలేదు.

అప్డేట్ అవడం అంటే ఇదా! ఈ ఆడపిల్లలకి ఇవన్నీ ఎలా తెలుస్తాయీ! తమలాగే బాగా చదువుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు చక్కగా చేస్తున్నారు. అయినా కూడా వాళ్లకి ఇలాంటి విషయాల మీద ఇంత ఆసక్తి ఉంటుందా! అందుకోసం ఇంత టైము, డబ్బూ వేస్ట్ చేస్తారా! ఇప్పటి అడపిల్లలని ఎలా అర్థం చేసుకోవాలో ఉదయ్‌కి తెలీలేదు. ప్రవీణ్ గాడన్న అప్డేట్ అవడం అంటే ఇదా అనుకున్నాడు. శృతి పంపిన డేన్సులన్నీ వరసగా చూసుకుంటూ వస్తున్న అతనికి వాటిని ఒక్కొక్కటీ చూస్తున్నకొద్దీ కడుపులోంచి ఏదో తెలీని బాధ వాంతిలా రావడానికి ప్రయత్నించి, భంగపడి కడుపులోనే గిరగిరా తిప్పెయ్యడం మొదలైంది.

కలవరపడిపోయిన ఉదయ్‌కి కలలో కూడా ఆ వీడియోలే కనపడ్డం మొదలెట్టేయి.

ఉదయ్ ఇంకా కలా నిద్రా అని తేల్చుకోని పరిస్థితిలో ఉండగానే తెల్లారిపోయింది. ఫొటో షూట్ చేసే గుంపు వచ్చేసింది. అంతే ఇంక అప్పట్నించి ఉదయ్ కొరియోగ్రాఫర్ చేతిలో బందీ అయిపోయేడు.

కట్ చేస్తే..

ఉదయ్ పట్టుపంచె, పట్టుచొక్కా తొడుక్కుని, మెడలో బంగారుగొలుసూ, ఒకచేతికి బ్రేస్‌లెట్, మరో చేతికి ఆపిల్ వాచ్ పెట్టుకుని, రెండుచేతుల వేళ్ళకీ రెండు రెండు ఉంగరాలు పెట్టుకుని, తల కిందకీ కాళ్ళు పైకీ పెట్టుకుని శీర్షాసనం వేస్తున్న పోజులో కాళ్ళకి బదులుగా చేతులమీద నిలబడ్డాడు. సరిగ్గా చెప్పాలంటే అతని చేతులు కాళ్లయాయి, కాళ్ళు చేతులయ్యాయన్నమాట. అలా నిలబడ్ద అతని చుట్టూ నాలుగు గంటలసేపు బ్రైడల్ మేకప్ చేయించుకున్న శృతి ఒక్కొక్క దిక్కునా ఆగుతూ నాలుగు దిక్కులా “నాదవినోదము నాట్య విలాసము పరమ సుఖము పరమూ.. అభినయ వేదము సభ కనువాదము కలుపు పరమ పదమూ..” అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటే క్లాసికల్‌గా నాట్యం చేస్తున్నానన్న ఫీలింగ్‌తో డేన్సు చేస్తోంది. దానిని వీడియోగ్రాఫర్లు ఎంతో చాకచక్యంగా వీడియో తీస్తున్నారు.

కాసేపటికి ఉదయ్‌కి చేతులు వణుకుతున్నట్లనిపించేయి. మొత్తం శరీరం బరువు మోయలేని చేతులు కాస్త తడబడ్డాయి. ఉదయ్‌కి ఏదో తలకిందులయి ఎక్కడికో పడిపోతున్నానన్న భావన.. “ధబ్” మన్నశబ్దం. కట్ చేస్తే.. ఇదిగో ఇదీ వీల్ చైర్ సీను. అదండీ అసలు జరిగిన కథ..” వివరంగా చెప్పాడు ప్రవీణ్ అనబడే ఆ పెద్దమనిషి.

***

నోరెళ్ళబెట్టి వింటున్న నేను మళ్ళీ స్టేజి వైపు చూసేను.

లక్షలు ఖర్చు పెట్టి అలంకారం చేయించిన పెళ్ళిమండపం. ఆ మండపం మధ్యలో వీల్ చెయిర్‌లో నీరసంగా ఉన్న ఉదయ్ పక్కనే పెళ్ళిపీటల మీద కూర్చునుంది శృతి. ఆమె మెడలో తాళి కట్టడానికి వంగలేక అవస్థ పడుతున్నాడు ఉదయ్. అతని ఇబ్బంది గ్రహించిన శృతి తల్లి శృతిని నెమ్మదిగా కాస్త లేపి ఆమె మెడని ఉదయ్ చేతికి అందేలా పట్టుకుంది. ఉదయ్ శృతి మెడలో మూడుముళ్ళూ వేసేడు. అక్షింతలు పూలజల్లులా కురిసేయి.

నాకైతే మాత్రం పెళ్ళంటే ఇదా అనిపించింది..

Exit mobile version